వ్యవసాయ మంత్రిత్వ శాఖ

సేంద్రీయ రైతుల సంఖ్యలో భారతదేశం మొదటి స్థానంలో, సేంద్రీయ వ్యవసాయం కింద విస్తీర్ణంలో తొమ్మిదవ స్థానంలో ఉంది; భారతదేశం నుండి ప్రధానంగా ఎగుమతి అయ్యే సేంద్రీయ ఎగుమతులు అవిసె గింజలు, నువ్వులు, సోయాబీన్, టీ, ఔషధ మొక్కలు, బియ్యం, పప్పుధాన్యాలు

రిటైల్, బల్క్ కొనుగోలుదారులతో రైతులను నేరుగా అనుసంధానించడానికి సేంద్రీయ ఈ-కామర్స్ వేదిక బలోపేతం అవుతోంది

ఆరోగ్యం, పోషకాహారం కోసం సేంద్రీయ ఆహారం # ఆత్మ నిర్భర్ కృషి

Posted On: 13 AUG 2020 4:03PM by PIB Hyderabad

సేంద్రీయ వ్యవసాయం వృద్ధి ప్రస్థానం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతున్న డిమాండ్‌తో మొదలైంది. కోవిడ్ మహమ్మారితో బాధపడుతున్న ప్రపంచంలో, ఆరోగ్యకరమైన, సురక్షితమైన ఆహారం కోసం అవసరాలు పెరుగుతున్నాయి. ఇది మన రైతులు, వినియోగదారులు, పర్యావరణానికి కూడా పరస్పరం ప్రయోజనకారిగా మారబోతోంది. 

సేంద్రీయ రైతుల సంఖ్యలో భారతదేశం మొదటి స్థానంలో, సేంద్రీయ వ్యవసాయం కింద విస్తీర్ణంలో తొమ్మిదవ స్థానంలో ఉంది. సిక్కిం పూర్తిగా సేంద్రీయంగా మారిన మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించింది, త్రిపుర, ఉత్తరాఖండ్ సహా ఇతర రాష్ట్రాలు ఇలాంటి లక్ష్యాలనే నిర్దేశించాయి. ఈశాన్య భారతదేశం సాంప్రదాయకంగా సేంద్రీయంగా ఉంది, రసాయనాల వినియోగం దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే చాలా తక్కువ. అదేవిధంగా గిరిజన, ద్వీప భూభాగాలు వారి సేంద్రీయ ప్రస్థానాన్ని కొనసాగించడానికి కృషి జరుగుతోంది. 

సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబించడానికి, ప్రీమియం ధరల కారణంగా వేతనాలను మెరుగుపర్చడానికి రైతులకు సహాయం చేయాలనే లక్ష్యంతో, రసాయన రహిత సాగుకు ప్రోత్సహించడానికి మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ (ఎంఓవిసిడి), పరంపరగత్ కృషి వికాస్ యోజన (పికెవివై) అనే రెండు ప్రత్యేక కార్యక్రమాలు 2015 లో ప్రారంభించాయి. దీనితో పాటు వ్యవసాయ-ఎగుమతి విధానం 2018 ఇచ్చిన ప్రోత్సాహంతో, ప్రపంచ సేంద్రీయ మార్కెట్లలో భారతదేశం ప్రధాన పాత్ర పోషించగలదు. భారతదేశం నుండి ప్రధాన సేంద్రీయ ఎగుమతులు అవిసె గింజలు, నువ్వులు, సోయాబీన్, టీ, ఔషధ మొక్కలు, బియ్యం, పప్పుధాన్యాలు.  ఇవి 2018-19లో సేంద్రీయ ఎగుమతుల్లో దాదాపు 50% పెరుగుదలకు దోహదపడ్డాయి, ఇది 5151 కోట్ల రూపాయలను తాకింది. అస్సాం, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ నుండి యుకె, యుఎస్ఎ, స్విజర్లాండ్, ఇటలీలకు ఎగుమతులను ప్రారంభించడం వల్ల ఆరోగ్యకర ఆహారాలకు డిమాండ్ పెరిగేకొద్దీ పరిమాణాన్ని పెంచడం, కొత్త గమ్యస్థానాలకు విస్తరించడం ద్వారా సామర్థ్యాన్ని నిరూపించారు.

