రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఎంఎస్ఎంఈ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న భారత రాష్ట్రపతి


* దృఢమైన ఎంఎస్ఎంఈ అనుబంధ విస్తారిత వ్యవస్థ ముఖ్యమైందే కాకుండా,
దేశ సుస్థిర ఆర్థిక అభివృద్ధికి కూడా అది అత్యవసరం: రాష్ట్రపతి ముర్ము

Posted On: 27 JUN 2025 2:31PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీలో ఈ రోజు జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొని ప్రసంగించారు.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈస్) దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన స్తంభంగా నిలుస్తున్నాయని రాష్ట్రపతి అభివర్ణించారు. అవి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి గణనీయంగా తోడ్పాటును అందించడంతో పాటు, కింది స్థాయిల్లో నవకల్పనకు దన్నుగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. దృఢమైన ఎంఎస్ఎంఈ అనుబంధ విస్తారిత వ్యవస్థ ముఖ్యమైందే కాకుండా, దేశం సుదీర్ఘకాలం ఆర్థికాభివృద్ధిని సాధించాలన్నా కూడా ఇవి అత్యవసరమని ఆమె అన్నారు. ఈ పరిశ్రమలు తక్కువ ఖర్చుతో మూలధనాన్ని సమకూర్చుకొంటూ గ్రామీణ ప్రాంతాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లోని ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయన్నారు. ఈ విధంగా చూస్తే, ఎంఎస్ఎంఈ రంగం బలహీన వర్గాల వారికి సాధికారతను కల్పించడం ద్వారా వృద్ధి ఫలాలు అందరికీ అందేందుకు తోడ్పడుతూ అభివృద్ధిని వికేంద్రీకరిస్తోందని రాష్ట్రపతి అన్నారు.

దేశం ప్రగతిపథంలో ముందుకు సాగిపోతుండడంలో ఎంఎస్ఎంఈ రంగం ప్రధాన పాత్రను పోషిస్తోందనడంలో ఎలాంటి అనుమానం లేదని రాష్ట్రపతి స్పష్టం చేశారు. అయితే, ఈ రంగం కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటిలో ఆర్థిక వనరుల సమస్య, బడా కార్పొరేషన్లతో పోటీపడాల్సిరావడం, ఆధునిక సాంకేతికత కొరవడడం, ముడిపదార్థాల, చేయి తిరిగిన కార్మికుల పరంగా లోటు, పరిమిత స్థాయి మార్కెట్, చెల్లింపుల్లో జాప్యం.. ఇవి ముఖ్య సవాళ్లు అని ఆమె అన్నారు.

ఎంఎస్ఎంఈలకున్న ప్రాముఖ్యాన్ని, ఎంఎస్ఎంఈల సమస్యలను అర్థం చేసుకున్న భారత ప్రభుత్వం అనేక విధానపరమైన కార్యక్రమాలను చేపట్టిందని రాష్ట్రపతి వివరించారు. వాటిలో ఎంఎస్ఎంఈల వర్గీకరణ ప్రమాణాలను సవరించడం, రుణ లభ్యతను పెంచడం, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏటా జరిపే కొనుగోళ్లలో కనీసం 35 శాతం సూక్ష్మ, చిన్న పరిశ్రమల వద్ద నుంచే కొనుగోలు చేసేలా ప్రోత్సహించడం, పీఎం విశ్వకర్మ యోజనలో భాగంగా చేతివృత్తుల వారికి నైపుణ్యాలను పెంపొందింప చేయడం వంటివి కొన్ని అని ప్రస్తావించారు. నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య చాలా వేగంగా పెరగానికి ఈ ప్రయత్నాలు ఇచ్చిన ఊతాన్ని చూస్తే తనకు సంతోషం కలుగుతోందని ఆమె అన్నారు. వివాదాల పరిష్కారానికి తీసుకువచ్చిన ఆన్‌లైన్ పోర్టల్‌.. చెల్లింపుల్లో జాప్యం జరిగిన సందర్భాల్లో ముఖ్య పాత్రను పోషించగలుగుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
     
ఎంఎస్ఎంఈలు నిలదొక్కుకోవాలంటే నవకల్పన చాలా ప్రధానం. కింది స్థాయిల్లో నవకల్పనను ఎంఎస్ఎంఈలు ప్రోత్సహించినట్లయితే స్థానిక సమస్యలకు, స్థానికంగా ఉండే వనరులతోనే తక్కువ ఖర్చులో పరిష్కారాలను అందించడానికి వీలవుతుందని రాష్ట్రపతి అన్నారు.
 
ఎంఎస్ఎంఈ రంగంలో మహిళల ప్రాతినిధ్యం ఇటీవల కొన్నేళ్లుగా పెరుగుతుండడం చూస్తే సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి మరింత ఎక్కువ మంది మహిళలు ఈ రంగంలోకి రావడం అత్యవసరం అని ఆమె అన్నారు. పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ, స్వయంసమృద్ధిని సాధించుకోవాల్సిందిగా యువతులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
 
భారత్ ఆర్థిక వృద్ధికి ఎంఎస్ఎంఈలు చెప్పుకోదగ్గ స్థాయిలో తోడ్పాటును అందిస్తున్నాయి, అయితే అవి ఇంధనాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవడంతో పాటు ఉద్గారాలకు కూడా కారణమవుతున్నాయని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ రంగంలో గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించాల్సిన తక్షణావసరం ఉందని ఆమె అన్నారు. ఇది ఎంఎస్ఎంఈలు దీర్ఘకాలం కొనసాగగలిగేటట్టు చూస్తూ వాటి పోటీతత్వాన్ని పెంచి,  దేశం నిర్దేశించుకొన్న వాతావరణ లక్ష్యాలను సాధించడంలో సహాయపడగలుగుతుందని రాష్ట్రపతి అన్నారు.

 

Click here to see the President's speech

 

***


(Release ID: 2140518)