Economy

మహిళలు, ఉపాధి, పారిశ్రామిక‌త‌: మెరుగైన జీవనోపాధుల దిశగా భారత్ ముందడుగు

Posted On: 15 OCT 2026 12:11PM

భారత్‌లో మహిళల ఉపాధి ప్రయాణం శ్రామిక శక్తిలో భాగస్వామ్యం నుంచి నాణ్యమైన ఉద్యోగ‌ అవకాశాల దిశగా ముందుకు సాగుతోంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) ప్రకారం.. మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్) 2017–18లో 23.3 శాతం నుంచి 2025లో 40 శాతానికి పెరిగింది. శ్రామిక జనాభా నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) 22 శాతం నుంచి 38.8 శాతానికి చేరింది. ఈ పురోగతిని కొనసాగిస్తూ వ్యాపారాలకు అధికారిక గుర్తింపు, రుణ సదుపాయాలు, మార్కెట్ అందుబాటు, సురక్షిత కార్యాలయాలు, నైపుణ్య శిక్షణ, కొత్త జీవనోపాధి అవకాశాల ద్వారా మహిళల ఉపాధికి విధానపరమైన మద్దతు లభిస్తోంది. పెరుగుతున్న భాగస్వామ్యాన్ని అధిక ఆదాయం, ఆర్థిక భద్రత, అభివృద్ధిగా మలచడంపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.

 

పెరుగుతున్న మహిళా ఉపాధి, విస్తరిస్తున్న ఆర్థిక అవకాశాలు

భారత్‌లో మహిళా ఉపాధి ఇప్పుడు కేవలం పనిలో వారి సంఖ్యకే పరిమితం కావడం లేదు. కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడంతో పాటు ఉపాధి స్వభావం, నాణ్యతపై దృష్టి విస్తరిస్తోంది. ఎక్కువ మంది మహిళలు శ్రామిక శక్తిలోకి వస్తున్న నేపథ్యంలో, పని ద్వారా లభించే అవకాశాలు పురోగతిలో తదుపరి దశగా నిలుస్తున్నాయి. ఉపాధి ఆదాయం, భద్రత, గుర్తింపు, ఆర్థిక నిర్ణయాలపై మరింత నియంత్రణను కల్పించినప్పుడు ఆర్థిక సాధికారత బలోపేతమవుతుంది.

 

సురక్షిత కార్యాలయాలు, సామాజిక రక్షణ, పారిశ్రామిక‌త‌, అధికారిక ఆర్థిక వ్యవస్థలో గుర్తింపు, ఆర్థిక అవకాశాలను మహిళలకు మరింత చేరువ చేసే విధానాలు ఈ విస్తృత మార్పుకు మద్దతు ఇస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్య నాణ్యతను పెంచుతూ, సురక్షితమైన సాధికార అవకాశాలుగా మలచేందుకు ఈ చర్యలు తోడ్పడుతున్నాయి.

 

సంఖ్యాపరమైన మార్పు: శ్రామిక శక్తిలో పెరిగిన భాగస్వామ్యం

భారత కార్మిక మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యం ఇటీవలి సంవత్సరాల్లో గణనీయంగా పెరిగింది. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న మహిళల కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 2017–18లో 23.3 శాతం నుంచి 2025లో 40 శాతానికి చేరింది.

 

పనిచేస్తున్న మహిళల వాటా కూడా పెరిగింది. మహిళల శ్రామిక జనాభా నిష్పత్తి 2017–18లో 22 శాతం నుంచి 2025లో 38.8 శాతానికి చేరింది. 2025లో భారత్‌లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న సుమారు 20 కోట్ల మంది మహిళలు ఉపాధి పొందినట్లు అంచనా.

 

కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్) జనాభాలో పనిచేస్తున్నవారు, ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు లేదా పని చేయడానికి అందుబాటులో ఉన్నవారి వాటాను సూచిస్తుంది.

 

శ్రామిక జనాభా నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) మొత్తం జనాభాలో ఉపాధి పొందిన వ్యక్తుల నిష్పత్తిని సూచిస్తుంది.

 

కార్మికులు, వ్యవస్థాపకులు, ఆర్థిక భాగస్వాములుగా మహిళలు

మహిళల భాగస్వామ్యం పెరుగుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థతో వారికి ఉన్న అనుబంధ స్వభావం కూడా మారుతోంది.

