Others
నక్సలిజానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ సమగ్ర వ్యూహం
Posted On:
25 OCT 2025 15:33 PM
దశాబ్దం పాటు దృఢమైన కార్యచరణ: తగ్గిన హింస.. పెరిగిన అభివృద్ధి, పునఃసమీకరణ
కీలకాంశాలు
- 2014-2024 మధ్య 53% తగ్గిన నక్సల్ సంబంధ ఘటనలు
- 576 ఫోర్టిఫైడ్ పోలీస్‌స్టేషన్ల నిర్మాణం
- దశాబ్దకాలంలో 126 నుంచి 18కి తగ్గిన నక్సల్ ప్రభావిత జిల్లాలు
- 2025 అక్టోబర్ వరకు 1,225 నక్సలైట్ల లొంగుబాటు, 270 మంది హతం
- 73% తగ్గిన భద్రతా సిబ్బంది మరణాలు, 70% తగ్గిన పౌరుల మరణాలు
పరిచయం
భద్రత, అభివృద్ధి, పునరావాసాన్ని మేళవిస్తూ చేపట్టిన సమగ్ర విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం భారతదేశ నక్సల్ వ్యతిరేక వ్యూహాన్ని మార్చేసింది. గతంలో అవలంభించిన విడిగా ప్రతిస్పందించే విధానాలను వదిలిపెట్టి 2026 మార్చి నాటికి అన్ని నక్సల్ ప్రభావిత జిల్లాలను నక్సల్ రహితంగా మార్చే లక్ష్యంతో చర్చలు, భద్రత, సమన్వయంతో కూడిన ఏకీకృత ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది.
చట్టాన్ని అమలుచేసే సామర్థ్యం, సామాజిక సమైక్యత, సామర్థ్య నిర్మాణంపై సమాన దృష్టి పెడుతూ పాటిస్తున్న ఈ విధానం ప్రతిస్పందనగా చేపట్టే నియంత్రణ చర్యల నుంచి ముందస్తు నిర్మూలన వైపు ఒక నమూనా మార్పుగా నిలుస్తోంది.
దశాబ్దంగా తగ్గిన నక్సల్ హింస
గత దశాబ్దకాలంగా భద్రతా బలగాల సమన్వయ కృషి, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా నక్సల్ సంబంధ హింస గణనీయంగా తగ్గింది. 2004-2014లో 16,463 హింసాత్మక ఘటనలు జరగగా 2014-2024లో 7,744కు తగ్గాయి. భద్రతా సిబ్బంది మరణాలు 1,851 నుంచి 509కి తగ్గాయి. పౌరుల మరణాలు 4,766 నుంచి 1,495కి తగ్గాయి. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి, పరిపాలన పునరుద్ధరణలో ఇది గొప్ప సంకేతం.

2025లోనే భద్రతా బలగాల చేతిలో 270 మంది నక్సలైట్లు హతమయ్యారు. 680 నక్సలైట్లు అరెస్టు కాగా, 1,225 మంది లొంగిపోయారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వంటి ప్రధానమైన ఆపరేషన్లు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌తో పాటు మహారాష్ట్రలో భారీ లొంగుబాట్లు జనజీవనస్రవంతిలో కలవడానికి తిరుగుబాటుదారుల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని చాటుతున్నాయి.

భద్రతా వ్యవస్థ, సాంకేతికత బలోపేతం
భద్రతా సదుపాయాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. గత దశాబ్దకాలంగా 576 ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్లను నిర్మించింది. గత ఆరేళ్లలో 336 కొత్త భద్రతా శిబిరాలను నిర్మించింది. 2014లో 126 నక్సల్ ప్రభావిత జిల్లాలు ఉండగా 2024కు 18కి తగ్గిపోయాయి. ఇందులో 6 జిల్లాలు మాత్రమే ఇప్పుడు తీవ్ర ప్రభావిత జిల్లాలుగా ఉన్నాయి. రాత్రివేళ ల్యాండ్ కాగలిగే హెలిప్యాడ్‌ల(68 నిర్మాణం)ను విస్తరించడం ఆపరేషన్ల సమయంలో రవాణా, ప్రతిస్పందనను మెరుగుపరిచింది.
