ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి వేడుక సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 28 JUN 2025 2:18PM by PIB Hyderabad

ఓం నమః! ఓం నమః! ఓం నమః!

పరమ శ్రాద్ధేయ ఆచార్య శ్రీ ప్రజ్ఞా సాగర్ మహరాజ్, శ్రావణబెళగొళ స్వామి శ్రీ చారుకీర్తి, మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ శ్రీ నవీన్ జైన్, భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ ప్రియాంక్ జైన్, కార్యదర్శి శ్రీ మమతా జైన్‌, ట్రస్టీ పీయూష్‌ జైన్‌, ఇతర విశిష్ట ప్రముఖులు, గౌరవనీయ సాధువులు, సోదరీసోదరులారా... జై జినేంద్ర!

భారత ఆధ్యాత్మిక సంప్రదాయంలో నేటి కీలక ఘట్టానికి మనమంతా ప్రత్యక్ష సాక్షులం. ఇందులో భాగంగా గౌరవనీయ ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ శతజయంతి వేడుక సహా ఆయన నిత్య ప్రేరణాత్మక పవిత్రోత్సవం, ఉత్తేజపూర్వక ఆధ్యాత్మిక కార్యక్రమం సంయుక్తంగా ఒక అద్భుత స్ఫూర్తిదాయక వాతావరణం సృష్టించాయి. ఈ వేడుకలకు ప్రత్యక్షంగా హాజరైన వారితోపాటు లక్షలాది ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా మనతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా మీకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వేడుకలలో భాగస్వామినయ్యే అవకాశం ఇచ్చినందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు అర్పిస్తున్నాను.

మిత్రులారా!

   మరో విధంగానూ ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 1987లో ఇదే రోజున (జూన్ 28) ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్‌కు ‘ఆచార్య’ బిరుదు ప్రదానోత్సవం నిర్వహించారు. అది ఒక బిరుదుకు పరిమితం కాదు- ఆలోచన, నిగ్రహం, కరుణతో జైన సంప్రదాయాన్ని అనుసంధానించే పవిత్ర స్రవంతి. నేడు మనం ఆయన శత జయంతి వేడుక నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఆనాటి చారిత్రక ఘట్టాన్ని ఈ తేదీ మనకు గుర్తుచేస్తుంది. ఈ సందర్భంగా నేను ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ పాదపద్మాలకు నమస్కరిస్తూ మనందరిపై ఆయన ఆశీస్సులు సదా ప్రసరించాలని ప్రార్థిస్తున్నాను.

మిత్రులారా!

   ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ శత జయంతి వేడుక సాధారణ ఘట్టం కాదు. ఇదొక శకానికి సంబంధించిన జ్ఞాపక సహితం. ఇదొక గొప్ప సన్యాసి జీవితానికి ప్రతీక. ఈ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకోవడంలో భాగంగా ప్రత్యేక స్మారక నాణేలు, తపాలా బిళ్లలను కూడా ఆవిష్కరించాం.  ఇందుకుగాను నా సహ పౌరులందరికీ అభినందనలు. ఆచార్య శ్రీ ప్రజ్ఞా సాగర్ జీకి నా ప్రత్యేక గౌరవ వందనం ఆచరిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ మార్గదర్శకత్వాన నేడు పూజ్య గురువు చూపిన సన్మార్గంలో కోట్లాది అనుయాయులు సహా మనమంతా ముందుకు సాగుతున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీరు నాకు ‘ధర్మ చక్రవర్తి’ బిరుదు ప్రదానం చేయాలని సంకల్పించారు. కానీ, ఈ గౌరవానికి అర్హుడినని నేను భావించడం లేదు. అయితే, రుషుల నుంచి ప్రతిదాన్నీ పవిత్ర ప్రసాదంగా స్వీకరించడం సాంస్కృతికంగా మన నైతిక నియమం. కాబట్టి, ఈ గౌరవాన్ని దైవ ప్రసాదంగా సవినయంగా స్వీకరించి, భరతమాత పాదపద్మాలకు అంకితం చేస్తున్నాను.

