Technology
ఐఎంఈఐ ట్యాంపరింగ్
प्रविष्टि तिथि:
23 SEP 2026 10:07 AM
డిజిటల్ సార్వభౌమత్వానికి ముప్పు
భారత్‌లో విస్తరిస్తున్న డిజిటల్ వ్యవస్థ, సురక్షిత పరికరాల అవసరం
భారత్‌లో వేగంగా సాగుతున్న డిజిటలీకరణతో టెలికమ్యూనికేషన్లు రోజువారీ జీవితం, వాణిజ్యం, పాలనలో కీలక భాగంగా మారాయి. దేశంలో క్రియాశీల వైర్లెస్ మొబైల్ చందాదారుల సంఖ్య 2026 జూలైలో 1,204.01 మిలియన్లకు చేరింది. ఈ భారీ చందాదారుల సంఖ్య దేశంలో విస్తరించిన డిజిటల్ అనుసంధాన వ్యవస్థ పరిమాణాన్ని తెలియజేస్తుంది. మొబైల్ నెట్‌వర్క్‌లు, పరికరాలు ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ సేవలు, పౌర కేంద్రిత పాలనకు విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. ఈ సాంకేతికతలపై ఆధారపడటం పెరుగుతున్న నేపథ్యంలో టెలికాం నెట్‌వర్క్‌లు, పరికరాల భద్రత, సమగ్రతను నిర్ధారించడం మరింత ముఖ్యమవుతోంది.
ఈ విస్తరిస్తున్న డిజిటల్ వ్యవస్థతో పాటు కొత్త భద్రతా సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. వాటిలో ఒకటి ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ దుర్వినియోగం. ఐఎంఈఐ నంబర్లను ట్యాంపర్ చేయడం లేదా దుర్వినియోగం చేయడం ద్వారా మార్చిన గుర్తింపులతో పరికరాలను వినియోగించే అవకాశం ఉంటుంది. దీంతో టెలికాం నెట్‌వర్క్‌లలో పరికరాలను గుర్తించడం క్లిష్టమవుతుంది. ఇది చట్ట అమలు సంస్థలు, వినియోగదారుల రక్షణ, నెట్వర్క్ భద్రతకు సవాళ్లు సృష్టించవచ్చు. అందువల్ల సురక్షితమైన, విశ్వసనీయమైన, పటిష్టమైన టెలికమ్యూనికేషన్ వ్యవస్థను కొనసాగించేందుకు పరికరాల గుర్తింపు వివరాల సమగ్రతను బలోపేతం చేయడం అవసరం.
ఐఎంఈఐని చట్టవిరుద్ధంగా ట్యాంపర్ చేయడం అంటే ఏమిటి?
ఒక వ్యక్తి కింది చర్యలకు పాల్పడితే అది చట్టవిరుద్ధం:
* మొబైల్ పరికరానికి సంబంధించిన ప్రత్యేక గుర్తింపు నంబర్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించడం, చెరిపివేయడం, మార్చడం లేదా తారుమారు చేయడం; లేదా
* పై విధంగా మార్పులు చేయడానికి వీలుగా రూపొందించిన హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌ను అది అలా కాన్ఫిగర్ చేసినదని తెలిసి ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం, తయారు చేయడం, విక్రయించడం, రవాణా చేయడం, నియంత్రణలో లేదా ఆధీనంలో ఉంచుకోవడం లేదా కలిగి ఉండటం.
ఐఎంఈఐని అర్థం చేసుకోవడం
* ఐఎంఈఐ అంటే ఏమిటి? ఐఎంఈఐ అనేది టెలికాం నెట్‌వర్క్‌లో మొబైల్ పరికరాన్ని గుర్తించేందుకు ఉపయోగించే ప్రత్యేక 15 అంకెల నంబర్.
* టీఏసీ అంటే ఏమిటి? ఐఎంఈఐలోని మొదటి ఎనిమిది అంకెలను టైప్ అలొకేషన్ కోడ్ (టీఏసీ) అంటారు. ఇది పరికరం మోడల్ లేదా రకాన్ని గుర్తిస్తుంది.
* ఐఎంఈఐ నంబర్లను ఎవరు కేటాయిస్తారు? గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ (జీఎస్ఎంఏ) ప్రపంచవ్యాప్తంగా టీఏసీ కేటాయింపులను పర్యవేక్షిస్తుంది.
