Technology
నేషనల్ బ్లాక్‌చెయిన్ ఫ్రేమ్‌వర్క్
బ్లాక్‌చెయిన్ సాంకేతికత ద్వారా పరిపాలన బలోపేతం
Posted On:
24 OCT 2025 10:38AM
కీలకాంశాలు
- 2024 సెప్టెంబర్‌లో రూ.64.76 కోట్ల బడ్జెట్‌తో జాతీయ బ్లాక్‌చెయిన్ ఫ్రేమ్‌వర్క్ ప్రారంభం
- జాతీయ బ్లాక్‌చెయిన్ ఫ్రేమ్‌వర్క్‌లో విశ్వస్య బ్లాక్‌చెయిన్ స్టాక్, ఎన్‌బీఎఫ్‌లైట్, ప్రామాణిక్, నేషనల్ బ్లాక్‌చెయిన్ పోర్టల్ వంటివి కీలకమైన భాగాలు
- హైదరాబాద్, భువనేశ్వర్, పుణెలోని ఎన్ఐసీ డేటా సెంటర్లలో బ్లాక్‌చెయిన్ సాంకేతికత ఏర్పాటు
- 2025 అక్టోబర్ 21 నాటికి బ్లాక్‌చెయిన్ వేదికపై దాదాపు 34 కోట్ల పత్రాల పరిశీలన
పరిచయం
తొలుత క్రిప్టోకరెన్జీలతో అనుబంధం ద్వారా తెరపైకి వచ్చిన బ్లాక్‌చెయిన్ సాంకేతికత 21వ శతాబ్దంలో అత్యంత పరివర్తన చెందుతున్న డిజిటల్ ఆవిష్కరణల్లో ఒకటిగా ఉద్భవించింది. కంప్యూటేషనల్ పవర్ ద్వారా శక్తిని పొందే కృత్రిమ మేధ(ఏఐ) లాంటి సాంకేతికతల మాదిరిగా కాకుండా మధ్యలో ఎలాంటి వ్యవస్థల ప్రమేయం లేకుండా పనిచేసి, విశ్వాసాన్ని నిర్మించుకోవడం బ్లాక్‌చెయిన్ సామర్థ్యం.
భారత్‌లో ప్రస్తుత పాలనా వ్యవస్థలు కేంద్రీకృత డేటాబేస్‌లపై ఆధారపడ్డాయి. వీటిల్లో ఎర్రర్, మోసాలకు అవకాశం ఉంది. పారదర్శకత కూడా తక్కువ. ట్యాంపర్ చేయడానికి వీలులేని, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ వ్యవస్థ ద్వారా ఇలాంటి సవాళ్లను బ్లాక్‌చెయిన్ సాంకేతికత పరిష్కారం చూపుతోంది. ఇందులో బహుళ నోడ్‌లలో రికార్డులను సురక్షితంగా నిర్వహించవచ్చు. బ్లాక్‌చెయిన్‌లో అనధికారికంగా రికార్డులను మార్చడం అసాధ్యం. ఇది డేటా సమగ్రత, విశ్వాసాన్ని గణనీయంగా పెంచుతుంది.

ఈ ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్విత్వ శాఖ.. వివిధ రంగాల్లో బ్లాక్‌చైన్ వ్యవస్థను ఏర్పాటుచేయడానికి ఏకీకృత విధానాన్ని అందించేందుకు నేషనల్ బ్లాక్‌చెయిన్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌బీఎఫ్)ను అభివృద్ధి చేసింది. ప్రజాసేవల్లో బ్లాక్‌చెయిన్‌ను భాగం చేయడానికి మార్గదర్శిగా ఉండటం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యాన్ని మెరుగుపర్చడం ఎన్‌బీఎఫ్ లక్ష్యం.
బ్లాక్‌చెయిన్ అంటే ఏంటి?
బ్లాక్‌చెయిన్ అనేది విస్తృత, పారదర్శక, సురక్షితమైన, మార్చలేని డేటాబేస్. ఇది రికార్డులు లేదా లావాదేవీలను నమోదు చేస్తుంది. అక్రమంగా రికార్డులు మార్చేందుకు వీలులేకుండా చేస్తుంది. కంప్యూటర్ నెట్‌వర్క్‌లకు అందుబాటులో ఉంటుంది.