 

వ్యాపార రంగంలో పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం

ఎక్కువ మంది మహిళలు వ్యవస్థాపకత వైపు అడుగులు వేస్తూ సొంత వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. మహిళా వ్యవస్థాపకత ఆదాయం పొందడం, ఆస్తులు సమకూర్చుకోవడం, వ్యాపారాలను విస్తరించుకోవడానికి అవకాశాలను సృష్టిస్తూ ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచుతోంది. నైపుణ్యాలు, వనరుల అందుబాటును విస్తరిస్తూ ఆర్థిక స్వాతంత్య్రాన్ని బలోపేతం చేస్తోంది.

- మహిళల యాజమాన్యంలోని ఎంఎస్‌ఎంఈలు: 2026 అక్టోబర్ నాటికి నమోదైన సుమారు 3.69 కోట్ల ఎంఎస్‌ఎంఈలు మహిళల యాజమాన్యంలో ఉన్నాయి. మొత్తం నమోదుల్లో వీటి వాటా సుమారు 38 శాతం.

- స్టార్టప్‌లలో మహిళలు: 2026 మార్చి నాటికి గుర్తింపు పొందిన 1.07 లక్షలకుపైగా స్టార్టప్‌లలో కనీసం ఒక మహిళ డైరెక్టర్‌గా లేదా భాగస్వామిగా ఉన్నారు. గుర్తింపు పొందిన మొత్తం స్టార్టప్‌లలో వీటి వాటా దాదాపు 48 శాతం.

 

సాంకేతికత, అధిక నైపుణ్య రంగాల్లో మహిళలు

వ్యవస్థాపకతతో పాటు తయారీ, అధిక నైపుణ్యం అవసరమైన రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం విస్తరిస్తోంది.

- 2026 జులై నాటికి మొబైల్ ఫోన్ల తయారీ రంగంలోని ప్రత్యక్ష శ్రామిక శక్తిలో మహిళల వాటా దాదాపు 70 శాతంగా ఉంది. విస్తృత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో గత దశాబ్దంలో ఏర్పడిన ఉద్యోగాల్లో మహిళల వాటా సుమారు 30 శాతం.

- సెమీకండక్టర్ పరిశ్రమలోనూ మహిళలు గణనీయమైన ప్రాతినిధ్యాన్ని సాధిస్తున్నారు. ఈ రంగంలోని మొత్తం శ్రామిక శక్తిలో వారి వాటా సుమారు 25 శాతం. 2025 మార్చి నాటికి భారత్ చిప్ డిజైన్, ఇంజినీరింగ్ శ్రామిక శక్తిలో దాదాపు నాలుగో వంతు మహిళలే.

- పౌర విమానయాన రంగంలోని ప్రత్యేక నైపుణ్య ఉద్యోగాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. భారత్‌లో పైలట్లలో మహిళల వాటా 15 శాతంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక మహిళా ప్రాతినిధ్యం ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. 2025 జూన్ నాటికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లలో మహిళలు 15 శాతం, ఫ్లైట్ డిస్పాచర్లలో 11 శాతం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లోని ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్లలో 33 శాతంగా ఉన్నారు.

- భారత్ పరిశోధన వ్యవస్థలోనూ మహిళల భాగస్వామ్యం విస్తరిస్తోంది. పరిశోధన, అభివృద్ధి గణాంకాల నివేదిక 2025–26 ప్రకారం, స్టెమ్ పరిశోధన వృత్తుల్లో మహిళల వాటా 2000–01లో 13 శాతం నుంచి 2020–21లో 18.6 శాతానికి, 2023–24లో 29 శాతానికి పెరిగింది.

 

గుర్తింపు నుంచి వృద్ధి వరకు మహిళ‌ల నేతృత్వంలో వ్యాపారాల నిర్మాణం

మహిళలు వివిధ విభాగాల్లో వ్యాపారాలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో, వాటి దీర్ఘకాలిక వృద్ధికి మద్దతు మరింత కీలకంగా మారుతోంది. అధికారిక గుర్తింపు, ఆర్థిక వనరులు, మార్కెట్ అందుబాటు మహిళా ఆధ్వర్యంలోని సంస్థలను బలోపేతం చేసే ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

 

అధికారిక గుర్తింపు: మహిళల పనికి ఆర్థిక అస్తిత్వం

మహిళల ఆధ్వర్యంలో సాగే అనేక ఆర్థిక కార్యకలాపాలు చిన్న స్థాయిలో ప్రారంభమవుతాయి. అందువల్ల వాటికి అధికారిక గుర్తింపు ఎంతో ముఖ్యం. ఈ గుర్తింపు వ్యాపారానికి అధికారిక అస్తిత్వాన్ని కల్పిస్తూ రుణాలు, ప్రభుత్వ పథకాలు, నైపుణ్యాలు, వ్యాపారాభివృద్ధి సేవలను పొందే అవకాశాలను మెరుగుపరుస్తుంది.