మిత్రులారా!

   మనం జీవితాంతం అనుసరించే ఆయన ప్రబోధాలతోపాటు మన హృదయాలు భావోద్వేగపరంగా ఎవరితో ముడిపడి ఉన్నాయో అటువంటి దివ్య పురుషుల గురించి ప్రసంగించడం అనివార్యంగా మనలో ఎంతో ఉద్వేగం కలిగిస్తుంది. అయితే, ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ గురించి మాట్లాడే బదులు, ఇవాళ ఆయన ప్రసంగం వినే అదృష్టం మనకు లభించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. అటువంటి మహనీయుని జీవనయానాన్ని వివరించడానికి మాటలు చాలవు. ఆయన 1925 ఏప్రిల్ 22న కర్ణాటక పవిత్ర భూమిలో జన్మించారు. ఆయనకు ‘విద్యానంద్’గా ఆధ్యాత్మిక నామకరణం చేశారు. ఆయన జీవితం జ్ఞానం-ఆనంద ప్రత్యేక సంగమంగా రూపొందింది. ఆయన ప్రసంగం లోతైన జ్ఞానానికి ప్రతీకగా వెలుగొందింది. ఆయన వాక్కు పామరులకైనా సులువుగా అర్థమయ్యేంత సరళం. వేల కిలోమీటర్ల ఆధ్యాత్మిక పాదయాత్ర సాగించిన ఆయన (150కిపైగా)- బహు గ్రంథకర్త. లక్షలాది యువతకు స్వీయ నిగ్రహం అలవరచడంతోపాటు సాంస్కృతిక విలువలతో అనుసంధానం కాగల ఒక గొప్ప లక్ష్యానికి మార్గనిర్దేశం చేశారు. ఆచార్య శ్రీ విద్యానంద్‌జీ మునిరాజ్ నిజంగా ఒక దార్శనిక శకపురుషుడు. ఆయన ఆధ్యాత్మిక జ్యోతిని స్వయంగా అనుభూతి చెందే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన నాకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూ వచ్చారు. ఆయన ఆశీస్సులు నాపై సదా ప్రసరిస్తూనే ఉన్నాయి. ఈ శతజయంతి వేదికపైనుంచి నేనిప్పటికీ ఆయన నుంచి అదే ప్రేమను, తాదాత్మ్యాన్ని అనుభూతి చెందగలను.

మిత్రులారా!

   భారత నాగరకత ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనం. మన ఆలోచనలు శాశ్వతం... మన తత్త్వశాస్త్రం నిత్యం... మన దృక్కోణం నిత్యసత్యం. కాబట్టే వేల ఏళ్లుగా మన శాశ్వతత్వం కొనసాగుతోంది. మన రుషులు, సాధుపుంగవులు, మహనీయులు, ఆచార్యులే ఈ దృక్కోణానికి మూలం. ఈ ప్రాచీన భారతీయ సంప్రదాయానికి ఆధునిక మార్గదర్శి ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్. అనేక అంశాలు-రంగాలలో ఆయన పాండిత్యం, నైపుణ్యం అపారం. ఆయన ఆధ్యాత్మిక మేధ, జ్ఞానంసహా కన్నడ, మరాఠీ, సంస్కృత, ప్రాకృత తదితర... 18 భాషలపై పట్టు అసాధారణం. ఇంతకుముందే గౌరవనీయ మహారాజ్ జీ చెప్పినట్లుగా, ఆయన జ్ఞానం- సాహితీ వైదుష్యం, ఆధ్యాత్మిక రచనలు, సంగీతంపై ఏకాగ్రత, జాతి సేవపై ఆయనకున్న అంకితభావం ఎనలేనివి. ఆయన జీవితాదర్శాలు అత్యున్నత స్థాయికి చేరని కోణమంటూ ఏదీ లేదు. ఆయనో గొప్ప సంగీత విద్వాంసుడు... ఒక విశిష్ట దేశభక్తుడు... స్వాతంత్య్ర సమరయోధుడు... జైనంతో అవినాభావ సంబంధంగల దిగంబర ముని. జ్ఞాన-వివేకాల అమూల్య నిధి... ఆధ్యాత్మికానంద ప్రదాన మూలపురుషుడు కూడా. సురేంద్ర ఉపాధ్యాయ్ నుంచి ఆచార్య శ్రీ విద్యానంద్ మునిరాజ్ స్థాయికి ఎదిగేదాకా... ఆయన జీవనయానం ఒక సామాన్య మానవుడు మహనీయుడుగా పరిణామం చెందడంలో భాగమేనని నేను విశ్వసిస్తాను. మన భవిష్యత్తు ప్రస్తుత మన పరిమితులకు లోబడి ఉండదనే వాస్తవాన్ని ఆయన జీవనోదంతం మనకు వివరించి, స్ఫూర్తినిస్తుంది. మన భవిష్యత్తును నిర్వచించేవి... మనం పయనించే దిశ, మన  లక్ష్యాలు, మన సంకల్పమే.

