ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న జిల్లాలపై దృష్టి పెట్టిన కేంద్ర ఆరోగ్య శాఖ

మరణాలను ఆపడానికి, తగ్గించడానికి "సెంట్రల్‌ అడ్వజరీస్‌ & గైడ్‌లైన్స్‌" సూచించిన ప్రమాణాలను పాటించాలని సలహా

Posted On: 07 AUG 2020 8:52PM by PIB Hyderabad

జాతీయ, రాష్ట్ర సగటు కంటే ఎక్కువ కొవిడ్‌-19 మరణాల సంఖ్య నమోదవుతున్న జిల్లాలు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఆ జిల్లాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధానంగా దృష్టి పెట్టింది. కొవిడ్‌-19ను సమర్ధవంతంగా అడ్డుకునే కేంద్ర-రాష్ట్ర వ్యూహంలో భాగంగా, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్‌ భూషణ్‌ అధ్యక్షతన అత్యున్నత స్థాయి అధికారుల వర్చువల్‌ సమావేశం జరిగింది. అధిక కొవిడ్‌-19 మరణాలకు కారణాలను విశ్లేషించడానికి, మరణాలకు అడ్డుకట్ట వేసే మార్గాలను అన్వేషించడానికి ఆయా జిల్లాలు, రాష్ట్ర యంత్రాంగాలతో కలిసి పని చేసేందుకు ఈ సమావేశం నిర్వహించారు.
    
    నాలుగు రాష్ట్రాల్లోని 16 జిల్లాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. అవి.. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్; కర్ణాటకలోని బెళగావి, బెంగళూరు పట్టణ, కలబుర్గి, ఉడిపి; తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, రాణిపేట, తేని, తిరువళ్లూరు, తిరుచ్చిరప్పల్లి, ట్యుటికోరిన్, విరుద్‌నగర్; తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్. అంతేగాక, దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్‌ కేసుల్లో 17 శాతం ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. ప్రతిరోజూ అధిక సంఖ్యలో కొత్త కేసులు, ప్రతి 10 లక్షల మందికి అతి తక్కువ పరీక్షలు, అత్యధిక నిర్ధరణ శాతం కూడా ఈ జిల్లాల్లో ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతోపాటు, ఎన్‌హెచ్‌ఎం ఎండీలు, కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర ఆరోగ్య సంబంధిత సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.

    కొవిడ్‌తోపాటు ఇతర నివారించగల మరణాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలు, మార్గదర్శకాలు, చికిత్స ప్రొటోకాల్స్‌ పాటించాలని ఈ జిల్లాలకు సమావేశంలో సూచించారు. ముఖ్యంగా ఇతర అనారోగ్యాలు ఉన్నవారు, గర్భిణులు, వృద్ధులు, చిన్నారుల మరణాలను నివారించాలని నిర్దేశించారు.

    పరీక్ష కేంద్రాల సామర్థ్యాన్ని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని, పరీక్షల సంఖ్య పెంచాలని, నిర్ధరణ శాతాలను తగ్గించాలని, ఏ ఒక్క కేసులోనూ అంబులెన్సును తిరస్కరించకుండా వెంటనే అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలకు  కేంద్రం సూచించింది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ లభ్యత, అవసరాలను విశ్లేషించాలని, సకాలంలో ప్రణాళిక రూపొందించుకోవాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది.

    కొవిడ్‌-19కు సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు&సూచనలపై అధికారిక, తాజా సమాచారం కోసం https://www.mohfw.gov.in/, @MoHFW_INDIA ను చూడవచ్చు.

    కొవిడ్‌-19పై సాంకేతిక సందేహాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు; ఇతర సందేహాలుంటే ncov2019[at]gov[dot]in, @CovidIndiaSeva కు పంపవచ్చు.

    కేంద్ర ఆరోగ్య&కుటుంబ సంక్షేమ శాఖ హెల్ప్‌లైన్‌ నంబర్‌ +91-1123978046 లేదా 1075 (ఉచితం) కి ఫోన్‌ చేసి సందేహాలు తీర్చుకోవచ్చు. రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్‌ నంబర్ల జాబితాను https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf లో చూడవచ్చు.   

***



(Release ID: 1644261) Visitor Counter : 224