బ్లాక్‌చెయిన్ రకాలు
పబ్లిక్ బ్లాక్‌చెయిన్: ఈ నెట్‌వర్క్‌లో అన్ని విభాగాలు రికార్డులను పొందొచ్చు, లావాదేవీలను పరిశీలించవచ్చు, ప్రూఫ్ ఆఫ్ వర్క్ చేయవచ్చు, కొత్త బ్లాక్‌లను చేర్చవచ్చు.
ప్రైవేటు బ్లాక్‌చెయిన్: ఇది అనుమతి ఆధారంగా పనిచేస్తుంది. ఏదైనా సంస్థలోని ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే పరిమితమై ఉంటుంది. భద్రత, వినియోగించే అధికారం, సౌలభ్యం ఏ స్థాయిలో ఉండాలనేది సంస్థ చేతిలోనే ఉంటుంది. దీంతో ఇది ప్రభుత్వ వ్యవస్థలకు అనువైనదిగా ఉంటుంది. డిజైన్‌పరంగా ఇది డేటా గోప్యత, నిర్వహణ సామర్థ్యం ద్వారా అందరికీలో విశ్వాసాన్ని పొందింది.
కన్సార్టియం బ్లాక్‌చెయిన్: ఈ నెట్‌వర్క్‌లో బ్లాక్‌చైన్ కొంత వికేంద్రీకరించి ఉంటుంది. డేటా నిర్వహణ, ధ్రువీకరణకు కలిసి పనిచేసేలా బహుళ సంస్థలు సంయుక్తంగా నిర్వహించవచ్చు.
హైబ్రిడ్ బ్లాక్‌చెయిన్: ఇది పబ్లిక్, ప్రైవేటు బ్లాక్‌చెయిన్‌ల మిశ్రమంగా పనిచేస్తుంది. ఇందులో ఎంపిక చేసిన డేటా, ఎంపిక చేసిన వ్యక్తులకు అందుబాటులో ఉంటుంది.

బ్లాక్‌చెయిన్ పునాదికి బలాలైన పారదర్శకత, అక్రమంగా మార్చడానికి వీలు లేని విధానం, వికేంద్రీకరణ, విశ్వాసం అనేవి నేషనల్ బ్లాక్‌చెయిన్ ఫ్రేమ్‌వర్క్‌కు కీలకంగా ఉన్నాయి. ఈ లక్షణాలు సురక్షితమైన, సమర్థవంతమైన డిజిటల్ వ్యవస్థలను ఏర్పాటుచేస్తాయి. ముఖ్యంగా పాలనలో పరివర్తన కోసం, పౌరులకు సేవలు మెరుగుపర్చడంలో కీలకంగా పనిచేస్తాయి.

నేషనల్ బ్లాక్‌చెయిన్ ఫ్రేమ్‌వర్క్: సురక్షితమైన డిజిటల్ పరిపాలన
2021 మార్చిలో రూ.64.76 కోట్ల వ్యయంతో చేపట్టిన నేషనల్ బ్లాక్‌చెయిన్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌బీఎఫ్) 2024 సెప్టెంబర్ 4న అధికారికంగా ప్రారంభమై ముఖ్యమైన మైలురాయికి చేరుకుంది. అనుమతి పొందిన బ్లాక్‌చెయిన్ ఆధారిత అప్లికేషన్ల అభివృద్ధి, ఏర్పాటుకు వీలు కల్పించేలా ఎన్‌బీఎఫ్ రూపొందింది. ఇది భారత్ కోసం సురక్షితమైన, పారదర్శకమైన, కొలవడానికి వీలు కలిగిన డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి వ్యూహాత్మక అడుగు.
టెక్నాలజీ స్టాక్ - విశ్వస్య బ్లాక్‌చెయిన్ స్టాక్
నేషనల్ బ్లాక్‌చెయిన్ ఫ్రేమ్‌వర్క్‌లో విశ్వవస్య బ్లాక్‌చెయిన్ స్టాక్ కీలకమైనది.
