వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఆహార ద్రవ్యోల్బణం

Posted On: 15 SEP 2020 6:53PM by PIB Hyderabad

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ క్రోడీకరించిన వినియోగదారుల ధరల సూచిక ప్రకారం, 2019 సెప్టెంబర్‌లో 5.1 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం, అదే ఏడాది డిసెంబర్‌ నాటికి 14.12 శాతానికి పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 13.63 శాతంగా నమోదైంది. తాజా లెక్కల ప్రకారం, జులైలో ఇది 9.62 శాతం (తాత్కాలికం)గా ఉంది. ఏటికేడు ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతోంది.

    అత్యవసర ఆహార పదార్థాల ధరలను స్థిరీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ చర్యలు తీసుకుంటోంది. దేశీయంగా ఆహార పదార్థాల లభ్యత పెంచడానికి, ధరలకు కళ్లెం వేయడానికి.. దిగుమతి సుంకం, కనీస ఎగుమతి ధర, ఎగుమతి నియంత్రణల వంటి వాణిజ్య, ఆర్థిక విధాన సాధనాలను సందర్భానుసారంగా ఉపయోగిస్తోంది. ఉత్పత్తులను పెంచేలా రైతులను ప్రోత్సహించడానికి కనీస మద్దతు ధరలను పెంచింది. ఉద్యాన పంటల సమీకృత అభివృద్ధి మిషన్; జాతీయ ఆహార భద్రత మిషన్‌; నూనె గింజలు, ఆయిల్‌ పామ్‌ జాతీయ మిషన్ వంటి పథకాలను అమలు చేస్తోంది. పప్పుధాన్యాలు, ఉల్లి, బంగాళాదుంప వంటి వ్యవసాయ, ఉద్యాన పంటల ధరల్లో అస్థిరతను నియంత్రించడానికి 'ధరల స్థిరీకరణ నిధి' (పీఎస్‌ఎఫ్‌)ని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

    కొవిడ్‌-19 ఆర్థిక ప్రతిస్పందనలో భాగంగా, ఆహార ధాన్యాలను ఒక్కొక్కరికి నెలకు 5 కేజీలు, పప్పుధాన్యాలను కుటుంబానికి కిలో చొప్పున ఉచితంగా కేంద్రం పంపిణీ చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కిందకు వచ్చే ప్రతి ఒక్కరికి, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ఏప్రిల్‌-నవంబర్‌కు వరకు ఈ ఉచిత రేషన్‌ అందింది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కిందకు రాని వలస కూలీలకు.., ఆహార ధాన్యాలను ఒక్కొక్కరికి నెలకు 5 కేజీలు, పప్పుధాన్యాలను కుటుంబానికి కిలో చొప్పున ఉచితంగా ఏప్రిల్‌, మే నెలల్లో పంపిణీ జరిగింది. పీఎంజీకేఏవై, ఏఎన్‌బీ కింద చేపట్టిన ఆహార, పప్పుధాన్యాల ఉచిత పంపిణీ.. లాక్‌డౌన్‌ సమయంలో ఆహార భద్రతకు, ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి తోడ్పడింది.

    కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీ దాన్వేరావ్‌ సాహెబ్‌ దాదారావ్‌, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు సమర్పించారు.

 

***


(Release ID: 1654774)
Read this release in: English