* ఐఎంఈఐలను ఎలా కేటాయిస్తారు? జీఎస్ఎంఏ తయారీదారులు, బ్రాండ్ యజమానులకు టీఏసీలను కేటాయిస్తుంది. అనంతరం తయారీదారులు ప్రతి పరికరానికి ప్రత్యేక ఐఎంఈఐ నంబర్లను కేటాయిస్తారు.
* డ్యూయల్ సిమ్ ఫోన్లో ఎన్ని ఐఎంఈఐలు ఉంటాయి? డ్యూయల్ సిమ్ ఫోన్లో సాధారణంగా రెండు ఐఎంఈఐ నంబర్లు ఉంటాయి. ప్రతి సిమ్ స్లాట్‌కు ఒక ఐఎంఈఐ ఉంటుంది.
* వినియోగదారులు తమ ఐఎంఈఐని ఎలా తెలుసుకోవచ్చు? మొబైల్ పరికరంలో *#06# డయల్ చేస్తే ఐఎంఈఐ నంబర్ తెరపై కనిపిస్తుంది.
* ఐఎంఈఐని ఎలా ధృవీకరించాలి? వినియోగదారులు సంచార్ సాథీ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఐఎంఈఐ వివరాలను ధృవీకరించవచ్చు. అలాగే KYM <15-digit IMEI number> అని టైప్ చేసి 14422కు ఎస్ఎంఎస్ పంపవచ్చు.

భద్రతపై అందరి బాధ్యత
సురక్షిత టెలికాం వ్యవస్థకు పరికరాల తయారీ నుంచి వాటిని రోజువారీగా వినియోగించే వరకు మొత్తం ప్రక్రియలో బాధ్యత అవసరం. తయారీదారులు, దిగుమతిదారులు, విక్రేతలు, పౌరులు ఐఎంఈఐ దుర్వినియోగాన్ని నిరోధించడంలో తమ వంతు పాత్ర పోషించాలి.
* తయారీదారులు భారత్‌లో తయారు చేసే వర్తించే టెలికాం పరికరాలన్నింటి ఐఎంఈఐ నంబర్లను మొదటిసారి విక్రయించే ముందు, పరీక్షించే ముందు, పరిశోధన లేదా ఇతర వినియోగానికి ముందు ప్రభుత్వంతో నమోదు చేయాలి. ఈ నమోదు డివైస్ సేతు–ఇండియన్ కౌంటర్‌ఫీటెడ్ డివైస్ రెస్ట్రిక్షన్ (ఐసీడీఆర్) పోర్టల్ ద్వారా జరుగుతుంది. పరికరాలకు చెల్లుబాటు అయ్యే, ప్రత్యేకమైన, ట్యాంపర్ చేయని ఐఎంఈఐ నంబర్లు కేటాయించేలా తయారీదారులు నిర్ధారించాలి.
* దిగుమతిదారులు వర్తించే టెలికాం పరికరాలను భారత్‌లోకి దిగుమతి చేసుకునే ముందు ఐఎంఈఐ నంబర్లను కేంద్ర ప్రభుత్వంతో నమోదు చేయాలి. విక్రయం, పరీక్షలు, పరిశోధన, అభివృద్ధి లేదా ఇతర అవసరాల కోసం ఉద్దేశించిన పరికరాలకు డివైస్ సేతు–ఐసీడీఆర్ పోర్టల్ ద్వారా నమోదు పూర్తి చేయాలి. దిగుమతి చేసే పరికరాల్లో చెల్లుబాటు అయ్యే, అధీకృత ఐఎంఈఐ నంబర్లు ఉన్నాయని దిగుమతిదారులు నిర్ధారించాలి.
* రిసెల్లర్లు, రిటైలర్లు విక్రయానికి అందుబాటులో ఉంచే టెలికాం పరికరాల్లో చెల్లుబాటు అయ్యే, ట్యాంపర్ చేయని ఐఎంఈఐ నంబర్లు ఉన్నాయని నిర్ధారించాలి. వాడిన పరికరాలతో వ్యాపారం చేసే వారు లావాదేవీ పూర్తి చేసే ముందు ప్రభుత్వ ట్యాంపర్ చేయబడిన, బ్లాక్‌లిస్ట్ చేసిన పరికరాల కేంద్ర డేటాబేస్‌లో ఐఎంఈఐని తనిఖీ చేయాలి. ప్రతి ఐఎంఈఐ ధృవీకరణకు నిర్దిష్ట రుసుము చెల్లించాలి. ట్యాంపర్ చేసిన లేదా మార్చుకునే అవకాశం ఉన్న ఐఎంఈఐలతో పరికరాలను విక్రయించడం లేదా వాటితో వ్యాపారం చేయడం కఠినమైన చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చు.
