Infrastructure

భారత జలమార్గాల్లో నౌకాయానం: మరింత సురక్షితమైన, ఆధునిక వ్యవస్థ నిర్మాణం

Posted On: 16 OCT 2026 12:05PM

జలమార్గాల్లో రవాణా పెరుగుతున్న నేపథ్యంలో, మరింత సురక్షితమైన, ఆధునిక అంతర్గత నౌకాయాన వ్యవస్థను భారత్ నిర్మిస్తోంది. హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, నౌకాయాన మార్గాల నిర్వహణ ద్వారా నౌకలు ప్రయాణించేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిపై దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న నదీ లైట్‌హౌస్‌లు 24×7 నౌకాయానానికి సుదూరం నుంచి మార్గదర్శనం అందించనున్నాయి. డిజిటల్ వేదికలు నీటి లోతు, ప్రయాణ మార్గాలు, వాతావరణంపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తున్నాయి. ఈ చర్యలు నౌకాయాన భద్రతను బలోపేతం చేస్తున్నాయి. ప్రయాణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకునేందుకు, భారత జలమార్గాల్లో పెరుగుతున్న సరుకు రవాణాకు తోడ్పడుతున్నాయి.

విస్తరిస్తున్న జలమార్గాల్లో బ‌లోపేత‌మ‌వుతున్న నౌకాయానం
దేశ రవాణా వ్యవస్థలో భారతదేశ‌ నదులు, జలమార్గాల పాత్ర పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో, తక్కువ కాలుష్యంతో రవాణా సదుపాయం అందించే ఈ మార్గాలను ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిచ్చేలా అభివృద్ధి చేస్తున్నారు. ఒక టన్ను సరుకును జలమార్గంలో తరలించేందుకు అయ్యే ఖర్చు రోడ్డు రవాణా ఖర్చులో దాదాపు మూడో వంతు, రైలు రవాణా ఖర్చులో సగం మాత్రమే. కార్బన ఉద్గారాలు కూడా చాలా తక్కువగా వెలువడతాయి. దీంతో జాతీయ రహదారులపై ఒత్తిడి తగ్గి, ప్రయాణికులు, నిర్ణీత సమయంలో చేరవేయాల్సిన సరుకుల రవాణాకు అవి మరింత అందుబాటులో ఉంటాయి.

నౌకా రవాణా, నౌకాయానాన్ని ప్రోత్సహించేందుకు దేశంలో 111 జాతీయ జలమార్గాలు (ఎన్‌డబ్ల్యూ) ఉన్నాయి. మొత్తం 20,187 కిలోమీటర్ల పొడవున్న ఈ జలమార్గాలు 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 32 జాతీయ జలమార్గాలు వినియోగంలో ఉన్నాయి. వేగంగా పెరుగుతున్న సరుకు రవాణా, జలమార్గాల ఆర్థిక ప్రాధాన్యాన్ని చాటుతోంది. అంతర్గత జలమార్గాల్లో సరుకు రవాణా 2014–15లో 29 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) నుంచి 2025–26లో 218 ఎంఎంటీలకు పెరిగింది. ఇది 20.13% వార్షిక సమ్మిళిత వృద్ధి రేటును (సీఏజీఆర్) సూచిస్తోంది. మారిటైమ్ ఇండియా విజన్ 2030 కింద నిర్దేశించిన 200 ఎంఎంటీల లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించింది. ఈ విధంగా అంతర్గత జలమార్గాలు తమ సామర్థ్యాన్ని వాస్తవ ఫలితాలుగా మార్చుకుంటున్నాయి.

