ప్రధాన మంత్రి కార్యాలయం

విశ్వ మహమ్మారి కరోనాను ఎదుర్కోవడానికి మున్ముందు తీసుకోవలసిన చర్యలను యోచించడానికి  ప్రధానమంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు  

మనం ఒక కొత్త మంత్రాన్ని ఆచరించాలి -- వ్యాధి సంక్రమించిన వ్యక్తిని కలసిన వారందరినీ 72 గంటల లోపల గుర్తించి పరీక్షించాలి: ప్రధానమంత్రి

దేశంలో 80% కేసులు 10 రాష్ట్రాలలో ఉన్నాయి.  ఆ రాష్ట్రాలలో వైరస్ ను ఓడించగలిగితే మొత్తం దేశం గెలుస్తుంది:  ప్రధాని

కోవిడ్ మరణాల రేటు త్వరలోనే  1% కన్నా దిగువకు తేవడం సాధ్యమే :   ప్రధాని

చర్చ ద్వారా బయల్పడిన విషయం ఏమిటంటే బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో సత్వరం కోవిడ్ పరీక్షలను పెంచాల్సిన అవసరం ఉంది:   ప్రధాని  

కోవిడ్ పై జరుపుతున్న పోరాటంలో వ్యాధి నిరోధం,  సన్నిహితులు/సంబంధీకుల గుర్తింపు, కాపు కాయడం  సమర్ధవంతమైన ఆయుధాలు : ప్రధాని  

ఢిల్లీ, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలతో కలసి మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కోవడానికి దిశా నిర్దేశం చేయడంలో హోమ్ మంత్రి అనుభవాన్ని ప్రధానమంత్రి వివరించారు

వాస్తవ పరిస్థితి గురించి  ముఖ్యమంత్రులు ప్రధానికి ప్రతిపుష్టి ఇచ్చారు.  ఆరోగ్య సేవల కోసం మౌలిక సదుపాయాలు పెంచడాన్ని, పరీక్షలు పెంచడాన్ని గురించి వివరించారు.&

Posted On: 11 AUG 2020 2:05PM by PIB Hyderabad

విశ్వ మహమ్మారి కోవిడ్ -19 ప్రస్తుత పరిస్థితిని గురించి చర్చించి భవిష్యత్ చర్యలను యోచించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర  మోదీ మంగళవారం 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా పరస్పరం చర్చలు జరిపారు.  ఆంద్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు,  పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్,  బీహార్, గుజరాత్, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో ప్రధాని చర్చించారు.   కర్ణాటక తరపున ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు.     

టీమ్ ఇండియా సంఘటిత శ్రమ

దేశంలో ప్రతి ఒక్కరు సహకరించి కలసికట్టుగా పని చేశారని, టీమ్ ఇండియా సంఘటిత కృషి చేయడం ప్రశంసాయోగ్యమని  ప్రధానమంత్రి తెలిపారు.  ఈ సందర్బంగా ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది  ఎదుర్కొన్న సవాళ్ళను మరియు

వత్తిళ్ళను గురించి ఆయన ప్రస్తావించారు.  దేశంలో 80% కోవిడ్ కేసులు 10 రాష్ట్రాలలో ఉన్నాయి.   ఈ 10 రాష్ట్రాలలో వైరస్ ను ఓడించగలిగితే మొత్తం దేశం కోవిడ్-19 పై  పోరాటంలో  విజయం సాధించగలదని ప్రధాని అన్నారు.  

పరీక్షలు పెంపు, మరణాల రేటు తగ్గింపు

       దేశవ్యాప్తంగా ప్రతిరోజు జరుపుతున్న కోవిడ్ పరీక్షల సంఖ్య దాదాపు 7 లక్షలకు చేరిందని,  అది క్రమంగా పెరుగుతోందని,  దానివల్ల వ్యాధి సోకిన వారిని త్వరగా గుర్తించడానికి మరియు అదుపుచేయడానికి తోడ్పడిందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.  దేశంలో   సగటు మరణాల రేటు ప్రపంచ దేశాలలో అతి తక్కువని,  అది క్రమంగా తగ్గుతోందని అన్నారు.  చికిత్స పొందుతున్న వారి శాతం కూడా తగ్గుతోందని,  అదే సమయంలో కోలుకుంటున్న వారి శాతం పెరుగుతోందని ఆయన అన్నారు.  ఈ చర్యలవల్ల  ప్రజల విశ్వాసం పెరిగిందని,  దీనివల్ల కోవిడ్ మరణాల రేటు  1% కన్నా దిగువకు తేవాలన్న లక్ష్యం త్వరలోనే సాధ్యం కావచ్చు అన్నారు.

