Social Welfare
అందరికీ అక్షరాస్యత
प्रविष्टि तिथि:
29 SEP 2026 11:13 AM
వికసిత భారత్ దిశగా భారతదేశ ప్రయాణం
భారతదేశ అక్షరాస్యతలో ముందడుగు: సంపూర్ణ అక్షరాస్యత దిశగా ప్రయాణం
దేశాభివృద్ధికి అక్షరాస్యత పునాది. విద్యా పురోగతికి సూచికగా ఉండటంతోపాటు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి, సమాజంలో అర్థవంతమైన పాత్ర పోషించడానికి అది ప్రజలకు శక్తినిస్తుంది. అక్షరాస్యతను ప్రాథమిక మానవ హక్కుగా యునెస్కో గుర్తించింది. సమానత్వం, న్యాయం, సమ్మిళితత్వం, చట్టబద్ధ పాలన పట్ల గౌరవాన్ని సాధించడంలో ఇది కీలక చోదకశక్తిగా నిలుస్తుందని పేర్కొంది. గత ఎనిమిది దశాబ్దాల్లో అక్షరాస్యత రేటును మెరుగుపరచడంలో భారత్ గణనీయ పురోగతి సాధించింది. 1947లో దేశ మొత్తం అక్షరాస్యత రేటు కేవలం 14 శాతంగా ఉండగా, మహిళల అక్షరాస్యత 8 శాతం మాత్రమే. అక్షరాస్యతను పెంచి, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారత్ కాలానుగుణంగా పలు కార్యక్రమాలు చేపట్టింది. అన్ని స్థాయుల్లో విద్యా సంస్కరణలు తీసుకురావడంతోపాటు నైపుణ్యం కలిగిన, పరిస్థితులకు అనుగుణంగా మారగల, భవిష్యత్తుకు సిద్ధమైన శ్రామిక శక్తిని రూపొందించేందుకు ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020ని ప్రవేశపెట్టింది.
అక్షరాస్యత అంటే ఏమిటి?
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం తొలిసారిగా అక్షరాస్యతకు నిర్వచనం ఇచ్చింది. ‘‘చదవడం, రాయడం, గణించడం, విషయాన్ని గ్రహించడం; అంటే గుర్తించడం, అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, సృష్టించడం; డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత వంటి కీలక జీవన నైపుణ్యాలు కలిగి ఉండటమే అక్షరాస్యత’’ అని పేర్కొంది. ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో 95 శాతం అక్షరాస్యత నమోదైతే దాన్ని సంపూర్ణ అక్షరాస్యతగా పరిగణిస్తుంది.
ప్రపంచ స్థాయిలో చూస్తే చదవడం, రాయడం, సంఖ్యలను ఉపయోగించడం, సాంకేతికత, సమాచార ఆధారిత వాతావరణంలో సమస్యలను పరిష్కరించేందుకు డిజిటల్ సామగ్రిని వినియోగించే సామర్థ్యాన్ని అక్షరాస్యతగా యునెస్కో నిర్వచించింది. ఉద్యోగం, అభ్యసనం, జీవితంలో ప్రజల భాగస్వామ్యానికి ఇది ప్రాథమిక నైపుణ్యంగా నిలుస్తుంది. విద్యా హక్కులో ఇది కీలక భాగం. ఇతర మానవ హక్కులను పొందేందుకు కూడా ముందస్తు అవసరం.
అక్షరాస్యత, విద్యలో పురోగతి అంచనా
1951 నుంచి భారత్ అక్షరాస్యత రేటులో విశేష పురోగతి సాధించింది. 1951లో 18.32 శాతంగా ఉన్న మొత్తం అక్షరాస్యత రేటు 2011 నాటికి 74.04 శాతానికి పెరిగింది. పురుషుల అక్షరాస్యత 27.15 శాతం నుంచి 82.14 శాతానికి చేరగా, మహిళల అక్షరాస్యత 8.86 శాతం నుంచి 65.46 శాతానికి గణనీయంగా పెరిగింది.

