Social Welfare
జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) బిల్లు–2026
प्रविष्टि तिथि:
30 JUL 2026 16:32 PM
జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం–1971లోని సెక్షన్ 3ను జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) బిల్లు–2026 సవరిస్తుంది. ప్రస్తుతం జాతీయ గానం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను జాతీయ గేయం ‘వందేమాతరం’కు కూడా ఈ బిల్లు విస్తరిస్తుంది. జాతీయ గేయాలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా గేయాలాపన చేస్తున్న సభకు అంతరాయం కలిగించడాన్ని ఈ సవరణ నేరంగా పరిగణిస్తుంది.
సవరణను ఎందుకు ప్రతిపాదించారు?
లక్ష్యాలు, కారణాల ప్రకటన ప్రకారం.. జాతీయ గానాలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా దానిని ఆలపిస్తున్న బృందానికి అంతరాయం కలిగించడాన్ని నేరంగా పరిగణించడం ద్వారా 1971 చట్టం జాతీయ గానానికి రక్షణ కల్పిస్తోంది.
1950 జనవరి 24న జరిగిన రాజ్యాంగ సభ సమావేశాన్ని ఈ ప్రకటనను గుర్తుచేసింది. భారత స్వాతంత్య్ర పోరాటంలో ‘వందేమాతరం’ పోషించిన చారిత్రక పాత్రను అప్పటి రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ సమావేశంలో ప్రస్తావించారు. ‘జనగణమన’తో సమానంగా ‘వందేమాతరం’ను గౌరవించాలని, సమాన హోదా కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
అయితే, జాతీయ గేయానికి ఇలాంటి రక్షణ కల్పించే నిర్దిష్ట చట్టపరమైన నిబంధన ఇప్పటివరకు లేదు. ఈ లోటును బిల్లు భర్తీ చేసింది. 1971 చట్టంలోని సెక్షన్ 3 పరిధిలోకి ‘వందేమాతరం’ను తీసుకురావాలని ప్రతిపాదించింది.
2026 బిల్లులోని ప్రధాన నిబంధనలు
* సెక్షన్ 3 సవరణ: ప్రస్తుతం ఉన్న సెక్షన్ 3 స్థానంలో జాతీయ గానం ‘జనగణమన’, జాతీయ గేయం ‘వందేమాతరం’ రెండింటినీ వర్తింపు పరిధిలోకి తీసుకొచ్చే కొత్త నిబంధనను క్లాజ్ 2 ప్రతిపాదిస్తోంది.
* వర్తించే చర్యలు: సవరించిన సెక్షన్ 3 ప్రకారం ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కింది చర్యలకు పాల్పడితే శిక్షార్హులు:
(ఎ) జాతీయ గానం లేదా జాతీయ గేయాలాపనను అడ్డుకోవడం; లేదా
(బి) వాటిని ఆలపిస్తున్న సభకు అంతరాయం కలిగించడం.
* సంక్షిప్త నామం: ఈ చట్టాన్ని ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) చట్టం–2026’గా వ్యవహరించవచ్చని క్లాజ్ 1 పేర్కొంటోంది.
సవరణ – ఒక సమగ్ర అవలోకనం
|
అంశం/నిబంధన
|
జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం–1971 (మూల చట్టం)
|
జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) బిల్లు–2026
|
|
సెక్షన్ 3 కింద రక్షణ పరిధి
|
భారత జాతీయ గానం ‘జనగణమన’కు మాత్రమే నిర్దిష్ట చట్టపరమైన రక్షణ
|
జాతీయ గానం, జాతీయ గేయం ‘వందేమాతరం’ రెండింటినీ సెక్షన్ 3 పరిధిలోకి తీసుకొస్తుంది
|
|
నిషేధిత చర్యలు
|
భారత జాతీయ గానాలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే లేదా దానిని ఆలపిస్తున్న సభకు అంతరాయం కలిగించే వ్యక్తికి శిక్ష విధిస్తుంది
|
జాతీయ గానం లేదా జాతీయ గేయాలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే లేదా వాటిని ఆలపిస్తున్న సభకు అంతరాయం కలిగించే వ్యక్తికి శిక్ష విధిస్తుంది
|
|
శిక్ష
|
గరిష్ఠంగా మూడేళ్ల కారాగార శిక్ష లేదా జరిమానా లేదా రెండూ
|
శిక్షలో ఎలాంటి మార్పు లేదు
|
|
పునరావృత నేర నిర్ధారణ
|
2003లో చేర్చిన సెక్షన్ 3ఏ ప్రకారం సెక్షన్ 2 లేదా 3 కింద రెండోసారి లేదా ఆ తర్వాత నేర నిర్ధారణ జరిగితే కనీసం ఏడాది కారాగార శిక్ష విధిస్తారు
|
కనీసం ఏడాది కారాగార శిక్ష విధించే కఠిన నిబంధన కొనసాగుతుంది. ‘వందేమాతరం’ ఆలాపనకు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగిస్తూ పదేపదే నేరాలకు పాల్పడేవారికి కూడా తప్పనిసరిగా కనీసం ఏడాది కారాగార శిక్ష వర్తిస్తుంది
|
వందేమాతరం: ఉద్యమంగా మారిన గేయం
* ‘మాతృమూర్తీ! నీకు వందనం’ అనే అర్థాన్నిచ్చే ‘వందేమాతరం’ను బంకించంద్ర చటర్జీ రచించారు.
