ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారుల శిక్షణలో మౌలిక మార్పు
ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులకోసం సార్వత్రిక శిక్షణా కార్యక్రమం.
నియామకం, మధ్యంతర స్థాయి శిక్షణ, పర్యవేక్షణలకు సంబంధించి సార్వత్రిక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్ధిక శాఖ మంత్రి
Posted On:
01 OCT 2020 5:17PM by PIB Hyderabad
ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారుల కోసం నిర్వహించే సార్వత్రిక శిక్షణా కార్యక్రమాన్ని ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమం నియామకం, మధ్యంతర స్థాయి శిక్షణ, పర్యవేక్షణలో లోపాలు దొర్లకుండా వుండడానికి (విజిలెన్స్) సంబంధించి వుంటుంది. విర్చువల్ పద్ధతిలో సాగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన విజిలెన్స్ కమిషనర్ శ్రీ సంజయ్ కొఠారి, భారతీయ బ్యాంకుల సంఘం నేతలు, పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర విజిలెన్స్ కమిషనత్ పాటు ఈ రంగానికి సంబంధించిన పలువురు ముఖ్యులతో సంప్రదింపులు చేసిన తర్వాతనే ఈ శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించారు. భారతీయ బ్యాంకుల్లో అధికారులుగా చేరే వారికి , అధికారులుగా చేరి బాధ్యతలు నిర్వహిస్తూ మధ్యలో శిక్షణ అవసరమయ్యేవారికి ఈ సార్వత్రిక శిక్షణా వ్యవస్థ ద్వారా ప్రమాణాలతో కూడిన శిక్షణ లభిస్తుంది. విజిలెన్స్ కేసుల్లో బైటకొస్తున్న తప్పులు జరగకుండా వుండేందుకుగాను సమగ్రమైన పద్ధతిలో బ్యాంకుల నియమ నిబంధనల్ని అర్థం చేసుకోవడానికి వీలుగా బ్యాంకు అధికారులకు ఈ శిక్షణ ఇస్తారు.
ఈ నూతన సార్వత్రిక శిక్షణా కార్యక్రమంద్వారా బ్యాంకు అధికారులు తమ కార్యకలాపాల నిర్వహణను సక్రమంగా చేసుకోగలుగుతారని ఆశిస్తున్నట్టు ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. నియమ నిబంధనలపట్ల అవగాహన లేకపోవడంవల్ల విజిలెన్స్ లో బైటపడుతున్న తప్పులు ఇక ముందు జరగకుండా వుంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శిక్షణ ద్వారా యువ అధికారులకు నాయకత్వ లక్షణాలు అలవడతాయని భావిస్తున్నట్టు ఆమె అన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంవల్ల బ్యాంకు వినియోగదారులకు కూడా ప్రయోజనం వుంటుందని బ్యాంకుల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా వుంటే ప్రజలు సరైన బ్యాంకు సేవలు పొందగలుగుతారని ఆర్ధిక మంత్రి వివరించారు. బ్యాంకుల యాజమాన్యాలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీమతి నిర్మలా సీతారామన్ కోరారు.
****
(Release ID: 1661240)
Visitor Counter : 155