Farmer's Welfare
25వ వార్షికోత్సవం: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) భారత్‌లో గ్రామీణ అనుసంధానతను అభివృద్ధి చేస్తున్న పథకం
Posted On:
25 DEC 2025 11:08AM
కీలకాంశాలు
- ప్రారంభమైనప్పటి నుంచి పీఎంజీఎస్‌వై కింద 8,25,114 కి.మీ గ్రామీణ రోడ్లు మంజూరయ్యాయి. ఇందులో 7,87,520 కి.మీ పూర్తి అయ్యాయి.
- పీఎంజీఎస్‌వై–3 కింద 1,22,393 కి.మీ మంజూరయ్యాయి. ఇందులో 1,01,623 కి.మీ నిర్మాణ పూర్తయ్యింది.
- పీఎంజీఎస్‌వై–4 (2024–29) కింద రూ.70,125 కోట్ల వ్యయంతో 62,500 కి.మీ రోడ్ల ద్వారా 25,000 ఆవాసాలను అనుసంధానించనున్నారు.
- ఓఎంఎంఏఎస్, ఈ-మార్గ్, జీపీఎస్ ట్రాకింగ్, మూడంచెల నాణ్యత వ్యవస్థ ద్వారా నిరంతర పర్యవేక్షణ, నాణ్యత ఉంటుంది.
పరిచయం
గ్రామీణ అభివృద్ధికి రహదారులు ప్రాథమిక మూలస్తంభాలుగా నిలుస్తాయి. ఇవి ఆర్థిక, సామాజిక సేవలకు ప్రాప్యతను కల్పిస్తాయి. వ్యవసాయ ఆదాయాలను పెంచుతాయి. ఉత్పాదక ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు పేదరిక నిర్మూలనలో గణనీయమైన సహకారాన్ని అందిస్తాయి. 2025లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన గ్రామీణ మౌలిక సదుపాయాల కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తోంది. గతంలో అనుసంధానం లేని గ్రామీణ నివాస ప్రాంతాలకు అన్ని కాలాలకు అనుకూలమైన రహదారి అనుసంధానతను అందించడానికి 2000 డిసెంబరు 25న ప్రారంభమైన ఈ పథకం వ్యవసాయ వృద్ధి, ఉపాధి కల్పన, విద్య, ఆరోగ్య సేవలకు మెరుగైన ప్రాప్యతగా, పేదరిక నిర్మూలనకు కీలకమైన సాధనంగా మారింది. కాలక్రమేణా పీఎంజీఎస్‌వై సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ప్రధాన చోదకశక్తిగా మారింది. మార్కెట్ ఏకీకరణను బలోపేతం చేయడం, రైతులకు మెరుగైన ధరలను అందించడం, వ్యవసాయ, వ్యవసాయేతర జీవనోపాధికి మద్దతు ఇస్తోంది. మొత్తంగా ఈ ఫలితాలు సమగ్ర, స్థిరమైన గ్రామీణ అభివృద్ధిని పెంపొందించడంలో ఈ కార్యక్రమ కీలకపాత్రను నొక్కి చెబుతున్నాయి.
అనుసంధానత నుంచి ఏకీకరణ వరకు: పీఎంజీఎస్‌వై కింద దశలవారీ పురోగతి
ప్రారంభమైన నాటి నుంచి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) కింద మొత్తం 8,25,114 కి.మీ గ్రామీణ రోడ్లు మంజూరయ్యాయి. ఇందులో 7,87,520 కి.మీ పూర్తయ్యాయి. ఇది డిసెంబర్ 2025 నాటికి దాదాపు 95 శాతం భౌతిక పురోగతిని ప్రతిబింబిస్తుంది.