పట్టణ అక్షరాస్యత రేటు 1951లో 34.59 శాతంగా ఉండగా, 2011 నాటికి 84.1 శాతానికి చేరింది. గ్రామీణ అక్షరాస్యత 12.10 శాతం నుంచి 67.8 శాతానికి పెరిగింది. 2001–2011 మధ్య గ్రామీణ మహిళల అక్షరాస్యత 26 శాతం వృద్ధి చెందగా, గ్రామీణ పురుషుల్లో వృద్ధి 10 శాతంగా నమోదైంది. మహిళల అక్షరాస్యతలో గణనీయ పురోగతిని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)–2025 ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో అక్షరాస్యత రేటు 89 శాతానికి చేరింది. ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో ఇది 88 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పురుషుల్లో అక్షరాస్యత 93.1 శాతం, మహిళల్లో 84.8 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో అక్షరాస్యత రేటు 77.4 శాతం కాగా, ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో 76.4 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పురుషుల్లో అక్షరాస్యత 84.8 శాతం, మహిళల్లో 70.3 శాతంగా నమోదైంది. ఈ సర్వే ప్రకారం దేశ మొత్తం అక్షరాస్యత రేటు 81.1 శాతంగా ఉంది.

అక్షరాస్యతలో సాధించిన పురోగతికి తోడుగా పాఠశాలల్లో ప్రవేశాలు, విద్యార్థుల కొనసాగింపు, తదుపరి తరగతులకు పురోగతిని మెరుగుపరచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014–15 నుంచి స్థూల ప్రవేశాల నిష్పత్తి (జీఈఆర్), తదుపరి దశకు మారే రేటు, విద్యార్థుల కొనసాగింపు రేటులో చెప్పుకోదగిన మెరుగుదల కనిపించింది. యూడైస్ ప్లస్ నివేదిక (2025–26) ప్రకారం:
- పాఠశాల ప్రవేశాలు: పాఠశాలల్లో 24.72 కోట్లకు పైగా విద్యార్థులు చేరారు.
- స్థూల ప్రవేశాల నిష్పత్తి (జీఈఆర్): ప్రాథమిక పునాది దశలో 42.8 శాతం, సన్నాహక దశలో 91.7 శాతం, మధ్య దశలో 89.6 శాతం, మాధ్యమిక దశలో 71.7 శాతంగా ఉంది.
- బడి మానేసే రేటు: సన్నాహక దశలో 1.8 శాతం, మధ్య దశలో 3.6 శాతం, మాధ్యమిక దశలో 7 శాతంగా నమోదైంది.
- విద్యార్థుల కొనసాగింపు రేటు: ప్రాథమిక పునాది దశలో 98.5 శాతం, సన్నాహక దశలో 91.1 శాతం, మధ్య దశలో 83.7 శాతం, మాధ్యమిక దశలో 51.9 శాతంగా ఉంది.
- తదుపరి దశకు మారే రేటు: ప్రాథమిక పునాది దశ నుంచి సన్నాహక దశకు వెళ్లిన విద్యార్థుల రేటు 99.2 శాతం, సన్నాహక దశ నుంచి మధ్య దశకు 93.8 శాతం, మధ్య దశ నుంచి మాధ్యమిక దశకు 88.3 శాతానికి మెరుగుపడింది.
ఒక విద్యా స్థాయి నుంచి తర్వాతి స్థాయికి విజయవంతంగా చేరే విద్యార్థుల శాతాన్ని తదుపరి దశకు మారే రేటు అంటారు.
గత దశాబ్దంలో ఉన్నత విద్యలో భాగస్వామ్యం గణనీయంగా విస్తరించింది:
- విద్యార్థుల ప్రవేశాలు 2014–15లో 3.42 కోట్లుగా ఉండగా, 2023–24 నాటికి 4.50 కోట్లకు పెరిగాయి.
- ఇదే కాలంలో జీఈఆర్ 23.7 శాతం నుంచి 30 శాతానికి చేరింది.