      ఈ రోజు జరిపిన చర్చల వల్ల బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో సత్వరం కోవిడ్ పరీక్షలను పెంచాల్సిన అవసరం ఉందని బయటపడిందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ  పోరాటంలో వ్యాధి నిరోధం,  సన్నిహితులు/సంబంధీకుల గుర్తింపు, కాపు కాయడం  సమర్ధవంతమైన ఆయుధాలని ప్రధాని అన్నారు.  ప్రజలు వీటి గురించి తెలుసుకున్నారని, ఈ ప్రయత్నాలకు తోడ్పడుతున్నారని,  దాని ఫలితంగా మనం ఇళ్లలో వేరుగా ఉంచడాన్ని సమర్ధవంతంగా నిర్వహించడంలో విజయం సాధించమనై అన్నారు.  ఆరోగ్య సేతు ఉపయోగాన్ని గురించి ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.   మొదటి 72 గంటల్లో కేసులను గుర్తించగలిగితే వైరస్ వ్యాప్తిని మందగించవచ్చని నిపుణులు చెప్పారని ఆయన వెల్లడించారు.  అందువల్ల రోగులతో కలసిన వారిని 72 గంటల్లో గుర్తించి,  పరీక్షలు జరపాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.  మనం చేతులు కడుక్కోవడం, మనిషికి మనిషికి మధ్య రెండు గజాల దూరం, ముఖానికి మాస్కు ధరించడం వలె  దీనిని  ఒక మంత్రం లాగా పాటించాలని ఆయన అన్నారు.  

ఢిల్లీ ఆ చుట్టుపక్కల రాష్ట్రాల వ్యూహం

ఢిల్లీ, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలతో కలసి మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కోవడానికి దిశా నిర్దేశం చేయడంలో హోమ్ మంత్రి అనుభవాన్ని ప్రధానమంత్రి వివరించారు    కంటెయిన్మెంట్   జోన్లను వేరుచేయడం మరియు  వ్యాధి సంక్రమితులను  ముఖ్యంగా  ఎక్కువ ముప్పు ఉన్న వారిని వేరుగా ఉంచడంపై ప్రత్యేక దృష్టిని  కేంద్రీకరించడం ఆ వ్యూహంలో ప్రధాన అంశాలని ఆయన అన్నారు. ఆ చర్యల ఫలితాలు మన ముందున్నాయి.  దానికి తోడు ఆసుపత్రుల యాజమాన్యానికి మెరుగైన చర్యలు మరియు ఐ సి యు పడకల పెంపు వంటివి సహాయపడ్డాయి.  

ముఖ్యమంత్రుల స్పందన

తమ తమ రాష్ట్రాలలో వాస్తవ పరిస్థితుల గురించి ముఖ్యమంత్రులు ప్రతిసృష్టి ఇచ్చారు. మహమ్మారిని అదుపుచేయడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో విజయవంతంగా పర్యవేక్షణ  చర్యలు తీసుకుంటున్నందుకు వారు ప్రధానమంత్రి నాయకత్వాన్ని ప్రశంసించారు.  నిరంతర మార్గదర్శకత్వం మరియు తోడ్పాటును అందిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.  పరీక్షల పెంపు, టెలి మెడిసిన్ వినియోగం మరియు ఆరోగ్య సేవల మౌలిక సదుపాయాల పెంపు తదితర అంశాల గురించి మాట్లాడారు.  దేశంలో సమగ్ర వైద్యం అందించడానికి  మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సూచించారు.  

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ)  ప్రశంస

వైరస్ పై పోరాటంలో ప్రభుత్వం సాధ్యమైనంత చేస్తోందని రక్షణ మంత్రి ఉద్ఘాటించారు.  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను  ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించిందని  ఆయన అన్నారు.  

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ దేశంలో కోవిడ్ కేసుల తీరుపై  స్థూలంగా సమీక్షించారు.  కొన్ని రాష్ట్రాలలో కేసుల వృద్ధి రేటు  జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని,   ఆ రాష్ట్రాలు తమ రాష్ట్రంలో ఉన్న పరీక్షా సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించుకుని పరీక్షలు జరపాలని కోరారు.   మరణాల సంఖ్యను ఖచ్చితంగా వెల్లడించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు,  స్థానికులు, సామాజిక వర్గాల సహాయంతో కంటెయిన్మెంట్ జోన్లను పర్యవేక్షించాలని ఆయన  కోరారు.  

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి,  ఆరోగ్య శాఖ మంత్రి , హోమ్ శాఖ సహాయ మంత్రి కూడా చర్చలో పాల్గొన్నారు.



(Release ID: 1645136) Visitor Counter : 226