* 1875 నవంబర్ 7న ‘బంగదర్శన్’ సాహిత్య పత్రికలో ఇది తొలిసారి ప్రచురితమైంది. అనంతరం 1882లో ప్రచురించిన ‘ఆనందమఠం’ నవలలో దీనిని చేర్చారు.
* రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గేయానికి స్వరకల్పన చేసి, 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి ఆలపించారు.
* స్వాతంత్య్ర పోరాట సమయంలో ఈ గేయం ప్రతిఘటనకు శక్తిమంతమైన చిహ్నంగా మారింది. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమ సమయంలో దీన్ని తొలిసారి రాజకీయ నినాదంగా ఉపయోగించారు.
* 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.. ‘జనగణమన’తో సమానంగా ‘వందేమాతరం’ను గౌరవించాలని, సమాన హోదా కల్పించాలని పేర్కొన్నారు.
జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం–1971
2026 సవరణ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలంటే జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం–1971 వేసిన పునాదిని తెలుసుకోవడం అవసరం. 1971 డిసెంబర్ 23న అమల్లోకి వచ్చిన ఈ చట్టం దేశమంతటికీ వర్తిస్తుంది. భారత జాతీయ పతాకం, భారత రాజ్యాంగం, జాతీయ గానం ‘జనగణమన’కు చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టంలోని కీలక నిబంధనలు
* సెక్షన్ 2 – జాతీయ పతాకం, రాజ్యాంగం: భారత జాతీయ పతాకం, భారత రాజ్యాంగానికి జరిగే అవమానాలకు సంబంధించిన అంశాలను ఈ సెక్షన్ పరిధిలోకి తీసుకొచ్చారు. బహిరంగ ప్రదేశంలో జాతీయ పతాకాన్ని లేదా రాజ్యాంగాన్ని కాల్చడం, ఛిద్రం చేయడం, చెరిపివేయడం, అపవిత్రం చేయడం, రూపు మార్చడం, ధ్వంసం చేయడం, తొక్కడం లేదా ఇతర రూపాల్లో అగౌరవపరిస్తే గరిష్ఠంగా మూడేళ్ల కారాగార శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని నిర్దేశిస్తోంది.
* చట్టబద్ధ విమర్శకు రక్షణ: చట్టబద్ధమైన సవరణ లేదా మార్పు సాధించాలన్న ఉద్దేశంతో రాజ్యాంగం, జాతీయ పతాకం లేదా ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ చేసే వ్యాఖ్యలను సెక్షన్ 2 కింద నేరంగా పరిగణించరు.
* సెక్షన్ 3 – జాతీయ గానం: ఈ సెక్షన్ ప్రత్యేకంగా జాతీయ గానానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తుంది. భారత జాతీయ గానాలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే లేదా దానిని ఆలపిస్తున్న సభకు అంతరాయం కలిగించే వ్యక్తికి గరిష్ఠంగా మూడేళ్ల కారాగార శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు.
* సెక్షన్ 3ఏ – పునరావృత నేరాలు: 2003 సవరణ ద్వారా ఈ సెక్షన్‌ను చేర్చారు. సెక్షన్ 2 లేదా 3 కింద రెండోసారి లేదా ఆ తర్వాత నేర నిర్ధారణ జరిగితే కనీసం ఏడాది కారాగార శిక్ష విధించే కఠిన నిబంధనను ఇది అమలు చేస్తోంది.
References
Click here to see pdf
***
(तथ्य सामग्री आईडी: 150809)
आगंतुक पटल : 12
Provide suggestions / comments