Social Welfare
రామమందిర కథ
Posted On:
24 NOV 2025 12:12PM
ఇతిహాసం నుంచి వారసత్వం వరకు
''ఈ భవ్య రామమందిరం భారతదేశ అభివృద్ధి, ఎదుగుదల, శ్రేయస్సు, వికసిత్ భారత్‌కు సాక్షిగా నిలుస్తుంది.''
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(2024 జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో)
పరిచయం

పురాతన అయోధ్య నగరంపై ప్రసరించే సూర్యుని తొలి కిరణాలు కేవలం ఇసుకరాతి స్తంభాలు, చెక్కిన గోపురాలను ప్రకాశింపజేయడమే కాకుండా భారతదేశ సాంస్కృతిక ఆత్మను శతాబ్దాలుగా తీర్చిదిద్దిన ఒక కథను కూడా వెల్లడిస్తాయి. ఇప్పుడు పూర్తి వైభవంతో నిర్మితమై ఉన్న రామ మందిరం కేవలం నిర్మాణ అద్భుతమే కాదు, విశ్వాసం, దృఢత్వానికి అత్యుత్తమమైన మేళవింపు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఆయోధ్యను ఎల్లప్పుడూ శ్రీరాముడి జన్మస్థలంగా పరిగణిస్తారు. ఈ పవిత్ర జన్మస్థలంలో ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచన భారతదేశ సాంస్కృతిక గుర్తింపులో అంతర్లీనంగా అల్లుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా భక్తులకు ఈ స్థలం ఆధ్యాత్మిక దిక్సూచీగా మారింది.
2025 నవంబర్ 25న 22 అడుగుల ధార్మిక పతాకాన్ని ఎగరేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవిత్ర హిందూ ఆచారమైన ధ్వజారోహనం నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సంప్రదాయంలో అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ధ్వజారోహనం ప్రతీకగా నిలుస్తుంది. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొనాల్సిందిగా ఒక బహిరంగ ఆహ్వానంగా కూడా నిలుస్తుంది.

సంక్షిప్త సందర్భోచిత చరిత్ర

ఈ మైలురాయి వెనుక ప్రగాఢ విశ్వాసం, నాగరిక స్మృతి సాధించిన విజయం, చట్టం ద్వారా చారిత్రక న్యాయ పునరుద్ధరణకు సంబంధించిన కథ ఉంది.
అయోధ్యలో రామజన్మభూమి మందిర ప్రయాణం భారతదేశ ప్రజాస్వామిక సంస్థల ద్వారా పరిష్కృతమైన సుదీర్ఘ న్యాయ, సాంస్కృతిక గాథ. 2019 నవంబర్ 9న భారత సుప్రీంకోర్టు ప్రపంచవ్యాప్తంగా భక్తులకు ఈ స్థలం ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. మొత్తం 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని రామమందిర నిర్మాణానికి అప్పగిస్తూ ఏకగ్రీవ, చారిత్రక తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు న్యాయపరమైన, సయోధ్య, రాజ్యాంగ సూత్రాల విజయంగా ప్రశంసలు అందుకుంది. ఈ తీర్పు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. 2020 ఫిబ్రవరి 5న ఆలయ నిర్మాణానికి భారత ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.
ఈ తీర్పు భౌతిక వ్యక్తీకరణ 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ స్థలంలో భూమిపూజ చేసి, ఆలయ నిర్మాణానికి పునాదిరాయి వేయడంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని శతాబ్దాల నిరీక్షణ ముగింపునకు ప్రతీకగా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ ఆలయం భావి తరాల్లో స్ఫూర్తి నింపడంతో పాటు మెరుగైన అనుసంధానత, ఆర్థిక అవకాశాలతో ప్రాంతీయ అభివృద్ధిని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.


నగర నిర్మాణశైలితో భవ్య శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణం జరిగింది. 392 స్తంభాలపై, 44 ప్రవేశ ద్వారాలతో నిర్మితమైంది. స్తంభాలు, గోడలపై హిందూ దేవీ, దేవతల చిత్రాలను చెక్కారు. కింది అంతస్తు(గ్రౌండ్ ఫ్లోర్)లోని గర్భగుడిలో శ్రీరాముడి బాల రూపమైన శ్రీ రామ్‌లల్లాను ప్రతిష్ఠించడమైంది.
తూర్పు ప్రవేశంలోని సింహద్వారం మీదుగా 32 మెట్ల ఎక్కితే చేరుకోగల ప్రధాన గర్భగుడిలో శ్రీ రామ్‌లల్లా విగ్రహం ఉంది. ఆలయ ప్రాంగణంలో భక్తి కార్యక్రమాల కోసం నృత్య, రంగ్, సభ, ప్రాథన, కీర్తన్ అనే పేర్లతో ఐదు మండపాలు ఉన్నాయి. కుబీర్ తిలాలో పురాతన శివాలయం, చారిత్రక సీతా కూప్ బావిని కూడా పునరుద్ధరించారు.
నేడు భారతదేశ నాగరికత కొనసాగింపునకు, చట్టం సమర్థించిన విశ్వాసానికి ఉన్న శక్తికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అద్భుతమైన కట్టడం కేవలం అయోధ్య ఆధ్యాత్మిక వారసత్వాన్ని పునరుద్ధరించడమే కాకుండా మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానశ్రయం, పునరాభివృద్ధి చేసిన యాక్సెస్ రోడ్లు వంటి మెరుగైన మౌలిక సదుపాయాలతో సహా సమగ్ర అభివృద్ధికి కారణమవుతోంది. తీర్థయాత్ర, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తోంది.