జలమార్గాల విస్తరణతో, ఆయా మార్గాల్లో నదుల పరిస్థితులు, నౌకాయానానికి ఉన్న అనుకూలతను తెలుసుకునేందుకు మరింత సురక్షితమైన, ఆధునిక సహాయక వ్యవస్థలు, మౌలిక వసతులు అవసరమవుతున్నాయి. నదుల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నౌకలు ప్రయాణించేందుకు హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, నౌకాయాన మార్గాల నిర్వహణ పనులు చేపడుతున్నారు. డిజిటల్ వేదికలు నీటి లోతు, ప్రయాణ మార్గాలు, నౌకల కదలికలు, వాతావరణంపై సమాచారం అందిస్తున్నాయి. భారత్‌లో తొలిసారిగా నదులపై ఏర్పాటు చేస్తున్న లైట్‌హౌస్‌లతో సహా కొత్త నౌకాయాన మౌలిక వసతులు, రేయింబవళ్లు నౌకల రాకపోకలకు మరింత తోడ్పాటునిస్తున్నాయి.

.



హైడ్రోగ్రాఫిక్ సర్వేలు: నదుల పరిస్థితులను తెలుసుకోవడం
ఉపరితలం నుంచి చూస్తే నదిలో ఎలాంటి మార్పులూ లేనట్లు కనిపించవచ్చు. కానీ నౌకలు ప్రయాణించే మార్గం అడుగు భాగం ఎలా ఉందో బయటకు కనిపించదు. కాలాలను బట్టి, నదిలోని ప్రాంతాలను బట్టి నీటి మట్టాలు కూడా మారుతుంటాయి. ఈ మార్పులు నౌకలు ప్రయాణించేందుకు అందుబాటులో ఉండే మార్గాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే అంతర్గత జలమార్గాల అభివృద్ధికి నదుల పరిస్థితులను నిరంతరం తెలుసుకోవడం అవసరం.

హైడ్రోగ్రాఫిక్ సర్వేలు
జలవనరులు, వాటి అడుగు భాగం ఆకృతి, నీటి లోతు, ప్రవాహ దిశ, ఎదురయ్యే ప్రమాదాలు వంటి భౌతిక లక్షణాలను కొలిచి, వివరించడాన్ని హైడ్రోగ్రఫీ అంటారు. నౌకాయానంతో పాటు సముద్ర తీరానికి దూరంగా చేపట్టే కార్యకలాపాలు, శాస్త్రీయ పరిశోధన, పర్యావరణ పరిరక్షణ, ముందస్తు అంచనా సేవలకు తోడ్పడటం దీని ఉద్దేశం. సర్వే చేసిన ప్రాంతంపై స్పష్టమైన, సమగ్రమైన, తాజా వివరాలతో నౌకాయాన పటాలను రూపొందించడం హైడ్రోగ్రాఫిక్ సర్వేల ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.

భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ జాతీయ జలమార్గాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహిస్తుంది. ఈ సర్వేల్లో నదుల లోతు, అడుగు భాగం ఆకృతి, లోతు తక్కువగా ఉన్న ప్రాంతాలు, ప్రవాహ లక్షణాలు, నౌకాయానాన్ని ప్రభావితం చేసే నదీ ఆకృతిలోని మార్పులను కొలిచి, విశ్లేషిస్తారు. వీటిలో భాగంగా నిర్వహించే థాల్‌వెగ్ సర్వేలు, నదిలో నౌకలు ప్రయాణించగల అత్యంత లోతైన మార్గాన్ని గుర్తించి, పర్యవేక్షిస్తాయి. టెర్మినల్ & జెట్టీ సర్వేలు, టెర్మినల్స్, జెట్టీల సమీపంలో నీటి లోతు, వాటిని చేరుకునే మార్గాల పరిస్థితులు తదితర అంశాలను అంచనా వేస్తాయి. నిరంతర హైడ్రోగ్రాఫిక్ అంచనాలు నౌకాయాన మార్గాల (ఫెయిర్‌వే) అభివృద్ధికి, డ్రెడ్జింగ్ ప్రణాళికలకు, నౌకాయాన భద్రతకు తోడ్పడతాయి. దేశవ్యాప్తంగా అంతర్గత జల రవాణా (ఐడబ్ల్యూటీ) మౌలిక వసతుల అభివృద్ధిపై తగిన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడతాయి.

