సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఉదంపూర్ & దోడా జిల్లాల్లో దేవికా మరియు పునేజా వంతెనల్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
వంతెన ప్రాజెక్టులు ఈ ప్రాంత అభివృద్ధికి గాను నవ శకానికి దారి తీస్తాయి: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
24 JUN 2020 5:44PM by PIB Hyderabad
దేశ ఈశాన్య ప్రాంతపు (డీఓఎన్ఈఆర్) అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధాన మంత్రి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్లు, దేశ అణుశక్తి మరియు అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు రెండు కీలకమైన వంతెనల్ని ప్రారంభించారు. వర్చువల్ వేదికపై జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్ మరియు దోడా జిల్లాల్లోని రెండు ముఖ్యమైన వంతెనలు దేవికా మరియు పునేజాలను ఆయన ప్రారంభించారు. సరిహద్దు రోడ్ల నిర్మాణ సంస్థ డీజీ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ సమక్షంలో ఉదంపూర్ జిల్లాలోని 10 మీటర్ల పొడవైన దేవికా వంతెనను ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల 70 సంవత్సరాల కోరిక నెరవేరిందని అన్నారు. ఈ వంతెన స్థానికంగా ట్రాఫిక్ సమస్యల్ని తీర్చడంలో కీలకంగా మారనుందని తెలిపారు. ఉదంపూర్ పట్టణ ప్రాంతపు ట్రాఫిక్ రద్దీ మరియు అభివృద్ధి అవసరాలను చూసుకోవడమే కాకుండా, ఆర్మీ కాన్వాయిలు మరియు ఇతర వాహనాలను సజావుగా సాగేందుకు దేవికా వంతెన సహాయపడుతుందని ఆయన అన్నారు. దాదాపు రూ.75 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ వంతెనను సంవత్సరం వ్యవధిలో నిర్మించారని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో లాక్‌డౌన్, కార్మికుల కొరత మరియు ఇతర స్థానిక సమస్యలు అనేక అడ్డంకులు, వివిధ సవాళ్లు ఎదురైనప్పటికీ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ పనులను పూర్తిచేయడాన్ని మంత్రి ప్రశంసించారు. ఈ వంతెన ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవం గురించి ఆయన వివరణనిచ్చారు. అధికారిక లాంఛనప్రాయాల కోసం ఎదురుచూడకుండా ప్రజలకు సంబంధించిన సంక్షేమ ప్రాజెక్టులను త్వరితగతిన అందుబాటులోకి తేవాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ దృష్టి కోణం మేరకు దీనిని వర్చువల్ విధానంలో తాము ప్రారంభించినట్టుగా తెలిపారు. మౌలిక సదుపాయాల అడ్డంకులను తగ్గించడానికి ప్రఖ్యాత అటల్ సేతు కేబుల్ వంతెనతో పాటు గత 4-5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో బీఆర్ఓ సంస్థ 200 కి పైగానే వంతెనల్ని నిర్మించిందని అన్నారు. దోడా జిల్లాలోని భదర్వా వద్ద దాదాపు రూ. 4 కోట్ల వ్యయంతో బీఆర్‌ఓ నిర్మించిన 50 మీటర్ల పొడవైన పునేజా వంతెనను కూడా కేంద్ర మంత్రి ఈ రోజు ప్రారంభించారు. జమ్మూ, ఉదంపూర్ల గుండా వెళ్లకుండా పఠాన్ కోట్ (పంజాబ్) ప్రాంతం నుండి దోడా, కిష్త్వార్, భదర్వా మరియు కాశ్మీర్ లోయకు బసోలి-బని-భదర్వా రహదారి ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయ లింక్. కొత్త కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు దోడా ప్రాంతం ఒక కొత్త అభివృద్ధి కేంద్రంగా అవతరించేలా చేయ గలవనని డాక్టర్ జితేంద్ర సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.



*******
(Release ID: 1634068)