రామమందిరం: ప్రపంచ ప్రతిధ్వని

మండే ఎండల్లో రేయింబవళ్లు శ్రమించిన కళాకారుల అచంచలమైన విశ్వాసానికి అయోధ్యలోని రామమందిరం నిదర్శనంగా నిలుస్తోంది. రామమందిరం పట్ల ఉన్న సామూహిక జాతీయ భావోద్వేగాలను మరింత ప్రతిబింబిస్తోంది.
గతంలో కూడా రామమందిర నిర్మాణంతో ముడిపడి ఉన్న వేడుకల స్ఫూర్తి భారతదేశం దాటి విస్తరించింది. ఉదాహరణకు, ట్రినిడాడ్ & టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఒక గొప్ప రామ మందిరాన్ని నిర్మించాలని ప్రణాళిక రూపొందిస్తోంది. 2025 మే నెలలో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో అయోధ్య రామ్‌లల్లా విగ్రహ ప్రతిరూపాన్ని సైతం ఆవిష్కరించింది. ఇటువంటి సంఘటనలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక స్ఫూర్తి కలయికను ప్రదర్శిస్తాయి. ఇదే సమయంలో ఆధ్యాత్మిక పర్యాటకం, తీర్థయాత్రలకు తలుపు తెరుస్తాయి.
అయోధ్య రామ మందిర డిజైన్‌ను అహ్మదాబాద్‌కు చెందిన శ్రీ చంద్రకాంత్ సోంపురా రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన లార్సెన్ అండ్ టర్బో నిర్మాణ బాధ్యతలను తీసుకుంది. సలహాదారుగా టాటా కన్సలింగ్ ఇంజినీర్స్ సంస్థ వ్యవహరించింది.

“ఇది రాముని రూపంలో ఉన్న జాతీయ చైతన్యానికి ఆలయం. శ్రీరాముడు భారతదేశ విశ్వాసం, పునాది, ఆలోచన, చట్టం, చైతన్యం, ప్రతిష్ట, కీర్తి.”
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(2024 జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకలో)


పురాతన నిర్మాణశైలి, అత్యాధునిక విజ్ఞానశాస్త్ర కలయికకు ఈ ప్రాజెక్టు మంచి ఉదాహరణ. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ గువాహటి సహా దేశంలోని ప్రఖ్యాత సంస్థలకు చెందిన ఇంజినీర్లు, మేధావులు వెయ్యి సంవత్సరాల పాటు ఉండేలా పునాదితో నిర్మించిన ఈ రాతి ఆలయంలో పాలుపంచుకున్నారు.
ఆలయానికి వచ్చే అన్ని వయసుల భక్తుల అవసరాలను తీర్చడానికి ప్రత్యేక భక్తుల సౌకర్యాల కేంద్రం(పీఎఫ్‌సీ), వృద్ధ భక్తుల కోసం ర్యాంప్‌లు, అత్యవసర వైద్య సహాయం వంటి ఆధునిక సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. భారీ నిర్మాణమైనప్పటికీ సుస్థిరమైన తీర్థయాత్ర అనే అయోధ్య నగర ముందుచూపుకు అనుగుణంగా ఆలయ కాంప్లెక్స్‌కు సౌరశక్తి ప్యానెళ్లు ఏర్పాటు చేశారు.
ముగింపు
2025 నవంబర్ 25న రామమందిరంపై కాషాయ పతాకం ఎగురనున్న తరుణం.. ఆలయ సముదాయం నిర్మాణం పూర్తయినట్టు సూచిక. వివాదాస్పద కల నుంచి సజీవ వారసత్వం వైపు సాగిన ప్రయాణం శిఖరాగ్రానికి చేరుకున్నట్టు భావించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే ఈ ధ్వజారోహణం ఆలయ నిర్మాణాన్ని మాత్రమే కాకుండా ధర్మమే స్ఫూర్తిగా జరిగే ఉత్సవం. సామరస్యం, వారసత్వం, వృద్ధికి కేంద్రంగా అయోధ్య తిరిగి ఆవిర్భవించినందున భక్తులను స్వాగతించే వేడుక ఇది. రామమందిరం కేవలం రాతి నిర్మాణం కంటే ఎక్కువగా దృఢత్వం, భక్తి, పురాతన సంప్రదాయాన్ని ప్రపంచ భవిష్యత్తుతో అనుసంధానం చేసే వారధిగా నిలుస్తోంది.
PM India:
https://www.pmindia.gov.in/en/news_updates/pm-announces-setting-up-of-shri-ram-janma-bhoomi-tirtha-kshetra-trust/
https://www.pmindia.gov.in/en/news_updates/pm-performs-bhoomi-pujan-at-shree-ram-janmabhoomi-mandir/
https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-participate-in-the-pran-pratishtha-ceremony-of-shri-ramlalla-in-the-newly-built-shri-ram-janmbhoomi-mandir-in-ayodhya-on-22nd-january/
Shri Ram Janmabhoomi Kshetra Trust:
https://srjbtkshetra.org/about/
https://srjbtkshetra.org/main-temple/
Ministry of Information & Broadcasting:
https://www.facebook.com/inbministry/posts/the-divine-idol-of-ramlalla-at-the-magnificent-shri-ram-janmabhoomi-temple-in-ay/779631037530987/
Click here to see pdf
***
(Features ID: 156180)
Visitor Counter : 3
Provide suggestions / comments