* బ్రాండ్ యజమానులు తమ బ్రాండ్ పేరుతో విక్రయించే పరికరాలు వర్తించే ఐఎంఈఐ నమోదు, సైబర్ భద్రతా నిబంధనలను పాటించేలా చూడాలి. తమ బ్రాండ్లను డివైస్ సేతు–ఐసీడీఆర్ పోర్టల్‌లో తగిన విధంగా నమోదు చేసి, సంబంధిత జీఎస్ఎంఏ టైప్ అలొకేషన్ కోడ్ (టీఏసీ)తో అనుసంధానించాలి. మార్కెట్లోకి తీసుకువచ్చే పరికరాల్లో అసలైన, అధీకృత ఐఎంఈఐ నంబర్లు ఉండేలా వారు నిర్ధారించాలి.
ప్రజలు చేయకూడనివి
టెలికమ్యూనికేషన్ గుర్తింపు వివరాలు, వనరులను ట్యాంపర్ చేయడం లేదా దుర్వినియోగం చేసే చర్యలకు దూరంగా ఉండాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) పౌరులకు సూచించింది:
* కాన్ఫిగర్ చేయగల లేదా ట్యాంపర్ చేసిన ఐఎంఈఐ నంబర్లతో ఉన్న మోడెమ్‌లు, మాడ్యూల్స్, సిమ్ బాక్స్‌లు లేదా ఇతర పరికరాలను ఉపయోగించడం, కొనుగోలు చేయడం లేదా సమీకరించడం.
* నకిలీ పత్రాలు, మోసం, మోసపూరిత చర్యలు లేదా వేరొకరి పేరుతో సిమ్ కార్డులను పొందడం.
* తమ పేరుతో తీసుకున్న సిమ్ కార్డులను వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న ఇతరులకు బదిలీ చేయడం, విక్రయించడం లేదా అప్పగించడం.
* కాలింగ్ లైన్ ఐడెంటిటీ (సీఎల్ఐ) లేదా ఇతర టెలికమ్యూనికేషన్ గుర్తింపు వివరాలను మార్చేందుకు మొబైల్ యాప్‌లు, వెబ్సైట్లు లేదా ఇతర మార్గాలను ఉపయోగించడం.
సంచార్ సాథీ ప్లాట్‌ఫామ్
పౌరులు తమ మొబైల్ హ్యాండ్సెట్లను ధృవీకరించి, భద్రపరచుకునేందుకు సంచార్ సాథీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా పరికరం బ్రాండ్, మోడల్, తయారీదారు వంటి ఐఎంఈఐ వివరాలను ధ్రువీకరించవచ్చు. తద్వారా పరికరం అసలైనదా, సురక్షితమైనదా అన్నది తెలుసుకోవడంలో సహాయపడుతుంది. సంచార్ సాథీ యాప్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

ప్రజలు చేయాల్సినవి
వినియోగదారులు తమ పరికరాలను రక్షించుకోవడంతో పాటు ఐఎంఈఐ నంబర్లు అసలైనవిగా, సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
* మొబైల్ పరికరాలను అధీకృత విక్రేతల వద్ద మాత్రమే కొనుగోలు చేసి, ఐఎంఈఐ వివరాలను ధ్రువీకరించాలి.
* హ్యాండ్‌సెట్‌ను సురక్షితంగా ఉంచేందుకు బలమైన పాస్వర్డ్లు, పిన్లు లేదా బయోమెట్రిక్ ధ్రువీకరణను ఉపయోగించాలి.
* ఐఎంఈఐ ట్యాంపరింగ్ లేదా ఇతర హానికర చర్యల ప్రమాదాన్ని తగ్గించేందుకు పరికరాలకు అధీకృత సర్వీస్ సెంటర్లలోనే మరమ్మతులు చేయించాలి.
* పరికరం పోయినా లేదా దొంగిలించబడినా, అధికారికంగా బ్లాక్ చేసేందుకు కింది దశలను అనుసరించాలి:
ఏ. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి, ఫిర్యాదు ప్రతిని భద్రపరచుకోవాలి.