మిత్రులారా!

   ఆచార్య శ్రీ విద్యానంద్ మునిరాజ్ కేవలం వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనకే జీవితాన్ని పరిమితం చేసుకోకుండా, సామాజిక-సాంస్కృతిక పునర్నిర్మాణానికి ఓ మాధ్యమంగా మలచుకున్నారు. ప్రాకృత భవన్, వివిధ పరిశోధన కేంద్రాలు వగైరా సంస్థల స్థాపన ద్వారా యువతరానికి తన జ్ఞాన జ్యోతిని అందించారు. జైన చారిత్రక కథనాన్ని సముచిత స్థానంలోకి పునరుద్ధరించారు. ‘జైన్ దర్శన్’, ‘అనేకాంత్వాద్’ వంటి ప్రాథమిక గ్రంథాల ద్వారా తన తాత్విక ప్రసంగాలకు మరింత సమగ్రత కల్పించారు. దేవాలయాల పునరుద్ధరణ నుంచి పేద పిల్లల విద్య, సామాజిక సంక్షేమం దాకా ప్రతి అంశంలోనూ స్వీయ సాక్షాత్కారం, ప్రజా సంక్షేమంతో ఆయన కృషి ముడిపడి ఉండటం విశేషం.

మిత్రులారా!

   జీవితం సేవా కార్యాచరణకు అంకితమైనపుడే ఆధ్యాత్మికంగా పరిపూర్ణం కాగలదని ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ సదా చెబుతుండేవారు. జైన తత్వసారంలో ఎంతో లోతుగా పాదుకున్న ఈ దృక్పథం భారతీయ ఆలోచనా ధోరణిలో అంతర్లీనంగా కనిపిస్తుంది. సేవా భావనకు భారత్ పురిటిగడ్డ. ఈ నేలలో మానవత్వం ఆకాశమంత ఉన్నతం. హింసను అణచివేయడం కోసం మరింత హింసా ప్రయోగానికి ప్రపంచం యత్నిస్తున్న వేళ, భారత దేశం అహింసకుగల శక్తి ఎంతటిదో చాటిచెప్పింది. భారతీయులకు మానవ సేవ స్ఫూర్తే అన్నింటికన్నా ప్రధానం.

మిత్రులారా!

   మన సేవా స్ఫూర్తి నిర్నిబంధం.. స్వార్థానికి అతీతం.. మానవాళి శ్రేయో ప్రేరితం. ఈ సూత్రమే తారకమంత్రంగా, అవే ఆదర్శాలతో మహనీయుల మార్గదర్శక జీవన విధాన స్ఫూర్తితో మా కృషిని కొనసాగిస్తున్నాం. ఈ మేరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ యోజన, పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు- ఇలా ప్రతి కార్యక్రమం లేదా పథకాన్ని సమాజం చివరి అంచెనగల వ్యక్తికీ ప్రయోజనం అందేవిధంగా రూపొందించాం. ఈ సేవా స్ఫూర్తి ద్వారా అన్నింటి అమలులో సంతృప్త స్థాయి సాధన లక్ష్యంగా మేం శ్రమిస్తున్నాం. అంటే- సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడకూడదు... అందరూ సమష్టిగా ముందడుగు వేయాలి. ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ ప్రేరణతో ఇదే మనందరి సంకల్పం.

