ఆర్థిక మంత్రిత్వ శాఖ

జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల స్థితి మీద ఆన్ లైన్ డాష్ బోర్డ్ ను ప్రారంభించిన ఆర్థికమంత్రి

Posted On: 10 AUG 2020 5:12PM by PIB Hyderabad

జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల స్థితిని తెలియజెప్పే ఆన్ లైన్ డాష్ బోర్డును కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. నవ భారతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం ఏ దశలో ఉన్నదో ఏ క్షణాన తెలుసుకోవాలన్నా ఈ డాష్ బోర్డ్ లో చూడవచ్చు. ఇండియా ఇన్వెస్ట్ మెంట్ గ్రిడ్  www.indiainvestmentgrid.gov.in లో దీన్ని చూసే వీలుకల్పించారు.  ఈ గ్రిడ్ ఇంటరాక్టివ్ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్. భారతదేశంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఇది చూపుతుంది.  ఈ ప్రారంభ కార్యక్రమంలో మౌలిక సదుపాయాలమీద ఏర్పాటైన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు, వివిధ మంత్రిత్వశాఖ కార్యదర్శులు, ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

 



ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి సీతారామన్ మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ భారత్ ముందు చూపుకు ఎన్ ఐ పి ప్రేరణ ఇస్తుందన్నారు. ఎన్ ఐ పి ప్రాజెక్టుల అందుబాటును ఐఐజి సుసాధ్యం చేస్తుందని, వివిధ ప్రాజెక్టుల తాజా సమాచారాన్ని అందజేయటం ద్వారా పిపిపి ప్రాజెక్టులకు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని చెప్పారు.  దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తూ, ఎన్ ఐ పి అమలుకు ఇది సరైన దిశలో సరైన అడుగుగా అభివర్ణించారు.
భారత్ లో పెట్టుబడులు పెట్టటానికి  విశ్వవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లకు ఉన్న అవకాశాలను తెలియజెప్పే ఇండియా ఇన్వెస్ట్ మెంట్ గ్రిడ్ (www.indiainvestmentgrid.gov.in) అనేది ఒక ఇంటరాక్టివ్ ఆన్ లైన్ ప్లాట్ ఫాం. జాతీయ  పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ అయిన ఇన్వెస్ట్ ఇండియా దీన్ని రూపొందించింది. భారతదేసంలో పెట్టుబడులకు ఐఐజి ఒక ముఖద్వారంలా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత రాయబార కార్యాలయాలు దీన్ని విస్తృతంగా వాడుకుంటాయు. ఇన్వెస్టర్లకు కల్పించే అవకాశాలు:

* అన్ని రంగాలలో పెట్టుబడులకు దేశవ్యాప్తంగా ఉన్న అవకాశాల సమాచారం వెతుక్కోవటం
* ఆశిస్తున్న ప్రాజెక్టుల పురోగతిని ట్రాక్ చేసి ఆసక్తి ఉన్నట్టు తెలియజేయటం
* ప్రాజెక్టు ప్రమోటర్లతో నేరుగా సంప్రదింపులు జరపటం
 
2019-2020 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకోసం రూ. 100 లక్షల కోట్లు ప్రకటించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం అనంతరం ఈ బడ్జెట్ ప్రకటన వెలువడింది. ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 100 లక్షల కోట్లు కేటాయించాం. దీనివలన జీవన ప్రమాణాలు మెరుగుపడటంతోబాటు కొత్త ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. దీనికి అనుబంధంగా ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ జాతీయ మౌలిక సదుపాయాల స్థితి మీద తన తుది నివేదికను అందించింది. 2020-25 మధ్య కాలంలో రూ. 111 లక్షల కోట్ల పెట్టుబడులను ఈ నివేదిక సూచించింది.

అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రజల జీవన నాణ్యతలు మెరుగుపరచటం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే ఎన్ ఐ పి. ప్రాజెక్టు తయారీ, మౌలిక సదుపాయాల కల్పనలో స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం ద్వారా 2025 ఆర్థిక సంవత్సరానికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవటానికి ఇది చాలా కీలకం. ఎన్ ఐ పి  ఆర్థిక, సామాజిక మౌలికసదుపాయాల ప్రాజెక్టులను ప్రస్తావిస్తుంది.


ఊహించిన మొత్తం మూలధన వ్యయం  రూ.111  లక్షల కోట్లలో రూ. 44 లక్షల కోట్ల విలువచేసే ప్రాజెక్టులు (40%)  అమలులో ఉన్నాయి. రూ. 33 లక్షల కోట్ల (30%) విలువచేసే ప్రాజెక్టుల ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉండగా, రూ. 22 లక్షల కోట్ల (20%) ఇంకా మొదలు కావాల్సి ఉంది.  ప్రాజెక్టులను గుర్తించి డిపిఆర్ సిద్ధమైనప్పటికీ, ఇంకా నిధులు కేటాయించబడనివి అవి. మిగిలిన రూ. 11 కోట్ల విలువచేసే 10% పనులు ఇంకా వర్గీకరించబడనివి. ఈ ప్రాజెక్టులన్నీ ఐఐజి లో కనిపిస్తాయి. ఎన్ ఐ పి లో అందుబాటులో ఉంటాయి. విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్లను ఇవి ఆకర్షిస్తాయి.

ఎన్ ఐ పి టాస్క్ ఫోర్స్  అంతిమ నివేదికలోని మూడవ వాల్యూమ్ కింద ఇచ్చిన ఎన్ ఐ పి ప్రాజెక్ట్ సమాచారం ఐఐజి లో అందుబాటులో ఉంటుంది. ఇది తాజా సమాచారాన్ని అన్ని రంగాల ఇన్వెస్టర్లకు అందిస్తుంది.  ప్రాజెక్టులను మార్కెట్ చేయటానికి ఈ డిజిటల్ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇండియన్ ఇన్వెస్ట్ మెంట్ గ్రిడ్ లో పెట్టిన ఎన్ ఐ పి ప్రాజెక్టు సమాచారం అందరికీ అందుబాటులో ఉంటూ ఇన్వెస్టర్లకు ఆర్థిక సహకారం అందించే అవకాశాలను కూడా తెలియజేస్తుంది. ఈ విధంగా ఉండే ప్రాజెక్ట్ స్థాయి సమాచారం స్వదేశీ, విదేశీ ఇన్వెస్టర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సంబంధిత మంత్రిత్వశాఖలకు, విభాగాలకు ఇది ఒక అంచనాల పనిముట్టుగా పనికొస్తుంది. విదేశాంగ వ్యవహారాల విభాగం కూడా దీన్ని సమన్వయం చేస్తూ  నిజమైన పురోగతిమీద సమాచారం అందుకుంటుంది.

ఇందులో ప్రాజెక్టుల సమాచారాన్ని అప్ డేట్ చేయాలని మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సంబంధిత మంత్రిత్వశాఖలను, విభాగాలను కోరారు. ఆ విధంగా తాజా సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రాజెక్టుల పురోగతిని, అమలులో సంస్కరణలను కచ్చితంగా ఇందులొ చూపాలన్నారు.


 

****



(Release ID: 1644879) Visitor Counter : 401