వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో నిత్యావసర వస్తువుల కొరత లేదు, దేశవ్యాప్తంగా తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయి: కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యహారాల మంత్రి

Posted On: 09 MAY 2025 6:58PM by PIB Hyderabad

దేశంలో నిత్యావసర వస్తువుల కొరత లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి స్పష్టం  చేశారు.

‘‘ప్రస్తుతం మన దగ్గర సాధారణంగా అవసరమయ్యే దాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నిల్వలు ఉన్నాయని హామీ ఇస్తున్నాను. అవి బియ్యం, గోధుమలైనా, శనగ, కంది, ఎర్ర కంది లేదా పెసర లాంటి పప్పుదాన్యాలైనా దేశంలో ఎలాంటి కొరతా లేదు. ఈ విషయంలో పౌరులు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన లేదా ఆహార ధాన్యాలు కొనుగోలు చేయడానికి తొందరపడి మార్కెట్లకు వెళ్లాల్సిన అవసరం లేదు’’ అని మంత్రి చెప్పారు.

తప్పుదారి పట్టించే ప్రకటనల బారిన పడవద్దని కేంద్ర మంత్రి సూచించారు. ‘‘దేశంలో ఆహార నిల్వలకు సంబంధించి ప్రసారమవుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు. మన దగ్గర అవసరాన్ని మించి అధికంగా ఆహార నిల్వలు ఉన్నాయి. ఇలాంటి సందేశాలను పట్టించుకోవద్దు. నిత్యావసర వస్తువుల వ్యాపారంలో పాల్గొనే ట్రేడర్లు, హోల్‌సేలర్లు, రీటైలర్లు, లేదా వ్యాపార సంస్థలు చట్టాలను అమలు చేసే వ్యవస్థలతో సహకరించాలని ఆదేశించాం. ఆహార ధాన్యాలను అక్రమంగా నిల్వ చేసే లేదా పెద్ద మొత్తంలో నిల్వ చేయడానికి ప్రయత్నించే వారిపై నిత్యావసర వస్తువుల చట్టంలోని నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తాం’’ అని ట్వీట్ చేశారు.

బఫర్ ప్రమాణాల ప్రకారం బియ్యం నిల్వలు 135 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) ఉండాలి. కానీ ప్రస్తుతం మన దగ్గర బియ్యం నిల్వలు 356.42 ఎల్ఎంటీ ఉన్నాయి. అదే విధంగా బఫర్ ప్రమాణాల ప్రకారం నిల్వ ఉండాల్సిన గోధుమలు 276 ఎల్ఎంటీలు కాగా ప్రస్తుతం 383.32 ఎల్ఎంటీలు ఉండటం గమనార్హం. అవసరమైన దాని కంటే ఎక్కువ మిగులుతో ఉన్న ఈ నిల్వలు దేశ వ్యాప్తంగా ఆహారభద్రతకు హామీ ఇస్తున్నాయి.

వీటికి అదనంగా ప్రస్తుతం దేశంలో 17 ఎల్ఎంటీల వంట నూనెల నిల్వలు ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో ఉత్పత్తి గరిష్ఠంగా కొనసాగుతున్నందున ఆవనూనె సరిపడినంత అందుబాటులోకి వస్తుంది. ఇది వంట నూనె సరఫరాలో ఇబ్బందులను తొలగిస్తుంది.

79 ఎల్ఎంటీల అదనపు నిల్వలతో ప్రస్తుత చక్కెర సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో ఇథనాల్ ఉత్పత్తి కోసం 34 ఎల్ఎంటీలను మళ్లించిన తర్వాత చక్కెర ఉత్పత్తి 262 ఎల్ఎంటీల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు దాదాపు 257 ఎల్ఎంటీల చక్కెర ఉత్పత్తి అయింది. దేశీయ వినియోగం 280 ఎల్ఎంటీలు, ఎగుమతులు 10 ఎల్ఎంటీలను మినహాయిస్తే.. ఇంకా 50 ఎల్ఎంటీల నిల్వలు ఉంటాయి. ఇది రెండు నెలల వినియోగం కంటే ఎక్కువ. అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా 2025-26 సీజన్లో చక్కెర ఉత్పత్తి అంచనా సైతం ఆశాజనకంగా ఉంది.

 

***


(Release ID: 2128063)