 

ఏ) స్వావలంబిని పథకం (2025): వ్యాపార ఆలోచన రూపకల్పన నుంచి సంస్థ ఏర్పాటయ్యే వరకు యువతులకు స్వావలంబిని పథకం సహాయం అందిస్తోంది. వ్యవస్థాపక శిక్షణ, ఆర్థిక వనరులు, మార్కెట్ మార్గదర్శనం, న్యాయ సహాయాన్ని కల్పిస్తోంది. స్థిరమైన వ్యాపారాలను అభివృద్ధి చేసేందుకు ఎంపికైన వారికి 21 వారాలపాటు మార్గదర్శనం, నిరంతర సహకారం కూడా అందిస్తోంది.

 

అస్సాం, మేఘాలయ, మిజోరం, ఉత్తరప్రదేశ్, తెలంగాణల్లోని ఆరు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని 2025 ఫిబ్రవరిలో ప్రారంభించారు.

 

స్వావలంబిని ప్రయోగాత్మక కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను సాధించారు.

- ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 82 మంది అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు.

- ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కింద 1,200 మంది లక్ష్యానికి మించి 1,276 మందికి శిక్షణ అందించారు.

- ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 600 మంది లక్ష్యానికి మించి 602 మందికి శిక్షణ ఇచ్చారు.

 

బీ) యశస్విని ప్రచారం (2024): 2029 నాటికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్, ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫామ్‌లో లింగ సమానత్వాన్ని సాధించడం ద్వారా వ్యవస్థాపకతలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని యశస్విని ప్రచారం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న సంస్థల నుంచి తప్పనిసరిగా 3 శాతం ప్రభుత్వ కొనుగోళ్లు చేపట్టాలనే లక్ష్యాన్ని ప్రోత్సహించడం కూడా దీని ఉద్దేశం.

 

అవగాహన, నిరంతర మార్గదర్శనం, సామర్థ్యాల పెంపు కార్యక్రమాల ద్వారా ఇప్పటికే వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళలు, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ ప్రచారం సహాయం అందిస్తోంది. 2026 జులై నాటికి మహిళల యాజమాన్యంలోని 22 లక్షలకుపైగా ఎంఎస్‌ఎంఈల నమోదుకు యశస్విని ప్రచారం తోడ్పడింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న సంస్థల నుంచి ప్రభుత్వ కొనుగోళ్లు 3.8 శాతానికి చేరి, నిర్దేశిత 3 శాతం లక్ష్యాన్ని అధిగమించాయి.

 

రుణ సదుపాయాలు: వ్యాపార వృద్ధికి ఆర్థిక తోడ్పాటు

అధికారిక గుర్తింపు సంస్థలను వ్యాపార వ్యవస్థలోకి తీసుకొస్తే, ఆర్థిక వనరుల అందుబాటు పెట్టుబడులు పెట్టడం, నవకల్పనలు చేపట్టడం, వ్యాపారాన్ని విస్తరించేందుకు వీలు కల్పిస్తుంది.

 

మహిళా ఆధ్వర్య ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సహాయం

ప్రధానమంత్రి ముద్ర యోజన

ఏ) ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై): 2015లో ప్రారంభించిన ఈ ప‌థ‌కం కార్పొరేట్‌యేతర, వ్యవసాయేతర ఆదాయ కార్యకలాపాల్లో ఉన్న సూక్ష్మ, చిన్న సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా ₹20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తోంది.

- పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2026 ఏప్రిల్ నాటికి 57.79 కోట్లకుపైగా రుణాలకు అనుమతులు ఇచ్చారు. మొత్తం రుణాల్లో మూడింట రెండు వంతులు మహిళా వ్యవస్థాపకులకే లభించాయి.

 

బీ) సూక్ష్మ, చిన్న సంస్థల రుణ హామీ పథకం: సూక్ష్మ, చిన్న సంస్థలకు రుణాల పంపిణీని బలోపేతం చేయడం, తగిన రుణ సదుపాయాలు పొందలేని వ్యవస్థాపకులకు ఆర్థిక వనరులను చేరువ చేయడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకం కింద మహిళా ఆధ్వర్య సూక్ష్మ, చిన్న సంస్థలకు 90 శాతం అధిక హామీ రక్షణతో పాటు హామీ రుసుములో 10 శాతం రాయితీ లభిస్తుంది.