వినియోగదారునికి విశ్వాసాన్ని కలిగించడానికి సేంద్రీయ ఉత్పత్తులలో ధృవీకరణ ఒక ముఖ్యమైన అంశం. పికెవివై, ఎంఓవిసిడి రెండూ దేశీయ, ఎగుమతి మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని భాగస్వామ్య హామీ వ్యవస్థ (పిజిఎస్), నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్‌పిఓపి) కింద ధృవీకరణను ప్రోత్సహిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఆర్గానిక్ ఫుడ్స్) రెగ్యులేషన్స్, 2017 ఎన్‌పిఓపి, పిజిఎస్ ప్రమాణాలపై ఆధారపడి ఉన్నాయి. ఉత్పత్తుల సేంద్రీయ ప్రామాణికతను స్థాపించడానికి వినియోగదారుడు ఉత్పత్తులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ, జైవిక్ భారత్ / పిజిఎస్ ఆర్గానిక్ ఇండియా లోగోలను చూడాలి. రసాయన రహిత ఉత్పత్తులకు పిజిఎస్ గ్రీన్ ఇవ్వబడుతుంది, ఇది 3 సంవత్సరాలు పడుతుంది.

సుమారు 7 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పికెవివై కింద 40,000 క్లస్టర్లకు సహాయం చేస్తున్నారు.  ఎంఓవిసిడి  తన పరిథిలోకి 160 ఎఫ్పిఓ లను 80,000 హెక్టార్లలో సాగు చేసింది. ఈ సమూహాలు స్థిరంగా మారడానికి, ఇకపై మార్కెట్ నేతృత్వంలోని ఉత్పత్తి కాంట్రాక్ట్ ఫార్మింగ్ మోడ్‌లో ప్రారంభం కావడం చాలా ముఖ్యం, తద్వారా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మార్కెట్ ఉంటుంది, పరిశ్రమ కూడా అవసరమైనప్పుడు కావలసిన నాణ్యత, పరిమాణాన్ని పొందుతుంది. ఫైటో పదార్థాల పరిశ్రమలతో సహా పెద్దమొత్తంలో కొనుగోలుదారులతో ఇది సరైన ఆసక్తితో కొనసాగుతోంది. అల్లం, పసుపు, నల్ల బియ్యం, సుగంధ ద్రవ్యాలు, పోషక తృణధాన్యాలు, పైనాపిల్స్, ఔషధ మొక్కలు, బక్వీట్, వెదురు రెమ్మలు మొదలైన వస్తువుల సరఫరా ఈశాన్య ప్రాంతాల నుండి ముఖ్యంగా మేఘాలయ నుండి మదర్ డైరీ, మణిపూర్ నుండి రేవంతా ఫుడ్స్, బిగ్ బాస్కెట్ ప్రారంభమయ్యాయి. 

భారతదేశంలో మహమ్మారి తాకినప్పుడు, ఆరోగ్యానికిచ్చినంత ప్రాధాన్యతను నాణ్యమైన ఆహారాన్ని పొందడానికి ఇచ్చింది. మండిల ఒత్తిడి తగ్గించడానికి ప్రత్యక్ష మార్కెటింగ్‌కు మద్దతు ఇవ్వడంపై రాష్ట్రాలకు చేసిన సలహాలు చట్టాలను సవరించడానికి దారితీశాయి, తద్వారా రైతులకు మార్కెట్ ఎంపికలను అవకాశం వచ్చింది. లాజిస్టిక్స్ లో  అంతరాయం, సాధారణ మార్కెట్లకు ప్రాప్యత, డిమాండ్ తగ్గడంతో పలు రాష్ట్రాలు ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్నాయి. కోహిమాకు చెందిన గ్రీన్ కారవాన్ నాగాలాండ్ లోని అన్ని గ్రామాల నుండి కూరగాయలు, హస్తకళలు, చేనేత వస్త్రాలు (www.instamojo.com) కోసం పట్టణ ప్రాంతాలకు మార్కెట్ అనుసంధానాలను సమకూర్చింది. మహారాష్ట్రలోని ఎఫ్‌పిఓలు ఆన్‌లైన్‌లో పండ్లు, కూరగాయల అమ్మకం, పంజాబ్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ వ్యాన్లలో డోర్‌స్టాప్ డెలివరీ జరిగింది. 

