Technology
జీఎస్ఎల్వీ-ఎఫ్18/ఎన్వీఎస్-03 మిషన్
प्रविष्टि तिथि:
01 NOV 2026 11:15 AM
భారత స్వదేశీ నావిగేషన్ సామర్థ్యాల బలోపేతం
ఎన్వీఎస్-03 మిషన్: నావిక్ పరిధి విస్తరణ
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) 2026 అక్టోబర్ 30న 23:51 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ) నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18/ఎన్వీఎస్-03 మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది.

జీఎస్ఎల్వీ-ఎఫ్18 ప్రయోగ వాహనం ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని కచ్చితమైన భూసమకాలిక బదిలీ కక్ష్యలోకి (జీటీఓ) ప్రవేశపెట్టింది. అనంతరం 2026 అక్టోబర్ 31న 16:48 గంటలకు తొలి కక్ష్య సవరణను పూర్తిచేశారు. ఉపగ్రహాన్ని దానికి నిర్దేశించిన 111.75° తూర్పు రేఖాంశంలోని భూసమకాలిక కక్ష్య స్థానానికి చేర్చేందుకు మరిన్ని కక్ష్య సవరణలను చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు.
భారత్ అభివృద్ధి చేస్తున్న ఐదు తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో ఇది మూడోది. ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌లో భారత సామర్థ్యాలను మెరుగుపరిచేలా నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ను (నావిక్) బలోపేతం చేసేందుకు దీన్ని రూపొందించారు.
మీకు తెలుసా? భూసమకాలిక లేదా భూస్థిర కక్ష్యలోకి వెళ్లాల్సిన వ్యోమనౌకను సాధారణంగా ముందుగా దీర్ఘవృత్తాకార భూసమకాలిక బదిలీ కక్ష్యలో (జీటీఓ) ప్రవేశపెడతారు. ఈ కక్ష్యలో పెరిజీ (భూమికి అత్యంత సమీప పాయింట్) తక్కువ ఎత్తులో, అపోజీ (భూమికి అత్యంత దూర పాయింట్) ఎక్కువ ఎత్తులో ఉంటాయి. సాధారణ జీటీఓలో అపోజీ భూమి ఉపరితలం నుంచి సుమారు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అపోజీ సమీపంలో వ్యోమనౌక తనలోని చోదక వ్యవస్థను పనిచేయించి, పెరిజీని పైకి ఎత్తి, కక్ష్యను వృత్తాకారంగా మారుస్తుంది. లక్ష్య కక్ష్యను బట్టి అదనపు సవరణల ద్వారా కక్ష్య వాలు, స్థానాన్ని సర్దుబాటు చేయవచ్చు. కక్ష్యను ఎత్తే ఈ సవరణలకు ఉపయోగించే చోదక వ్యవస్థను సాధారణంగా అపోజీ మోటార్ అంటారు. ఎన్వీఎస్-03 విషయంలో, రసాయన రాకెట్ ఇంజిన్ రకానికి చెందిన లిక్విడ్ అపోజీ మోటార్‌ను (ఎల్ఏఎం) ఉపయోగించి కక్ష్యను ఎత్తే సవరణ చేపట్టారు.
మిషన్ ప్రధాన విశేషాలు
విజయవంతమైన ప్రయోగం: జీఎస్ఎల్వీ-ఎఫ్18, ఎన్వీఎస్-03ను నిర్దేశిత భూసమకాలిక బదిలీ కక్ష్యలోకి (జీటీఓ) చేర్చింది. ఉపగ్రహ నావిగేషన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మరో మైలురాయి.
జీఎస్ఎల్వీ 20వ ప్రయోగం: భారత జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌కు ఇది 20వ ప్రయోగం. వ్యూహాత్మక అంతరిక్ష మిషన్ల కోసం భారత ప్రయోగ వాహనాన్ని నిరంతరం వినియోగిస్తున్న తీరును ఇది చాటుతోంది.
