రైల్వే మంత్రిత్వ శాఖ

రైల్వేల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి డిసెంబర్ 15 నుంచి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు


Posted On: 05 SEP 2020 6:59PM by PIB Hyderabad

ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం, ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ నుంచి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను రైల్వేలు నిర్వహించనున్నాయి.

మూడు రకాల ఉద్యోగాల కోసం భారతీయ రైల్వేలు ప్రకటనలు ఇచ్చాయి. గార్డులు, ఆఫీస్‌ క్లర్కులు, కమర్షియల్‌ క్లర్కులు వంటి నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీల్లో (ఎన్‌టీపీసీ) 35,208 ఖాళీలు; స్టెనో, టెకీ వంటి పోస్టుల కోసం 1,663 ఖాళీలు; ట్రాక్‌ నిర్వాహకులు, పాయింట్‌మన్‌ వంటి లెవెల్‌-1 విభాగంలో 1,03,769 ఖాళీల భర్తీకి ప్రకటనలు ఇచ్చాయి. ఈ మూడు విభాగాల్లో అన్ని ఆర్‌ఆర్‌బీలు కలిపి 1.4 లక్షల ఖాళీల భర్తీకి ప్రకటనలు ఇవ్వగా, 2.4 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ఈ ఖాళీల భర్తీకి నిర్వహించాల్సిన కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేశారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయినా, పరీక్షలు మాత్రం జరగలేదు.

జేఈఈ, నీట్‌ జరుగుతున్న నేపథ్యంలో, ఆర్‌ఆర్‌బీలు కూడా పరీక్షల నిర్వహణకు మొగ్గు చూపుతున్నాయి. ఇందుకోసం ప్రామాణిక కార్యాచరణ విధానాలను రూపొందిస్తున్నాయి. అభ్యర్థుల భద్రత దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన సామాజిక దూరం వంటి నిబంధనలు పాటించడం తప్పనిసరి. డిసెంబర్‌ 15వ తేదీ నుంచి మొదటి దశ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన రైల్వేలు, ఆ దిశగా కసరత్తు ఏర్పాట్లు చేస్తున్నాయి.

****


(Release ID: 1651689)