Infrastructure

ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన (పీఎంకేకేకేవై)

प्रविष्टि तिथि: 17 SEP 2026 18:06 PM

గనుల వల్ల నష్టాలను భరించే ప్రజలకు లాభాల్లో వాటా
 


స్థూలదృష్టి
ఖనిజాలు దేశానికి అత్యంత కీలకమైన వనరులు. వాటి వెలికితీతతో ఆదాయం సమకూరుతుంది. పరిశ్రమలకు ఊతం లభిస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే, గనులు ఉన్న జిల్లాలు తరచూ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. నిర్వాసిత సమస్య, కాలుష్యం, సంప్రదాయ జీవనోపాధి కోల్పోవడం వంటి ప్రభావాలు అక్కడి ప్రజలపై పడుతున్నాయి.

గనుల ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తిరిగి అందించేందుకు భారత్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ డిస్ట్రిక్ట్ మినెర‌ల్‌ ఫౌండేషన్ల (డీఎంఎఫ్‌లు) ద్వారా పనిచేస్తుంది. గనుల లీజుదారుల నుంచి చట్టబద్ధ విరాళాలను డీఎంఎఫ్‌లు సేకరిస్తాయి. 2015 సెప్టెంబర్ 17న ప్రారంభించిన ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన (పీఎంకేకేకేవై) ద్వారా ఈ నిధులను క్షేత్రస్థాయిలో సంక్షేమ, అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగిస్తారు.

పథకం గురించి
గనుల ప్రభావిత ప్రాంతాలన్నింటికీ కనీస స్థాయిలో సామాజిక, మౌలిక సదుపాయాలు అవసరం. ఈ ప్రాంతాలు, అక్కడి ప్రజల సంక్షేమం కోసం జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన (పీఎంకేకేకేవై)ను రూపొందించారు. చట్టం ప్రకారం డీఎంఎఫ్‌లకు సమకూరే నిధులతో ఆయా ఫౌండేషన్లు ఈ పథకాన్ని అమలు చేస్తాయి.

గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం–1957 ప్రకారం రాష్ట్రాలు తమ డీఎంఎఫ్ నిబంధనల్లో పీఎంకేకేకేవైని చేర్చాలి. పథకానికి సవరించిన మార్గదర్శకాలను 2024 జనవరిలో విడుదల చేశారు. ప్రాజెక్టుల ప్రణాళిక, అమలుకు ఈ మార్గదర్శకాలు నవీకరించిన విధానాన్ని అందిస్తున్నాయి.

లక్ష్యాలు
* గనుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులను అమలు చేయడం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే చేపడుతున్న కార్యక్రమాలకు ఈ పనులు అదనపు బలాన్ని అందిస్తాయి.
* గనుల కార్యకలాపాల వల్ల పర్యావరణం, ఆరోగ్యం, స్థానిక ప్రజల సామాజిక–ఆర్థిక పరిస్థితులపై పడే ప్రతికూల ప్రభావాలను తగ్గించడం. గనుల తవ్వకాల సమయంలోనే కాకుండా, అవి ముగిసిన తర్వాత ఎదురయ్యే ప్రభావాలు కూడా ఇందులోకి వస్తాయి.
* ప్రభావిత ప్రజలకు దీర్ఘకాలిక, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించడం.

డిస్ట్రిక్ట్ మినెర‌ల్ ఫౌండేషన్: సంస్థాగత పునాది
గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం–1957కు 2015లో చేసిన సవరణ ద్వారా డిస్ట్రిక్ట్ మినెర‌ల్‌ ఫౌండేషన్ (డీఎంఎఫ్) ఏర్పాటుకు అవకాశం కల్పించారు. గనుల కార్యకలాపాలతో ప్రభావితమైన ప్రజలు, ప్రాంతాల ప్రయోజనాల కోసం పనిచేసే లాభాపేక్ష లేని ట్రస్టులుగా డీఎంఎఫ్‌లు ఏర్పాటయ్యాయి. గనుల ప్రభావం ఉన్న ప్రతి జిల్లా వీటి పరిధిలోకి వస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో డీఎంఎఫ్‌లు పనిచేస్తాయి. డీఎంఎఫ్ నిధులను జిల్లా స్థాయిలో సేకరిస్తారు. ఇప్పటివరకు 23 రాష్ట్రాల్లోని 656 జిల్లాల్లో డీఎంఎఫ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి రాష్ట్రం సొంత డీఎంఎఫ్ నిబంధనలను రూపొందించింది.

షెడ్యూల్డ్, గిరిజన ప్రాంతాలకు రక్షణ చర్యలు
గనుల కార్యకలాపాల ప్రభావం ప్రధానంగా దేశంలోని వెనుకబడిన, మారుమూల ప్రాంతాలపై పడుతోంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగల వంటి బలహీన వర్గాలు కూడా తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. అందువల్ల వారికి ప్రత్యేక శ్రద్ధ, సంరక్షణ అందించడం అత్యవసరం. నిబంధనలను రూపొందించే సమయంలో షెడ్యూల్డ్, గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తాయి. పంచాయతీల(విస్తరణ–షెడ్యూల్డ్ ప్రాంతాల చట్టం–1996), షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం–2006 నిబంధనలను కూడా పాటిస్తాయి.