తదుపరి తరం శ్రేణి ఉపగ్రహం: రెండో తరం నావిక్ ఉపగ్రహాల శ్రేణిలో (ఎన్వీఎస్-01 నుంచి ఎన్వీఎస్-05 వరకు) ఎన్వీఎస్-03 మూడో ఉపగ్రహం. భారత ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ పరిధి, కచ్చితత్వం, విశ్వసనీయతను బలోపేతం చేసేందుకు ఈ ఉపగ్రహాలను రూపొందించారు.
ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ
స్థాన నిర్ధారణ, నావిగేషన్, సమయ సమాచారాన్ని అందించే ఉపగ్రహాల నెట్‌వర్క్‌నే ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ అంటారు. ఈ ఉపగ్రహాలు తమ స్థానం, కచ్చితమైన సమయ సమాచారంతో కూడిన సంకేతాలను నిరంతరం ప్రసారం చేస్తాయి. స్మార్ట్ఫోన్లు, వాహనాలు, నావిగేషన్ పరికరాలు వంటి వాటిలోని రిసీవర్లు పలు ఉపగ్రహాల సంకేతాలను ఉపయోగించి తమ కచ్చితమైన స్థానం, వేగం, దిశను నిర్ధారిస్తాయి. మార్గనిర్దేశం, విమానాలు, నౌకల కదలికల పర్యవేక్షణ, కచ్చితత్వ వ్యవసాయం, విపత్తు నిర్వహణ, టెలికమ్యూనికేషన్లతో సహా పలు అవసరాలకు ఈ వ్యవస్థలు తోడ్పడతాయి. అమెరికా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), భారత నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (నావిక్) ఇందుకు ఉదాహరణలు.
మెరుగైన నావిగేషన్ సంకేతాలు: ఎన్వీఎస్-03లో ఎల్1, ఎల్5, ఎస్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో పనిచేసే నావిగేషన్ పేలోడ్లు ఉన్నాయి. ఎల్5, ఎస్ సంకేతాలతోపాటు ఎల్1 సంకేతాన్ని చేర్చడం నావిక్ సామర్థ్యాలను, అనుకూలతను మరింత మెరుగుపరుస్తోంది. భారత భూభాగంతోపాటు దేశ సరిహద్దుకు ఆవల 1,500 కిలోమీటర్ల వరకు విస్తరించిన ప్రాంతంలో నావిగేషన్ సేవలకు ఇది తోడ్పడుతుంది.
పలు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను ఉపయోగించడం వల్ల అనుకూలమైన రిసీవర్లు వేర్వేరు పౌనఃపున్యాల్లో ప్రసారమయ్యే సంకేతాలను పొందగలవు. వివిధ అవసరాలు, నిర్వహణ పరిస్థితులకు అనువైన రిసీవర్లను రూపొందించేందుకు కూడా అవకాశాలు కల్పిస్తుంది.
నావిగేషన్ సంకేతాలు, వాటి ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు
నావిగేషన్ ఉపగ్రహాలు భూమిపై ఉన్న రిసీవర్లకు ప్రసారం చేసే రేడియో పౌనఃపున్య సంకేతాలే నావిగేషన్ సంకేతాలు. వీటిలో కచ్చితమైన సమయ సమాచారం, ఉపగ్రహ స్థానం వివరాలు ఉంటాయి. తమ స్థానం, వేగం, సమయాన్ని లెక్కించేందుకు రిసీవర్లు ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాయి. ఈ సంకేతాలను ప్రసారం చేసేందుకు ఉపయోగించే నిర్దిష్ట రేడియో పౌనఃపున్య పరిధులే ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు. ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థలు రేడియో పౌనఃపున్య స్పెక్ట్రమ్‌లో నిర్దేశిత భాగాలను ఉపయోగిస్తాయి. వేర్వేరు బ్యాండ్లు వివిధ పౌనఃపున్యాల్లో సంకేతాలను ప్రసారం చేసేందుకు, స్వీకరించేందుకు వీలు కల్పిస్తాయి.