మిత్రులారా!

   మన తీర్థంకరులు, సాధువులు, ఆచార్యుల బోధనలు, ప్రబోధాలు శాశ్వతాలు. ముఖ్యంగా జైనమత ప్రబోధిత పంచ మహావ్రతాలు, అనువ్రతాలు, రత్నత్రయం, ఆరు శాశ్వతాంశాలు మునుపటికన్నా నేటి కాలానికే చక్కగా వర్తిస్తాయి. ప్రతి యుగంలో సామాన్యులు సులువుగా అనుసరించగలిగేలా ఈ కాలాతీత బోధనల సరళీకరణ అవశ్యమని కూడా మేం అర్థం చేసుకున్నాం. ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ ఈ లక్ష్యం కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ‘వచనామృత’ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సామాన్యుల దైనందిన భాషలో జైన గ్రంథాలను అందుబాటులోకి తెచ్చారు. లోతైన ఆధ్యాత్మిక భావనలను భక్తి సంగీతం ద్వారా సరళ భాషలో ఆయన జనానికి చేరువ చేశారు. “అబ్ హమ్ అమర్ భయే న మరేంగే, హమ్ అమర్ భయే న మరేంగే, తన్ కరణ్ మిథ్యాత్ దియో తజా, క్యుం కరి దేహ్ ధరేంగే” వంటి కీర్తనలు ఆయన మనకు జ్ఞాన ముత్యాలతో అల్లి ఇచ్చిన ఆధ్యాత్మిక సరాలు. అమరత్వంపై ఈ సహజ విశ్వాసం, అనంతం వైపు చూడగల ఈ సాహసం- ఇవే భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతిని విశిష్టంగా చూపే ప్రత్యేక లక్షణాలు.

మిత్రులారా!

   ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ శతాజయంతి స్ఫూర్తిదాయకంగా కొనసాగుతుంది. ఆయన ఆధ్యాత్మిక బోధనలను మన జీవితాల్లో పాటించడమే కాకుండా, సమాజంతోపాటు  జాతి సంక్షేమం లక్ష్యంగా ఆయన రచనలను విస్తృతం చేయడం కూడా మన కర్తవ్యం. ఆయన తన రచనలు, కీర్తనల ద్వారా ప్రాచీన ప్రాకృత భాషను ఎలా పునరుద్ధరించారో మీకందరికీ తెలిసిందే. భారతీయ ప్రాచీన భాషలలో ప్రాకృతం ఒకటి. మహావీరుడు ఉపన్యసించినది ఈ భాషలోనే... వాస్తవానికి యావత్‌ జైన ఆగమం ఈ భాషలోనే కూర్చబడింది. అయితే, మనదైన సంస్కృతిపై నిర్లక్ష్యం ఫలితంగా ఈ భాష దైనందిన వినియోగం నుంచి కనుమరుగవుతూ వచ్చింది. ఆచార్య శ్రీ వంటి రుషి పుంగవుల కృషిని మేం జాతీయ స్థాయికి చేర్చాం. ఇందులో భాగంగా నిరుడు అక్టోబరు ప్రాకృతాన్ని ‘శాస్త్రీయ భాష’గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ఇప్పుడే ఆచార్య జీ కూడా ప్రస్తావించారు. భారత ప్రాచీన లిఖిత ప్రతుల డిజిటలీకరణకు మేమొక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. వీటిలో ముఖ్యమైన జైన ఇతిహాసాలు, గౌరవనీయ ఆచార్యులతో ముడిపడిన గ్రంథాలు ఉన్నాయి. మీరు ఊహిస్తున్నట్లుగానే 50,000కుపైగా లిఖిత ప్రతులకు సంబంధించి- ఈ కృషిని శ్రద్ధగా కొనసాగించేందుకు ఇక్కడే ఉన్న మా మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కృషిని ఇతరత్రా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మాతృభాషలో ఉన్నత విద్యను కూడా ప్రోత్సహిస్తున్నాం. అందుకే, దేశాన్ని వలసవాద ధోరణి నుంచి విముక్తం చేయాలని నేను ఎర్రకోటపైనుంచి పిలుపునిచ్చాను. ఆ మేరకు ప్రగతి, వారసత్వం రెండు కళ్లుగా మనం ముందడుగు వేయాలి. ఈ సంకల్పంతోనే భారతదేశ సాంస్కృతిక, తీర్థయాత్రా ప్రదేశాల అభివృద్ధికి మేం కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే 2024లో ప్రభుత్వం భగవాన్ మహావీర్ 2550వ నిర్వాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. ఈ వేడుక ఆచార్య శ్రీ విద్యానంద్ జీ ముని ప్రేరణతో ఆచార్య శ్రీ ప్రజ్ఞా సాగర్ జీ వంటి సాధువుల ఆశీస్సులతో విజయవంతమైంది. భవిష్యత్తులో మన సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేయడానికి ఇలాంటి మరిన్ని గొప్ప కార్యక్రమాలు నిర్వహించాలి. ఇప్పటి వేడుకల తరహాలోనే మా కృషికి ప్రజల భాగస్వామ్య స్ఫూర్తి మార్గనిర్దేశం చేస్తుంది. తదనుగుణంగా “సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్” తారకమంత్రంగా అన్నీ అమలవుతాయి.

