• Sitemap
  • Advance Search
Social Welfare

భారతదేశ‌ ఉన్నత విద్యా రంగం

प्रविष्टि तिथि: 30 AUG 2026 10:08 AM

వృద్ధి, అందుబాటు, సమ్మిళితత్వంతో దశాబ్ద ప్రయాణం

భారతదేశ‌ విజ్ఞాన వ్యవస్థ నిర్మాణం: దశాబ్ద కాల ప్రగతి
విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారత ప్రయాణానికి ఉన్నత విద్య కీలక పునాది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020లోనూ ఇది ప్రధాన స్తంభంగా ఉంది. సమగ్ర, బహుళ విభాగాల అభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ సుస్థిర అభివృద్ధి లక్ష్యం(ఎస్‌డీజీ) 4 సాధనకు తోడ్పడే విద్యా వ్యవస్థను ఈ విధానం ప్రతిపాదిస్తుంది. అందరికీ సమ్మిళిత, సమాన అవకాశాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం, జీవితాంత అభ్యాస అవకాశాలను ప్రోత్సహించడం సుస్థిర అభివృద్ధి లక్ష్యం(ఎస్‌డీజీ) 4 ప్రధాన ఉద్దేశం. భారత్‌లోని ఉన్నత విద్యా సంస్థలపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏటా సర్వే నిర్వహిస్తోంది.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏటా నిర్వహించే అఖిల భారత ఉన్నత విద్యా సర్వే (ఏఐఎస్‌హెచ్‌ఈ) దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల(హెచ్ఈఐ)కు సంబంధించిన సమగ్ర ఆధారాలను అందిస్తుంది. జాతీయ విద్యా విధానం 2020 కింద ఉన్నత విద్యా సంస్కరణల ప్రగతిని తెలుసుకోవడం, కొత్తగా తలెత్తుతున్న లోటుపాట్లను గుర్తించడం, వాటికి అనుగుణంగా విధానపరమైన చర్యలు రూపొందించడంలో ఈ సమాచారం తోడ్పడుతుంది.

విస్తరిస్తున్న ఉన్నత విద్యా వ్యవస్థ
ఏఐఎస్‌హెచ్‌ఈ నివేదికల ప్రకారం గత దశాబ్దంలో భారత ఉన్నత విద్యా వ్యవస్థ గణనీయంగా విస్తరించింది.
* విశ్వవిద్యాలయాల సంఖ్య 2014–15లో 760 నుంచి 2023–24లో 1,289కి పెరిగింది. ఇది 69.6 శాతం వృద్ధి.
* కళాశాలల సంఖ్య 38,498 నుంచి 48,246కు పెరిగింది. ఇది 25.3 శాతం వృద్ధి.
* స్వతంత్ర సంస్థల సంఖ్య 12,276 నుంచి 15,221కు చేరి, దాదాపు 24 శాతం వృద్ధి నమోదు చేసింది.
సంస్థాగత పునాది విస్తరించడం, దేశవ్యాప్తంగా విద్యార్థులకు సేవలు అందించే సామర్థ్యం పెరగడాన్ని ఈ వృద్ధి ప్రతిబింబిస్తోంది. ఉన్నత విద్య మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చి, ప్రజల భాగస్వామ్యం పెరిగింది. భారత భవిష్యత్తు కోసం మరింత అందుబాటులో ఉండే, వైవిధ్యభరితమైన, సమ్మిళిత విజ్ఞాన వ్యవస్థ నిర్మాణానికి ఇది తోడ్పడింది.

 



పెరుగుతున్న విద్యార్థుల నమోదు: సమానత్వం, సమ్మిళితత్వం దిశగా ప్రగతి
భారత్‌లో ఉన్నత విద్యా నమోదు గత దశాబ్దంలో స్థిరంగా పెరిగింది. 2014–15లో 3.42 కోట్లుగా ఉన్న విద్యార్థుల సంఖ్య 31.5 శాతం పెరిగి 2023–24లో 4.50 కోట్లకు చేరింది.
* ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) 2014–15లో 23.7 శాతం నుంచి 2022–23లో 29.5 శాతానికి, 2023–24లో 30 శాతానికి పెరిగింది. ఉన్నత విద్య అందుబాటు, భాగస్వామ్యం స్థిరంగా పెరుగుతున్న తీరును ఇది ప్రతిబింబిస్తోంది. 2035 నాటికి స్థూల నమోదు నిష్పత్తిని 50 శాతానికి పెంచాలన్న జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యానికి ఇది తోడ్పడుతోంది.
* 2014–15 నుంచి 2023–24 మధ్య వివిధ విద్యాస్థాయుల్లో మొత్తం నమోదుల పెరుగుదల ఇలా ఉంది:


- పీహెచ్‌డీ నమోదులు 1.17 లక్షల నుంచి 3.43 లక్షలకు–192.89 శాతం; స్నాతకోత్తర నమోదులు 38.53 లక్షల నుంచి 57.85 లక్షలకు–50.15 శాతం; స్నాతక నమోదులు 2.71 కోట్ల నుంచి 3.45 కోట్లకు–27.27 శాతం పెరిగాయి.
- డిప్లొమా నమోదులు 25.08 లక్షల నుంచి 33.15 లక్షలకు–32.22 శాతం; సర్టిఫికెట్ కోర్సుల్లో నమోదులు 1.70 లక్షల నుంచి 2.08 లక్షలకు–22.55 శాతం; సమీకృత కోర్సుల నమోదులు 1.41 లక్షల నుంచి 5.69 లక్షలకు–301.36 శాతం పెరిగాయి.


* ఉన్నత విద్యలో మహిళల నమోదు గత దశాబ్దంలో స్థిరంగా పెరిగింది. 2014–15లో 1.57 కోట్లుగా ఉన్న సంఖ్య 42.2 శాతం వృద్ధితో 2023–24లో 2.24 కోట్లకు చేరింది. దశాబ్ద కాలంలో మొత్తం నమోదుల వృద్ధి కంటే మహిళల నమోదుల వృద్ధి ఎక్కువగా ఉంది. 2023–24లో వివిధ కోర్సుల్లో నమోదైన మహిళా విద్యార్థుల సంఖ్య:
- పీహెచ్‌డీ: 1.71 లక్షలు; స్నాతకోత్తర: 32.53 లక్షలు; స్నాతక: 1.71 కోట్లు
- పీజీ డిప్లొమా: 91,332; డిప్లొమా: 13.27 లక్షలు; సర్టిఫికెట్: 1.10 లక్షలు; సమీకృత కోర్సులు: 2.73 లక్షలు.
* మహిళల స్థూల నమోదు నిష్పత్తి 2014–15లో 22.9 శాతం నుంచి 2023–24లో 31.2 శాతానికి పెరిగింది. వరుసగా ఏడో ఏడాది పురుషుల స్థూల నమోదు నిష్పత్తి 28.9 శాతం కంటే మహిళల నిష్పత్తి అధికంగా ఉంది.
* ఉన్నత విద్యను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్య 2014–15లో 88.28 లక్షల నుంచి 2023–24లో 1.09 కోట్లకు పైగా పెరిగింది. ఇది 24.06 శాతం వృద్ధి. కోర్సులను విజయవంతంగా పూర్తిచేసే విద్యార్థుల సంఖ్య పెరగడం, విద్య కొనసాగింపు మెరుగుపడటం, నమోదులు వృద్ధి చెందడం, సంస్థాగత సామర్థ్యం విస్తరించడాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల మద్దతుతో ఉన్నత విద్యలో అందుబాటు, సమానత్వం, నాణ్యత, పనితీరు మెరుగుపడిన తీరును ఈ ధోరణి వెల్లడిస్తోంది.

ఒక విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యా సంస్థల నుంచి ఉత్తీర్ణులైన మొత్తం విద్యార్థుల సంఖ్యను ఉన్నత విద్యా అవుట్‌–టర్న్‌గా పరిగణిస్తారు.