- 2000–01 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు 2026 ఫిబ్రవరి నాటికి మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న సంస్థలకు సుమారు ₹2.07 లక్షల కోట్ల విలువైన 30.75 లక్షల రుణ హామీలకు ఆమోదం లభించింది.

 

సీ) ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ): ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) వ్యవసాయేతర రంగంలో కొత్త సూక్ష్మ సంస్థలకు సహకరించే రుణ అనుసంధానిత రాయితీ పథకం. బ్యాంకు రుణాలపై లబ్ధిదారులకు మార్జిన్ మనీ రాయితీ సహాయం లభిస్తుంది. ఈ పథకం కింద మహిళలు పట్టణ ప్రాంతాల్లో 25 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం రాయితీకి అర్హులు.

- 2026 మే నాటికి పీఎంఈజీపీ సహాయం పొందిన మొత్తం సూక్ష్మ సంస్థల్లో మహిళల వాటా దాదాపు 40 శాతంగా ఉంది. పంపిణీ చేసిన మొత్తం మార్జిన్ మనీ రాయితీలో సుమారు 45 శాతం మహిళలకు లభించింది.

 

మహిళల‌ ఆధ్వర్యంలోని స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం

2016లో ప్రారంభించిన స్టార్టప్ ఇండియా నవకల్పనలను ప్రోత్సహిస్తూ బలమైన స్టార్టప్ వ్యవస్థను నిర్మించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమం. దీని కింద వివిధ రంగాలు, వ్యాపార దశల్లో ఉన్న స్టార్టప్‌లకు అనేక ఆర్థిక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం సహకారం అందిస్తోంది.

ఏ) ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్ఎఫ్ఎస్‌): 2016లో ఏర్పాటు చేసిన ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్ఎఫ్ఎస్), సెబీ వద్ద నమోదైన ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్లకు (ఏఐఎఫ్‌లు) మూలధనం అందించడం ద్వారా స్టార్టప్‌లకు నిధుల సమీకరణలో సహకరిస్తోంది. ఏఐఎఫ్‌లు ఈక్విటీ, ఈక్విటీ అనుసంధానిత సాధనాల ద్వారా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడతాయి.

- 2026 జనవరి నాటికి ఈ కార్యక్రమం మద్దతు పొందిన ఏఐఎఫ్‌లు 2025 నుంచి మహిళా ఆధ్వర్య స్టార్టప్‌లలో సుమారు ₹2,995 కోట్లు పెట్టుబడి పెట్టాయి.

 

బీ) స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం (ఎస్ఐఎస్ఎఫ్ఎస్‌): 2021లో ప్రారంభించిన స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం (ఎస్ఐఎస్ఎఫ్ఎస్) ఆమోదిత ఇంక్యుబేటర్ల ద్వారా వివిధ రంగాల స్టార్టప్‌లకు ప్రారంభ దశ నిధులను అందిస్తోంది.

- 2026 జనవరి నాటికి పథకం మద్దతు పొందిన ఇంక్యుబేటర్లు మహిళా ఆధ్వర్య స్టార్టప్‌లకు సుమారు ₹294 కోట్ల నిధులను ఆమోదించాయి.

 

సీ) స్టార్టప్‌ల రుణ హామీ పథకం (సీజీఎస్ఎస్): 2023 ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చిన స్టార్టప్‌ల రుణ హామీ పథకం (సీజీఎస్ఎస్), అర్హత కలిగిన స్టార్టప్‌లకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించేందుకు సహకరిస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సెబీ వద్ద నమోదైన ఏఐఎఫ్‌లు ఇచ్చే రుణాలకు ఇది హామీ కల్పిస్తోంది.

- 2026 జనవరి నాటికి మహిళా ఆధ్వర్య స్టార్టప్‌లకు అందించిన సుమారు ₹39 కోట్ల రుణాలకు హామీ ఇచ్చారు.

 

మార్కెట్ అందుబాటు: మహిళల ఉత్పత్తులకు కొనుగోలుదారులతో అనుసంధానం

మార్కెట్ అందుబాటు ద్వారా మహిళా వ్యవస్థాపకులు ఎక్కువ మంది కొనుగోలుదారులను చేరుకోవచ్చు. డిమాండ్, నాణ్యత ప్రమాణాలు, బ్రాండింగ్, ధరల నిర్ణయంపై మెరుగైన అవగాహన పొందవచ్చు.

