రాష్ట్రప‌తి స‌చివాల‌యం

న్యాయ వ్యవస్థ యొక్క లక్ష్యం వివాదాలను పరిష్కరించడం మాత్రమే కాదు, న్యాయాన్ని నిలబెట్టాలి కూడా; న్యాయాన్ని నిలబెట్టడానికి ఒక మార్గం న్యాయం ఆలస్యం కావడం వంటి అవరోధాలను తొలగించడం : రాష్ట్రపతి కోవింద్


అఖిల భారత రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ల రిట్రీట్‌ను ప్రారంభించిన - భారత రాష్ట్రపతి

Posted On: 06 MAR 2021 2:49PM by PIB Hyderabad

న్యాయ వ్యవస్థ యొక్క లక్ష్యం కేవలం వివాదాలను పరిష్కరించడమే కాదు, న్యాయాన్ని సమర్థించడం కూడా అనీ, న్యాయం అందించడంలో ఆలస్యం వంటి అడ్డంకులను తొలగించడం ద్వారా దీనిని అమలు చేయవచ్చుననీ, భారత రాష్ట్రపతి, శ్రీ రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ రోజు, అంటే, 2021 మార్చి నెల 6వ తేదీన, మధ్యప్రదేశ్ ‌లోని జబల్పూర్ ‌లో జరిగిన "ఆల్ ఇండియా స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్స్ రిట్రీట్" ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

న్యాయ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం వేగంగా పెరిగిందని రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో 18,000 కి పైగా న్యాయస్థానాలను కంప్యూటరీకరించడం జరిగింది. లాక్-డౌన్ కాలంతో సహా, 2021 జనవరి వరకు, దేశవ్యాప్తంగా సుమారు 76 లక్షల కేసులను దృశ్యమాధ్యమం ద్వారా విచారించడం జరిగింది. జాతీయ జ్యుడిషియల్ డేటా గ్రిడ్, యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్, క్యూ.ఆర్. కోడ్ వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాయని ఆయన అన్నారు. ఈ-కోర్టులు, వీడియో కాన్ఫరెన్సులు, ఈ-ప్రొసీడింగులు, ఈ-ఫైలింగులు, ఈ-సేవా కేంద్రాల సహాయంతో, న్యాయ పరిపాలనకు న్యాయం చేయడం సులభమయ్యింది. ఈ సాంకేతిక జోక్యం యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే, ఈ కార్యక్రమాల వల్ల, కాగితాల వాడకం తగ్గింది, ఇది సహజ వనరులను పరిరక్షించడంలో సహాయపడుతుంది.

దిగువ న్యాయవ్యవస్థ దేశ న్యాయ వ్యవస్థలో ప్రధాన భాగమని రాష్ట్రపతి పేర్కొన్నారు. మన న్యాయ విద్యా సంస్థలు న్యాయ విద్యార్థులను విజ్ఞాన వంతులైన న్యాయమూర్తులుగా తీర్చి దిద్దడం ద్వారా చాలా ముఖ్యమైన పని చేస్తున్నాయి. మన న్యాయస్థానాల్లో, ముఖ్యంగా జిల్లా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడానికి వీలుగా, న్యాయమూర్తులతో పాటు ఇతర న్యాయ, పాక్షిక-న్యాయ అధికారులకు శిక్షణ ఇచ్చే పరిధిని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

'న్యాయం యొక్క వేగవంతమైన పంపిణీ' అందించడానికి, విస్తృతమైన న్యాయ శిక్షణతో పాటు, మన న్యాయ ప్రక్రియలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా, సమస్యలను సరైన దృక్పథంలో అర్థం చేసుకోవడంతో పాటు, తక్కువ సమయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. కొత్త చట్టాల పరిచయం, వ్యాజ్యం యొక్క స్వభావంలో విస్తృతమైన మార్పుల నేపథ్యంలో, కేసులను సమయానుసారంగా పరిష్కరించుకోవలసిన అవసరంతో పాటు, న్యాయమూర్తులకు చట్టం, న్యాయ విధానాల గురించి అధునాతన పరిజ్ఞానం కలిగి ఉండటం కూడా అత్యవసరమని, ఆయన అభిప్రాయపడ్డారు.