నక్సల్ కార్యకలాపాలను కచ్చితత్వంతో పర్యవేక్షించడానికి, విశ్లేషించడానికి ఇప్పుడు భద్రతా సంస్థలు అధునాతన సాంకేతికతలను వినియోగిస్తున్నాయి. నక్సల్ కదలికలను నిశితంగా గమనించడానికి లొకేషన్ ట్రాకింగ్, మొబైల్ డేటా విశ్లేషణ, శాస్త్రీయంగా కాల్ లాగ్ పరీక్షించడం వంటి సాధనాలను మోహరించాయి. వివిధ ఫోరెన్సిక్, సాంకేతిక సంస్థల నుంచి అందుతున్న సహకారం నిఘా సమాచార సేకరణ, కార్యచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది. అదనంగా, పర్యవేక్షణ, వ్యూహాత్మక ప్రణాళికను మరింత మెరుగుపరిచేందుకు డ్రోన్‌ల ద్వారా నిఘా, ఉపగ్రహ చిత్రీకరణ, ఏఐ ఆధారిత డేటా అనలటిక్స్‌ను సమర్థవంతంగా వినియోగిస్తున్నాయి.
నక్సల్ ఆర్థిక వ్యవస్థలను కూల్చేసే వ్యూహాలు
నక్సలిజాన్ని పోషిస్తున్న ఆర్థిక వ్యవస్థలను క్రమంగా కూల్చివేయడం జరిగింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)లోని ప్రత్యేక విభాగం దాదాపు రూ.40 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పలు ఆపరేషన్లలో రూ.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. రాష్ట్రాలు సైతం రూ.40 కోట్లు విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పాటు అర్బన్ నక్సలైట్లు గణనీయంగా నైతిక, మానసిక ఎదురుదెబ్బలు తిన్నారు. తద్వారా సమాచార యుద్ధరంగంలో వారి సామర్థ్యం తగ్గిపోయింది.
సామర్థ్య నిర్మాణం, రాష్ట్రాలకు సహకారం
ప్రభుత్వ వామపక్ష తీవ్రవాద(ఎల్‌డబ్ల్యూ) విధానంలో రాష్ట్ర బలగాలను శక్తివంతం చేయడం కీలకం. భద్రతా సంబంధిత వ్యయం(ఎస్ఆర్ఈ) పథకం కింద గత 11 ఏళ్లలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు రూ.3,331 కోట్లు విడుదలయ్యాయి. ఇది అంతకుముందు దశాబ్దంతో పోలిస్తే 155% పెరిగింది. రాష్ట్రాల ప్రత్యేక బలగాలు, ప్రత్యేక నిఘా విభాగాల బలోపేతం, ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి రూ.991 కోట్ల వ్యయంతో ప్రత్యేక సదుపాయాల పథకం(ఎస్ఐఎస్) ఆమోదం పొందింది.
2017-18 నుంచి ఇప్పటివరకు రూ.1,741 కోట్ల విలువైన పథకాలకు ఆమోదం లభించగా, రూ.445 కోట్లు విడుదలయ్యాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రత్యేక సహాయం(ఎస్‌సీఏ) కింద రూ.3,769 కోట్ల కేటాయింపు జరిగింది. దీంతో పాటు కేంద్ర సంస్థలకు సహాయం(ఏసీఏఎల్‌డబ్ల్యూఈఎంఎస్) కింద శిబిరాల మౌలిక సదుపాయాలకు రూ.122.28 కోట్లు, ఆరోగ్య సౌకర్యాలకు రూ.12.56 కోట్ల కేటాయింపు జరిగింది.
మౌలిక సదుపాయాల అభివృద్ధి
క్లిష్టమైన మౌలిక సదుపాయాల అభివృద్ధితో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది.
- రోడ్ల అనుసంధానం: 2014-25 మధ్య రూ.20,815 కోట్లతో 17,589 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ఆమోదం లభించగా, ఇప్పటికే దాదాపు 12,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది.