పరిపాలనలో బ్లాక్‌చెయిన్ ఆధారిత అప్లికేషన్ల నిర్మాణం, విస్తరణకు సాంకేతిక పునాది వేయడానికి రూపొందించిన స్వదేశీ, మాడ్యూలర్ వేదిక.
విశ్వస్య బ్లాక్‌చెయిన్ స్టాక్ లక్షణాలు ఇవి:
బ్లాక్‌చెయిన్-యాజ్-ఎ-సర్వీస్(బీఏఏఎస్): బ్లాక్‌చెయిన్ సౌకర్యాన్ని విశ్వస్య ఒక భాగస్వామ్య సేవగా అందిస్తోంది. తద్వారా ప్రభుత్వ సంస్థలు సొంతంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటుచేసుకోవాల్సిన, నిర్వహించాల్సిన అవసరం లేకుండా బ్లాక్‌చెయిన్ ఆధారంగా అప్లికేషన్లను విస్తరించేందుకు అవకాశం ఉంటుంది.
సదుపాయాల పంపిణీ: హైదరాబాద్, పుణె, భువనేశ్వర్‌లోని ఎన్ఐసీ డేటా సెంటర్లలో స్టాక్‌ను ఏర్పాటుచేయడం జరిగింది. తద్వారా లోపాలను తట్టుకునే, వినియోగాన్ని కొలవగలిగే, దృఢమైన బ్లాక్‌చెయిన్ ఆధారిత అప్లికేషన్లకు అవకాశం ఉంటుంది.
పర్మీషన్డ్ బ్లాక్‌చెయిన్ లేయర్: పర్మీషన్డ్ బ్లాక్‌చెయిన్‌పై ఈ వేదిక నిర్మాణం జరిగింది. తద్వారా కేవలం ధ్రువీకరించిన, అధీకృత వ్యక్తులు మాత్రమే ఇందులో చేరే, లావాదేవీలు చేయగలిగే అవకాశం ఉంటుంది.
ఓపెన్ ఏపీఐ, సమీకృత సేవలు:
ప్రమాణీకరణ, డేటా పంచుకునేంలా ఓపెన్ ఏపీఐ(అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేసెస్), సమీకృత మాడ్యూళ్లను విశ్వస్య అందిస్తుంది.
ఎన్‌బీఎఫ్‌లైట్ - అంకుర, విద్యాసంస్థల కోసం బ్లాక్‌చెయిన్ శాండ్‌బాక్స్
ఎన్‌బీఎఫ్‌లైట్ అనేది బ్లాక్‌చెయిన్ సాంకేతికత స్టాక్‌కు శాండ్‌బాక్స్ వర్షన్. ఆవిష్కరణ, ప్రయోగాత్మకత, సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహించేలా ఇది రూపొందింది. అంకుర, పరిశోధన సంస్థలతో పాటు విద్యార్థులు నియంత్రిత వాతావరణంలో, పూర్తిస్థాయి బ్లాక్‌చెయిన్ సదుపాయాలు అవసరం లేకుండానే బ్లాక్‌చెయిన్ ఆధారిత అప్లికేషన్లను వినియోగించవచ్చు.
ప్రామాణిక్ - యాప్ ధ్రువీకరణకు వినూత్న బ్లాక్‌చెయిన్ పరిష్కారం
వేగంగా మారుతున్న నేటి డిజిటల్ యుగంలో హానికర యాప్‌లు, మోసపూరిత కస్టమర్ సపోర్ట్ వ్యక్తిగత డేటాకు ముప్పు, ఆర్థిక నష్టాలకు దారి తీసే అవకాశం ఉన్నందున వీటి నుంచి మొబైల్ ఫోన్లను రక్షించడం కీలకం. మొబైల్ అప్లికేషన్ల మూలం, ప్రామాణికతను ధ్రువీకరించేందుకు బ్లాక్‌చెయిన్ సాంకేతికతను వినియోగించే వినూత్న పరిష్కారమే ప్రామాణిక్. వినియోగదారులు యాప్‌ను స్కాన్ లేదా పరిశీలించినప్పుడు బ్లాక్‌చెయిన్ రికార్డులను ప్రామాణిక్ సరిపోల్చి ఆ యాప్‌ల చట్టబద్ధతను ధ్రువీకరిస్తుంది. తద్వారా మొబైల్ వ్యవస్థలో విశ్వసనీయత, పారదర్శకతను ప్రోత్సహిస్తుంది.