- ఉన్నత విద్యలో ఉత్తీర్ణుల సంఖ్య 2014–15లో 88.28 లక్షలుగా ఉండగా, 2023–24 నాటికి 1.09 కోట్లకు పైగా పెరిగింది.
ఒక విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యా సంస్థల నుంచి ఉత్తీర్ణులయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్యను ఉన్నత విద్య ఉత్తీర్ణతగా పరిగణిస్తారు.
మహిళల భాగస్వామ్యం పెరగడం, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యలో చేరడం అందుబాటు, సమానత్వం మెరుగైనట్లు సూచిస్తోంది. ఉన్నత విద్యలో జీఈఆర్ను 2035 నాటికి 50 శాతానికి పెంచాలన్న ఎన్ఈపీ–2020 లక్ష్యానికి అనుగుణంగా ఈ పురోగతి కొనసాగుతోంది.
అక్షరాస్యత పురోగతికి ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాలు
భారత్ అక్షరాస్యత విధానం ప్రాథమిక చదవడం, గణించడం నుంచి వేగంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థ, సమాజంలో పాల్గొనేందుకు అవసరమైన విస్తృత సామర్థ్యాల దిశగా పరిణామం చెందింది. ఎన్ఈపీ–2020కి అనుగుణంగా విద్యావకాశాలను విస్తరించడం, అభ్యసన ఫలితాలను బలోపేతం చేయడం, సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడం, జీవితకాల అభ్యసనానికి మద్దతు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఉల్లాస్, నిపుణ్ భారత్ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది.
ఉల్లాస్ (సమాజంలోని అందరికీ జీవితకాల అభ్యసనంపై అవగాహన)
ఉల్లాస్ – నవభారత్ సాక్షరతా కార్యక్రమం: ఉల్లాస్ లేదా న్యూ ఇండియా లిటెరసీ ప్రోగ్రామ్ (ఎన్ఐఎల్పీ) కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం. ఇది ఎన్ఈపీ–2020కి అనుగుణంగా పనిచేస్తుంది. అధికారిక పాఠశాల విద్యకు దూరమైన 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వయోజనులకు సాధికారత కల్పించడంపై దృష్టి సారిస్తుంది. క్రియాత్మక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం, కీలక జీవన నైపుణ్యాలు, జీవితకాల అభ్యసన అవకాశాలను ఈ కార్యక్రమం అందిస్తుంది. తద్వారా లక్ష్యిత వర్గాల సామాజిక సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించి, దేశాభివృద్ధిలో వారు భాగస్వాములు అయ్యేందుకు తోడ్పడుతుంది.
‘జన్ జన్ సాక్షర్’ అంటే ప్రతి వ్యక్తినీ అక్షరాస్యత ద్వారా సాధికారుడిగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ దార్శనికత. ‘కర్తవ్య బోధ్’ అంటే బాధ్యతా భావం స్ఫూర్తితో ఇది పనిచేస్తుంది. సార్వత్రిక అక్షరాస్యతను సాధించేందుకు స్వచ్ఛంద సేవ, జనభాగీదారీ అంటే ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
ఉల్లాస్ మిశ్రమ అభ్యసన విధానాన్ని అనుసరిస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వేదికల్లో అందుబాటులో ఉన్న ఉల్లాస్ యాప్లో 27 భాషల్లో బోధన–అభ్యసన సామగ్రి ఉంది. జిల్లా లేదా బ్లాక్ స్థాయిలో సర్వేయర్లు అభ్యాసకులు, వలంటీర్లను గుర్తిస్తారు. పాఠశాల ఉపాధ్యాయులు, పౌర సమాజ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది వీరిలో ఉండవచ్చు. నిరక్షరాస్యులు, స్వచ్ఛంద ఉపాధ్యాయులుగా సేవలు అందించగలవారిని గుర్తించేందుకు సర్వేయర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. తర్వాతి దశలో అభ్యాసకులను స్వచ్ఛంద ఉపాధ్యాయులతో అనుసంధానిస్తారు. ఉల్లాస్ యాప్లో నమోదు చేసుకునేందుకు విద్యార్థులకు స్వచ్ఛంద ఉపాధ్యాయులు సహాయం చేసి, మార్గనిర్దేశం చేస్తారు. ప్రత్యక్ష, ఆన్లైన్ విధానాల్లో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, కార్యశాలలు నిర్వహిస్తారు. అభ్యాసకులు పాఠ్య సామగ్రిని ఉపయోగించుకుని ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. అనంతరం ఫౌండేషనల్ లిటెరసీ ఆండ్ న్యుమెరసీ అసెస్మెంట్ టెస్ట్ (ఎఫ్ఎల్ఎన్ఏటీ) రాస్తారు. పరీక్ష ఫలితాల మూల్యాంకనం తర్వాత వారికి ధ్రువపత్రాలు అందిస్తారు.