 

ఏ) వుమనియా కార్యక్రమం: ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్‌లో సమ్మిళిత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే కార్యక్రమమే వుమనియా. మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న సంస్థలు, స్వయం సహాయక సంఘాలను అధికారిక ప్రభుత్వ కొనుగోలుదారులతో ఇది అనుసంధానిస్తుంది. ప్రత్యేక డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా వారు చేనేత, జనపనార, కొబ్బరి పీచు, గృహాలంకరణ వస్తువుల వంటి ఉత్పత్తులను నమోదు చేసి విక్రయానికి ఉంచవచ్చు.

- 2026 జులై నాటికి మహిళల యాజమాన్యంలోని 2.17 లక్షలకుపైగా సూక్ష్మ, చిన్న సంస్థలు ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్‌లో నమోదయ్యాయి. ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసే విభిన్న వస్తువులు, సేవల కోసం జెమ్ ప్రత్యేక ఈ-మార్కెట్‌గా పనిచేస్తోంది.

- 2025–26 ఆర్థిక సంవత్సరంలో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న సంస్థలకు లభించిన ఒప్పందాల మొత్తం విలువ ₹28,000 కోట్లు దాటింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 27.6 శాతం వృద్ధిని నమోదు చేసింది.

- జెమ్ ద్వారా కేటాయించిన మొత్తం ఆర్డర్ల విలువలో మహిళలకు 5.6 శాతం లభించింది. ఇది నిర్దేశిత 3 శాతం కొనుగోలు లక్ష్యాన్ని అధిగమించింది.

 

బీ) ప్రొక్యూర్‌మెంట్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ పథకం (పీఎంఎస్‌): ప్రొక్యూర్‌మెంట్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ పథకం (పీఎంఎస్) నమోదిత సూక్ష్మ, చిన్న సంస్థలకు వాణిజ్య ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, విక్రేతల అభివృద్ధి కార్యక్రమాలు, ఈ-కామర్స్, ప్యాకేజింగ్ సహాయం ద్వారా మార్కెట్లను చేరుకోవడానికి తోడ్పడుతోంది. మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న సంస్థలకు వాణిజ్య ప్రదర్శనల్లో నిర్మిత ప్రాంగణ అద్దెపై 100 శాతం రాయితీ లభిస్తుంది.

 

సీ) ఎంఎస్‌ఎంఈ ట్రేడ్ ఎనేబుల్‌మెంట్ అండ్ మార్కెటింగ్(టీమ్‌) కార్యక్రమం: సూక్ష్మ, చిన్న సంస్థలకు డిజిటల్ మార్కెటింగ్ అందుబాటును కల్పించేందుకు ర్యాంప్ కార్యక్రమం కింద మూడు సంవత్సరాల కాలానికి, అంటే 2024–27 వరకు టీమ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ద్వారా కొత్త మార్కెట్లను చేరుకోవడం, వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం, ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి సూక్ష్మ, చిన్న సంస్థలకు సాధికారత కల్పించడం దీని లక్ష్యం.

- 2025–26 వరకు మహిళల యాజమాన్యంలోని 1,700 సూక్ష్మ, చిన్న సంస్థలు ఈ కార్యక్రమం కింద నమోదయ్యాయి.

 

మార్కెట్ అందుబాటుతో సంస్థ విలువ గొలుసు పూర్తవుతుంది. అధికారిక గుర్తింపు సంస్థకు అస్తిత్వాన్ని ఇస్తుంది. రుణ సదుపాయం ఉత్పత్తికి అవకాశం కల్పిస్తుంది. మార్కెట్ మద్దతు ఉత్పత్తిని ఆదాయం, స్థిరమైన వృద్ధిగా మారుస్తుంది.

 

అభివృద్ధి చెందుతున్న రంగాలకు నైపుణ్య వ్యవస్థ నిర్మాణం

సాంకేతికత, ప్రత్యేక నైపుణ్య రంగాల్లో మహిళల అవకాశాలు విస్తరిస్తున్న నేపథ్యంలో, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ ద్వారా ఈ ఉద్యోగాలను మరింత మందికి చేరువ చేయడం కీలకం.

