Technology
తర్వాతి-తరం సాంకేతికతకు శక్తి
Posted On:
22 OCT 2025 17:08 PM
స్వదేశీ 7 ఎంఎం ప్రాసెసర్ ద్వారా ఆవిష్కరణలకు ఊతం
గత దశాబ్ద కాలంగా భారత్ తన స్వదేశీ సెమీకండక్టర్ సామర్థ్యాలను స్థిరంగా అభివృద్ధి చేసుకుంటోంది. దేశంలోనే ప్రాసెసర్ ఆర్కిటెక్చర్లను అభివృద్ధి చేసుకుంటోంది. డిజైన్ చేయగల ప్రతిభను పెంచుకుంటోంది. పరిశోధనా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకుంటోంది. ఈ ప్రయత్నాలు ప్రపంచ చిప్ డిజైన్ వ్యవస్థలో భారత్ కీలకంగా ఆవిర్భవించడానికి పునాది వేశాయి. ఈ క్రమంలో భారత్ ఇప్పుడు 7 నానోమీటర్ ప్రాసెసర్ అభివృద్ధి చేయడం ద్వారా మరో కీలక ముందడుగు వేసింది. తద్వారా అధునాతన నోడ్ సెమీకండక్టర్ డిజైన్‌లోకి ప్రవేశించింది. 2025 అక్టోబర్ 18న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించినట్టుగా ఇది భారతదేశ సెమీకండక్టర్ ప్రయాణంలో కీలక ఘట్టం. స్వయం సమృద్ధి, తర్వాత-తరం సాంకేతికత ఆవిష్కరణ కోసం దేశ నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది.
అమలు ప్రక్రియ
- 7 ఎన్ఎం ప్రాసెసర్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్(ఐఐటీ మద్రాస్) అభివృద్ధి చేసింది. భారతదేశం చేపట్టిన శక్తి అనే ప్రాసెసర్ డిజైన్ వ్యవస్థలో ఐఐటీ మద్రాస్ కీలకమైన సంస్థ. 2013లో ప్రారంభించిన శక్తి ఓపెన్-సోర్స్ ఆర్కిటెక్చర్. దీనిని ఎవరైనా పరిమితులు లేకుండా ఉచితంగా స్వీకరించడానికి, ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది.
- భారత్ ప్రస్తుతం ఆర్ఐఎస్‌సీ-వీ అనే ఓపెన్ సోర్స్ ఆర్కిటెక్చర్‌ను, వివిధ రకాల సాధనాల ఆధారంగా తయారుచేసిన మైక్రోప్రాసెసర్లను వినియోగిస్తోంది. శక్తి ప్రాజెక్టులో భాగంగా మధ్య శ్రేణి ఓపెన్ సోర్స్ ప్రాసెసర్‌ను అభివృద్ధి చేసింది. దీనిని ఏ అంకుర సంస్థ అయినా వినియోగించుకోవచ్చు.
- శక్తి ప్రాజెక్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్విత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. సెమీ కండక్టర్ పరిశోధన & అభివృద్ధి, చిప్ డిజైన్, ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలకు సంబంధించిన జాతీయ ప్రయత్నాలకు శక్తి ప్రాజెక్టు నేతృత్వం వహిస్తోంది.
- పూర్తిస్థాయి సెమీకండక్టర్, డిస్‌ప్లే తయారీ సామర్థ్యాలను నెలకొల్పడానికి, జాతీయ ఎలక్ట్రానిక్స్ వాల్యూ చైన్‌ను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమమైన ఇండియా సెమీకండక్టర్ మిషన్‌కు శక్తి ప్రాజెక్టు అనుబంధ కార్యక్రమం.
- పరిశోధన & అభివృద్ధి మౌలిక సదుపాయాలు పెంపొందించడానికి, ప్రతిభా సామర్థ్యాలను విస్తృతం చేయడం కోసం విద్యాసంస్థలు, పరిశ్రమ, అంకుర సంస్థల మధ్య సహకారాన్ని ఈ కార్యక్రమం పెంపొందిస్తోంది.
7 ఎన్ఎం తయారుచేయడం ద్వారా ప్రయోజనాలు
- ఆర్థిక సేవలు, రక్షణ, వ్యూహాత్మక రంగాలకు సంబంధించిన సర్వర్ అప్లికేషన్లకు 7 ఎన్ఎం ప్రాసెసర్ ఉపయోగపడుతుంది.