 

.


జలవనరుల అడుగు భాగంలో పేరుకున్న మట్టి, ఇసుక వంటి పదార్థాలను తొలగించే ప్రక్రియను డ్రెడ్జింగ్ అంటారు. జాతీయ జలమార్గాల్లో నౌకలు సులభంగా ప్రయాణించేందుకు వివిధ ప్రాంతాల్లో డ్రెడ్జింగ్ పనులు చేపడతారు.

నదుల్లో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు వేగంగా మారవచ్చు. అందువల్ల ఆయా జలమార్గాల అవసరాలను బట్టి సర్వేలు నిర్వహించే వ్యవధి మారుతుంది. సెప్టెంబర్ 2026 నాటికి 22 జాతీయ జలమార్గాల్లో క్రమం తప్పకుండా థాల్‌వెగ్ సర్వేలు నిర్వహిస్తున్నారు. జలమార్గాన్ని బట్టి వారానికి ఒకసారి, పక్షానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి సర్వేలు చేపడుతున్నారు. ఇండో-బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గంలోని భారత భూభాగం కూడా ఈ పర్యవేక్షణ వ్యవస్థ పరిధిలో ఉంది. నిర్దేశించిన నదీ మార్గాల ద్వారా భారత్, బంగ్లాదేశ్ మధ్య సరుకు రవాణాకు వీలు కల్పించే అంతర్గత జల రవాణా వ్యవస్థ ఇది.

అందుబాటులో ఉన్న కనీస నీటి లోతు: నౌకాయానానికి కీలక ప్రమాణం
హైడ్రోగ్రాఫిక్ సర్వేల ద్వారా లభించే అత్యంత ముఖ్యమైన వివరాల్లో అందుబాటులో ఉన్న కనీస నీటి లోతు (ఎల్‌ఏడీ) ఒకటి. నౌకాయాన మార్గంలో అందుబాటులో ఉన్న కనీస నీటి లోతును ఎల్‌ఏడీ అంటారు. ఒక నిర్దిష్ట ప్రాంతానికి, నిర్దిష్ట కాలానికి దీన్ని అంచనా వేస్తారు. నౌకల నిర్వహణ, నౌకాయాన ప్రణాళికలను ఎల్‌ఏడీ నేరుగా ప్రభావితం చేస్తుంది. నౌక నీటిలో ఎంత లోతు వరకు మునిగి ప్రయాణించవచ్చో నిర్ణయిస్తుంది. సరుకు మోసుకెళ్లే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మార్గాలవారీగా ప్రయాణ సమయాలను నిర్ణయించేందుకు, కాలాలకు అనుగుణంగా నౌకాయాన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతుంది.

నౌకాయాన సహాయక వ్యవస్థలు: నౌకలకు సురక్షిత మార్గదర్శనం
ప్రయాణ మార్గాలు, ప్రమాదాలు, మారుతున్న పరిస్థితులను నౌకలు గుర్తించేందుకు తోడ్పడే నమ్మకమైన వ్యవస్థలపై సురక్షిత నౌకాయానం ఆధారపడి ఉంటుంది. సముద్ర నౌకాయాన సహాయక వ్యవస్థల చట్టం, 2021 ప్రకారం వీటిని అధికారికంగా ఎయిడ్స్ టు నావిగేషన్ (ఏటీఓఎన్)గా గుర్తించారు.