ప్రధాన నైపుణ్యాభివృద్ధి పథకాల కింద అభివృద్ధి చెందుతున్న రంగాల్లో శిక్షణ పొందిన మహిళలు

 

2021–22 నుంచి 2025–26 వరకు

పథకం

లక్ష్యం

కృత్రిమ మేధ

సెమీకండక్టర్

పునరుత్పాదక ఇంధనం

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 (పీఎంకేవీవై 4.0)

కృత్రిమ మేధ సహా భవిష్యత్, నవతరం సాంకేతికతల్లో శిక్షణకు ప్రాధాన్యం

20,393

5,927

76,671

జాతీయ అప్రెంటిస్‌షిప్ ప్రోత్సాహక పథకం (ఎన్‌ఏపీఎస్)

సంప్రదాయ, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో వేతనంతో కూడిన ప్రత్యక్ష పని అనుభవం ద్వారా అప్రెంటిస్‌షిప్ శిక్షణను ప్రోత్సహిస్తుంది. శిక్షణార్థులకు ప్రత్యక్ష స్టైపెండ్ సహాయం అందిస్తుంది

1,534

–

19,899

పారిశ్రామిక శిక్షణ సంస్థల ద్వారా క్రాఫ్ట్స్‌మన్ ట్రైనింగ్ స్కీమ్ (సీటీఎస్)

ఐటీఐల ద్వారా వృత్తి, సాంకేతిక శిక్షణ అందిస్తూ సంప్రదాయ, కొత్త వృత్తుల్లో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందిస్తుంది

512

31

5,753

 

మహిళల కోసం లక్ష్య నిర్దేశిత కార్యక్రమాలు

ఏ) నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడోలసెంట్ గర్ల్స్ (నవ్య): ఈ కార్యక్రమాన్ని 2025లో ప్రారంభించారు. పీఎంకేవీవై 4.0 కింద సంప్రదాయేతర, భవిష్యత్ ఆధారిత ఉద్యోగాల్లో 3,850 మంది కిశోర బాలికలకు లక్ష్య నిర్దేశిత నైపుణ్య శిక్షణ అందించడం దీని ఉద్దేశం. 2026 ఆగస్టు 31 నాటికి ఈ పథకం కింద 1,105 మంది బాలికలు శిక్షణ పొందారు.

 

బీ) మహిళల కోసం ఏఐ ఉద్యోగావ‌కాశాలు: 2025లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆరు రాష్ట్రాల్లోని మహిళా కళాశాలల్లో 30 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని 150 అనుబంధ కేంద్రాలకు ఇవి సహకరిస్తాయి.

20 వేల మంది అభ్యాసకులకు ఆచరణాత్మక, పరిశ్రమ అవసరాలకు తగిన ఏఐ శిక్షణ, ప్రాజెక్టు ఆధారిత అనుభవాన్ని అందించడం ఈ కార్యక్రమ లక్ష్యం. అభ్యర్థులకు ధ్రువపత్రాలు, ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు, వృత్తి మార్గదర్శనం, ఏఐ ఆధారిత ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు.

 

సీ) విమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్-నాలెడ్జ్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఇన్ రీసెర్చ్ అడ్వాన్స్‌మెంట్ త్రూ నర్చరింగ్ (వైజ్-కిరణ్) పథకం: ఫెలోషిప్‌లు, సంస్థాగత కార్యక్రమాల ద్వారా శాస్త్ర, సాంకేతిక పరిశోధన & అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని ఈ ప‌థ‌కం ప్రోత్సహిస్తోంది.

- ఫెలోషిప్‌లలో వైజ్ ఫెలోషిప్ ఫర్ పీహెచ్‌డీ (వైజ్-పీహెచ్‌డీ), వైజ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ (వైజ్-పీడీఎఫ్), వైజ్-సొసైటల్ ఛాలెంజెస్ విత్ ఆపర్చునిటీస్ (వైజ్-స్కోప్), వైజ్ ఇంటర్న్‌షిప్ ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (వైజ్-ఐపీఆర్), విమెన్స్ ఇన్‌స్టింక్ట్ ఫర్ డెవలపింగ్ అండ్ అషరింగ్ ఇన్ సైంటిఫిక్ హైట్స్ అండ్ ఇన్నోవేషన్స్ (విదుషి) ఉన్నాయి. డాక్టరల్, పోస్ట్ డాక్టరల్ పరిశోధన, వృత్తిలోకి తిరిగి ప్రవేశించడం, అనువర్తిత పరిశోధన, మేధోహక్కుల శిక్షణ, నిరంతర పరిశోధన భాగస్వామ్యానికి ఇవి సహకరిస్తాయి.

- సంస్థాగత కార్యక్రమాల్లో కన్సాలిడేషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ (క్యూరీ), విజ్ఞాన్ జ్యోతి, జెండర్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ (గతి), విమెన్ ఇన్ స్పేస్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ (డ‌బ్ల్యూఐఎస్ఎల్‌పీ) ఉన్నాయి.