* ఉన్నత విద్యలో లింగ సమానత్వ సూచీ (జీపీఐ) 2014–15లో 0.92 నుంచి 2023–24లో 1.08కి గణనీయంగా మెరుగుపడింది. ఇదే కాలంలో ఎస్సీ వర్గ జీపీఐ 0.91 నుంచి 1.11కు, ఎస్టీ వర్గ జీపీఐ 0.81 నుంచి 1.08కి పెరిగింది.
* పెరుగుతున్న జీపీఐ మహిళలకు అనుకూలంగా సమానత్వం మెరుగుపడుతున్న తీరును సూచిస్తోంది. ఉన్నత విద్యలో సమానత్వం, సమ్మిళితత్వం, సమతుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ప్రభావాన్ని ఈ ప్రగతి వెల్లడిస్తోంది.
* మొత్తం నమోదుల్లో ఎస్సీ విద్యార్థుల వాటా 2014–15లో 13.44 శాతం నుంచి 2023–24లో 15.5 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఎస్టీ విద్యార్థుల వాటా 4.8 శాతం నుంచి 6.4 శాతానికి చేరింది. ఓబీసీ విద్యార్థుల భాగస్వామ్యం 32.8 శాతం నుంచి 40.1 శాతానికి పెరిగింది. అన్ని సామాజిక వర్గాల్లో నమోదు వాటా పరంగా ఇదే అత్యధిక పెరుగుదల.
* ఎస్సీ విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి 2014–15లో 18.9 శాతం నుంచి 2023–24లో 27.8 శాతానికి పెరిగింది. ఎస్టీ విద్యార్థుల నిష్పత్తి 2014–15లో 13.5 శాతం నుంచి 2023–24లో 22.8 శాతానికి చేరింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల పెరుగుతున్న భాగస్వామ్యం ఉన్నత విద్యలో సమ్మిళితత్వం విస్తరిస్తున్న తీరును ప్రతిబింబిస్తోంది.
* నిర్దేశిత స్థాయి వైకల్యం కలిగిన వ్యక్తుల(పీడ‌బ్ల్యూబీడీ) నమోదు 2014–15లో 64,298 నుంచి 2022–23లో 88,816కు పెరిగింది. ఇది 38.1 శాతం వృద్ధి. ఈ కాలంలో పురుషుల నమోదు 54.4 శాతం, మహిళల నమోదు 19 శాతం పెరిగాయి.
* 2023–24లో 54,080 మంది పీడ‌బ్ల్యూబీడీ విద్యార్థులు నమోదయ్యారు. వీరిలో 34,080 మంది పురుషులు, 20,000 మంది మహిళలు ఉన్నారు. ఈ వర్గంలో పురుషుల నమోదు అధికంగా ఉండటం ఉన్నత విద్య అందుబాటులో కొనసాగుతున్న లింగ అసమతుల్యతను సూచిస్తోంది. అందుబాటులో వచ్చిన మెరుగుదలలు రెండు లింగాలకు సమానంగా ప్రయోజనం చేకూర్చలేదని ఇది తెలియజేస్తోంది.

లింగ సమానత్వ సూచీ (జీపీఐ)
మహిళల స్థూల నమోదు నిష్పత్తిని పురుషుల స్థూల నమోదు నిష్పత్తితో భాగిస్తే వచ్చే నిష్పత్తే లింగ సమానత్వ సూచీ(జీపీఐ). విద్యా వ్యవస్థలో మహిళల సమాన భాగస్వామ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
* జీపీఐ 1గా ఉంటే రెండు లింగాల మధ్య సమానత్వాన్ని సూచిస్తుంది.
* జీపీఐ 0 నుంచి 1 మధ్య ఉంటే సాధారణంగా పురుషులకు అనుకూలమైన అసమానతను సూచిస్తుంది.
* జీపీఐ 1 కంటే ఎక్కువగా ఉంటే మహిళలకు అనుకూలమైన అసమానతను సూచిస్తుంది.

సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితశాస్త్ర(స్టెమ్‌) కోర్సుల్లో నమోదు
ఉన్నత విద్యలో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితశాస్త్ర(స్టెమ్‌) కోర్సుల నమోదు గత దశాబ్దంలో స్థిరంగా పెరిగింది.

మొత్తం నమోదులు 2014–15లో 91.5 లక్షల నుంచి 2023–24లో 1.02 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో ఇది దాదాపు 11.5 శాతం వృద్ధి.

 



ప్రభుత్వ కార్యక్రమాలు, డిజిటల్ సాంకేతికతలు, ఆవిష్కరణలు, పరిశోధన, ఉపాధి అవకాశాలు భారత విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. సంస్థాగత సామర్థ్యం విస్తరించడం, సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితశాస్త్ర విభాగాలపై విద్యార్థుల్లో ఆసక్తి కొనసాగుతున్న తీరును ఈ వృద్ధి ప్రతిబింబిస్తోంది.

ఉన్నత విద్యలో విదేశీ విద్యార్థుల నమోదు
* విదేశీ విద్యార్థుల నమోదు 2014–15లో 42,293 నుంచి 2023–24లో 58,134కు పెరిగింది. గత దశాబ్దంలో ఇది దాదాపు 37.5 శాతం వృద్ధి. అంతర్జాతీయ విద్యార్థులకు ఉన్నత విద్యా గమ్యస్థానంగా భారత్‌పై పెరుగుతున్న ఆదరణను ఇది ప్రతిబింబిస్తోంది.
* ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ, విస్తరిస్తున్న విద్యా సహకారం, భారత విద్యాసంస్థలకు పెరుగుతున్న ప్రపంచ గుర్తింపును ఇది సూచిస్తోంది.