నేషనల్ బ్లాక్‌చెయిన్ పోర్టల్
పరిపాలన, పరిశ్రమలో బ్లాక్‌చెయిన్ సాంకేతికతను వినియోగించడానికి భారతదేశ వ్యూహాత్మక విధానాన్ని నేషనల్ బ్లాక్‌చెయిన్ పోర్టల్ వివరిస్తుంది. అప్లికేషన్ల కోసం ఆవిష్కరణ, ప్రమాణీకరణను ఈ వేదిక ప్రోత్సహిస్తుంది. విశ్వసనీయతను పెంచుతుంది. సరికొత్త సాంకేతికతల్లో భారతదేశ నాయకత్వాన్ని పెంపొందిస్తుంది. బహుళ పరిశ్రమల్లో బ్లాక్‌చెయిన్ సాంకేతికతకు మద్దతిస్తున్న ప్రపంచంలోని కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భారతదేశ ఎన్‌బీఎఫ్ ఒకటి.

బ్లాక్‌చెయిన్‌తో పరిపాలన, సరఫరా చెయిన్, న్యాయ వ్యవస్థల రూపాంతరం
విశ్వసనీయమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశ ప్రయాణం కీలకమైన నియత్రణసంస్థలు, సాంకేతిక సంస్థల సమన్వయ ప్రయత్నాలతో కొనసాగుతోంది. పరిపాలన, సప్లయ్ చెయిన్‌లు, సంస్థల్లో బ్లాక్‌చెయిన్ వినియోగానికి అవసరమైన కీలకమైన సౌకర్యాలను ఎన్‌బీఎఫ్ అందిస్తోంది.
ధ్రువపత్రాలు, పత్రాల చెయిన్
ధ్రువపత్రాల జారీ, వినియోగంలో ప్రస్తుత వ్యవస్థలో నకిలీ పత్రాల వినియోగం, సేవల్లో ఆలస్యం వంటి సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సురక్షితంగా భద్రపరచగలిగే, రికార్డులను పునరుద్ధరించగలిగే సర్టిఫికెట్ చెయిన్ నిర్మించడానికి నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) బ్లాక్‌చెయిన్ సాంకేతికతను వినియోగిస్తోంది.
* సర్టిఫికెట్ చెయిన్ వినియోగం ద్వారా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యా సంబంధ పత్రాలను బ్లాక్‌చెయిన్‌లో భద్రపరుస్తోంది.

ధ్రువపత్రాల జారీ అధీకృత సంస్థలు, వినియోగించే సంస్థలకు డాక్యుమెంట్ చెయిన్ అనేది ఒకే వేదిక. ప్రభుత్వం జారీ చేసే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, జనన, మరణ ధ్రువపత్రాలు వంటి ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను భద్రపరిచేందుకు, తిరిగిపొందేందుకు ఒకేరకమైన విధానం ఉంటుంది. 2025 అక్టోబర్ 21 నాటికి భారతదేశ బ్లాక్‌చెయిన్ ఆధారిత వేదిక ద్వారా 34 కోట్ల పత్రాల పరిశీలన పూర్తయ్యింది. వీటిల్లో 48,000 పత్రాలు డాక్యుమెంట్ చెయిన్‌లోనివి.
లాజిస్టిక్స్ చెయిన్
బహుళ భాగస్వామ్య పక్షాలు వస్తువులు, వనరుల రవాణాను పర్యవేక్షించేలా సురక్షితమైన, పారదర్శమైన వేదికను లాజిస్టిక్స్ చెయిన్ అందిస్తోంది. బ్లాక్‌చెయిన్ సాంకేతికతను వినియోగించడం ద్వారా సప్లయ్ చెయిన్‌లోని లావాదేవీలు అన్ని దశలోనూ అక్రమాలకు తావులేకుండా, పర్యవేక్షించేలా, జవాబుదారీ విధానంతో నమోదవుతాయి. ఇటీవల కర్నాటకలో ఔషదాల రవాణాకు ఆన్‌లైన్ సప్లయ్ చెయిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఔషద)ను వినియోగించారు.