మిత్రులారా!

   మీ మధ్య నిలుచున్న నేనివాళ నవకార్ మహామంత్ర దివస్ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం సహజం. ఆ రోజున మనం 9 సంకల్పాల గురించి చర్చించాం. వాటిని సాకారం చేసేదిశగా పెద్ద సంఖ్యలో పౌరులు కృషి చేస్తుండటం నాకెంతో సంతోషదాయకం. ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ నుంచి మనకు లభించే మార్గదర్శకత్వం ఈ 9 సంకల్పాల సాకారం దిశగా మన ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ సంకల్పాలను ఇప్పుడు మరోసారి మీతో పంచుకుంటాను. వాటిలో మొదటిది- నీటిని ఆదా చేయడం. ప్రతి నీటిచుక్క మనకు అమూల్యమే. అది మన బాధ్యత... భూమాత విషయంలో మన కర్తవ్యం. రెండోది- అమ్మ పేరిట ఓ మొక్క నాటడం. ఆమె మనను సంరక్షించిన రీతిలోనే ఆ మొక్కనూ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి మొక్కనూ మన తల్లి ఆశీస్సుగా పరిగణించాలి. మూడోది- పరిశుభ్రత.. ఇది కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోరాదు. ఇది అహింసకు ప్రతీక... ప్రతి వీధి, ప్రతి పొరుగు ప్రాంతం, ప్రతి నగరం శుభ్రంగా ఉండటమే కాదు.. అందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కూడా ఉండాలి. నాలుగోది- 'స్థానికత కోసం నినాదం’. తోటి భారతీయుల స్వేదగంధం పరిమళించే, మన నేల సువాసనను వెదజల్లే ఉత్పత్తులను మాత్రమే కొనండి. మీలో చాలా మంది వ్యాపార రంగంలో ఉండి ఉంటారు- కాబట్టి, స్థానిక ఉత్పత్తుల విక్రయానికి ప్రాధాన్యమివ్వాలని మీకు నా వినతి. లాభానికి అతీతంగా దృష్టి సారించి, ఇతరులకూ స్ఫూర్తినివ్వండి. ఐదో సంకల్పం- మాతృభూమి విశేషాల అన్వేషణ. ప్రపంచాన్ని అన్ని విధాలుగా చూడండి- కానీ తొలుత మన మాతృదేశాన్ని ఆసాంతం సందర్శిద్దాం... అర్థం చేసుకుంటూ, అనుభూతి చెందుదాం. ఆరోది- సేంద్రియ వ్యవసాయ విధానాల అనుసరణ. మన నేల విషతుల్యం కాకుండా కాపాడుకుందాం. వ్యవసాయంలో భాగంగా భూమాతను రసాయన విముక్తం చేద్దాం. సేంద్రియ వ్యవసాయ సందేశాన్ని ప్రతి గ్రామానికీ చేరుద్దాం. పూజ్య మహారాజ్ జీ ఏనాడూ పాదరక్షలు ధరించలేదు- కానీ, ఆ సూత్రం ఒక్కటే పాటిస్తే సరిపోదు... మనం భూమాతను కూడా రక్షించడం అవశ్యం. ఏడోది- ఆరోగ్యకర జీవనశైలి. మనమేం తింటున్నామో అవగాహనతో తినండి. సంప్రదాయ భారతీయ భోజనంలో ‘శ్రీ అన్న’ (చిరుధాన్యాల)ను చేర్చండి. నూనె వినియోగాన్ని కనీసం 10 శాతమైనా తగ్గించండి- తద్వారా ఊబకాయం సమస్య తగ్గి, శక్తి ఇనుమడిస్తుంది. ఎనిమిదోది- యోగా.. క్రీడలు. ఈ రెండింటినీ మీ దినచర్యలో భాగం చేసుకోండి. తొమ్మిదోది- పేదలకు సహాయం. వారికి చేయూతనివ్వడం, పేదరికాన్ని అధిగమించడంలో తోడ్పడటం వారికి మనం చేసే నిజమైన సేవ. మొత్తంమీద ఈ 9 సంకల్పాల సాకారానికి మనం కృషి చేస్తే, ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ వారసత్వానికే కాకుండా ఆయన ప్రబోధాలకూ మనం న్యాయం చేసినట్లేనని నా ప్రగాఢ విశ్వాసం.