- మొబైల్ కనెక్టివిటీ: వామపక్ష తీవ్రవాద(ఎల్‌డబ్ల్యూఈ) ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ విస్తరణ రెండు దశల్లో అమలయ్యింది. మొదటి దశ కింద రూ.4,080 కోట్ల వ్యయంతో 2,343(2జీ) టవర్ల నిర్మాణం జరిగింది. రెండో దశలో 2,542(4జీ) టవర్ల నిర్మాణానికి 2022 సెప్టెంబర్-అక్టోబర్‌లో రూ.2,210 కోట్లు కేటాయింపు జరిగింది. ఇందులో 1,139 ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
దీంతో పాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అదనంగా 8,527(4జీ) టవర్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. వీటిల్లో ఆశావాహ జిల్లాల ప్రణాళిక కింద 4,281 టవర్లకు ఆమోదం లభించగా, ఇప్పటికే 2,556 ప్రారంభమయ్యాయి. 4జీ శాచురేషన్ ప్లాన్ కింద 4,246 టవర్లకు ఆమోదం లభించగా 2,602 టవర్లు ప్రారంభమయ్యాయి.
- అందుబాటులో పోస్టల్, ఆర్థిక సేవలు: 1,007 బ్యాంక్ శాఖలు, 937 ఏటీఎంలు, 37,850 బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ఏర్పాటు జరిగింది. 90 జిల్లాల్లో 5,899 పోస్ట్ ఆఫీస్‌లు పనిచేస్తున్నాయి. తద్వారా ప్రతి 5 కిలోమీటర్లకు పోస్టల్, ఆర్థిక సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
- విద్య, నైపుణ్యాభివృద్ధి: కౌశల్ వికాస్ యోజన కింద 48 జిల్లాల్లో రూ.495 కోట్లతో 48 పారిశ్రామిక శిక్షణ సంస్థలు(ఐటీఐలు), 61 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు(ఎస్‌డీసీ)ల నిర్మాణానికి ఆమోదం లభించగా, వీటిల్లో ఇప్పటికే 46 ఐటీఐలు, 49 ఎస్‌డీసీలు ప్రారంభమయ్యాయి. ఈ సంస్థలు సంఘర్షణ నుంచి అభివృద్ధి వైపు పయనిస్తున్న యువతకు కొత్త జీవనోపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.
- భద్రత: ఇప్పటివరకు 108 కేసుల విచారణ పూర్తయ్యింది. 87 ఛార్జ్‌షీట్‌లు దాఖలయ్యాయి. 2018లో బస్తరియా బేటాలియన్ ఏర్పాటయ్యింది. ఇందులో 1,143 మందిని నియమించగా వీరిలో 400 మంది యువత బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాలకు చెందినవారు. ఇది భద్రతా కార్యకలాపాల్లో స్థానికుల భాగస్వామ్యం, నమ్మకానికి ప్రతిబింబం.
నక్సల్ వ్యవస్థ నిర్వీర్యం, ప్రాంతాల స్వాధీనం, పునరావాసానికి భరోసా
మూడు దశాబ్దాలకు పైగా వామపక్ష తీవ్రవాద(ఎల్‌డబ్ల్యూఈ) ప్రభావం ఉన్న అనేక ప్రాంతాలను సుస్థిర భద్రతా ఆపరేషన్లు, ప్రత్యేక నిఘా ఆధారిత వ్యూహాలతో ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ విజయానికి “ట్రేస్, టార్గెట్, న్యూట్రలైజ్” అనే విధానం కీలకంగా పని చేసింది. కీలక నక్సల్ నేతలను గుర్తించి, హతమార్చేందుకు, వారి కమాండ్ స్ట్రక్చర్‌ను దెబ్బతీయడానికి భద్రతా బలగాలకు ఈ విధానం ఉపయోగపడింది. మారుమూల ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి చేపట్టిన ఆక్టోపస్, డబుల్ బుల్, చక్రబంధ వంటి ఆపరేషన్ల నక్సలిజం వ్యతిరేక పోరాటంలో అద్భుతమైన విజయాన్ని సాధించాయి.
