ఆయుష్

ఆయుష్ వాణిజ్యం, పరిశ్రమల సంయుక్త సమీక్షను రేపు నిర్వహించనున్న - పియుష్ గోయెల్ మరియు శ్రీపాద్ నాయక్


Posted On: 03 DEC 2020 4:57PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాల నేపథ్యంలో, ఆయుష్ వాణిజ్య, పరిశ్రమల ప్రస్తుత పరిస్థితులపై, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయెల్, కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్, 2020 డిసెంబర్, 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు, దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించనున్నారు.

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆయుష్ ఆధారిత వ్యాధి-నివారణ పరిష్కారాలపై పెరుగుతున్న ప్రపంచ ఆసక్తి నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు.  ఇంతకు ముందు, ఇద్దరు మంత్రులు నిర్వహించిన, ఆయుష్ వాణిజ్యం మరియు పరిశ్రమల సంయుక్త సమీక్షా సమావేశం, 2020 ఏప్రిల్, 9వ తేదీన జరిగింది.  ఆ తర్వాత, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ వైద్య విధానం ద్వారా కోవిడ్-19 నుండి ప్రజలను రక్షించే ప్రయత్నాల్లో భాగంగా మరియు వారికి విజయవంతంగా చికిత్స చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది.   కోవిడ్ -19 నిర్వహణ కోసం ఆయుర్వేదం, యోగా ఆధారంగా సకాలంలో సలహాలు, కోవిడ్ అనంతర నిర్వహణ మరియు జాతీయ వైద్య చికిత్సా నిర్వహణకు అనుసరించవలసిన నియమనిబంధనలను జారీ చేయడం ద్వారా మరియు క్రియాశీల విధాన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మంత్రిత్వ శాఖ దీనిని సాధించింది.  కోవిడ్-19 నుండి తమను తాము రక్షించుకోవడానికి ఆయుష్ వైద్య విధానాన్ని ఉపయోగించమని ప్రజలను ప్రోత్సహించడానికీ, వ్యాధి-నివారణ చర్యలను అవలంబించాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయడానికీ,   మంత్రిత్వ శాఖ భారీ ప్రచార కార్యక్రమాలను చేపట్టింది.

ప్రజలు ఆయుష్ ఆధారిత రోగనిరోధక పరిష్కారాలను పెద్ద ఎత్తున స్వీకరించినట్లు ఆధారాలు ఉన్నాయి.  భారతదేశంలో పెద్ద ఎత్తున ఆయుష్ పద్ధతులు మరియు తక్కువ స్థాయి కోవిడ్ -19 మరణాల మధ్య పరస్పర సంబంధం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి.  ఇవన్నీ భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాలలో ఆయుష్ విభాగాల ఆధారంగా ఆరోగ్యం మరియు సంరక్షణ పరిష్కారాలను పెంచడానికి దోహదపడ్డాయి.  అందువల్ల, ఈ పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి వీలుగా, ఆయుష్ వాణిజ్య, పరిశ్రమల రంగాలు సన్నద్ధం కావలసిన అవసరం ఉంది.

ఆయుష్ మంత్రిత్వ శాఖ తీసుకున్న విధాన కార్యక్రమాలలో, విజ్ఞానశాస్త్రానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన పరిశోధకులతో పాటు ఆయుష్ వైద్యులు కోవిడ్ -19 పై ఆయుష్ వైద్య విధానం ద్వారా పరిశోధనలు చేయటానికి మరియు లాక్ డౌన్ వ్యవధిలో కూడా ఆయుష్ పరిశ్రమ పని చేయడానికి వీలు కల్పించే చర్యలు ఉన్నాయి.  ఆయుష్ మంత్రిత్వ శాఖ తీసుకున్న వివిధ కార్యక్రమాల ద్వారా, భారతదేశంతో పాటు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఆయుర్వేద ఔషధం కోసం అపూర్వమైన డిమాండ్ లభించింది.  ఆయుష్ వాణిజ్యం, దేశీయ స్థాయిలో డిమాండ్ ఎంత పెరిగింది మరియు ఆయుష్ ప్రమోషన్ కోసం భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడానికి మంత్రులు ఇద్దరూ పరిశ్రమ నాయకులతో సంప్రదించనున్నారు.

***


(Release ID: 1678140)