- అధిక ట్రాన్సిటర్ డెన్‌సిటీ, మెరుగైన కంప్యూటింగ్ సామర్థ్యంతో ఈ ప్రాసెసర్ సెమీకండక్టర్ డిజైన్‌లో కీలక అడుగుగా నిలిచింది.
- భారత సెమీకండక్టర్ మిషన్ కింద స్వదేశీ సెమీకండక్టర్ తయారీ సామర్థ్యాలను స్థాపించడానికి జరుగుతున్న జాతీయ ప్రయత్నాలకు అనుగుణంగా ఫ్యాబ్రికేషన్(ఫ్యాబ్) ఇంటిగ్రేషన్‌లో భారతదేశ సంసిద్ధతను మరింత బలోపేతం చేస్తుంది.
- డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద కీలక రంగాలుగా ఉన్న 5జీ, ఏఐ, సూపర్‌కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు వెన్నెముకగా నిలుస్తుంది.
- ఆత్మనిర్భర్ భారత్ కింద క్లిష్టమైన రంగాలకు సంబంధించిన చిప్‌ల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా సాంకేతికంగా స్వావలంబన సాధించాలనే భారతదేశ వ్యూహాత్మక లక్ష్యాన్ని ఇది బలోపేతం చేస్తుంది.
ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో భారత్
- రూ.76 వేల కోట్లతో చేపట్టిన ఇండియా సెమీకండక్టర్ మిషన్(ఐఎస్ఎం) కింద ఆరు రాష్ట్రాల్లో రూ.1.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో స్థాపించనున్న 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
- కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్విత్వ శాఖ చేపట్టిన డిజైన్ లింక్డ్ ఇన్‌సెంటీవ్(డీఎల్ఐ) పథకం 288కి పైగా విద్యాసంస్థలకు తోడ్పాటును అందిస్తోంది.
- స్వదేశీ 7 ఎన్ఎం ప్రాసెసర్ డిజైన్‌తో భారత్ అధునాతన నోడ్ పరిశోధన & అభివృద్ధిలోకి ప్రవేశించింది. ఆధునిక నోడ్‌ల డిజైన్‌లో ముందంజలో ఉన్న అమెరికా, తైవాన్, సౌత్ కొరియా వంటి దేశాల సరసన నిలిచింది.
- ప్రపంచ సెమీకండక్టర్ వాల్యూచైన్‌లో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ స్థానం బలోపేతమైంది. పూర్తిస్థాయి సెమీకండక్టర్ వ్యవస్థ నిర్మించాలనే సంకల్పం దిశగా మరింత ముందుకువెళ్తోంది.
భవిష్యత్ ప్రణాళిక
- సెమీకాన్ ఇండియా కార్యక్రమం ద్వారా సబ్-7ఎన్ఎం నొడ్‌ల తయారీలో పురోగతి కొనసాగించడం.
- భారత్‌లోనే అత్యాధునిక చిప్ డిజైన్, టెస్టింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలు నెలకొల్పడం.
- కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్విత్వ శాఖ, ఐఎస్ఎం కింద చేపడుతున్న సెమీకండక్టర్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి, వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తాయని అంచనా.
- 24 చిప్ డిజైన్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. 87 సంస్థలు ఆధునిక డిజైన్ సదుపాయాలను వినియోగిస్తున్నాయి.
- ప్రపంచం కోసం భారత్‌లో చిప్స్ తయారుచేయడం ఈ కార్యక్రమాల లక్ష్యం.
స్వదేశీ 7 ఎన్ఎం ప్రాసెసర్ తయారీ అనేది సాంకేతిక ఘనతను మించి సంకల్ప ప్రకటనగా ప్రతిబింబిస్తోంది. ఆవిష్కరణ, విద్యాసంస్థలు, పరిశ్రమను ఒకే చోటకు చేర్చడం ద్వారా ప్రపంచ పోటీతత్వ సెమీకండక్టర్ వ్యవస్థలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు పునాది వేస్తోంది. సుస్థిర పరిశోధన & అభివృద్ధి, వ్యూహాత్మక పెట్టుబడి ద్వారా ప్రపంచ సెమీకండక్టర్ వాల్యూ చైన్‌లో భారత్ కీలకమైన కేంద్రంగా ఆవిర్భవించనుంది.
References:
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=150300
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2155456
https://cdn.digitalindiacorporation.in/wp-content/uploads/2025/09/PIB2163622.pdf
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2150464
https://x.com/AshwiniVaishnaw/status/1979531474950095199
Click here to see PDF
***
(Factsheet ID: 150419)
Visitor Counter : 1
Provide suggestions / comments