ఉల్లాస్ పురోగతి, ప్రభావం: 2022–27 మధ్య ₹1,037.90 కోట్ల ఆర్థిక కేటాయింపుతో ఐదు కోట్ల మంది అభ్యాసకులను చేరుకోవాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ఉల్లాస్లో దాదాపు 4.03 కోట్ల మంది అభ్యాసకులు, 52.20 లక్షలకుపైగా వలంటీర్లు నమోదయ్యారు. ఇప్పటివరకు 3.3 కోట్లకు పైగా అభ్యాసకులు ఎఫ్ఎల్ఎన్ఏటీలో పాల్గొన్నారు.

2024 నుంచి 2026 మధ్య పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమను సంపూర్ణ అక్షరాస్యత సాధించిన ప్రాంతాలుగా ప్రకటించుకున్నాయి. లద్దాఖ్, మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, సిక్కిం, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ ఈ జాబితాలో ఉన్నాయి. ప్రజల భాగస్వామ్యంతో వయోజన అక్షరాస్యతను ఉల్లాస్ విస్తరిస్తోంది. కోట్ల మంది అభ్యాసకులను చేరుకుంటూ సార్వత్రిక అక్షరాస్యత సాధించాలన్న భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది.
నిపుణ్ భారత్: (చదవడం, విషయాన్ని గ్రహించడం, సంఖ్యా పరిజ్ఞానంలో నైపుణ్యం కోసం జాతీయ కార్యక్రమం)
సమగ్ర శిక్ష పరిధిలో 2021 జులైలో ప్రారంభమైన ఈ కార్యక్రమం బాల్య దశలో అభ్యసనాన్ని బలోపేతం చేయడం, తదుపరి విద్యా పురోగతికి మద్దతు ఇవ్వడంపై దృష్టి సారిస్తుంది. 2026–27 నాటికి సార్వత్రిక ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండో తరగతి నాటికి ప్రతి చిన్నారి ప్రాథమిక నైపుణ్యాలను పొందేలా చూడటం దీని ఉద్దేశం. మూడు నుంచి ఎనిమిదేళ్ల వయసుతో కూడిన ప్రాథమిక పునాది దశపై ఈ మిషన్ దృష్టి పెడుతుంది.
పాఠశాలల్లో ప్రవేశాలను పెంచి, విద్యార్థుల కొనసాగింపును మెరుగుపరచేందుకు ప్రభుత్వం మరికొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టింది. సమగ్ర శిక్ష, పీఎం శ్రీ(ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా), పీఎం ఈ–విద్య, పీఎం పోషణ్(ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్) వీటిలో ముఖ్యమైనవి.