సేంద్రీయ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం www.jaivikkheti.in ని రైతులు, రిటైల్‌తో పాటు పెద్దమొత్తంలో కొనుగోలుదారులతో నేరుగా అనుసంధానించడానికి బలోపేతం చేస్తున్నారు. మహమ్మారి కాలంలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఒక పెద్ద ఊతంగా ఉంది. లాజిస్టిక్స్ మొదలైన వాటిపై ఖర్చులను ఆదా చేయడం, నాణ్యత సమాచార భాగస్వామ్య పై ఏ విధంగానూ రాజీ పడటం లేదు. వాస్తవానికి, వీడియో కాన్ఫరెన్సింగ్, వెబి‌నార్లు ఈ రంగంలో ఇంకా చాలా మందితో అనుసంధానమయ్యేలా చేస్తాయి, వారి పనులలో అంతరాయం పెద్దగా ఉండదు. ఇది భౌతిక సమావేశాలలో సాధ్యం కాదు. ఉత్పాదకత, సమగ్ర పోషకాలు, తెగుళ్ల నిర్వహణ,  వీటి వల్ల  రైతుల ఆదాయంలో పెరుగుదల కోసం ఐసిఎఆర్ అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మోడళ్లపై వెబినార్‌లో కూడా ఎన్ఇఆర్ రాష్ట్రాలు పాల్గొన్నాయి. కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి, రాష్ట్రాలు, ప్రాంతీయ కౌన్సిల్‌లతో సంభాషణలను బలోపేతం చేయడానికి వీడియో సమావేశాలు జరుగుతున్నాయి, ఈ ప్రక్రియలో రైతులు / రైతు సమూహాల నుండి ప్రత్యక్ష సేకరణ కోసం కొత్త భాగస్వామ్యాలు ఏర్పడుతున్నాయి.

ప్రకృతి వ్యవసాయం భారతదేశంలో కొత్త భావనేమి  కాదు, రైతులు రసాయనాలను ఉపయోగించకుండా తమ భూమిని పండించడం - ప్రాచీన కాలం నుండి ఎక్కువగా సేంద్రీయ అవశేషాలు, ఆవు పేడ, కంపోస్టులు మొదలైన వాటిపై ఆధారపడటం వస్తూనే ఉంది. నేల, నీరు, సూక్ష్మజీవులు, 'వ్యర్థ' ఉత్పత్తులు, అటవీ, వ్యవసాయం అనే మూలకాల సమైక్య సేంద్రీయ వ్యవసాయానికి అంతర్లీనంగా ఉన్న భావన.  ఇది సహజ వనరుల స్థిరమైన ఉపయోగం కోసం మేలి కలయిక,  ఆహార భద్రత, మెరుగైన పోషణను సాధించడం, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం’ లక్ష్యంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యం దిశగా ఉంటుంది. 

అందువల్ల అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తిదారులపై ఎక్కువ అవగాహన మరియు సామర్థ్యాన్ని పెంపొందించడంతో, భారతీయ సేంద్రీయ రైతులు త్వరలో ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో పటిష్టమైన స్థానాన్ని సంపాదించుకోనున్నారు. 

****



(Release ID: 1645634) Visitor Counter : 444