ఇటీవలి సంవత్సరాలలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై)కి కేటాయించిన బడ్జెట్ గ్రామీణ రోడ్డు కనెక్టివిటీని బలోపేతం చేయడంపై ప్రభుత్వ నిరంతర ప్రాధాన్యతను చూపుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ కార్యక్రమానికి రూ.19,000 కోట్లు కేటాయించారు. ఇది గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అన్ని కాలాలకు అనుకూలమైన రోడ్డు కనెక్టివిటీని నిర్ధారించడానికి, గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక అవకాశాలను పెంచడానికి నిరంతర మద్దతును చాటి చెబుతుంది.
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) తొలి దశ(2000)
2000లో ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటి దశ గతంలో అనుసంధానత లేని అర్హత గల గ్రామాలకు అన్ని కాలాలకు అనుకూలమైన రోడ్డు సౌకర్యాన్ని కల్పించడానికి ప్రధాన చొరవగా పనిచేసింది. గ్రామాలను మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించడం ద్వారా ఇది సార్వత్రిక గ్రామీణ ప్రాప్యతకు పునాది వేసింది. ఫేజ్ 1 కింద దేశవ్యాప్తంగా మొత్తం 1,63,339 గ్రామాలకు రోడ్డు అనుసంధాన ప్రాజెక్టులు మంజూరయ్యాయి.
పీఎంజీఎస్‌వై రెండో దశ(2013)
2013లో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం రెండో దశ ప్రస్తుతం ఉన్న గ్రామీణ రహదారి వ్యవస్థను బలోపేతం చేయడం, ఏకీకృతం చేయడంపై దృష్టి సారించింది. రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, గ్రామీణ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం అనే లక్ష్యంతో గ్రామీణ మార్కెట్లు, అభివృద్ధి కేంద్రాలు, సేవా కేంద్రాలను అనుసంధానించే ఆర్థికంగా ముఖ్యమైన మార్గాల ఆధునికీకరణకు ఇది ప్రాధాన్యత ఇచ్చింది.
వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల రహదారి అనుసంధాన ప్రాజెక్టు(ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ) – (2016)
2016లో ప్రారంభించిన ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ తొమ్మిది రాష్ట్రాలలో(ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్) వామపక్ష తీవ్రవాదంతో ఎక్కువగా ప్రభావితమైన 44 జిల్లాలు, వాటి పరిసర ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి నిర్దేశించిన లక్ష్యిత కార్యక్రమం.
ఈ పథకంలోని రెండు లక్ష్యాలు:
- భద్రతా దళాల కదలికలను పెంచడం ద్వారా భద్రతా కార్యకలాపాలను బలోపేతం చేయడం.
- మారుమూల, వెనుకబడిన ప్రాంతాలలో మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆరోగ్య సేవలకు ప్రాప్యతను మెరుగుపరచడం ద్వారా సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం.
పీఎంజీఎస్‌వై మూడో దశ(2019)
2019లో ప్రారంభించిన మూడో దశ గ్రామీణ నివాస ప్రాంతాలు, గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, ఉన్నత మాధ్యమిక పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలతో సహా కీలక సామాజిక-ఆర్థిక సంస్థల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి 1,25,000 కి.మీ రహదారులను, ప్రధాన గ్రామీణ లింక్‌ల ఆధునికీకరణపై దృష్టి సారించింది. డిసెంబర్ 2025 నాటికి మొత్తం లక్ష్యంలో 1,22,393 కి.మీ రోడ్లు మంజూరయ్యాయి. ఇందులో దేశవ్యాప్తంగా 1,01,623 కి.మీ(83%) రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. పీఎంజీఎస్‌వై-3 రవాణా సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరిచింది. విద్య, ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను పెంచింది. వ్యవసాయ మార్కెట్లతో మెరుగైన అనుసంధానానికి దోహదపడటంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచింది. విస్తృతమైన గ్రామీణ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తోడ్పడింది.