స్వదేశీ సాంకేతికత: సమకూర్చుకున్న అణు గడియారాలతోపాటు స్వదేశీగా అభివృద్ధి చేసిన అణు గడియారం ఎన్వీఎస్-03లో ఉంది. నావిగేషన్ సంకేతాల ఉత్పత్తికి ఈ గడియారాలు అత్యంత ఖచ్చితమైన సమయ ప్రామాణికాలను అందిస్తాయి. సంకేతాలు ప్రయాణించేందుకు పట్టే సమయాన్ని నిర్ధారించడానికి, వినియోగదారుల స్థానాలను లెక్కించడానికి కచ్చితమైన సమయం అవసరం.
విస్తృత వినియోగాలు: భారత స్వతంత్ర స్థాన నిర్ధారణ, నావిగేషన్, సమయ నిర్ధారణ (పీఎన్టీ) సామర్థ్యాలను ఎన్వీఎస్-03 బలోపేతం చేస్తుంది. రవాణా, సముద్ర కార్యకలాపాలు, విమానయానం, విపత్తు నిర్వహణ, కచ్చితత్వ వ్యవసాయం, వ్యూహాత్మక సేవల్లో ఈ సామర్థ్యాలు ఉపయోగపడతాయి.
జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ)
జియోసింక్రనస్ శాటిలైట్ ఆర్బిట్ (జీటీఓ), లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ) ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అభివృద్ధి చేసిన మూడు దశల ప్రయోగ వాహనమే జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ). చివరి దశలో స్వదేశీ క్రయోజెనిక్ ఎగువ దశను ఉపయోగించడం ఇతర ప్రయోగ వాహనాలతో పోలిస్తే జీఎస్ఎల్వీ ప్రత్యేకత. అదనంగా, జీఎస్ఎల్వీలో ఉపయోగించే బూస్టర్లు ద్రవ ఇంధనంతో పనిచేస్తాయి. వీటిని సాధారణంగా ఎల్-40గా పిలుస్తారు. నైట్రోజన్ టెట్రాక్సైడ్ (ఎన్₂ఓ₄), యూహెచ్25 కలవగానే మండే హైపర్గాలిక్ మిశ్రమాన్ని ఇవి ఉపయోగిస్తాయి. యూహెచ్25లో 75% అన్‌సిమెట్రికల్ డైమిథైల్హైడ్రజీన్ (యూడీఎంహెచ్), 25% హైడ్రజీన్ హైడ్రేట్ ఉంటాయి.
జీఎస్ఎల్వీ-ఎఫ్18 ఎత్తు సుమారు 50 మీటర్లు. ప్రయోగ సమయంలో దీని బరువు దాదాపు 420 టన్నులు. ఇందులో 3.4 మీటర్ల వ్యాసం గల లోహపు ఉపగ్రహ రక్షణ కవచం (పేలోడ్ ఫెయిరింగ్) ఉంది. సుమారు 2,250 కిలోగ్రాముల ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని ఇది విజయవంతంగా మోసుకెళ్లింది.
క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్: అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేసే చోదక ద్రవ్యాలను ఉపయోగిస్తూ, ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లోకి చేర్చేందుకు అవసరమైన అధిక సామర్థ్యాన్ని అందించే ప్రయోగ వాహనం చివరి దశనే క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ అంటారు. జీఎస్ఎల్వీలో ఉపయోగించే ఇస్రో స్వదేశీ క్రయోజెనిక్ ఎగువ దశ, ద్రవ హైడ్రోజన్‌ను (ఎల్‌హెచ్₂) ఇంధనంగా, ద్రవ ఆక్సిజన్‌ను (ఎల్‌ఓఎక్స్) ఆక్సిడైజర్‌గా ఉపయోగిస్తుంది. రెండింటినీ అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేస్తారు. గత జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఉపయోగించిన రష్యా సరఫరా దశ స్థానంలో ఈ స్వదేశీ దశను ప్రవేశపెట్టారు. దీంతో అధునాతన ప్రయోగ వాహన సాంకేతికతలో భారత స్వావలంబన బలోపేతమైంది.
