ప్రధాన మంత్రి కార్యాలయం

వరద పరిస్థితిని సమీక్షించడానికి ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన - ప్రధానమంత్రి.

సూచన మరియు హెచ్చరికల వ్యవస్థను మెరుగుపరచడానికి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని నొక్కి చెప్పిన - ప్రధానమంత్రి.

స్థానికంగా ముందస్తు హెచ్చరికలు పొందే విధానంలో పెట్టుబడులు పెంచాలని సూచించిన - ప్రధానమంత్రి.

వరద పరిస్థితి మరియు సహాయక చర్యలపై ముఖ్యమంత్రులు తాజా పరిస్థితిని వివరించారు; సకాలంలో మోహరించడంలో, ప్రజలను రక్షించడంలో ఎన్.డి.ఆర్.ఎఫ్ తో సహా కేంద్ర ఏజెన్సీల కృషిని వారు అభినందించారు.

Posted On: 10 AUG 2020 3:10PM by PIB Hyderabad

నైరుతి రుతుపవనాలతో పాటు దేశంలో ప్రస్తుత వరద పరిస్థితులను ఎదుర్కోవటానికి, వారి సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అస్సాం, బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ అనే ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో రక్షణ మంత్రి, ఆరోగ్య మంత్రి, కేంద్ర హోంశాఖ ఇద్దరు సహాయ మంత్రులతో పాటు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు సంస్థల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

వరదలను ముందుగా అంచనా వేయడానికీ, శాశ్వత వ్యవస్థను కలిగి ఉండటానికీ, అదేవిధంగా ముందస్తు సూచనలు, హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థను మెరుగుపరచడానికీ, వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించటానికి వీలుగా, అన్ని కేంద్ర మరియు రాష్ట్ర సంస్థల మధ్య మంచి సమన్వయం పెంపొందించుకోవాలని, ప్రధానమంత్రి గట్టిగా నొక్కి చెప్పారు.

భారత వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం వంటి మన ముందస్తు అంచనా సంస్థలు,  గత కొన్ని సంవత్సరాలుగా,  మెరుగైన, మరింత ఉపయుక్తమైన వరద సూచనలను చేయడానికి సమగ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజేశారు.  వర్షపాతం, నదుల నీటి మట్టంలకు సంబంధించిన సూచనలతో పాటు, ఉప్పెనల వంటి, నీటి ప్రవాహ వేగానికి సంబంధించిన నిర్దిష్ట సూచనలను కూడా అందించడానికి ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.  ప్రదేశాల నిర్దిష్ట సూచనలను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సు వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి ప్రయోగాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం, ఈ ఏజెన్సీలకు అవసరమైన సమాచారాన్ని రాష్ట్రాలు అందజేయాలి. అదేవిధంగా ఈ సంస్థలు విడుదల చేసిన హెచ్చరికలు స్థానిక సమాజాలకు  సకాలంలో అందేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలి. 

నదుల కట్టలు తెగడం, ఉప్పెనలు, పిడుగులు, మెరుపుల వంటి ప్రకృతి వైపరీత్య పరిస్థితులు సంభవించినప్పుడు, ఒక నిర్దిష్ట ప్రాంతంలోని ప్రజలకు సకాలంలో హెచ్చరికలు జారీ చేసే విధంగా, ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ముందస్తు హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన పేర్కొన్నారు.

కోవిడ్ పరిస్థితి నేపథ్యంలో, సహాయక చర్యలను చేపట్టేటప్పుడు, ప్రజలు ముఖానికి మాస్కు ధరించడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకొవడం, తగినంత భౌతిక దూరాన్ని పాటించడం వంటి అన్ని ఆరోగ్య జాగ్రత్తలను ప్రజలు పాటించేలా చూడాలని ప్రధానమంత్రి సూచించారు.  చేతులు కడుక్కోవడానికి / శుభ్రపరచుకోడానికీ అవసరమైన సహాయ సామాగ్రితో పాటు, బాధిత వ్యక్తులకు అవసరమైన ఫేస్ మాస్కులు అందుబాటులో ఉంచాలని కూడా ఆయన  సూచించారు. ఈ విషయంలో, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. 

స్థానిక విపత్తులను తట్టుకోవటానికి మరియు పర్యవసానంగా జరిగే నష్టాలను తగ్గించడంలో సహాయపడటానికి అవసరమైన అన్ని అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను స్థితిస్థాపకతతో నిర్మించాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. 

అస్సాం, బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులు, కర్ణాటక హోంమంత్రి, తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న వరద పరిస్థితి, చేపట్టిన సహాయక చర్యల గురించి తాజా పరిస్థితిని వివరించారు. సకాలంలో మోహరించడంలో, ప్రజలను రక్షించడంలో, ఎం.డి.ఆర్.ఎఫ్. బృందాలతో సహా కేంద్ర ఏజెన్సీల కృషిని వారు అభినందించారు.  వరద ప్రభావాలను తగ్గించడానికి చేపట్టవలసిన కొన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను వారు సూచించారు. 

రాష్ట్రాలు ఇచ్చిన సూచనలపై తగిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత మంత్రిత్వ శాఖలు, సంస్థల అధికారులను ప్రధానమంత్రి ఆదేశించారు.  వివిధ విపత్తులను ఎదుర్కోవటానికి అవసరమైన సామర్థ్యాలను బలోపేతం చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం తన మద్దతును అందిస్తుందని ఆయన ఈ సందర్భంగా రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు హామీ ఇచ్చారు.

*****



(Release ID: 1644854) Visitor Counter : 226