సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏఐ-ఆధారిత రియల్-టైమ్ బహుభాషానువాద పరిష్కారం ‘భాషా సేతు’ను అభివృద్ధి చేయాలని అంకురసంస్థలను ఆహ్వానించిన స్టార్టప్ యాక్సిలరేటర్ ప్లాట్‌ఫామ్ వేవ్‌ఎక్స్


12 భారతీయ భాషల్లో అనువాదం, లిప్యంతరణం, వాయిస్ టెక్‌లతో కూడిన ‘భాషా సేతు’ సవాలుకు అర్హత ప్రమాణాలేవీ లేకుండా అందరూ పోటీపడవచ్చు

ప్రోటోటైప్ సమర్పణకు ఈనెల 22 వరకు గడువు

Posted On: 30 JUN 2025 6:52PM by PIB Hyderabad

 సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తన ప్రధాన స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ వేవ్ఎక్స్ ద్వారా వేవ్ఎక్స్ స్టార్టప్ ఛాలెంజ్ 2025ను ప్రారంభించింది. ఏఐ-ఆధారిత బహుభాషానువాద పరిష్కారాన్ని అభివృద్ధి చేయడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అంకురసంస్థలు జాతీయ హ్యాకథాన్‌లో పాల్గొనాలని ఈ ఛాలెంజ్ ఆహ్వానిస్తోంది.

‘భాషాసేతు – రియల్-టైమ్ లాంగ్వేజ్ టెక్ ఫర్ భారత్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఛాలెంజ్.. కనీసం 12 ప్రధాన భారతీయ భాషల్లో రియల్-టైమ్ అనువాదం, లిప్యంతరణం, వాయిస్ లోకలైజేషన్ అందించే సామర్థ్యం గల వినూత్న కృత్రిమ మేధ సాధనాల అభివృద్ధిని ప్రోత్సహించనుంది. సమగ్రమైన, అందుబాటులో గల, భావోద్వేగాల సంబంధిత కమ్యూనికేషన్ సాంకేతికతలను రూపొందించేందుకు ఈ కార్యక్రమం కృషి చేస్తుంది.

విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈ సవాలు కోసం ఎలాంటి కనీస అర్హత ప్రమాణాలూ నిర్దేశించలేదు. దీంతో ఏ అభివృద్ధి దశలో ఉన్న అంకురసంస్థలైనా దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్-సోర్స్, తక్కువ-ధర గల ఏఐ నమూనాలను ఉపయోగించి సమర్థమైన, చౌకైన పరిష్కారాలను రూపొందించేలా అంకురసంస్థలను ప్రోత్సహించనున్నారు. అయితే, విస్తృత స్థాయి అమలు కోసం సరసమైనవి.. ఆచరణీయమైనవి అయిన యాజమాన్య పరిష్కారాలను కూడా ప్రతిపాదించవచ్చు.

విజేతగా నిలిచే అంకురసంస్థకు వేవ్‌ఎక్స్ యాక్సిలరేటర్ ద్వారా ఇంక్యుబేషన్ మద్దతు అందించనున్నారు. దీనిలో భాగంగా తుది ఉత్పత్తిని సిద్ధం చేసి.. అమలు చేసే వరకూ నిపుణుల మార్గదర్శనం, కార్యస్థలం, అభివృద్ధికి అవసరమైన సహాయం అందిస్తారు. ఈరోజు (జూన్ 30) నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా.. ప్రోటోటైప్ సమర్పణకు జూలై 22 వరకు గడువు నిర్దేశించారు. ఆసక్తిగల అంకురసంస్థలు వేవ్ఎక్స్ అధికారిక పోర్టల్ https://wavex.wavesbazaar.com పై దరఖాస్తు చేసుకోవచ్చు.

వేవ్ఎక్స్ గురించి

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వేవ్స్ కార్యక్రమం కింద వేవ్ఎక్స్ పేరుతో ప్రత్యేక స్టార్టప్ యాక్సిలరేటర్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. ఇది మీడియా, వినోదం, భాషా సాంకేతికత రంగాల్లో ఆవిష్కరణలను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభమైంది. ఈ సంవత్సరం మే నెలలో ముంబయిలో నిర్వహించిన వేవ్స్ సమ్మిట్‌లో 30కి పైగా ఆశావహ అంకురసంస్థలకు వేవ్ఎక్స్ పిచింగ్ అవకాశాలను అందించింది. ప్రభుత్వ సంస్థలు, పెట్టుబడిదారులు, పరిశ్రమ ప్రముఖుల ప్రత్యక్ష భాగస్వామ్యానికి ఇది వీలు కల్పించింది. టార్గెటెడ్ హ్యాకథాన్‌లు, ఇంక్యుబేషన్, మెంటర్‌షిప్, జాతీయ వేదికలతో అనుసంధానం ద్వారా వేవ్ఎక్స్ కొత్త ఆలోచనలకు మద్దతునిస్తూనే ఉంది.


 

***


(Release ID: 2140971)