ఒక్కో నౌకతో పాటు మొత్తం నౌకల రాకపోకలు సురక్షితంగా, సమర్థంగా సాగేలా నౌకల వెలుపల ఏర్పాటు చేసి నిర్వహించే పరికరం, వ్యవస్థ లేదా సేవను ఏటీఓఎన్ అంటారు. వీటిలో దీపాలు అమర్చిన బోయీలు, రేడార్ బీకన్లు, దీప స్తంభాలు, నౌకాయాన మార్గాన్ని సూచించే గుర్తులు, లైట్‌హౌస్‌లు, దీపాలు అమర్చిన ప్రత్యేక నౌకలు వంటివి ఉంటాయి.

బోయీలు- నౌకా సిబ్బందికి మార్గదర్శనం లేదా హెచ్చరికలు అందించేందుకు, నీటిలో మునిగిన వస్తువుల స్థానాలను గుర్తించేందుకు, లంగరు వేయడానికి బదులుగా నౌకలను కట్టి నిలిపేందుకు ఉపయోగించే తేలియాడే పరికరాలు. వీటిని నిర్దిష్ట ప్రదేశంలో లంగరుతో స్థిరంగా ఉంచుతారు. మార్గం పక్కలను సూచించేవి, దిక్కులను సూచించేవి, ఒక నిర్దిష్ట ప్రదేశంలోని ప్రమాదాన్ని సూచించేవి, సురక్షిత నీటి ప్రాంతాలను సూచించేవి, ప్రత్యేక సూచనల కోసం వాడేవి, మునిగిన నౌకల స్థానాన్ని అత్యవసరంగా గుర్తించేవి వంటి రకాలు బోయీల్లో ఉన్నాయి.

.



రేడార్ బీకన్ (రాకాన్)- స్థిరంగా ఉండే లేదా తేలియాడే నౌకాయాన సహాయక పరికరాల స్థానాలను నౌకా సిబ్బంది సులభంగా గుర్తించేందుకు పోర్టులు, హార్బర్ అధికారులు ఉపయోగించే పరికరం. ఒకే యూనిట్‌గా ఉండే ఈ పరికరం సంకేతాలకు వేగంగా స్పందిస్తుంది. దాదాపు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సంకేతాలు పంపుతుంది. పొగమంచు, ప్రతికూల వాతావరణం, సముద్ర పరిస్థితులు దీని పనితీరును ప్రభావితం చేయవు.

.



భారత తీరప్రాంతం వెంబడి సాధారణ నౌకాయాన సహాయక వ్యవస్థల అభివృద్ధి, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్‌హౌసెస్ అండ్ లైట్‌షిప్స్ (డీజీఎల్‌ఎల్) నిర్వర్తిస్తుంది. నౌకాయాన సహాయక వ్యవస్థలు, నౌకల రాకపోకల సేవలపై (వీటీఎస్) శిక్షణకు జాతీయ ప్రాధికార సంస్థగా కూడా వ్యవహరిస్తుంది. సముద్రంలో ప్రాణ భద్రతకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందం (సోలాస్)పై భారత్ సంతకం చేసింది. తగిన నౌకాయాన సహాయక వ్యవస్థలను అభివృద్ధి చేసి, నిర్వహించాలని ఈ ఒప్పందం భాగస్వామ్య ప్రభుత్వాలను నిర్దేశిస్తుంది. నౌకాయాన సహాయక వ్యవస్థలపై (ఏటీఓఎన్) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ (ఐఏఎల్‌ఏ) జారీ చేసే సిఫార్సులు, మార్గదర్శకాలను కూడా భారత్ అనుసరిస్తోంది.

