ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ మరణాలు భారత్ లో అతి తక్కువ స్థాయిలో 2% లోపు

కోలుకుంటున్నవారి శాతం పైపైకి, నేటికి దాదాపు 72%

3 కోట్లకు దగ్గరగా కోవిడ్ పరీక్షలు

Posted On: 16 AUG 2020 12:40PM by PIB Hyderabad

కోవిడ్ మరణాల శాతం బాగా తగ్గుముఖం పట్టటంతో భారత దేశం అంతర్జాతీయంగా తక్కువశాతం మరణాలు నమోదైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. కోవిడ్ పాజిటివ్ కేసుల్లో నేటికి మరణాల శాతం 1.93% గా నమోదైంది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమన్వయంతో చేసిన కృషి ఫలితంగా ఇది సాధ్యమైంది.

అమెరికాలో 23 రోజుల్లో 50,000కు పైగా మరణాలు నమోదు కాగా, బ్రెజిల్ లో 95 రోజుల్లోను, మెక్సికోలో 141 రోజుల్లోను ఆ స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. భారత్ లో జాతీయ స్థాయిలో ఆ సంఖ్య చేరుకోవటానికి 156 రోజులు పట్టింది.

Image


కేంద్ర ప్రభుత్వంతోబాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్థిరమైన చర్యలు చేపడుతూ,  ఆస్పత్రులలో సమర్థమైన చికిత్స, ఇళ్ళలో ఐసొలేషన్ లో ఉన్నవారి పర్యవేక్షణ, ఆక్సిజెన్ సహాయం, ఆంబులెన్స్ ల సేవలు మెరుగుపరచటం, సకాలంలో ఆస్పత్రులకు తరలించటం, తగిన చికిత్స అందించటం ద్వారా మరణాలను తగ్గించగలిగాయి. ఆశా వర్కర్ల అవిరళ శ్రమతో నిఘా పెట్టి బాధితులను గుర్తించటం, ఇళ్ళలో ఉన్నవారిని పరామర్శించటం సులువుగా మారింది న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు ఎప్పటికప్పుడు టెలీ కన్సల్టేషన్స్ ద్వారా కోవిడ్ చికిత్స చేసే డాక్టర్లకిచ్చే విలువైన సూచనలు చికిత్సకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వీటన్నిటి ఉమ్మడి ఫలితంగానే బాధితులకు తగిన చికిత్స అందింది. పాజిటివ్ కేసులలో సగటు మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు తక్కువ స్థాయిలో కొనసాగటానికి  ఇది కారణమైంది.

"దూకుడుగా పరీక్షించటం,  సమగ్రంగా ఆనవాలు పట్టటం, సమర్థవంతమైన చికిత్స అందించటం" అనే త్రిముఖ వ్యూహం  ఆశించిన ఫలితాలనిస్తోంది. దీనివల్లనే కోలుకున్నవారి శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. దేశంలో  కోలుకున్నవారి శాతం 72 కు చేరింది. దీన్ని బట్టి కోలుకుంటున్నవారు పెరుగుతున్నట్టు స్పష్టమవుతూ ఉంది.  గడిచిన 24  గంటల్లో 53,322  మంది కోలుకొని ఇళ్ళకు చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 18,62,258 కు చేరింది.



అలా కోలుకుంటున్నవారు పెరుగేకొద్దీ చికిత్స అందించాల్సినవారి సంఖ్య కూడా తగ్గుతూ ఉంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 6,77,444 కాగా అది నేడు మొత్తం పాజిటివ్ కేసుల్లో 26.16% గా నిలిచింది. గడిచిన 24 గంటల్లో కూడా తగ్గుముఖంలోనే కొనసాగుతున్నట్టు ఈ సంఖ్య సూచిస్తోంది. వీరందరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

సమర్థంగా, దూకుడుగా పరీక్షలు చేపట్టటం వలన భారత్ 3 కోట్ల కోవిడ్ పరీక్షలకు చేరువవుతూ ఉంది. ఇప్పటివరకూ 2,93,09,703 శాంపిల్స్ పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో 7,46,608  పరీక్షలు జరిగాయి.

దేశవ్యాప్తంగా పరీక్షల నెట్ వర్క్ పెంచటం ద్వారా ఇదంతా సాధ్యమైంది. ఈరోజుకు లాబ్ ల సంఖ్య మొత్తం1469 కి చేరుకోగా అందులో 969  ప్రభుత్వం ఆధ్వర్యంలోను, 500  లాబ్ లు ప్రైవేట్ రంగంలోను ఉన్నాయి. 


రకరకాల లాబ్ ల వివరాలు ఇలా ఉన్నాయి: 


తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ :  754 (ప్రభుత్వ:  450  + ప్రైవేట్:  304)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 598  (ప్రభుత్వ: 485+ ప్రైవేట్: 113)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 117 (ప్రభుత్వ: 34  + ప్రైవేట్ 83 )


కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి


కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

***



(Release ID: 1646294) Visitor Counter : 242