- 2025-26లో 180 మంది మహిళలు పీహెచ్‌డీ పరిశోధన చేపట్టారు. 606 మంది మహిళా శాస్త్రవేత్తలు పోస్ట్ డాక్టరల్ లేదా అనువర్తిత పరిశోధన సహాయం పొందారు. 26 మంది సీనియర్ శాస్త్రవేత్తలకు పరిశోధన-అభివృద్ధి మద్దతు లభించింది. స్టెమ్ రంగంలో 29,443 మంది బాలికలకు సహాయం అందించారు.

- 110 మందికిపైగా మహిళా శాస్త్రవేత్తలు ఉపాధి పొందారు. 450 మందికిపైగా మహిళలకు పరిశోధనలో భాగస్వామ్యం, నైపుణ్యాల మెరుగుదల లేదా వృత్తిలోకి తిరిగి ప్రవేశించే అవకాశాలు లభించాయి.

నైపుణ్య శిక్షణ, పరిశోధన సహాయం ద్వారా అభివృద్ధి చెందుతున్న, ప్రత్యేక నైపుణ్య రంగాల్లోకి మహిళలు ప్రవేశించే మార్గాలను ఈ కార్యక్రమాలు బలోపేతం చేస్తున్నాయి.

 

సురక్షిత ఉపాధి అవకాశాలకు కార్మిక సంస్కరణలు

మహిళలు శ్రామిక శక్తిలో విస్తృతంగా భాగస్వాములు కావాలంటే ఉద్యోగాలు అందుబాటులో ఉండటమే కాకుండా, వాటిని సులభంగా పొందడం, దీర్ఘకాలం కొనసాగించడం కూడా కీలకం. ఈ పరిస్థితులను రూపొందించడంలో కార్మిక నియంత్రణ వ్యవస్థ ముఖ్యపాత్ర పోషిస్తుంది.

 

2025 నవంబర్‌లో అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లుగా ఏకీకృతం చేసింది. అవి వేతనాల కోడ్-2019, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్-2020.

 

ఈ ఏకీకృత వ్యవస్థలో మహిళల కార్యాలయ హక్కులు, భద్రత, ప్రాతినిధ్యం, ఉపాధి అవకాశాలను బలోపేతం చేసే అనేక నిబంధనలు ఉన్నాయి.

 

- ఫిర్యాదుల పరిష్కారంలో ప్రాతినిధ్యం: మొత్తం శ్రామిక శక్తిలో మహిళల వాటాకు అనుగుణంగా ఫిర్యాదుల పరిష్కార కమిటీల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించాలి.

- ప్రసూతి ప్రయోజనాలు: అర్హత కలిగిన మహిళలకు 26 వారాల వరకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు లభిస్తుంది. దత్తత తీసుకున్న తల్లులు, సరోగసీ విధానాన్ని ఉపయోగించే జీవసంబంధ తల్లులు 12 వారాల ప్రసూతి సెలవుకు అర్హులు. ఇతర ముఖ్య నిబంధనలు:

  - ఉచిత ప్రసవపూర్వ, ప్రసవానంతర సంరక్షణ అందని సందర్భంలో మహిళలకు ₹3,500 వైద్య బోనస్ లభిస్తుంది.

  - శిశువుకు 15 నెలల వయసు వచ్చే వరకు పని సమయంలో రెండుసార్లు పాలిచ్చేందుకు విరామం పొందే హక్కు మహిళలకు ఉంటుంది.

  - కనీసం 50 మంది కార్మికులు ఉన్న సంస్థలు శిశు సంరక్షణ కేంద్ర సదుపాయం కల్పించాలి. విశ్రాంతి విరామాలతో కలిపి రోజుకు నాలుగుసార్లు మహిళలు శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు యజమాని అనుమతించాలి.

- విస్తృత ఉపాధి అవకాశాలు: మహిళల సమ్మతి, నిర్దేశిత భద్రతా చర్యలతో రాత్రి షిఫ్టులు సహా అన్ని సంస్థల్లో పనిచేయవచ్చు.

- లింగ వివక్ష నిషేధం: నియామకాలు, వేతనాలు, ఉద్యోగ పరిస్థితుల్లో లింగ వివక్షను నిషేధించారు.

- విధాన రూపకల్పనలో ప్రాతినిధ్యం: కేంద్ర, రాష్ట్ర సలహా మండళ్లలో మూడింట ఒక వంతు సభ్యులు మహిళలై ఉండాలి. కనీస వేతనాలు, మహిళల ఉపాధిని విస్తరించే చర్యలపై ఈ మండళ్లు సలహాలు ఇస్తాయి.