జాతీయ జలమార్గాల్లో ఐడబ్ల్యూఏఐ పటిష్ఠమైన నౌకాయాన సహాయక వ్యవస్థలను నిర్వహిస్తోంది. నౌకాయాన అవసరాలను బట్టి ఆయా జలమార్గాల్లో వివిధ సహాయక పరికరాలను కలిపి ఉపయోగిస్తున్నారు. ఈ మౌలిక వసతులకు జాతీయ జలమార్గం-3 ఒక మంచి ఉదాహరణ. కేరళలో ఉన్న ఎన్‌డబ్ల్యూ-3, దేశ అంతర్గత జల రవాణా వ్యవస్థలో కీలక భాగం. పశ్చిమ తీర కాలువ వ్యవస్థ కొట్టపురాన్ని కొల్లంతో కలుపుతూ, చంపక్కర, ఉద్యోగమండల్ కాలువల మీదుగా విస్తరించి ఉంది. నౌకలు ప్రయాణించగల మొత్తం మార్గంలో 24×7 నౌకాయానానికి తోడ్పడే సహాయక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ జలమార్గంలో సౌర విద్యుత్‌తో పనిచేసే, దీపాలు అమర్చిన మొత్తం 312 ఎఫ్‌ఆర్‌పీ (ఫైబర్‌గ్లాస్ రీఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్) బోయీలు, 17 బీకన్ దీప స్తంభాలను ఏర్పాటు చేశారు.

నదీ లైట్‌హౌస్‌లు: 24×7 నౌకాయానానికి తోడ్పాటు
మార్చి 2026లో భారత అంతర్గత నౌకాయాన వ్యవస్థ కొత్త దశలోకి అడుగుపెట్టింది. జాతీయ జలమార్గం-2గా గుర్తించిన బ్రహ్మపుత్ర నదిపై దేశంలోనే తొలి నాలుగు నదీ లైట్‌హౌస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు భారత్ ప్రకటించింది. అంతర్గత జలమార్గాల్లో నౌకాయాన సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడంలో ఇది కీలక ముందడుగు. ఈ నాలుగు లైట్‌హౌస్‌లను పాండు, బోగీబీల్, సిల్‌ఘాట్, బిశ్వనాథ్ ఘాట్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. ₹74 కోట్ల ఈ ప్రాజెక్టు, నౌకాయాన మార్గదర్శకత్వంతో పాటు ఆధునిక పర్యవేక్షణ సామర్థ్యాలను అందించనుంది.
- లైట్‌హౌస్‌లు భూమి నుంచి 20 మీటర్ల ఎత్తులో ఉంటాయి. నౌకలు తమ ప్రయాణ మార్గాన్ని గుర్తించేందుకు స్పష్టమైన సూచికలుగా ఉపయోగపడతాయి.
- భౌగోళికంగా ఇవి 14 నాటికల్ మైళ్ల దూరం వరకు కనిపిస్తాయి. దీంతో మరింత విస్తృత ప్రాంతంలో నౌకలకు మార్గదర్శనం లభిస్తుంది.
- వీటి కాంతి 8 నుంచి 10 నాటికల్ మైళ్ల దూరం వరకు కనిపిస్తుంది. ఇది రాత్రివేళ నౌకల రాకపోకలకు తోడ్పడుతుంది.
- ఇవి పూర్తిగా సౌర విద్యుత్‌తో పనిచేస్తాయి. దీంతో లైట్‌హౌస్‌ల నిర్వహణకు కాలుష్యరహితమైన, నమ్మకమైన విద్యుత్ వనరు అందుబాటులో ఉంటుంది.
- వాతావరణాన్ని పరిశీలించే సెన్సర్లు నౌకాయానం, భద్రతకు అవసరమైన అదనపు సమాచారం అందిస్తాయి.
- ఈ సముదాయాల్లో మ్యూజియంలు, ఆరుబయట ప్రదర్శన వేదికలు, కెఫెటేరియాలు, అందంగా తీర్చిదిద్దిన బహిరంగ ప్రదేశాలు కూడా ఉంటాయి.
- పిల్లల ఆట స్థలాలు, జ్ఞాపికల దుకాణాలు ప్రజలకు, పర్యాటకులకు అదనపు సదుపాయాలు కల్పిస్తాయి.

