ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో 14.2 లక్షలు దాటిన కోలుకున్నవారిసంఖ్య కోలుకున్నవారి శాతం మరింత మెరుగుదల, నేడు 68.32%
జాతీయ స్థాయిలో పాజిటివ్ లలో 2.04 శాతానికి తగ్గిన మరణాలు

Posted On: 08 AUG 2020 5:02PM by PIB Hyderabad

కోవిడ్ వైరస్ వ్యాప్తి నివారణ, పరీక్షలు, ఐసొలేషన్ , చికిత్స పరంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉమ్మడిగా తీసుకున్న సమర్థవంతమైన చర్యల ఫలితంగా కోలుకున్నవారి శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. అదే సమయంలో పాజిటివ్ కేసులలో మరణాల శాతం కూడా బాగా తగ్గుతోంది.

సమర్థంగా నిఘా పెట్టి వ్యాధి సోకే అవకాశమున్నవారిని గుర్తించి పరీక్షలు జరిపే వ్యవస్థను బలోపేతం చేయటం వలన ప్రాథమిక దశలోనే బాధితులను గుర్తించటం, చికిత్స అందించటం సాధ్యమైంది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే, భారత్ లో సగటున ప్రతి పది లక్షలమందిలో అతి తక్కువగా 1469  మరణాలు నమోదు కాగా, అంతర్జాతీయంగా ఆ సంఖ్య 2425 గా ఉంది.

cases per million.jpg


పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే త్రిముఖ వ్యూహం సమర్థంగా అనుసరించటంలో కేంద్రంతో బాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థంగా సమన్వయంతో పనిచేయటం వల్ల మరణాల శాతం తక్కువగా ఉంది. పైగా ఇది తగ్గుతూ వస్తోంది. ఈరోజు పాజిటివ్ కేసులలో మరణించినవారి శాతం 2.04% గా నమోదైంది. ప్రతి పది లక్షల మందిలో 30 మరణాలు నమోదు కాగా అంతర్జాతీయంగా 91 మరణాలు నమోదయ్యాయి.  
 

deaths per million.jpg


కోలుకున్నవారి సంఖ్య కూడా భారత్ లో బాగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 48,900 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు భారత్ లో కోలుకున్నవారి సంఖ్య 14,27,005 కు చేరింది. ఆ విధంగా కోలుకుంటున్నవారి శాతం క్రమంగా పెరుగుతూ  ప్రస్తుతం 68.32% చేరింది. ప్రస్తుతం ఇంకా చికిత్సలో ఉన్నవారి సంఖ్య 6,19,088 కాగా, మొత్తం పాజిటివ్ గా నమోదైన వారిలో ఇది 29.64%. వీరంతా ఆస్పత్రులలోగాని, ఇళ్ళలో ఐసొలేషన్ లో గాని చికిత్స అందుకుంటూ ఉన్నారు.

పరీక్షలు ఉద్ధృతంగా జరిపేందుకు వీలుగా లాబ్ ల నెట్ వర్క్ పెంచటంతో ఇప్పటివరకు 2,33,87,171  శాంపిల్స్ పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో 5,98,778  మందికి పరీక్షలు జరిపారు. ఆ విధంగా చూస్తే ఇప్పటివరకు పెరుగుతూ ప్రతి పది లక్షల మందిలో 16947 మందికి పరీక్షలు జరిపినట్టయింది.  ఇందుకు ప్రధాన కారణం డయాగ్నొస్టిక్ లాబ్ ల  నెట్ వర్క్ బాగా విస్తృతం కావటమే. ప్రస్తుతం మొత్తం 1396 లాబ్ లు ఉండగా  ప్రభుత్వ ఆధ్వర్యంలో 936, ప్రైవేటు రంగంలో 460 లాబ్ లు ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ :  711 (ప్రభుత్వ:  428 + ప్రైవేట్:  283)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 574  (ప్రభుత్వ: 476+ ప్రైవేట్: 98)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 111  (ప్రభుత్వ: 32  + ప్రైవేట్ 79 )

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి


కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19@gov.in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019@gov.in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
 

****(Release ID: 1644424) Visitor Counter : 17