ఔషద వ్యవస్థ బ్లాక్‌చెయిన్‌తో పనిచేస్తుంది. ఔషదాలు తయారీదారు నుంచి ఆస్పత్రుల వరకు ఔషదాల రవాణాకు సంబంధించి నాణ్యత పరీక్షలు సహా ప్రతి రికార్డును ఇది నమోదు చేస్తుంది. రోగులు ఔషదాల వినియోగానికి ముందు తయారీదారు, గడువు వివరాలు, నాణ్యత తెలుసుకోవచ్చు. ఔషదాల రవాణాను పర్యవేక్షించడం ద్వారా నకిలీ ఔషదాలు వచ్చే అవకాశాలను తగ్గించడంతో పాటు పారదర్శకతను తీసుకువస్తుంది.
జుడీషియరీ చెయిన్
న్యాయ సంబంధమైన డేటా పత్రాల సురక్షితమైన, మార్చడానికి వీలులేని, సమయాన్ని ముద్రిస్తూ రికార్డును అందజేయడం ద్వారా న్యాయ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యత, విశ్వసనీయతను పెంపొందించేందుకు బ్లాక్‌చెయిన్‌ను జ్యుడీషియరీ చెయిన్ వినియోగిస్తోంది. నోటీసులు, సమన్లు, బెయిల్ ఉత్తర్వుల జారీలో ఆలస్యాన్ని, మనుఫులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రానిక్ డెలివరీ విధానాన్ని వినియోగించడానికి బ్లాక్‌చెయిన్ అవకాశం కల్పిస్తుంది. 2025 అక్టోబర్ 21 నాటికి బ్లాక్‌చెయిన్ వేదికగా 665 న్యాయసంబంధమైన పత్రాల పరిశీలన జరిగింది.
ఇంటర్-ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్
జ్యూడీషియరీ చెయిన్‌పై రూపొందించిన ఇంటర్-ఆపరేబుల్ జస్టీస్ సిస్టమ్(ఐసీజేఎస్) కేస్ రికార్డులు, సాక్ష్యాలు, న్యాయసంబంధ పత్రాల కోసం ఏకీకృత డిజిటల్ వేదికగా ఉంటుంది. 2025 అక్టోబర్ 21 నాటికి దాదాపు 39,000 ఐసీజేఎస్ పత్రాలు బ్లాక్‌చెయిన్ వేదికగా పరిశీలన పూర్తయ్యింది.
ప్రాపర్టీ చెయిన్
బ్లాక్‌చెయిన్‌తో రూపొందించిన ఆస్తి నిర్వహణ వ్యవస్థ ప్రతి ఆస్తి లావాదేవీని బ్లాక్‌చెయిన్‌లో సురక్షితంగా భద్రపరించేందుకు అవకాశం కల్పిస్తుంది. భూరికార్డులను మార్పులు, బదిలాయింపులు జరిగినప్పుడు కూడా భాగస్వామ్య పక్షాలన్నీ నిర్ణయం తీసుకునేముందు లావాదేవీల పూర్తి చరిత్రను తెలుసుకునే వీలు ఉంటుంది. యాజమాన్యాన్ని, హక్కులను, రుణాలను కొనుగోలుదారులు తెలుసుకునేందుకు ఈ పారదర్శకత ఉపయోగపడుతుంది. తద్వారా వివాదాలను తగ్గిస్తుంది. 2025 అక్టోబర్ 21 నాటికి 34 కోట్లకు పైగా ఆస్తి పత్రాలను బ్లాక్‌చెయిన్ వేదికగా ధ్రువీకరించడం జరిగింది.