పీఎంజీఎస్‌వై నాలుగో దశ(2024)
రూ.70,125 కోట్ల మొత్తం ఆర్థిక వ్యయంతో 2024–25 నుంచి 2028–29 ఆర్థిక సంవత్సరాల అమలు కాలంలో మొత్తం 62,500 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాలని ప్రతిపాదించారు. 2011 జనాభా లెక్కల ప్రమాణాల ఆధారంగా 25,000 కనెక్టివిటీ లేని గ్రామీణ నివాస ప్రాంతాలకు అన్ని కాలాలకు అనుకూలమైన రోడ్డు అనుసంధానతను అందించడం పీఎంజీఎస్‌వై నాలుగో దశ లక్ష్యం:
- మైదాన ప్రాంతాలలో 500, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నివాస ప్రాంతాలు
- ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 250, అంతకంటే ఎక్కువ జనాభా
- గిరిజన ప్రాంతాలు(షెడ్యూల్ 5), ఆశావాహ జిల్లాలు/బ్లాక్‌లు, ఎడారి ప్రాంతాలతో సహా ప్రత్యేక కేటగిరి ప్రాంతాలలో ఉన్న నివాస ప్రాంతాలు

గ్రామీణ రోడ్ల అభివృద్ధిలో అధునాతన సాంకేతికతల వినియోగం
ప్రభుత్వ క్రమబద్ధమైన చర్యలు పీఎంజీఎస్‌వై కింద నిర్మించిన గ్రామీణ రోడ్ల నాణ్యత, మన్నిక, స్థిరత్వాన్ని గణనీయంగా మెరుగుపరిచాయి. అధునాతన డిజిటల్ సాంకేతికతలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి పీఎంజీఎస్‌వై రోడ్డు ప్రాజెక్టుల పురోగతి, పనితీరు నిశితంగా పర్యవేక్షించడం జరుగుతోంది. ఇది మరింత సమర్థత, పారదర్శకత, బాధ్యతను నిర్ధారిస్తుంది.
ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్, మానిటరింగ్ మరియు అకౌంటింగ్ సిస్టమ్(ఓఎంఎంఏఎస్)
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద చేపట్టే అన్ని పనుల నిరంతర పర్యవేక్షణకు ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్, మానిటరింగ్ అండ్ అకౌంటింగ్ సిస్టమ్(ఓఎంఎంఏఎస్) తోడ్పడుతుంది. రాష్ట్రాలకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా భౌతిక, ఆర్థిక పురోగతి ఉండేలా చూస్తుంది. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(పీఎంఐఎస్)ను మరింత బలోపేతం చేయడానికి పీఎంజీఎస్‌వై-3 కింద మంజూరైన ప్రతి రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఓఎంఎంఏఎస్‌లో దీనిని విలీనం చేశారు.
ఓఎంఎంఏఎస్ స్వతంత్ర నాణ్యత పర్యవేక్షకులు నిర్వహించిన మదింపులను నమోదు చేయడం ద్వారా నాణ్యత ఉండేలా చూస్తుంది. నేషనల్ క్వాలిటీ మానిటర్స్(ఎన్‌క్యూఎం), స్టేట్ క్వాలిటీ మానిటర్స్(ఎస్‌క్యూఎం) నిర్వహించిన తనిఖీలు క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్(క్యూఎంఎస్) మొబైల్ అప్లికేషన్ ద్వారా క్షేత్రస్థాయి నుంచి జియో-ట్యాగ్ చేసిన ఫోటోగ్రాఫ్‌లతో పాటు అప్‌లోడ్ చేస్తారు. అనంతరం ఓఎంఎంఏఎస్ పోర్టల్‌లో కనిపిస్తాయి. ఈ విధానం నిరంతర నాణ్యత పర్యవేక్షణను అనుమతిస్తుంది. మన్నికైన గ్రామీణ మౌలిక సదుపాయాల పంపిణీలో పారదర్శకతను పెంచుతుంది.