బీ. పోయిన మొబైల్ నంబర్‌కు సంబంధించి టెలికాం ఆపరేటర్ నుంచి డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకోవాలి. (ట్రాయ్ నిబంధనల ప్రకారం కొత్తగా జారీ చేసిన సిమ్ యాక్టివేట్ అయిన మొదటి 24 గంటల్లో ఎస్ఎంఎస్ సేవలు పరిమితం ఉంటాయి. సంచార్ సాథీ ద్వారా మొబైల్ ఓటీపీ ధ్రువీకరణ అవసరం కాబట్టి, సిమ్ యాక్టివేషన్ తర్వాత 24 గంటలు వేచి ఉండి అభ్యర్థన సమర్పించాలి.)
సీ. సంచార్ సాథీ (సీఈఐఆర్) పోర్టల్ లేదా మొబైల్ యాప్‌లో బ్లాకింగ్ అభ్యర్థన నమోదు చేసి, పోలీసు ఫిర్యాదు, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని అప్లోడ్ చేయాలి. అనంతరం ప్రత్యేక రిక్వెస్ట్ ఐడీ పొందాలి.
డీ. పరికరం తిరిగి లభిస్తే, ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అనంతరం రిక్వెస్ట్ ఐడీని ఉపయోగించి పోర్టల్‌లో హ్యాండ్‌సెట్‌ను సురక్షితంగా అన్‌బ్లాక్ చేయాలి.
టెలికాం వ్యవస్థలో పరికరాల భద్రత అందరి ఉమ్మడి బాధ్యత. అవగాహన, నిబంధనల పాటింపు, బాధ్యతాయుత వినియోగం ద్వారా మోసాలను నివారించడంతో పాటు పౌరులను రక్షించి, భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతను మరింత బలోపేతం చేయవచ్చు.
ఐఎంఈఐ ట్యాంపరింగ్‌పై చట్టపరమైన రక్షణలు
టెలికమ్యూనికేషన్ వ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు భారత్‌లో బలమైన చట్టపరమైన వ్యవస్థ ఉంది.
* టెలికమ్యూనికేషన్స్ యాక్ట్, 2023 మొబైల్ హ్యాండ్సెట్లు, ఇతర టెలికమ్యూనికేషన్ పరికరాల ఐఎంఈఐ నంబర్ సహా టెలికమ్యూనికేషన్ గుర్తింపు వివరాలను ట్యాంపర్ చేయడంపై కఠిన చర్యలకు అవకాశం కల్పిస్తుంది.
* సెక్షన్ 42(3)(c) టెలికమ్యూనికేషన్ గుర్తింపు వివరాలను ట్యాంపర్ చేయడాన్ని నిషేధిస్తుంది. సెక్షన్ 42(3)(e) మోసం, మోసపూరిత చర్యలు లేదా వేరొకరి పేరుతో సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్స్ (సిమ్‌లు) లేదా టెలికమ్యూనికేషన్ గుర్తింపు వివరాలను పొందడాన్ని నిషేధిస్తుంది.
* నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. సెక్షన్ 42(7) ప్రకారం ఇలాంటి నేరాలు కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తారు.
* సెక్షన్ 42(6) ప్రకారం ఇలాంటి నేరాలకు ప్రేరేపించే లేదా సహకరించే వ్యక్తులు కూడా అదే శిక్షకు బాధ్యత వహించాలి.
ఈ నిబంధనలు ఐఎంఈఐ ట్యాంపరింగ్, టెలికాం వనరుల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు బలమైన నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయి.
భారత్ డిజిటల్ భవిష్యత్తుకు రక్షణ
భారత్ టెలికాం ప్రయాణం వేగవంతమైన పురోగతితో పాటు ఉమ్మడి బాధ్యతను కూడా ప్రతిబింబిస్తోంది. బలమైన చట్టాలు, ధృవీకరణ సాధనాలు, పౌరుల అవగాహన కలిసికట్టుగా ఈ నెట్‌వర్క్‌ను సురక్షితంగా, విశ్వసనీయంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రభుత్వం, పరిశ్రమలు, వ్యక్తిగత వినియోగదారులు సహా ప్రతి భాగస్వామి ఈ విశ్వాసాన్ని కాపాడటంలో తన వంతు పాత్ర పోషించాలి. అప్రమత్తమైన, అవగాహన కలిగిన పౌర సమాజం దుర్వినియోగాన్ని అడ్డుకునే బలమైన రక్షణగా నిలుస్తుంది. నిరంతర సహకారంతో భారత్ డిజిటల్ అనుసంధానం భవిష్యత్ తరాలకు కూడా సురక్షితంగా కొనసాగుతుంది.
References:
Ministry of Communications
Telecom Regulatory Authority of India
Click to see pdf
***
(तथ्य सामग्री आईडी: 151041)
आगंतुक पटल : 31
Provide suggestions / comments