 

మహిళల ఉపాధికి మరింత బలమైన మార్గాలు

మహిళలు పనిచేసి ఆర్థికంగా పురోగమించే పరిస్థితులను బలోపేతం చేయడంపై భారత్ విధానం మరింతగా దృష్టి సారిస్తోంది. అవకాశాలు విస్తరిస్తున్న కొద్దీ ఉపాధి, వ్యవస్థాపకత, ఆర్థిక వ్యవస్థలోని కొత్త రంగాల్లో మహిళల కృషి మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

 

నైపుణ్యాలు, ఆర్థిక వనరులు, మార్కెట్లు, అనుకూలమైన కార్యాలయాలకు విస్తృత అందుబాటు ఈ మార్గాలను మరింత బలోపేతం చేస్తుంది. వికసిత భారత్ ప్రయాణంలో మహిళా నాయకత్వ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ, దేశ వృద్ధిలో మహిళల పాత్రను మరింత విస్తరిస్తుంది.

 

References

Ministry of Labour & Employment

https://www.labour.gov.in/static/uploads/2026/06/4b7ec0e8206aa4860576d6f75b432e97.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2078530&lang=2&reg=48

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2256177&lang=2&reg=48

Ministry of Finance

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2249915&lang=1&reg=3

Ministry of Micro, Small & Medium Enterprises

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2236871&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2209712&reg=48&lang=2

https://www.cgtmse.in/

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2236871&lang=1&reg=20

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AS289_FewgL8.pdf?source=pqals

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2099687&lang=2&reg=3

https://www.msme.gov.in/offerings/schemes-and-services/details/prime-minister-employment-generation-programme-and-other-credit-support-schemes-1-MDMzETMtQWa

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2258590&lang=1&reg=1

https://www.msme.gov.in/offerings/schemes-and-services/details/marketing-promotion-schemes-1-QzMzETMtQWa

https://ramp.msme.gov.in/ramp/RAMP-initiative/msme-team-initiative/msme-team-initiative

https://www.msme.gov.in/static/uploads/2026/05/1bfda06b460e72543530b40817573495.pdf

https://dashboard.msme.gov.in/#

https://sambandh.msme.gov.in/PPP_Index.aspx

Ministry of Commerce & Industry

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2253019&lang=1&reg=3

https://www.startupindia.gov.in/content/sih/en/about-startup-india-initiative.html

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1595854&lang=2&reg=48

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2202984&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2127843&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241313&reg=48&lang=2

Ministry of Skill Development and Entrepreneurship

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2226498&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2204133&lang=1&reg=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2123510&lang=2&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2225466&lang=1&reg=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294851&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2149336&lang=2&reg=3

https://nstiwshimla.dgt.gov.in/en/node/2209

Ministry of Statistics & Programme Implementation

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2246009&lang=1&reg=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2057970&lang=2&reg=3

https://mospi.gov.in/uploads/publications_reports/publications_reports1787307445576_78c40fd2-1acd-40fb-abb8-15f9491ba4b8_QBUSE_Bulletin_(2).pdf

https://www.mospi.gov.in/national-sample-survey-office

Ministry of Electronics & IT

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2284808&reg=48&lang=2

Ministry of Women and Child Development

https://sansad.in/getFile/annex/270/AU3029_YErb7m.pdf?source=pqars

Ministry of Science and Technology

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2298220&lang=1&reg=48

Press Information Bureau (PIB) Archive

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2250664&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2181702&lang=2&reg=3

https://newindiasamachar.pib.gov.in/WriteReadData/Magazine//2026/May/M202605011.pdf

https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=150499&reg=3&lang=1

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=154624&reg=48&lang=2

https://www.pib.gov.in/blogs/blogsdescr.aspx?feaaid=581&lang=1

Invest India

https://www.investindia.gov.in/team-india-blogs/women-shaping-future-indian-industries

International Organisations

https://www.unwomen.org/sites/default/files/2024-03/un-women-womens-economic-empowerment-strategy-en.pdf

https://www.ilo.org/sites/default/files/wcmsp5/groups/public/%40ed_emp/%40emp_ent/%40ifp_seed/documents/publication/wcms_766156.pdf

 https://www.worldbank.org/ext/en/topic/competitiveness/small-and-medium-enterprises-smes-finance#tab-context

https://digitalforwomen.worldbank.org/access-markets

Click here to see PDF

 

***

(Explainer ID: 160522) आगंतुक पटल : 11
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Kannada