'భారత ప్రజల మైన మనం', న్యాయవ్యవస్థ నుండి అధిక అంచనాలను కలిగి ఉన్నామని, రాష్ట్రపతి పేర్కొన్నారు. న్యాయమూర్తులు - పరిజ్ఞానం, వివేకం, ఆప్యాయతతో, గౌరవప్రదంగా, నిష్పాక్షికంగా ఉండాలని సమాజం ఆశిస్తోందని, ఆయన తెలియజేశారు. న్యాయ వ్యవస్థలో కేసుల సంఖ్య కంటే నాణ్యతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని, ఆయన చెప్పారు. అదేవిధంగా, ఈ అవసరాలను తీర్చడానికి, శిక్షణా విధానాలు, జ్ఞానం, సాంకేతికత, న్యాయ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు ఆధునీకరించడం కూడా చాలా ముఖ్యం. న్యాయమూర్తులపై మన అంచనాకు తగినట్లుగా , ఇండక్షన్ స్థాయి, ఇన్-సర్వీస్ శిక్షణలో కూడా, అవగాహన కల్పించడంలో, రాష్ట్ర న్యాయవ్యవస్థ అకాడమీల పాత్ర చాలా ముఖ్యమైనది.

సుప్రీంకోర్టు తన తీర్పుల అనువాదాలను తొమ్మిది భారతీయ భాషలలో అందుబాటులో ఉంచినందుకు, రాష్ట్రపతి, తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొన్ని హైకోర్టులు కూడా తమ తీర్పుల అనువాదాలను స్థానిక భాషలలో అందిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో పాల్గొన్న వారందరినీ ఆయన అభినందించారు. సుప్రీంకోర్టు మాదిరిగానే ఏకకాలంలో రాష్ట్ర అధికారిక భాషలలో ప్రజా జీవితంలోని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వారి తీర్పుల యొక్క ధృవీకరించబడిన అనువాదాలను అందించాలని, రాష్ట్రపతి, హైకోర్టులను కోరారు.

ప్రతి వ్యక్తికీ చివరి ఆశ్రయం న్యాయవ్యవస్థేనని, రాష్ట్రపతి పేర్కొంటూ, ఇది న్యాయ వ్యవస్థలో ప్రజలు ఆశించే నమ్మకాన్ని సూచిస్తుందని వివరించారు. ఈ నమ్మకాన్ని కొనసాగించడానికి, ఈ వ్యవస్థకు సంబంధించిన ముఖ్య వ్యక్తులుగా మనమందరం ఈ క్రింది అంశాలపై దృష్టి సారించాలి :

  • ప్రజలకు, వారి స్వంత భాషలో, వేగవంతంగా, అందుబాటులో, సరసమైన న్యాయం అందించే లక్ష్యంతో ప్రక్రియలను సరళీకృతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి మనం ఏమి చేయగలం?
  • అదేవిధంగా, మధ్యవర్తిత్వం, రాజీ, సంధి, లోక్ అదాలత్ వంటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థల పరిధిని ఎలా విస్తరించవచ్చు?
  •  హైకోర్టులు మరియు జిల్లా కోర్టుల విచారణలో రాష్ట్ర అధికారిక భాష వాడకాన్ని ఎలా ప్రోత్సహించవచ్చు?
  •  ప్రభుత్వ వ్యాజ్యాల సంఖ్యను తగ్గించడానికి ఏ చర్యలు తీసుకోవచ్చు?

న్యాయ వ్యవస్థ యొక్క లక్ష్యం కేవలం వివాదాలను పరిష్కరించడం మాత్రమే కాదు, న్యాయాన్ని సమర్థించడం కూడా అనీ, న్యాయాన్ని సమర్ధించడానికి, న్యాయం అందించడంలో ఆలస్యం వంటి అడ్డంకులను తొలగించడం ఒక మార్గమనీ, రాష్ట్రపతి అన్నారు. న్యాయం ఆలస్యం కావడానికి, కేవలం న్యాయస్థానం పనితీరు లేదా వ్యవస్థ సరిగా లేకపోవడం మాత్రమే కారణం కాదు. అనేక సందర్భాల్లో, వాది, ప్రతివాదులు దీనిని ఒక వ్యూహంగా ఉపయోగిస్తున్నారు. చట్టాలు, విధానాలు వంటి వాటిలో ఉన్న లొసుగులు ఆధారంగా వారు తరచూ వాయిదా వేయడం ద్వారా విచారణను పొడిగిస్తూ ఉంటారు. న్యాయస్థానాల కార్యకలాపాలు, విధానాలలో ఉన్న ఈ లొసుగులను పరిష్కరించడంలో అప్రమత్తంగా ఉంటూ, న్యాయవ్యవస్థ చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఆవిష్కరణలను అవలంబించడంతో పాటు, ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. రెండు రోజుల ఈ సమావేశంలో న్యాయ పరిపాలన యొక్క అంశాలన్నీ లోతుగా చర్చించబడతాయనీ, కార్యాచరణ అంశాలు నిర్ణయించబడతాయనీ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి ప్రసంగం కోసం ఇక్కడ "క్లిక్" చేయండి

 

*****

 


(Release ID: 1702941)