బ్రహ్మపుత్రకు ఇది ఎందుకు కీలకం?
భారత్‌లో ఒక అంతర్గత జలమార్గంపై లైట్‌హౌస్ మౌలిక వసతులను తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ఇది. రవాణా కార్యకలాపాలు పెరుగుతున్న నదీ మార్గంలో కొత్త నౌకాయాన భద్రతా వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. అస్సాంలోని ధుబ్రీ నుంచి సదియా వరకు 891 కిలోమీటర్ల నౌకాయాన మార్గాన్ని ఎన్‌డబ్ల్యూ-2 కలుపుతుంది. భారత జలమార్గాల్లో నౌకలు ప్రయాణించగల అత్యంత పొడవైన మార్గం ఇదే.

ఈ జలమార్గం ప్రాంతంలోని సరుకు రవాణాకు, ప్రయాణికులు, పర్యాటకుల రాకపోకలకు తోడ్పడుతోంది. తేయాకు, బొగ్గు, ఎరువుల సరఫరా వ్యవస్థలకు కూడా ఉపయోగపడుతోంది. ఎన్‌డబ్ల్యూ-2లో సరుకు రవాణా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 0.90 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరంలో 1.29 ఎంఎంటీలకు పెరిగింది. ఈ వృద్ధి, జలమార్గం వెంబడి మరింత పటిష్ఠమైన నౌకాయాన మౌలిక వసతుల అవసరాన్ని స్పష్టం చేస్తోంది. కొత్త లైట్‌హౌస్‌లు 24×7 నౌకాయానానికి తోడ్పడనున్నాయి. ఈ విధంగా బ్రహ్మపుత్ర నది వెంబడి నౌకాయాన భద్రత, సాంకేతిక తోడ్పాటు, పర్యాటక అభివృద్ధిని ఈ ప్రాజెక్టు సమన్వయం చేస్తోంది.

డిజిటల్ నౌకాయానం, ఎప్పటికప్పుడు తాజా సమాచారం
భారత అంతర్గత జలమార్గాల్లో నౌకలు ప్రయాణించే విధానాన్ని సాంకేతికత మారుస్తోంది. జలమార్గాలు, నౌకల కదలికలు, నీటి లోతు, వాతావరణం, రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ వేదికలు ఒకేచోట అందిస్తున్నాయి. దీంతో నౌకా సిబ్బంది, అధికారులు అవసరమైన సమయంలో, అవసరమైన చోట కీలక సమాచారాన్ని పొందగలుగుతున్నారు.

డిజిటల్ హైడ్రోగ్రాఫిక్ పటాలు: తెరపై నదుల సమాచారం
నౌకాయాన భద్రతను మెరుగుపరిచేందుకు ఆధునిక హైడ్రోగ్రాఫిక్ పటాల ద్వారా నౌకా సిబ్బందికి డిజిటల్ రూపంలో సమాచారం అందిస్తున్నారు. సెప్టెంబర్ 2026 నాటికి, వినియోగంలో ఉన్న జలమార్గాలు, సముద్రపు ఆటుపోట్ల ప్రభావం ఉండే జలమార్గాలు కలిపి 18 జలమార్గాలకు ఎలక్ట్రానిక్ నౌకాయాన పటాలను (ఈఎన్‌సీలు) సిద్ధం చేశారు. వాటిని పానీ, ఐడబ్ల్యూఏఐ వెసెల్ ట్రాకర్ వంటి పోర్టళ్లలో అందుబాటులో ఉంచారు. 2014కు ముందు ఈ సదుపాయం ఎన్‌డబ్ల్యూ-1 (హల్దియా, ప్రయాగ్‌రాజ్ మధ్య ఉన్న గంగా - భాగీరథి - హుగ్లీ నదీ వ్యవస్థ)లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ విస్తరణతో డిజిటల్ రూపంలో నౌకాయాన సమాచారం మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. నదులకు సంబంధించిన సమాచారాన్ని నౌకాయానానికి నేరుగా ఉపయోగపడే రూపంలోకి మార్చడం ద్వారా ఈ పటాలు క్షేత్రస్థాయి సర్వేలకు తోడ్పడుతున్నాయి.