* సమగ్ర శిక్ష: అభ్యసన ఫలితాలను మెరుగుపరచేందుకు పాఠశాలల సామర్థ్యాన్ని పెంచడం, అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. విద్యకు సంబంధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యం–4కు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. గతంలో అమల్లో ఉన్న సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ (ఆర్ఎంఎస్ఏ), ఉపాధ్యాయ విద్య (టీఈ) అనే మూడు పథకాలను విలీనం చేసి దీన్ని ప్రవేశపెట్టారు. ప్రాథమిక అభ్యసనం, ఉపాధ్యాయుల అభివృద్ధి, వృత్తి విద్య అనుసంధానంపై దృష్టి సారిస్తూ సమానమైన, సమ్మిళిత, నాణ్యమైన విద్యను ఈ పథకం ప్రోత్సహిస్తుంది.
* ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ): దేశవ్యాప్తంగా 14,500కు పైగా ఆదర్శ పాఠశాలలను బలోపేతం చేయడం ఈ పథకం లక్ష్యం. విభిన్న సామాజిక నేపథ్యాలు, బహుభాషా అవసరాలు, వివిధ విద్యా సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని సమానమైన, సమ్మిళిత, ఆనందదాయక అభ్యసన వాతావరణాన్ని కల్పించడం ద్వారా విద్యార్థుల సమగ్ర వికాసంపై పథకం దృష్టి సారిస్తుంది.
* పీఎం ఈ–విద్య: డిజిటల్, ఆన్లైన్, ప్రసార మాధ్యమ విద్యకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బహుళ విధానాల్లో అభ్యసన అవకాశాలను అందించే సమగ్ర కార్యక్రమం ఇది. దేశవ్యాప్తంగా పాఠశాలలకు వెళ్లే దాదాపు 25 కోట్ల మంది చిన్నారులకు ఈ కార్యక్రమం ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా.
* పీఎం పోషణ్: 10.36 లక్షల ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ పాఠశాలల్లోని బాలవాటికలు, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న 11.20 కోట్ల మంది విద్యార్థులకు ప్రతి పనిదినం వేడిగా వండిన భోజనాన్ని అందించే కేంద్ర ప్రాయోజిత పథకం ఇది. విద్యార్థులకు పోషకాహార మద్దతు అందించి, పాఠశాలల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం పథకం లక్ష్యం.
ఈ కార్యక్రమాలన్నీ పాఠశాల ప్రవేశాలు, విద్యార్థుల కొనసాగింపు, అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. వివిధ వయసులు, అభ్యసన దశల్లో అక్షరాస్యత అవసరాలను కూడా పరిష్కరిస్తూ ప్రాథమిక విద్య, వయోజన అక్షరాస్యత, జీవితకాల అభ్యసనాన్ని బలోపేతం చేస్తున్నాయి.
వికసిత భారత్, సుస్థిర అభివృద్ధి కోసం అక్షరాస్యత
అందరికీ మరింత సమానమైన, సమ్మిళిత, సుస్థిర భవిష్యత్తును ప్రోత్సహించేందుకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సమగ్ర చట్రాన్ని అందిస్తున్నాయి. అందరికీ సమ్మిళిత, సమాన, నాణ్యమైన విద్యతోపాటు జీవితకాల అభ్యసన అవకాశాలను కల్పించాలని సుస్థిర అభివృద్ధి లక్ష్యం–4 నిర్దేశిస్తోంది. ఇందులో అక్షరాస్యత, విద్య ప్రధానంగా ఉన్నాయి. స్థూల దేశీయోత్పత్తి, తలసరి ఆదాయంతో అక్షరాస్యతకు సానుకూల సంబంధం ఉంది. అది ఆర్థిక వృద్ధి, దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అక్షరాస్యులు, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన ప్రజలు దేశానికి అవసరం.
విద్యకు మించి మహిళా సాధికారత, సమానత్వం, సమ్మిళితత్వం, మానవ హక్కుల సాధనకు అక్షరాస్యత దోహదం చేస్తుంది. ఉద్యోగ అవకాశాలు పొందే సామర్థ్యం, ఉత్పాదకత, ఆవిష్కరణలు, ఆర్థిక భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. హరిత ఉద్యోగాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు విద్య, నైపుణ్యాలు వీలు కల్పిస్తాయి. సర్క్యులర్ ఎకానమికి మద్దతు ఇవ్వడంతోపాటు పర్యావరణ సుస్థిరతకు దోహదపడతాయి. అందువల్ల అక్షరాస్యతలో పురోగతి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలన్నింటిపై బహుళ ప్రయోజనాలు కలిగించి సమ్మిళిత, సుస్థిర, విస్తృత ఆధారిత అభివృద్ధికి మద్దతు ఇస్తుంది.
