వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన దశ - 1 : 2020 ఏప్రిల్ నుండి 2020 జూన్ వరకు

రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు, 2020 ఏప్రిల్ - జూన్ మధ్య కాలానికి, తమకు కేటాయించిన ఆహార ధాన్యాలలో 93.5 శాతం మేర, ఎన్.ఎఫ్.ఎస్.ఏ. లబ్ధిదారులకు పంపిణీ చేశాయి : భారత ఆహార సంస్థ.

Posted On: 05 AUG 2020 4:53PM by PIB Hyderabad

ఎన్.‌ఎఫ్.‌ఎస్.‌ఎ. లబ్ధిదారులకు ఉచితంగా అందజేసే అదనపు ఆహార ధాన్యాల పంపిణీ కోసం అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి, మూడు నెలలకు సరిపడా 118 లక్షల మెట్రిక్ టన్నులు (99 శాతం) మేర ఆహారధాన్యాలను,  ఎఫ్.‌సి.ఐ. డిపోలు / సెంట్రల్ పూల్ నుండి తీసుకున్నట్లు, భారత ఆహార సంస్థ అందజేసిన నివేదికలు తెలియజేస్తున్నాయి.  అదేవిధంగా, 2020 ఏప్రిల్ - జూన్ మధ్య కాలానికి తమకు కేటాయించిన ఆహార ధాన్యాలలో 111.52 లక్షల మెట్రిక్ టన్నులు (93.5 శాతం) మేర అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు కలిసి, లబ్దిదారులకు పంపిణీ చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.  2020 ఏప్రిల్ మరియు మే నెలల్లో, 37.5 లక్షల మెట్రిక్ టన్నులు (94 శాతం) మేర ఆహార ధాన్యాలను, ప్రతి నెలలో 75 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేయగా, జూన్ నెలలో 36.54 లక్షల టన్నులు (92 శాతం) మేర ఆహార ధాన్యాలను, 73 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు ఎఫ్‌.సి.ఐ. తెలియజేసింది.  

అంతకుముందు, 2020, మార్చి లో, దేశంలో కోవిడ్-19 వ్యాప్తి వలన ఏర్పడిన ఆర్థిక అంతరాయాల కారణంగా పేదలు మరియు అన్నార్తులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చడానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పి.ఎం.జి.కె.పి) ని ప్రకటించడం జరిగింది. దీనిని అనుసరించి,  అసాధారణమైన సంక్షోభ సమయంలో ఆహార ధాన్యాలు అందుబాటులో లేని కారణంగా, ఎన్.ఎఫ్.ఎస్.ఏ. క్రింద ఉన్న పేద మరియు దుర్బలులైన లబ్ధిదారులెవరూ బాధపడకూడదనే ఉద్దేశ్యంతో,  ఆహార, ప్రజా పంపిణీ శాఖ 2020 ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల కాలానికి “ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ అన్న యోజన (పి.ఎమ్-జి.కె.ఏ.వై)”  ను అమలు చేయడం ప్రారంభించింది. 

ఈ ప్రత్యేక పథకం కింద, ఎన్.‌ఎఫ్.‌ఎస్.‌ఏ. కి చెందిన,  అంత్యోదయ అన్నయోజన (ఎ.ఎ.వై) మరియు ప్రాధాన్యతా కుటుంబాలు (పి.హెచ్.‌హెచ్) రెండు కేటగిరీల పరిధిలో ఉన్న 81 కోట్ల ఎన్.‌ఎఫ్.‌ఎస్.‌ఎ. లబ్ధిదారులకు, సాధారణంగా నెలవారీగా అందజేసే ఆహార ధాన్యాలకు అదనంగా నెలకు, ఒక వ్యక్తికీ ఉచితంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు (బియ్యం లేదా గోధుమలు) అందజేయడం జరుగుతోంది. 

దీని ప్రకారం, పథకం-1 కింద,  మూడు నెలల వ్యవధి అంటే 2020 ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో,  ఆహార, ప్రజా పంపిణీ శాఖ, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా మొత్తం 121 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు (సుమారు నెలకు 40 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున), ఎన్.‌ఎఫ్.‌ఎస్.‌ఎ. లబ్ధిదారులందరికీ పంపిణీ చేయాలని, 2020 మార్చి, 30వ తేదీన, తెలియజేసింది.  

****



(Release ID: 1643602) Visitor Counter : 310