నౌకారవాణా మంత్రిత్వ శాఖ

నావికులకు ఆన్ లైన్ లో ఫైనల్ పరీక్షలు ప్రారంభించిన మంత్రి మాన్ సుఖ్ మాందవ్యా

కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో నావికులు
ఇంటినుంచే పరీక్షలు రాసే సౌకర్యం

నావికారంగంలో ఉపాధి అవకాశాలున్నాయన్న ప్రధాని ఆలోచనలమేరకే ఈ కృషి: శ్రీ మాందవ్యా

ప్రపంచంలో నావికులకు ఆన్ లైన్ పరీక్షలు పెడుతున్న మొదటి దేశం భారత్

Posted On: 07 AUG 2020 5:07PM by PIB Hyderabad

నావికాశిక్షణ పొందిన అభ్యర్థులకు అంతిమ పరీక్షలు ఆన్ లైన్ లో నిర్వహించటానికి కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ మాన్ సుఖ్ మాందవ్యా శ్రీకారం చుట్టారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆధ్వర్యంలోని వివిధ నావికాశిక్షణా సంస్థలలో శిక్షణ పొందినవారు ఇప్పుడు కోవిడ్ సంక్షోభంలో వాళ్ళ ఇళ్ళనుంచే పరీక్షలు రాసే అవకాశం కల్పించారు. 

 

ఈ సందర్భంగా మంత్రి శ్రీ మాందవ్యా మాట్లాడుతూ, నిపుణులైన నావికులకు భారత్ పేరు మోసిందన్నారు. 2017లో 1.54 లక్షలమంది సుశిక్షితులైన నావికులుండగా 2019 నాటికి 2.34 లక్షలకు చేరుకోగలిగామన్నారు. భారత, విదేశీ అవసరాలను సైతం తీర్చగలిగేలా 5 లక్షల మందిని సిద్ధం చేయటమేనమన్నారు. నావికారంగంలో ఉపాధి అవకాశాలు బాగా పెరుతాయన్న ప్రధాని మోదీ అంచనాలకు అనుగుణంగా ఈ కృషి జరుగుతోందన్నారు. షిప్పింగ్ పరిశ్రమ ఈ కోణంలో  దృష్టి సారించిందని చెప్పారు.

 

మారుతున్న కాలానికి అనుగుణంగా శిక్షణా సంస్థలు కూడా మారుతూ ఉండటం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.  నావికులకోసం అంతిమ పరీక్షలు ఆన్ లైన్ లో జరుపుతున్న దేశం ప్రపంచంలో భారత్ ఒక్కటేనని మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.  ఆ విధంగా వారు ఇళ్ళనుంచే పరీక్షలు రాసే అవకాశం కల్పించిందన్నారు. దీనివలన కచ్చితమైన, ఏకరూప పరీక్షా విధానం అందుబాటులోకి వస్తుందని కూడా గుర్తుచేశారు.

ఈ వర్చువల్ ప్రారంభోత్సవంలో షిప్పింగ్ డి.జి. శ్రీ అమితాబ్ కుమార్ మొత్తం పరీక్షల ప్రక్రియ గురించి మంత్రికి వివరించారు. అనేక భద్రతా చర్యలు తీసుకున్నమీదటే ఈ విధానాన్ని చేపట్టినట్టు చెప్పారు. ఎలాంటి అవకతవకలకూ అవకాశం లేనివిధంగా రూపొందించగలిగినట్టు మంత్రికి తెలియజేశారు. పరీక్షలు రాసేవారు ఆన్ లైన్ లో https://www.dgsexams.in/  వెబ్ సైట్ లో లాగిన్ కావాల్సి ఉంటుందన్నారు.

షిప్పింగ్ కార్యదర్శి శ్రీ సంజీవ్ రంజన్ తోబాటు మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులు, షిప్పీంగ్, నావికా శిక్షణాసంస్థల డైరెక్టరేట్ జనరల్ కార్యాలయ అధికారులు, నావికులు ఈ వర్చువల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1644275) Visitor Counter : 219