 

.



పానీ, ఐడబ్ల్యూఏఐ వెసెల్ ట్రాకర్: తాజా సమాచారంతో నౌకాయాన అనుసంధానం
నౌకాయానానికి మార్గంలో నీటి లోతు తెలుసుకోవడం ఒక్కటే సరిపోదు. పోర్టల్ ఫర్ అసెట్ అండ్ నావిగేషన్ ఇన్ఫర్మేషన్ (పానీ), నదీ నౌకాయానం, మౌలిక వసతుల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. జాతీయ జలమార్గాలు, వాటికి సంబంధించిన ఆస్తుల వివరాలను పానీ అందిస్తోంది. వీటిలో నౌకాయాన మార్గాలు, మౌలిక సదుపాయాలు, నదికి అడ్డంగా ఉన్న నిర్మాణాలు ఉన్నాయి. సరుకు రవాణాను సులభతరం చేసేందుకు జెట్టీల అనుసంధానం, అత్యవసర సేవల వివరాలను కూడా ఈ పోర్టల్ అందిస్తోంది.

ఐడబ్ల్యూఏఐ వెసెల్ ట్రాకర్, పానీ పోర్టల్ కలిసి వెబ్, మొబైల్ ఆధారిత ఈ-నావిగేషన్ వ్యవస్థగా పనిచేస్తున్నాయి. నౌకల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, తాజా నౌకాయాన మార్గాలు, నీటి లోతు సమాచారాన్ని పొందేందుకు ఈ వ్యవస్థ వీలు కల్పిస్తోంది. అంతర్గత జలమార్గాల్లో సురక్షితమైన, సమర్థమైన రవాణాకు ఈ సదుపాయాలు తోడ్పడుతున్నాయి.

నౌదర్శిక: సమగ్ర నదీ రవాణా నిర్వహణ దిశగా..
నౌకలు సురక్షితంగా, సమర్థంగా, సుస్థిరంగా ప్రయాణించేందుకు నేషనల్ రివర్ ట్రాఫిక్ అండ్ నావిగేషన్ సిస్టమ్ అయిన నౌదర్శికను 2025లో ప్రారంభించారు. నౌకాయానానికి తోడ్పడేలా, అందుబాటులో ఉన్న కనీస నీటి లోతుపై (ఎల్‌ఏడీ) ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఈ వ్యవస్థ అందిస్తుంది. ఇప్పటికే ఉన్న పానీ, లాడిస్ వంటి డిజిటల్ వేదికలకు తోడుగా, నదుల్లో నౌకల రాకపోకలు, నౌకాయాన నిర్వహణ కోసం నౌదర్శిక ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది.

రివర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్: నౌకల రాకపోకల సమాచార వ్యవస్థ
రివర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, డిజిటల్ నౌకాయానాన్ని మరో మెట్టు ముందుకు తీసుకెళ్తున్నాయి. నౌకల కదలికలను గుర్తించే సాంకేతికతలు, వాతావరణం, నీటి పరిస్థితులను తెలుసుకునే సెన్సర్లు, సమాచార సాంకేతిక వ్యవస్థలను ఆర్‌ఐఎస్ అనుసంధానిస్తుంది. నౌకల నిర్వాహకులు, అధికారులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తుంది. నౌకలు, నియంత్రణ కేంద్రాల మధ్య సమాచార మార్పిడికి కూడా తోడ్పడుతుంది. ఈ సమాచార మార్పిడి మెరుగైన రాకపోకల నిర్వహణకు, నిర్వహణపరమైన నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.