ఉన్నత విద్యలో అధ్యాపకుల సంఖ్య పెరుగుదల
ఉన్నత విద్యలో అధ్యాపకుల సంఖ్య 2014–15లో 14.73 లక్షల నుంచి 2023–24లో 17.32 లక్షలకు పెరిగింది. ఈ కాలంలో మొత్తం 2.59 లక్షల మంది అధ్యాపకులు పెరిగారు. ఇది దాదాపు 17.6 శాతం వృద్ధి.


* 2014–15 నుంచి 2023–24 మధ్య మహిళా అధ్యాపకుల సంఖ్య 36.7 శాతం పెరిగింది. ఈ రంగంలో మహిళలకు ఉపాధి అవకాశాల్లో సమానత్వం పెరుగుతున్న తీరును ఇది ప్రతిబింబిస్తోంది.
* 2022–23, 2023–24లో మొత్తం అధ్యాపకుల్లో మహిళల కంటే పురుషుల వాటా అధికంగా ఉంది.
* 2022–23లో మహిళా అధ్యాపకుల వాటా 44.3 శాతం. 2023–24లో ఇది స్వల్పంగా పెరిగి 44.9 శాతానికి చేరింది.

మౌలిక వసతులు
2014–15 నుంచి 2023–24 మధ్య ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. సంస్థలన్నింటిలో భౌతిక, డిజిటల్, హరిత మౌలిక వసతులతోపాటు మహిళలు, నిర్దేశిత స్థాయి వైకల్యం కలిగిన వ్యక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలను అభివృద్ధి చేశారు. 2023–24లో:
* 94 శాతం విశ్వవిద్యాలయాలు, 95 శాతం కళాశాలలు, 91 శాతం స్వతంత్ర సంస్థల్లో క్రీడా మైదానాలు ఉన్నాయి.
* 98 శాతం విశ్వవిద్యాలయాలు, 98 శాతం కళాశాలలు, 98 శాతం స్వతంత్ర సంస్థల్లో గ్రంథాలయ సదుపాయం ఉంది.
* 89 శాతం విశ్వవిద్యాలయాలు, 85 శాతం కళాశాలలు, 94 శాతం స్వతంత్ర సంస్థల్లో ప్రయోగశాలలు ఉన్నాయి.
దీనికి అదనంగా చాలా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్వతంత్ర సంస్థల్లో ఆరోగ్య కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, కంప్యూటర్ కేంద్రాలు, సభా మందిరాలు, సమావేశ మందిరాలు వంటి సదుపాయాలు ఉన్నాయి.

భవిష్యత్ అవసరాలకు సిద్ధమైన ఉన్నత విద్యా వ్యవస్థ దిశగా
గత దశాబ్దంలో భారత ఉన్నత విద్యా రంగం గణనీయంగా విస్తరించింది. విద్యాసంస్థలు, విద్యార్థుల నమోదు, అధ్యాపకుల సంఖ్య, ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య పెరిగాయి. స్థూల నమోదు నిష్పత్తి, మహిళల భాగస్వామ్యం, లింగ సమానత్వం, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల సమ్మిళితత్వంలో వచ్చిన మెరుగుదలలు ఉన్నత విద్య మరింత అందుబాటులోకి రావడం, సమాన అవకాశాలు విస్తరించడాన్ని ప్రతిబింబిస్తున్నాయి. స్టెమ్‌ కోర్సులు, విదేశీ విద్యార్థుల నమోదులో పెరుగుదల భారత విజ్ఞాన వ్యవస్థ బలోపేతాన్ని సూచిస్తోంది. నాణ్యత, సమ్మిళితత్వం, అత్యుత్తమ ప్రమాణాలను ప్రోత్సహించడంలో ఎన్ఈపీ 2020 చూపుతున్న ప్రభావాన్ని ఈ విజయాలు సమష్టిగా వెల్లడిస్తున్నాయి.

 

References

Ministry of Education

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2282525&reg=48&lang=1

https://cdnbbsr.s3waas.gov.in/s392049debbe566ca5782a3045cf300a3c/uploads/2025/06/202506041473712372.pdf

https://cdnbbsr.s3waas.gov.in/s392049debbe566ca5782a3045cf300a3c/uploads/2026/07/20260708401535366.pdf

https://cdnbbsr.s3waas.gov.in/s392049debbe566ca5782a3045cf300a3c/uploads/2026/07/202607131602421770.pdf

 

Click to see pdf

 

***

(तथ्य सामग्री आईडी: 150989) आगंतुक पटल : 5


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Urdu , Urdu , Malayalam , Kannada