భవిష్యత్తు: అందరికీ అక్షరాస్యత దిశగా పురోగతి
స్వాతంత్య్రం తర్వాత భారత్ సాగించిన అక్షరాస్యత ప్రయాణం దేశ నిర్మాణం, మానవాభివృద్ధిలో వచ్చిన విస్తృత పరివర్తనను ప్రతిబింబిస్తోంది. నేడు అక్షరాస్యత చదవడం, రాయడానికే పరిమితం కాదు. అభ్యసనం, జీవనోపాధి, సాధికారత, సమాజంలో అర్థవంతమైన భాగస్వామ్యానికి అది వీలు కల్పిస్తుంది. ఎన్ఈపీ–2020, ఉల్లాస్, నిపుణ్ భారత్ వంటి కార్యక్రమాలు ఈ దార్శనికతను మరింత విస్తరిస్తున్నాయి. ప్రాథమిక అభ్యసనాన్ని వయోజన విద్య, జీవితకాల అభ్యసనం, భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలతో అనుసంధానిస్తున్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యం–4కు అనుగుణంగా సమ్మిళిత, సమాన అభివృద్ధి పట్ల భారత్ నిబద్ధతను ఈ ప్రయత్నాలు బలోపేతం చేస్తున్నాయి.
వికసిత భారత్ దిశగా దేశం ముందుకు సాగుతున్న వేళ కార్యక్రమాల నిరంతర అమలు ఎంతో కీలకం. ప్రాంతీయ, లింగ అసమానతలపై మరింత దృష్టి సారిస్తే అక్షరాస్యత ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వర్గానికీ చేరతాయి. అక్షరాస్యులు, నైపుణ్యం కలిగిన, సాధికారులైన ప్రజలు మరింత సమ్మిళిత, ఉత్పాదక, సుస్థిర వికసిత భారత్కు బలమైన పునాదిగా నిలవగలరు.
References
Ministry of Education
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2282525®=48&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2049494®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1882765®=48&lang=2
https://ullas.education.gov.in/nilp/about-us
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2021/jul/doc20217531.pdf
https://aicte.gov.in/sites/default/files/nep2020.pdf
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1805881®=48&lang=2
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1911807®=48&lang=2
https://udiseplus.gov.in/#/en/page/publications
https://cdnbbsr.s3waas.gov.in/s392049debbe566ca5782a3045cf300a3c/uploads/2025/06/202506041473712372.pdf
https://cdnbbsr.s3waas.gov.in/s392049debbe566ca5782a3045cf300a3c/uploads/2026/07/202607131602421770.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291330®=48&lang=2
https://www.dsel-education.gov.in/offerings/initiative/details/pm-e-vidya-IDOyMTMtQWa
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2120666®=48&lang=2
MOSPI
https://www.mospi.gov.in/sites/default/files/reports_and_publication/cso_social_statices_division/Chapter_3_2014.pdfhttps://www.mospi.gov.in/uploads/publications_reports/publications_reports1780040415321_0624fb13-fb47-40bc-b470-7c7e9635c3ef_PLFS_2025_F_REV_29052026.pdf
NITI Aayog
https://www.niti.gov.in/sites/default/files/2026-05/School-Education-System-in-India.pdf
PIB Backgrounder
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=150983®=48&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=159901&NoteId=159901&ModuleId=3®=3&lang=1
UNESCO
https://www.unesco.org/en/days/literacy
https://unesdoc.unesco.org/ark:/48223/pf0000399013
Literacy for All
***
(तथ्य सामग्री आईडी: 151058)
आगंतुक पटल : 9
Provide suggestions / comments