ఈ-మార్గ్(ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్)
పీఎంజీఎస్‌వై రోడ్ల నిర్వహణను క్రమబద్ధంగా పర్యవేక్షించడానికి అన్ని రాష్ట్రాల్లో ఈ-మార్గ్ ప్లాట్‌ఫారమ్ అమలవుతోంది. ఇది నిర్మాణం పూర్తయిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల పాటు ఉండే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్(డీఎల్‌పీ)కి అనుగుణంగా ఉంటుంది. నిర్వహణ చెల్లింపుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ మాడ్యూల్‌గా ఈ-మార్గ్‌ను ప్రవేశపెట్టడంతో డీఎల్‌పీ సమయంలో కాంట్రాక్టర్ చెల్లింపులు ఇప్పుడు నేరుగా రోడ్డు పనితీరు, నాణ్యత ఫలితాలతో ముడిపడి ఉన్నాయి. ఈ పనితీరు ఆధారిత కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ బాధ్యతను గణనీయంగా బలోపేతం చేయడంతో పాటు నిర్వహణ ప్రమాణాలను మెరుగుపరిచింది. పీఎంజీఎస్‌వై ఆస్తుల దీర్ఘకాలిక మన్నికను పెంచింది.
గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) వినియోగం
రోడ్డు నిర్మాణంలో పారదర్శకత, బాధ్యతను పెంపొందించడానికి 2022 మే నుంచి పీఎంజీఎస్‌వై 3 పనుల కోసం కాంట్రాక్టర్లు, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యూనిట్లు(పీఐయూ) వినియోగించే అన్ని వాహనాలు, యంత్రాలు, పరికరాలపై జీపీఎస్-ఆధారిత వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్(వీటీఎస్)ను ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరి చేసింది. ఈ యంత్రాంగం పరికరాల వినియోగం, పని చేసే సమయాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా సూచించిన నిర్మాణ ప్రక్రియలను పాటించేలా చేస్తుంది. నిర్దేశిత రోడ్డు నాణ్యత ప్రమాణాలను సాధించడంలో దోహదపడుతుంది.
బలమైన సాంకేతిక ప్రమాణాలు
రోడ్డు అభివృద్ధిలో పర్యావరణపరంగా స్థిరమైన పదార్థాలు, అధునాతన నిర్మాణ సాంకేతికతల వినియోగాన్ని చురుకుగా ప్రోత్సహిస్తున్నారు. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు, స్వదేశీ పరిశోధనల నుంచి వచ్చిన ఆధారాలను ఉపయోగించి ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్(ఐఆర్‌సీ) కొత్త ప్రమాణాలను రూపొందించింది. అటువంటి ఆవిష్కరణలను సులభతరం చేయడానికి ప్రస్తుత మార్గదర్శకాలను క్రమానుగతంగా సవరిస్తోంది. తదనుగుణంగా, ఫ్లై యాష్, స్లాగ్, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, క్రంబ్ రబ్బర్ మోడిఫైడ్ బిటుమెన్, జియోసింథటిక్స్, బయో-బిటుమెన్, బయో-ఇంజినీరింగ్ చర్యలతో సహా అనేక రకాల పర్యావరణ అనుకూల పదార్థాల లభ్యత, సాంకేతిక సాధ్యతను బట్టి జాతీయ రహదారి ప్రాజెక్టులలో వినియోగిస్తున్నారు.
ఆవిష్కరణ, వాతావరణ పునరుత్థాన సామర్థ్యం
ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం, కోల్డ్ మిక్స్ పద్ధతులు, ఫుల్ డెప్త్ రిక్లమేషన్ వంటి వినూత్న నిర్మాణ సాంకేతికతలను అవలంబించడం పర్యావరణ ప్రభావాలను తగ్గిస్తూనే గ్రామీణ రోడ్ల మన్నికను పెంచింది. జూలై 2025 నాటికి 1.24 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ రోడ్ల నిర్మాణంలో ఈ స్థిరమైన పద్ధతులను ఉపయోగించారు. ఇది పునరుత్థాన సామర్థ్యం కలిగిన, పర్యావరణ అనుకూలమైన గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు వ్యూహాత్మక మార్పును ప్రతిబింబిస్తోంది.