మిత్రులారా!

   భారతదేశ నిత్య సజీవ చైతన్యం, మన రుషుల అనుభవాల నుంచి మనం అమృత కాలానికి రూపమిస్తున్నాం. దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు ఈ అమృత సంకల్పాల సాకారం ద్వారా ‘వికసిత భారత్’ను రూపుదిద్దడానికి తమనుతాము అంకితం చేసుకుంటున్నారు. అభివృద్ధి చెందిన దేశమంటే ప్రతి భారతీయుడి కలనూ నెరవేర్చడం. ఇది ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ మనకిచ్చిన స్ఫూర్తి. ఆయన బోధనలను ఇముడ్చుకుంటూ ఆ స్ఫూర్తిదాయక పథంలో సాగుతూ దేశ ప్రగతిని మన ప్రధాన జీవన లక్ష్యం చేసుకోవడం మనందరి బాధ్యత. ఈ సంకల్పాల సాకారానికి మనం చేస్తున్న కృషిని ఈ పవిత్ర ఘట్టం నుంచి ఉద్భవించిన శక్తి మరింత పరిపుష్టం చేస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఇంతకుముందే ఆచార్య శ్రీ ప్రజ్ఞా సాగర్ మహారాజ్ జీ చెప్పినట్లు- “ఎవరైతే మనల్ని రెచ్చగొట్టడానికి సాహసిస్తారో..." నేనిప్పుడు అహింస సిద్ధాంతాన్ని ఆచరించే జైన సమావేశంలో ఉన్నాను. అందుకే నేను సగం వాక్యం మాత్రమే ఉటంకించాను... మిగిలినదాన్ని మీరు పూర్తి చేస్తారని నాకు తెలుసు. నా ఉద్దేశమేమిటంటే- ఆ వాక్యాన్ని మీరు మాటల్లో పూరించకపోయినా, మీ మనసులో బహుశా ఆపరేషన్ సిందూర్‌ను ఆశీర్వదించే ఉంటారు. మీ అందరి ప్రేమ, ఆశీస్సులతో నేను మరోసారి ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ కు భక్తి పురస్సరంగా నమస్కరిస్తున్నాను.
 
అనేకానేక ధన్యవాదాలు! జై జినేంద్ర!

 

****


(Release ID: 2140587)