సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
దివ్యాంగులు, వయోవృద్ధుల సులభ వినియోగం దృష్ట్యా సుగమ్య భారత్ యాప్ ను పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం
ప్రభుత్వ పథకాల తాజా సమాచారాన్ని అందించే యాప్, ఏఐ చాట్ బాట్ తో వినియోగదారులకు మరింత చేరువ
Posted On:
27 JUN 2025 11:38AM by PIB Hyderabad
దివ్యాంగులు, వయోవృద్ధులకు సహకారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుగమ్య భారత్ యాప్ ను (ఎస్బీఏ), మరింత మెరుగైన సేవల అందజేత లక్ష్యంగా పునర్వ్యవస్థీకరించారు.
ఇటీవల చేపట్టిన మార్పుల్లో భాగంగా యాప్ లోకి చేరిన సరికొత్త ఫీచర్లు:
· వినియోగదారుల అవసరాలను తక్షణమే గ్రహించి సేవలందించే యాప్... యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ తో నావిగేషన్ మరింత సులభం.
· కృత్రిమ మేధ సాంకేతికత ఆధారంగా పనిచేసే చాట్ బాట్, వినియోగదారులకు తక్షణమే అందుబాటులోకి వచ్చి తగిన సహాయాన్నందిస్తుంది.
· దివ్యాంగులు, వయోవృద్ధులకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక వసతుల సర్క్యులర్లు, ప్రకటనలను అందించే ఏర్పాటు.
· వైకల్యం గల వ్యక్తులకు వివిధ ప్రభుత్వ పథకాలు, ఇతర విలువైన వనరుల ఏకీకృత సేవలు
జూన్ 25 వరకూ యాప్ లో 14,358 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా, ఆండ్రాయిడ్, ఐఓఎస్ వేదికలపై కలిపి, యాప్ 83,791 సార్లు డౌన్లోడయ్యింది... (ఆండ్రాయిడ్ వేదికపై 82,291సార్లు, ఐఓఎస్ వేదికలపై1500 సార్లు). ఆండ్రాయిడ్ డివైజ్ లు (Android devices ) గూగుల్ ప్లే స్టోర్ ద్వారా, ఐఓఎస్ వేదికలు (iOS platforms) ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా సుగమ్య భారత్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సామాజిక న్యాయం, సాధికారతల మంత్రిత్వశాఖలోని దివ్యాంగుల సాధికారత విభాగం (డీఈపీడబ్ల్యూ) 2021లో ప్రారంభించిన సుగమ్య భారత్ యాప్ ద్వారా... ప్రజా సౌకర్యాలు, రవాణా, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ (ఐసీటీ) వ్యవస్థలను చేరుకోవడంలో తమకు ఎదురయ్యే ఇబ్బందులను దివ్యాంగులు, వయోవృద్ధులు వెల్లడించవచ్చు.
సేవలు అందుబాటులోకి రాని విధంగా ఆటంకాలు ఎదుర్కొన్న బాధితులు, ఆ ప్రదేశం తాలూకు జియో-ట్యాగింగ్ చేసిన ఫోటోలను అప్లోడ్ చేయడం ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్ళవచ్చు. దాంతో, అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని దివ్యాంగులకు సహాయపడగలుగుతారు.
ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు యాప్ లో 2,705 ఫిర్యాదులు అందగా, 1,897 ఫిర్యాదులను పరిష్కరించారు. అందరికీ సౌకర్యవంతమైన సమ్మిళిత వాతావరణం కల్పించాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. ఆటంకాలు లేని దేశం సృష్టించాలన్న ప్రభుత్వ ఆశయానికి మద్దతునిచ్చే విధంగా, దివ్యాంగులు, వయోవృద్ధులకు ఆటంకాలు ఎదురైనట్లు తెలిస్తే, సమస్యను వెంటనే అధికారుల దృష్టికి తేవాలని డీఈపీడబ్ల్యూ పౌరులను కోరుతోంది.
****
(Release ID: 2140517)