నావిక్‌ను అర్థం చేసుకుందాం: భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ
- ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అభివృద్ధి చేసిన భారత ప్రాంతీయ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్.
- గతంలో దీన్ని ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్)గా పిలిచేవారు.
- వినియోగదారులకు ఈ వ్యవస్థ స్థాన నిర్ధారణ, నావిగేషన్, సమయ నిర్ధారణ (పీఎన్టీ) సేవలను అందిస్తుంది.
- నిరంతరం పనిచేసే భూకేంద్రాల నెట్వర్క్ మద్దతుతో ఏడు ఉపగ్రహాల సమూహంగా నావిక్‌ను మొదట రూపొందించారు. దీని నిర్మాణంలో మూడు ఉపగ్రహాలు భూస్థిర కక్ష్యలో, నాలుగు ఉపగ్రహాలు వాలుగా ఉన్న భూసమకాలిక కక్ష్యలో ఉంటాయి. ప్రస్తుత ఉపగ్రహ సమూహాన్ని బలోపేతం చేయడానికి, నావిగేషన్ సేవల నిరంతర కొనసాగింపునకు ఎన్వీఎస్ శ్రేణిని ప్రవేశపెడుతున్నారు.
- భారత భూభాగంతోపాటు దేశ సరిహద్దుకు ఆవల సుమారు 1,500 కిలోమీటర్ల వరకు విస్తరించిన ప్రాంతాన్ని నావిక్ కవర్ చేస్తుంది.
- ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎల్5, ఎస్ సంకేతాలకు ఎన్వీఎస్ శ్రేణి ఎల్1 సంకేతాన్ని అదనంగా చేరుస్తుంది.
రెండు రకాల నావిగేషన్ సేవలు
పౌరులు, అనుమతి పొందిన వ్యూహాత్మక వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు నావిక్ రెండు రకాల నావిగేషన్ సేవలను అందిస్తుంది.
- స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ (ఎస్పీఎస్): పౌర వినియోగదారులకు అందుబాటులో ఉండే బహిరంగ నావిగేషన్ సేవ. జీపీఎస్ (యూఎస్ఏ), గ్లోనాస్ (రష్యా), గెలీలియో (ఈయూ), బైడౌ (చైనా) వంటి ఇతర గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) సంకేతాలతో కలిపి ఉపయోగించేందుకు నావిక్ ఎస్పీఎస్ సంకేతాలు అనుకూలంగా ఉంటాయి.
- రిస్ట్రిక్టెడ్ సర్వీస్ (ఆర్ఎస్): వ్యూహాత్మక వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండే, ఎన్క్రిప్షన్తో రక్షించిన నావిగేషన్ సేవ.
తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణి పురోగతి
నావిక్ ఉపగ్రహ సమూహాన్ని బలోపేతం చేయడానికి, స్వదేశీ నావిగేషన్ సేవల నిరంతర కొనసాగింపునకు ఐదు ఉపగ్రహాలతో కూడిన ఎన్వీఎస్ శ్రేణిని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్వీఎస్-01, ఎన్వీఎస్-02, ఎన్వీఎస్-03లను ప్రయోగించారు. ఎన్వీఎస్-04, ఎన్వీఎస్-05 తదుపరి ప్రణాళికల్లో ఉన్నాయి. నావిక్ సేవల పరిధి, విశ్వసనీయత, అందుబాటును పెంచేందుకు ఇస్రో కృషి చేస్తోంది.
ఎన్వీఎస్-01 – తదుపరి/రెండో తరం శ్రేణిలో తొలి ఉపగ్రహం
- భారత జీఎస్ఎల్వీ 15వ ప్రయోగమైన జీఎస్ఎల్వీ-ఎఫ్12, ఎన్వీఎస్-01ను భూసమకాలిక బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
- ఎన్వీఎస్-01ను 2023 మే 29న ప్రయోగించారు. రెండో తరం నావిక్ శ్రేణిలో ఇది తొలి ఉపగ్రహం. ఇప్పటికే అందిస్తున్న నావిక్ సేవలు నిరంతరం కొనసాగేలా దీన్ని రూపొందించారు.
