రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ప్రతిపాదిత భారీ ఔషధ, వైద్య పరికరాల పార్కుల అభివృద్ధి అంశాలపై ఔషధ అధికారులతో కేంద్రమంత్రి సదానంద గౌడ సమీక్ష

Posted On: 24 JUN 2020 6:10PM by PIB Hyderabad

కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ, ఔషధ విభాగాధికారులతో సమీక్ష నిర్వహించారు.  మూడు భారీ ఔషధ పార్కులు, నాలుగు వైద్య పరికరాల పార్కుల అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు.

        సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్‌ మాండవీయ, ఔషధ విభాగం కార్యదర్శి పి.డి.వాఘేలా, సంయుక్త కార్యదర్శి నవ్‌దీప్‌ రిన్వా, సంయుక్త ఔషధ నియంత్రణాధికారి ఎస్‌.ఈశ్వరరెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.

        పార్కుల అభివృద్ధి క్రమబద్ధంగా సాగేలా.., ఏర్పాటు స్థలం గుర్తింపు పద్ధతులు, పీఎల్‌ఐ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక కచ్చితమైన ప్రమాణాల ప్రకారం ఉండాలని మంత్రులు గౌడ, మాండవీయ అధికారులకు సూచించారు.

 

        మౌలిక వసతులు, రవాణా సదుపాయల రూపంలో ఈ పథకాల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి, దేశీయంగా భారీస్థాయిలో ఔషధాలు, వైద్య పరికరాల తయారీలో పోటీతత్వం పెరుగుతుందని సదానంద గౌడ చెప్పారు. ఈ పార్కులు, ఔషధదిగుమతుల్లో కొరతను తగ్గించమేకాక, అంతర్జాతీయ ఎగుమతుల్లో భారత్‌ను కీలక స్థానంలో నిలబెడతాయన్నారు. ప్రతి పౌరుడు కొనగలిగే ధరల్లో ఔషధాలు లభించాలన్న ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఆశయాన్ని సాధించాలంటే, దేశీయంగా తక్కువ ధరల్లో ఔషధాల ఉత్పత్తి జరగాలన్నారు. ఇవి అత్యవసరంగా చేపట్టాల్సిన పథకాలని సదానంద గౌడ చెప్పారు.

 

        ఆత్మనిర్భర్‌ భారత్‌, ఔషధ భద్రత దిశగా మూడు భారీ ఔషధ పార్కులు, నాలుగు వైద్య పరికరాల పార్కుల అభివృద్ధి పథకాలకు మార్చి 21న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఔషధ దిగుమతుల్లో కొరతను తగ్గించడంతోపాటు, దేశీయ ఉత్పత్తులు, ఉద్యోగితను పెంపొందించడం ఈ పథకాల లక్ష్యం.

 

        భారీ ఔషధ పార్కుల వృద్ధి కోసం, గరిష్టంగా వెయ్యి కోట్ల రూపాయలను ఏకకాల గ్రాంటుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. లేదా, మౌలిక వసతుల ఏర్పాటు వ్యయంలో 70 శాతాన్ని ( కొండ ప్రాంత, ఈశాన్య రాష్ట్రాల్లో 90 శాతం) భరిస్తుంది. ఈ రెండిటిలో ఏది తక్కువైతే దానిని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇదే విధంగా, వైద్య పరికరాల పార్కులకు కూడా ఒక్కోదానికి గరిష్టంగా వంద కోట్ల రూపాయల చొప్పున ఏకకాల గ్రాంటు లేదా మౌలిక వసతుల ఏర్పాటు వ్యయంలో 70 శాతాన్ని, ( కొండ ప్రాంత, ఈశాన్య రాష్ట్రాల్లో 90 శాతం) ఈ రెండిటిలో ఏది తక్కువైతే దానిని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి (పీఎల్‌ఐ) కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

 

        ఈ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు ఔషధ విభాగ కార్యదర్శి కేంద్ర మంత్రికి వివరించారు.

 

*******


(Release ID: 1634064)