మూడంచెల నాణ్యత పర్యవేక్షణ
గ్రామీణ రోడ్ల నాణ్యత, దీర్ఘకాలిక మన్నికను నిర్ధారించడానికి ఒక బలమైన మూడంచెల నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
- మొదటి దశ: అమలు చేసే ఏజెన్సీల ద్వారా క్షేత్రస్థాయి నాణ్యత తనిఖీలు.
- రెండో దశ: స్వతంత్ర స్టేట్ క్వాలిటీ మానిటర్స్(ఎస్‌క్యూఎం) ద్వారా తనిఖీలు.
- మూడో దశ: మంత్రిత్వ శాఖ నియమించిన నేషనల్ క్వాలిటీ మానిటర్స్(ఎన్‌క్యూఎం) ద్వారా ఆకస్మిక తనిఖీలు.
అన్ని పురోగతి, నాణ్యత మదింపులపై ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్, మానిటరింగ్, అకౌంటింగ్ సిస్టమ్(ఓఎంఎంఏఎస్) ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.
ముగింపు
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) 2025లో 25 సంవత్సరాల పరివర్తనాత్మక ప్రభావాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇది భారతదేశ గ్రామీణ అభివృద్ధి ప్రయాణంలో ఒక ప్రత్యేక మూలస్తంభంగా నిలుస్తోంది. మంజూరైన గ్రామీణ రోడ్డు పొడవులో దాదాపు 95 శాతం పూర్తి చేయడంతో ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలకు ప్రాప్యతను గణనీయంగా పెంచింది. మార్కెట్ అనుసంధానాలను బలోపేతం చేయడంతో పాటు విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరిచింది. సమగ్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసింది. ప్రాథమిక అనుసంధానతను నిర్ధారించడం నుంచి నెట్‌వర్క్‌లను ఏకీకృతం చేయడం, వ్యూహాత్మక గ్రామీణ లింక్‌లను అభివృద్ధి చేయడం, నాలుగో దశలో సార్వత్రిక చివరి మైలు ప్రాప్యతను పెంపొందించడం వరకు పీఎంజీఎస్‌వై దశలవారీగా అభివృద్ధి చెందింది. ఓఎంఎంఏఎస్, ఈ-మార్గ్, జీపీఎస్-ఆధారిత ట్రాకింగ్, బలమైన మూడంచెల నాణ్యత తనిఖీ యంత్రాంగం వంటి అధునాతన డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థల అనుసంధానం పారదర్శకత, బాధ్యత, మన్నిక, వాతావరణ పునరుత్థాన సామర్థ్యాన్ని నిర్ధారించింది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పీఎంజీఎస్‌వై కేవలం మౌలిక సదుపాయాల సృష్టికి మాత్రమే పరిమితం కాకుండా పర్యావరణ స్థిరత్వం, పేదరిక నిర్మూలన, సమగ్ర గ్రామీణ మార్పును ప్రోత్సహిస్తోంది.
References
Press Information Bureau
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155199&ModuleId=3®=3&lang=1
Lok Sabha and Rajya Sabha Questions
https://sansad.in/getFile/annex/269/AU721_d4mLjX.pdf?source=pqars
https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AS321_1O3k2I.pdf?source=pqals
Ministry of Rural Development
https://www.civilapps.in/files/PMGSY/PMGSY-IV/1-Overview.pdf
https://pmgsy.nic.in/sites/default/files/circular/GuidelinesfirsttierQM.pdf
https://omms.nic.in/dbweb/
https://pmgsy.dord.gov.in/dbweb/Home/PMGSYIII
https://pmgsy.dord.gov.in/dbweb/Home/HabitationCoverage
https://pmgsy.dord.gov.in/dbweb/Home/TableView
Click here to see in PDF
***
(Explainer ID: 156782)
आगंतुक पटल : 91
Provide suggestions / comments