భారత్‌లో బ్లాక్‌చెయిన్ వినియోగానికి వ్యూహాత్మక ప్రణాళిక, నియంత్రణ
భారత్‌లో బ్లాక్‌చెయిన్ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ప్రణాళికతో కూడిన నేషనల్ స్ట్రాటజీ ఆన్ బ్లాక్‌చెయిన్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. వివిధ రంగాల్లో బ్లాక్‌చెయిన్ వినియోగానికి ఉన్న సవాళ్లను ఇది పరిష్కరించడంతో పాటు స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాలను నిర్దేశిస్తోంది.
బ్లాక్‌చెయిన్ సాంకేతికత(బీసీటీ)లో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్(సీఓఈ)
బ్లాక్‌చెయిన్ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించడానికి ముందుగా ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేపట్టేందుకు సలహాలు, శిక్షణ, సహకారం పొందేందుకు ప్రభుత్వ విభాగాల కోసం వేదికగా పనిచేసేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్(సీఓఈ)ని నేషనల్ ఇన్‌ఫార్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) స్థాపించింది.
బ్లాక్‌చెయిన్ సాంకేతికత(బీసీటీ)ని సమర్థంగా వినియోగించేందుకు, వ్యవస్థలను అనుసంధానం చేయడానికి ప్రభుత్వ సీఓఈ బ్లాక్‌చెయిన్ సంబంధ సేవలు, ఐసీటీ(ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) సౌకర్యాలను అందిస్తోంది. సురక్షితమైన, పారదర్శకమైన డిజిటల్ వ్యవస్థలను నిర్మించేందుకు ఉపయోగపడే ఓపెన్ సోర్స్ వ్యవస్థలైన హైపర్‌లెడ్జర్ సాటూత్, హైపర్‌లెడ్జర్ ఫ్యాబ్రిక్, ఎథెరియమ్ వంటి ప్రముఖ బ్లాక్‌చెయిన్ వేదికలతో సీఓఈ పని చేసింది.
బీసీటీలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) పాత్ర
టెలికాం వ్యవస్థలో బ్లాక్‌చెయిన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ(డీఎల్‌టీ)ని ట్రాయ్ ప్రవేశపెట్టింది. ప్రిన్సిపల్ ఎంటిటీలు(పీఈ), టెలిమార్కెటర్లు వాటి మెసేజ్‌ను ట్రాన్స్‌మిషన్ చెయిన్లలో నమోదు చేయడం తప్పనిసరి చేసింది. తద్వారా ఎస్ఎంసీ పంపించిన దగ్గర నుంచి వినియోగదారుకు చేరే వరకు పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు అవకాశం కలిగింది. రెగ్యులేటర్లు, యాక్సెస్ ప్రొవైడర్ల సంయుక్తంగా దీనిని అమలు చేసింది. ఇది స్పామ్‌లను తగ్గించడం ద్వారా వినియోగదారుల రక్షణను గణనీయంగా బలోపేతం చేసింది. బ్లాక్‌చెయిన్ సామర్థ్యాన్ని చాటింది. దాదాపు 1.13 లక్షలకు పైగా సంస్థల పరిధిలో చేపట్టిన ఈ కార్యక్రమం ఆర్‌బీఐ, సెబి, ఎన్ఐసీ, సీ-డాక్ వంటి సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్వహించింది.
బీసీటీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్ర
డిజిటల్ రూపీ వంటి ప్రయోగాత్మక ప్రాజెక్టుల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆధునికీకరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లాక్‌చెయిన్ సాంకేతికతను వినియోగిస్తోంది. 2022 డిసెంబర్‌లో పరిమిత సంఖ్యలో వినియోగదారులు, వర్తకులతో కూడిన బృందం పరిధిలో ప్రారంభించిన రిటైల్ పైలట్ ప్రాజెక్టు బ్లాక్‌చెయిన్ ఎలా తక్షణ, పారదర్శక, గుర్తించగల చెల్లింపులకు అవకాశం కలిగించడంతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.