గంగానదిపై ఆర్‌ఐఎస్
జాతీయ జలమార్గం-1 (గంగా)లో మూడు ప్రాంతాల్లో ఆర్‌ఐఎస్‌ను అమలు చేశారు. అవి హల్దియా–ఫరక్కా, ఫరక్కా–పట్నా, పట్నా–వారణాసి. ఈ వ్యవస్థలో 4 నియంత్రణ కేంద్రాలు, 13 బేస్ స్టేషన్లు ఉన్నాయి. ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్) పరికరాలు, వెరీ హై ఫ్రీక్వెన్సీ (వీహెచ్‌ఎఫ్) కమ్యూనికేషన్‌ను ఇందులో వినియోగిస్తున్నారు. వాతావరణ సెన్సర్లు కూడా ఈ వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. శాఖకు చెందిన 30 నౌకల్లో ఆర్‌ఐఎస్ కన్సోళ్లను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కలిసి ఎన్‌డబ్ల్యూ-1 వెంబడి నౌకల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థగా పనిచేస్తున్నాయి.

సురక్షిత నౌకాయానానికి సమన్వయ విధానం
నదుల పరిస్థితులను నిరంతరం తెలుసుకోవడం, నమ్మకమైన మౌలిక వసతులు, సకాలంలో సమాచారం అందించడం భారత జలమార్గాల్లో సురక్షిత నౌకాయానానికి పునాదులు. హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నదుల్లో మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకునేందుకు సహాయపడుతుండగా, నౌకాయాన సహాయక వ్యవస్థలు నీటిపై స్పష్టమైన మార్గదర్శనం అందిస్తున్నాయి. నీటి లోతు, ప్రయాణ మార్గాలు, వాతావరణం, నౌకల రాకపోకలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూ డిజిటల్ వేదికలు మరింత కచ్చితత్వాన్ని జోడిస్తున్నాయి. ఈ వ్యవస్థలన్నీ కలిసి అంతర్గత నౌకాయానంలో పరిస్థితులను ముందుగానే అంచనా వేసేందుకు, మార్పులకు వేగంగా స్పందించేందుకు వీలు కల్పిస్తున్నాయి. జలమార్గాల్లో రవాణా విస్తరిస్తున్న నేపథ్యంలో, సురక్షితంగా, సమర్థంగా, రేయింబవళ్లు నౌకల రాకపోకలకు ఈ సమగ్ర విధానం మరింత బలమైన పునాదిని ఏర్పరుస్తోంది.

 

 References

Ministry of Ports, Shipping and Waterways

https://shipmin.gov.in/en/division/iwt-1

https://shipmin.gov.in/en/content/dgll

https://shipmin.gov.in/sites/default/files/Marine%20Aids%20to%20Navigation%20Act%202021as%20Notified.pdf

https://iwai.gov.in/hydrography-0

https://dgll.nic.in/about-DGLL/Service-reminder/Buoys-page

https://www.dgll.nic.in/About-DGLL/Service-reminder/Racon

https://iwai.gov.in/offerings/national-waterway/national-waterways1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2289149&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2275554&reg=3&lang=1

https://iwai.gov.in/least-available-depth-lad

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2289149&reg=48&lang=2

https://iwai.gov.in/digital-platform

https://iwai.gov.in/offerings/national-waterway/national-waterways3?page=1

https://www.facebook.com/IWAI.MoPSW/videos/indias-waterways-are-entering-a-smarter-safer-and-more-connected-future-with-nau/1350068953607450/

https://www.facebook.com/IWAI.MoPSW/videos/dredging-is-the-process-of-removing-sediments-from-the-bottom-of-waterbodies-dre/1170286874124187/

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2290484&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2235574&reg=3&lang=1

https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?lang=2&reg=48&relid=188636

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2003047&lang=2

https://www.facebook.com/IWAI.MoPSW/videos/indias-waterways-are-entering-a-smarter-safer-and-more-connected-future-with-nau/1350068953607450/

PIB Backgrounders

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2255798&lang=2

 

Click to see pdf

***

(Explainer ID: 160523) आगंतुक पटल : 5
Provide suggestions / comments