ఫలితంగా బుద్ధపహర్, పరాస్‌నాథ్, బారామ్సియా, చక్రబంధ వంటి ప్రాంతాలు వామపక్ష తీవ్రవాదం నుంచి దాదాపుగా విముక్తి పొందాయి. తిరుగుబాటుదారుల చివరి ప్రధాన కేంద్రమైన అబూజ్‌మాడ్‌లోకి భద్రతా దళాలు విజయవంతంగా ప్రవేశించాయి. దీంతో పాటు పీఎల్‌జీఏ(పీపుల్స్ లిబెరేషన్ గెరిల్లా ఆర్మీ) దాని ప్రధాన ప్రాంతాలైన బీజాపూర్, సుక్మాను విడిచిపెట్టేలా చేశాయి. 2024లో మన భద్రతా దళాలకు వ్యతిరేకంగా నక్సలైట్లు చేపట్టిన టాక్టికల్ కౌంటర్-అఫెన్సీవ్ క్యాంపెయిన్(టీసీఓసీ) మన భద్రతా దళాల సమర్థమైన, దూకుడైన ఆపరేషన్లతో విఫలమైంది.
2024లో భద్రతా బలగాలు 26 ప్రధాన ఎన్‌కౌంటర్లు జరిపారు. ఫలితంగా పెద్ద కేడర్‌లో ఉన్న నక్సల్స్ హతమయ్యారు. వీరిలో కొందరు:
- ఒక జోనల్ కమిటీ సభ్యుడు(జేడ్‌సీఎం)
- ఐదుగురు సబ్-జోనల్ కమిటీ సభ్యులు(ఎస్‌జెడ్‌సీఎం)
- ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు(ఎస్‌సీఎం)
- 31 మంది డివిజనల్ కమిటీ సభ్యులు(డీవీసీఎం)
- 59 ఏరియా కమిటీ సభ్యులు(ఏసీఎం)
భద్రతా దళాల ప్రణాళిబద్ధమైన కార్యచరణ అనేక కీలక నక్సల్ బృందాలను నిర్వీర్యం చేసి గతంలోని ప్రభావిత ప్రాంతాల్లో శాంతి, పరిపాలనను పునరుద్ధరించాయి. భద్రతా ప్రయత్నాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానం జీవనోపాధి, సామాజిక మద్దతు అందిస్తూ నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి వచ్చేలా ప్రోత్సహిస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లో 2025లో ఇప్పటివరకు 521 మంది వామపక్ష తీవ్రవాదులు లొంగిపోయారు. గత రెండేళ్లలో 1,053 మంది లొంగిపోయారు. పునరావాసం పొందిన వారికి రూ.5 లక్షలు(పెద్ద ర్యాంక్), రూ.2.5 లక్షల(చిన్న, మధ్య ర్యాంక్) ఆర్థిక సహాయం అందుతోంది. దీంతో పాటు వృత్తి శిక్షణ కోసం 36 నెలల పాటు రూ.10 వేల చొప్పున నెలవారీ స్టైపెండ్ అందుతోంది. ఇది గౌరవం, స్థిరత్వంతో వారు తమ జీవితాలను పునర్నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.
ముగింపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నక్సలిజానికి వ్యతిరేకంగా భారతదేశం భద్రత, అభివృద్ధి, సామాజిక న్యాయం ద్వారా భారతదేశం సమగ్ర పోరాటం చేస్తోంది. పటిష్టమైన మౌలిక సదుపాయాలు, అధునాతన సాంకేతికత, కారుణ్యంతో కూడిన పునరావాసం ద్వారా ప్రభుత్వం గతంలోని సంఘర్షణాత్మక ప్రాంతాలను ఇప్పుడు అవకాశాల కేంద్రంగా మారుస్తోంది.
కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం, నిలకడైన పురోగతితో 2026 మార్చి నాటికి నక్సల్ రహిత దేశంగా మారాలనే లక్ష్యాన్ని అందుకునే దిశగా భారత్ పయనిస్తోంది. ఇది దశాబ్ద కాలపు నిర్ణయాత్మక పాలన, శాంతి, అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం.
See in PDF
***
(Factsheet ID: 150437)
Visitor Counter : 3
Provide suggestions / comments