డిబెంచర్ కొవెనెంట్ పర్యవేక్షణలో ఎన్ఎస్‌డీఎల్ బ్లాక్‌చెయిన్ వినియోగం
డిబెంచర్ కొవెనెంట్ పర్యవేక్షణలో బ్లాక్‌చెయిన్ ఆధారిత వేదిక డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ(డీఎల్‌టీ)ని భారతదేశ అతిపెద్ద డిపాజిటరీ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్‌డీఎల్) ప్రవేశపెట్టింది. ఇది భారతీయ క్యాపిటల్ మార్కెట్ల ఆధునికీకరణలో కీలక అడుగు. సురక్షితమైన డిజిటల్ లెడ్జర్‌లో అసెట్ చార్జీల నమోదు, అసెట్ కవర్ రేషియో, కోవెనెంట్ల పర్యవేక్షణకు ఇష్యూయర్లు, డిబెంచర్ ట్రస్టీలకు అవకాశం ఉంటుంది. ఈ లెడ్చర్‌ను అక్రమంగా మార్చడానికి వీలు ఉండదు. క్రిప్టోగ్రాఫిక్‌గా సంతకం, సమయ ముద్రణ జరిగి ఉంటుంది. ఇది పెట్టుబడులు పెట్టేవారిలో విశ్వాసాన్ని పెంచుతుంది.
బ్లాక్‌చెయిన్ సాంకేతికతలో సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు
బ్లాక్‌చెయిన్ లాంటి సరికొత్త సాంకేతికతల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అనేక సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది. బ్లాక్‌చెయిన్‌పై ప్రధాన దృష్టితో భవిష్యత్తుకు తగ్గట్టుగా శ్రామికశక్తిని తయారుచేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యం.
నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం
డిజిటల్ ఇండియా కార్పొరేషన్(ఎంఈఐటీవై)లోని కేపాసిటీ బిల్డింగ్ డివిజన్ వివిధ శాఖల్లో సాంకేతిక సమర్థను పెంపొందించడానికి ప్రభుత్వ అధికారులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. దాదాపు 214 కార్యక్రమాల ద్వారా 21,000 మందికి పైగా అధికారులకు బ్లాక్‌చెయిన్ వంటి సరికొత్త అంశాల్లో శిక్షణ ఇప్పించింది. స్టేట్ ఈ-మిషన్ టీమ్స్(ఎస్ఈఎంటీఎస్) సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమాలు సాంకేతిక ఆధారంగా పరిపాలన చేయగలిగే ప్రభుత్వ ఉద్యోగులను తయారుచేస్తున్నాయి.
ఫిన్‌టెక్ & బ్లాక్‌చెయిన్ అభివృద్ధిలో పీజీ డిప్లొమా(పీజీ-డీఎఫ్‌బీడీ)
క్రిప్టోకరెన్సీలు, ఎన్ఎఫ్‌టీలు(నాన్-ఫంగిబుల్ టెకోన్స్), ఇతర బ్లాక్‌చెయిన్ అప్లికేషన్ల ప్రాముఖ్యత పెరిగిన తర్వాత ఫిన్‌టెక్ వ్యవస్థ వృద్ధి కోసం వేగవంతమైన, సరసమై, సురక్షితమైన వేదికల అవసరం పెరిగింది. ఈ డిమాండ్‌ను అందుకునేందుకు పీజీ డిప్లొమా ఇన్ ఫిన్‌టెక్ & బ్లాక్‌చెయిన్ డెవెలప్‌మెంట్(పీజీ-డీఎఫ్‌బీడీ) వంటి కోర్సులు నిపుణులు, విద్యార్థులకు బ్లాక్‌చెయిన్, ఫిన్‌టెక్, ఏఐ/ఎంఎల్, సైబర్‌సెక్యూరిటీ, ప్రాగ్రామింగ్, నియమావళిపై 900 గంటల పాఠ్యాంశాలను అందిస్తున్నాయి.