- ఇందులో ఎల్1, ఎల్5, ఎస్ బ్యాండ్ల నావిగేషన్ పేలోడ్లు ఉన్నాయి.
- ప్రయోగ సమయంలో దీని బరువు సుమారు 2,232 కిలోగ్రాములు.
- ఎన్వీఎస్-01 మిషన్ కాలపరిమితి 12 ఏళ్లు.
- అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ స్వదేశీగా అభివృద్ధి చేసిన రుబీడియం అణు గడియారం ఇందులో ఉంది.
ఎన్వీఎస్-02 – శ్రేణిలో రెండో ఉపగ్రహం
- ఎన్వీఎస్-02ను 2025 జనవరి 29న జీఎస్ఎల్వీ-ఎఫ్15 ద్వారా ప్రయోగించారు.
- ఇందులో ఎల్1, ఎల్5, ఎస్ బ్యాండ్ల నావిగేషన్ పేలోడ్లతోపాటు దూరాన్ని కొలిచే సీ-బ్యాండ్ పేలోడ్ ఉంది.
- ప్రయోగ సమయంలో ఎన్వీఎస్-02 బరువు 2,250 కిలోగ్రాములు.
- కచ్చితమైన సమయ నిర్ధారణ కోసం స్వదేశీ, సమకూర్చుకున్న అణు గడియారాలను కలిపి ఉపయోగిస్తుంది.
- ప్రయోగం తర్వాత ఆక్సిడైజర్ వాల్వులు తెరుచుకోకపోవడంతో కక్ష్యను ఎత్తే ప్రక్రియను చేపట్టలేకపోయారు. ఫలితంగా ఉపగ్రహం నిర్దేశిత కక్ష్య స్థానానికి చేరుకోలేకపోయింది.
ఎన్వీఎస్-04, ఎన్వీఎస్-05 – రాబోయే ఉపగ్రహాలు
- రెండో తరం నావిక్ శ్రేణిలో నాలుగు, ఐదో ఉపగ్రహాలుగా ఎన్వీఎస్-04, ఎన్వీఎస్-05లను ప్రణాళిక చేశారు.
- గత ఎన్వీఎస్ ఉపగ్రహాల మాదిరిగానే, వీటిలో ఎల్5, ఎస్‌తోపాటు ఎల్1 సంకేతం కూడా ఉంటుందని భావిస్తున్నారు. రెండు ఉపగ్రహాలూ మెరుగైన నావిగేషన్ సామర్థ్యాలను అందించేలా ప్రణాళిక రూపొందించారు.
భారత అంతరిక్ష సార్వభౌమత్వం దిశగా మరో ముందడుగు
తదుపరి తరం నావిక్ ఉపగ్రహాల విజయవంతమైన అభివృద్ధి, ప్రవేశపెట్టడం అధునాతన అంతరిక్ష సాంకేతికతలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా భారత ప్రయాణంలో మరో మైలురాయి. స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ సామర్థ్యాలను బలోపేతం చేయడం ద్వారా నమ్మకమైన స్థాన నిర్ధారణ, నావిగేషన్, సమయ నిర్ధారణ సేవలను స్వతంత్రంగా అందించే సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటోంది. కీలక అవసరాల కోసం విదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థలపై ఆధారపడటాన్ని ఈ పురోగతి తగ్గిస్తుంది. వ్యూహాత్మక అంతరిక్ష మౌలిక సదుపాయాల రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణకు భారత సాంకేతిక సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేస్తుంది. ఈ ప్రయత్నాలు భారత అంతరిక్ష సార్వభౌమత్వం, సాంకేతిక స్వావలంబన, అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో పెరుగుతున్న పాత్రకు మరింత బలాన్నిస్తాయి.
References:
Click here to see pdf
***
(तथ्य सामग्री आईडी: 151158)
आगंतुक पटल : 11
Provide suggestions / comments