ఫౌండేషన్లకు నిధులు ఎలా సమకూరుతాయి?
గనుల లీజుదారులు వెలికితీసిన ఖనిజ పరిమాణానికి అనుగుణంగా నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించాలి. దీన్ని రాయల్టీగా పేర్కొంటారు. జిల్లా ఖనిజ ఫౌండేషన్‌కు చెల్లించాల్సిన వాటాను ఈ కింది విధంగా నిర్ణయించారు:

ఏ. 2015 జనవరి 12న లేదా ఆ తర్వాత మంజూరైన గనుల లీజులు, అన్వేషణ లైసెన్స్‌తో కూడిన గనుల లీజులకు రాయల్టీలో పది శాతం.
బీ. 2015 జనవరి 12కు ముందు మంజూరైన గనుల లీజులకు రాయల్టీలో ముప్పై శాతం.
 

నిధులను ఎక్కడ ఖర్చు చేస్తారు?
పీఎంకేకేకేవై నిధుల వినియోగానికి స్పష్టమైన విధానం ఉంది. ప్రాధాన్య సంక్షేమ అవసరాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మధ్య సమతుల్యత పాటిస్తారు.

అత్యంత ప్రాధాన్య రంగాలు: కనీసం 70 శాతం నిధులు
* తాగునీటి సరఫరా.
* పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలు.
* ఆరోగ్య సంరక్షణ, విద్య.
* మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం.
* నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి కల్పన.
* పారిశుద్ధ్యం, గృహ వసతి.
* వ్యవసాయం, పశుసంవర్ధకం.

ఇతర ప్రాధాన్య రంగాలు: గరిష్ఠంగా 30 శాతం నిధులు
* భౌతిక మౌలిక సదుపాయాలు.
* సాగునీరు.
* ఇంధనం, పరీవాహక ప్రాంతాల అభివృద్ధి.
* గనుల జిల్లాల్లో పర్యావరణ నాణ్యతను మెరుగుపరిచే ఇతర చర్యలు.

క్షేత్రస్థాయిలో పురోగతి
అమలు స్థాయిని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకు ₹1 లక్ష కోట్లకు పైగా విలువైన 4.70 లక్షలకు మించిన ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. వీటిలో 2.92 లక్షలకు పైగా ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 2026 జూలై నాటికి ₹30,512 కోట్లకు పైగా కేటాయింపులతో మరో 78,809 పనులు అమలులో ఉన్నాయి.

 



ప్రాజెక్టు స్థితి ప్రాజెక్టుల సంఖ్య మొత్తం (₹ కోట్లు)
అనుమతి పొందినవి
4,70,020 1,09,938
పూర్తయినవి 2,92,156 49,973
కొనసాగుతున్నవి 78,809 30,512 (కేటాయించిన మొత్తం)

గనుల జిల్లాలకు న్యాయమైన వాటా
ఖనిజ సంపద దేశ ప్రజలందరికీ చెందుతుంది. అందువల్ల ఖనిజాల వెలికితీత కారణంగా నష్టాలను భరించే ప్రజలకు వాటి ప్రయోజనాలు తప్పనిసరిగా చేరాలి. డీఎంఎఫ్–పీఎంకేకేకేవై ద్వారా ఈ ప్రయోజనాలను గనుల ప్రభావిత ప్రాంతాల్లో విద్య, ఆరోగ్య సంరక్షణ, తాగునీరు, జీవనోపాధి అవకాశాల మెరుగుదలకు మళ్లిస్తున్నారు.

పథకం అమలు మరింత విస్తరించే కొద్దీ ప్రభావిత సముదాయాలకు తమ నేల కింద ఉన్న సంపదలో న్యాయమైన వాటా దక్కుతుంది. తద్వారా గనుల రంగం దేశాభివృద్ధితో పాటు స్థానిక ప్రజల సంక్షేమానికీ దోహదపడుతుంది.

 

References

Ministry of Mines

https://mines.gov.in/webportal/content/about-dmfpmkkky

https://mines.gov.in/admin/download/6a895eaeb2fd21787387566.pdf

https://ibm.gov.in/writereaddata/files/10172016123146MR.pdf

 

National DMF Portal

https://dmfindia.mines.gov.in/login

 

Finance Commission of India

https://fincomindia.nic.in/asset/doc/commission-reports/12th-FC/reports/eng/Chapter%2013.pdf

 

Government of Maharashtra

https://mahakhanij.maharashtra.gov.in/district-mineral-foundation.aspx

 

Ministry of Finance

https://ies.gov.in/arthapedia/concept/district-mineral-foundation-dmf

https://ies.gov.in/arthapedia/concept/pradhan-mantri-khanij-kshetra-kalyan-yojana-pmkkky

Pradhan Mantri Khanij Kshetra Kalyan Yojana (PMKKKY)

 

****

(तथ्य सामग्री आईडी: 151034) आगंतुक पटल : 51


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , Assamese , Bengali , हिन्दी , Malayalam , Urdu , Kannada , Marathi