బ్లెండ్: సీ-డాక్ ఆన్‌లైన్ కోర్సు
సెంటర్ ఫర్ డెవెలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీ-డాక్) బ్లెండ్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది బ్లాక్‌చెయిన్ సాంకేతికతలో ప్రావీణ్యం పొందేందుకు ఇంజినీరింగ్ విద్యార్థులు, కెరీర్ ఆరంభంలో ఉన్న నిపుణులు కోసం అందిస్తున్న ఆన్‌లైన్ కోర్సు ఇది. ఇందులో ప్రయోగాత్మక అప్లికేషన్లు కూడా ఉన్నాయి. బ్లాక్‌చెయిన్ సిద్ధాంతాలను, ఆర్కిటెక్చర్‌ను, విభాగాలను, నిర్వహణ తీరును సమగ్రం అర్థం చేసుకునేందుకు రూపొందించిన కోర్సు ఇది. విభిన్న రంగాల్లో నిజమైన బ్లాక్‌చెయిన్ అప్లికేషన్ల అభివృద్ధికి ఈ కోర్సు అవకాశం కల్పిస్తోంది.
ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్
ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్(ప్రోగ్రామ్ ఫర్ రీస్కిల్లింగ్/అప్‌స్కిల్లింగ్ ఆఫ్ ఐటీ మ్యాన్‌పవర్ ఫర్ ఎంప్లాయబులిటీ) అనే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ప్రోత్సాహంతో అందిస్తున్న పరిశ్రమ ఆధారిత కార్యక్రమం. బ్లాక్‌చెయిన్ లాంటి పది సరికొత్త సాంకేతికతల్లో భారతీయ ఉద్యోగశక్తికి డిజిటల్ సామర్థ్యాలు పెంపొందించడం ద్వారా దేశంలో సాంకేతిక ప్రతిభను బలోపేతం చేయడం, ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యాలు.
భవిష్యత్తులో బ్లాక్‌చెయిన్ వినియోగం
ప్రజాసేవల్లో సమర్థత, విశ్వసనీయత పెంపొందించడానికి వివిధ రంగాల్లో వినియోగించిన బ్లాక్‌చెయిన్ ఆధారిత వ్యవస్థలపై అధ్యయనాలు జరిగింది. పరిపాలనలో ఆవిష్కరణ, జవాబుదారీతనం పెంచడం, లోపాలను తగ్గించడంలో బ్లాక్‌చెయిన్ ఎలా పనిచేస్తుందనేది ఈ అధ్యయనాలు చాటిచెప్తున్నాయి. యాజమాన్య హక్కులను భద్రపరించేందుకు ల్యాండ్ రికార్డ్స్, అవయవదానాన్ని నర్యవేక్షించేందుకు బ్లక్‌బ్యాంక్, పన్నుల పర్యవేక్షణ కోసం జీఎస్టీ చెయిన్, సరఫరా గొలుసుల భద్రతకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్) వంటివి కీలకమైన ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్(పీఓసీ)లు.

ముగింపు
డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి అనుగుణంగా బ్లాక్‌చెయిన్ సాంకేతికత డిజిటల్ గవర్నెన్స్‌లో విశ్వసనీయత, పారదర్శకత తీసుకొస్తుంది. సాంకేతికతలో ఆత్మనిర్భరత, ఆవిష్కరణకు మార్గం సుగమం చేసేలా ప్రభుత్వం నుంచి పౌరులకు(జీ2సీ), ప్రభుత్వం నుంచి వ్యాపారానికి(జీ2బీ) సేవకు సహకారంగా నేషనల్ బ్లాక్‌చెయిన్ ఫ్రేమ్‌వర్క్ కార్యక్రమం ద్వారా భారత్ సమ్మిళిత బ్లాక్‌చెయిన్ వ్యవస్థను నిర్మిస్తోంది. సామర్థ్య నిర్మాణం, స్వదేశీ బ్లాక్‌చెయిన్ సాంకేతికతల అభివృద్ధిపై దృష్టిని కొనసాగిస్తూ సమ్మిళిత వృద్ధి కోసం బ్లాక్‌చెయిన్ వినియోగంలో భారత్ ప్రపంచ అగ్రగామిగా ఎదిగేందుకు సిద్ధంగా ఉంది.
References
Ministry of Electronics and IT
Rajya Sabha
Ministry of Communications
Ministry of Finance
Digital India Corporation
National Informatics Centre
National Institute of Electronics & Information Technology
Centre of Excellence in Blockchain Technology
Download in PDF
****
(Backgrounder ID: 155694)
Visitor Counter : 22
Provide suggestions / comments