ఆర్థిక మంత్రిత్వ శాఖ
నేటి నుంచి జూలై 5 వరకు స్పెయిన్, పోర్చుగల్, బ్రెజిల్ దేశాల్లో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధికారిక పర్యటన
• ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన నాలుగో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్‌మెంట్ (ఎఫ్ఎఫ్‌డీ4)ను ఉద్దేశించి ప్రసంగించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి
• న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) పదో వార్షిక సమావేశంలో భారత్ గవర్నర్ హోదాలో ప్రసంగించనున్న శ్రీమతి సీతారామన్... రియో డి జనీరోలో జరగనున్న బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం (ఎఫ్ఎంసీబీజీ) ఒకటో సమావేశానికీ హాజరు కానున్న కేంద్ర మంత్రి
Posted On:
30 JUN 2025 11:40AM by PIB Hyderabad
నేటి నుంచి జులై 5వ తేదీ వరకు స్పెయిన్, పోర్చుగల్, బ్రెజిల్ దేశాల్లో అధికారికంగా పర్యటించనున్న కేంద్ర ఆర్థిక శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగానికి చెందిన భారత ప్రతినిధి వర్గానికి ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నాయకత్వం వహిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి స్పెయిన్‌లోని సెవిలేలో నిర్వహించే నాలుగో ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్‌మెంట్’ (ఎఫ్ఎఫ్‌డీ4)కు కేంద్ర ఆర్థిక మంత్రి హాజరు కానున్నారు.
సెవిలేలోనే ‘‘ఎఫ్ఎఫ్‌డీ4 ఫలితాల మొదలు అమలు దాకా: దీర్ఘకాలిక ప్రాతిపదికన అభివృద్ధి సాధన దిశగా ప్రయివేటు మూలధన శక్తిని వినియోగించుకోవడం’’ అంశంపై ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ బిజినెస్ ఫోరమ్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రధానోపన్యాసాన్ని అందిస్తారు.
ఎఫ్ఎఫ్‌డీ4ను పురస్కరించుకొని, జర్మనీ, పెరూ, న్యూజిలాండ్ సీనియర్ మంత్రులతోనూ, ఐరోపా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు (ఈఐబీ) ప్రెసిడెంటుతోనూ శ్రీమతి సీతారామన్ భేటీ కానున్నారు.
పోర్చుగల్‌లోని లిస్బన్‌లో పోర్చుగల్ ఆర్థిక మంత్రితో ఓ ద్వైపాక్షిక సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రముఖ పెట్టుబడిదారులు, భారతీయ ప్రవాసులతో కూడా ఆమె సమావేశం కానున్నారు.
రియొ డి జనీరోలో నిర్వహించనున్న న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) పదో వార్షిక సమావేశంలో శ్రీమతి సీతారామన్ ప్రసంగిస్తారు. భారత్ గవర్నర్ హోదాలో ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశానికి (ఎఫ్ఎంసీబీజీ) కూడా ఆమె హాజరవుతారు.
ఎన్‌డీబీ సమావేశాల్లో భాగంగా ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం ఒక ముఖ్య బహుశాఖాభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేయడం’’ అంశంపై ఎన్‌డీబీ ప్రధాన గవర్నర్ల సెమినార్‌ను ఉద్దేశించి శ్రీమతి సీతారామన్ ప్రసంగిస్తారు.
ఎన్‌డీబీ సమావేశాలను పురస్కరించుకొని, బ్రెజిల్, చైనా, ఇండొనేషియాతో పాటు రష్యా ఆర్థిక మంత్రులతో నిర్వహించే ద్వైపాక్షిక సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి పాల్గొంటారు.
***
(Release ID: 2140723)