ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మధ్యప్రదేశ్ ఆరోగ్య స్థితిగతులపై సిఎంతో కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమాలోచనలు

Posted On: 10 AUG 2020 7:42PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్ లో ఆరోగ్య, వైద్య సేవల మెరుగుదలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ నుంచి సలహాల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు డిజిటల్ సమావేశం జరిపారు. 2023 నాటికి మధ్యప్రదేశ్ ను ఆరోగ్య రంగంలో మెరుగుదల ద్వారా ఆత్మ నిర్భర్ గా మార్చటానికి చేపట్టాలనుకుంటున్న చర్యలమీద ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. డాక్టర్ హర్ష వర్ధన్ తన అమూల్యమైన సలహాలు అందించగా వాటిని పూర్తిగా అమలు చేస్తామని శ్రీ చౌహాన్ హామీ ఇచ్చారు.

సంక్షోభ సమయం మధ్యలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ సమర్థంగా కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగినందుకు. తాను స్వయంగా కూడా కోలుకున్నందుకు  శ్రీ చౌహాన్ ను డాక్టర్ హర్షవర్ధన్ ప్రత్యేకంగా అభినందించారు.

పౌరులందరికీ ఆరోగ్య రక్షణ కల్పించేందుకు దీక్ష చేపట్టిన అతి కొద్ది రాష్ట్రాలలో ఒకటైనందుకు కూడా మధ్య ప్రదేశ్ ను మంత్రి అభినందించారు. జనాభాలో 78% మందిని ఆయుష్మాన్ భారత్ పిఎం-జె ఎ వై పథకం కిందికి తీసుకువచ్చారని చెబుతూ, కేవలం 28.26% ఆరోగ్య కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నప్పటికీ  ఎనిమిదికోట్ల జనాభా ఉన్న మధ్యప్రదేశ్ లో కోవిడ్ సంక్షోభ సమయంలో కోటిమంది వాటిని సందర్శించారన్నారు. వీలైనంత త్వరగా మరిన్ని ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర అధికారులను ఆయన కోరారు.  ఈ కేంద్రాలతోబాటు ఆయుష్మాన్ భారత్ లోని పిఎం-జె ఎ వై ద్వారా ప్రజలు తమ జేబుల్లోనుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నుంచి బైటపడతారని, నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉంటుందని డాక్టర్ హర్ష వర్ధన్ అభిప్రాయపడ్దారు.

నవజాత శిశువుల ఆరోగ్యం, ఫస్ట్ రిఫరల్ యూనిట్,  రోగి కల్యాణ్ సమితి లాంటి సరికొత్త వ్యూహాలతో మధ్య ప్రదేశ్ అందరికంటే ముందుండటాన్ని ప్రస్తావిస్తూ, టెలిమెడిసిన్ వేదిక ఈ-సంజీవని ని  కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మధ్యప్రదేశ్ లో ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ,  గర్భిణులు, శిశువుల ఆరోగ్యం ఇంకా కలవరపరచే స్థాయిలోనే ఉందన్నారు. కాన్పు సమయంలో మరణాలు ప్రతి లక్ష కాన్పుల్లో 173 ఉండటాన్ని ప్రస్తావించారు. ఈ సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటాన్ని ఆయన గుర్తు చేశారు. ఆరోగ్య విభాగంలో మానవ వనరుల కొరతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకే ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి డాక్టర్ హర్ష వర్ధన్ సూచించారు. రాష్ట్ర స్థూల ఆదాయంలో కనీసం 8% ఆరోగ్యరంగానికి వెచ్చించాలని కూడా కోరారు. రాష్ట్ర అధికారులు తమ లక్ష్యాలను, కార్యాచరణ ప్రణాళికలను మంత్రికి సమర్పించగా వాటిని ఆచరణలోకి తెస్తే ప్రధాని స్వప్నమైన ఆత్మనిర్భర్ భారత్ నెరవేరుతుందని డాక్టర్ హర్షవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు

***



(Release ID: 1644971) Visitor Counter : 238