మంత్రిమండలి
ఉపాధి ఆధారిత ప్రోత్సాహక (ఈఎల్ఐ) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
అన్ని రంగాల్లో ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పనా సామర్థ్యం, సామాజిక భద్రతను పెంపొందించనున్న పథకం
తయారీరంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తూ.. తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ప్రోత్సాహకాలు
తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల వేతన మొత్తం రూ. 15,000 వరకు రెండు వాయిదాల్లో చెల్లింపు
రూ. లక్ష కోట్ల వ్యయంతో రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల కల్పనకు మద్దతు
Posted On:
01 JUL 2025 3:04PM by PIB Hyderabad
తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. అన్ని రంగాల్లో ఉపాధి కల్పనకు మద్దతునివ్వడానికి, ఉపాధి అవకాశాలను, సామాజిక భద్రతను పెంపొందించడానికి ప్రభుత్వం ఉపాధి ఆధారిత ప్రోత్సాహక (ఈఎల్ఐ) పథకాన్ని రూపొందించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద, మొదటిసారి ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు ఒక నెల వేతనం (రూ. 15,000/- వరకు) ప్రోత్సాహకంగా పొందుతారు. మరిన్ని ఉద్యోగాలు కల్పించేలా అన్ని రంగాల్లోని యాజమాన్యాలకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలను అందించనున్నారు. తయారీ రంగానికి చెందిన యాజమాన్యాలకు మరో రెండేళ్లు అదనంగా ఈ ప్రయోజనాలు కల్పించనున్నారు. 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలను సులభతరం చేయడం కోసం ప్రధానమంత్రి ఐదు పథకాల ప్యాకేజీలో భాగంగా రూ. 2 లక్షల కోట్ల బడ్జెట్ వ్యయంతో 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ఈఎల్ఐ పథకాన్ని ప్రకటించారు.
ఈఎల్ఐ పథకం ద్వారా 99,446 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 2 సంవత్సరాల కాలంలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రోత్సాహకాలను అందించనున్నారు. దీనిలో భాగంగా 1.92 కోట్ల మంది లబ్ధిదారులు తొలిసారిగా ఉద్యోగంలో చేరనున్నారు. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 మధ్య కాలంలో కల్పించిన ఉద్యోగాలకు ఈ పథకం ప్రయోజనాలు వర్తిస్తాయి.
ఈ పథకం రెండు భాగాలను కలిగి ఉంటుంది. మొదటి భాగం తొలిసారిగా ఉద్యోగంలో చేరిన వారిపై దృష్టి సారించనుండగా.. రెండో భాగం యాజమాన్యాలపై దృష్టి సారిస్తుంది:
భాగం A: తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ప్రోత్సాహం:
మొదటిసారిగా ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకున్న ఉద్యోగులకు వారి ఒక నెల ఈపీఎఫ్ వేతన మొత్తాన్ని రూ. 15,000ల వరకు ఈ భాగం ద్వారా రెండు విడతల్లో అందించనున్నారు. రూ.లక్ష వరకు వేతనం పొందే ఉద్యోగులు దీనికి అర్హులు. 6 నెలల సర్వీస్ తర్వాత మొదటి విడత మొత్తాన్ని.. ఉద్యోగి 12 నెలల సర్వీస్ అనంతరం ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత రెండో విడత మొత్తాన్నీ చెల్లిస్తారు. పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు వారికి అందించే ప్రోత్సాహకంలో కొంత మొత్తాన్ని పొదుపు సాధనాల్లో నిర్ణీత కాలానికి డిపాజిట్ చేస్తారు. ఆ కాలపరిమితి పూర్తయిన తరువాత ఉద్యోగి ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.
మొదటిసారి ఉద్యోగంలో చేరే 1.92 కోట్ల మంది భాగం A ద్వారా లబ్ది పొందనున్నారు.
భాగం B: యాజమాన్యాలకు మద్దతు:
ఈ భాగం తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. అన్ని రంగాల్లో అదనపు ఉద్యోగాల కల్పనకు ఊతమిస్తుంది. రూ. 1 లక్ష వరకు వేతనం గల ఉద్యోగులను కలిగి ఉన్న యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు అందిస్తారు. కనీసం ఆరు నెలల నిరంతర ఉపాధి ప్రాతిపదికన నియమించుకున్న ప్రతీ అదనపు ఉద్యోగి కోసం యాజమాన్యాలకు ప్రభుత్వం రెండేళ్ల పాటు నెలకు రూ. 3000 వరకు ప్రోత్సాహకాలను అందిస్తుంది. తయారీ రంగానికి ఈ ప్రోత్సాహకాలను 3వ, 4వ సంవత్సరాలకూ అందించనున్నారు.
ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకున్న సంస్థలు కనీసం ఆరు నెలల పాటు నిరంతర ప్రాతిపదికన కనీసం ఇద్దరు అదనపు ఉద్యోగులను (50 కంటే తక్కువ ఉద్యోగులు గల యాజమాన్యాల కోసం) లేదా ఐదుగురు అదనపు ఉద్యోగులను (50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు గల యాజమాన్యాల కోసం) నియమించుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్రోత్సాహకాల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
EPF Wage Slabs of Additional Employee (in
|
Benefit to the Employer (per additional employment per month)
|
Up to Rs 10,000*
|
Upto Rs 1,000
|
More than Rs 10,000 and up to Rs 20,000
|
Rs 2,000
|
More than Rs 20,000 (upto salary of Rs 1 Lakh/month)
|
Rs 3,000
|
* రూ. 10,000ల వరకు ఈపీఎఫ్ వేతనం గల ఉద్యోగులు పనితీరు ఆధారిత ప్రోత్సహకాలు పొందుతారు.
ఈ భాగం దాదాపు 2.60 కోట్ల మందికి అదనంగా ఉపాధి కల్పించేలా యజమాన్యాలను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.
ప్రోత్సాహకాలు చెల్లించే విధానం:
ఈ పథకంలోని భాగం A కింద మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్ (ఏబీపీఎస్) ఉపయోగించి డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) విధానం ద్వారా అన్ని చెల్లింపులూ చేస్తారు. భాగం B కింద యాజమాన్యాలకు వారి పాన్-అనుసంధానిత ఖాతాల్లో చెల్లింపులు జమ చేస్తారు.
ఈఎల్ఐ పథకం ద్వారా అన్ని రంగాల్లో.. ముఖ్యంగా తయారీ రంగంలో ఉద్యోగాల కల్పనను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అలాగే మొదటిసారిగా ఉద్యోగంలో చేరే యువతకు ప్రోత్సాహకాలనూ అందిస్తుంది. కోట్లాది మంది యువత, మహిళలకు సామాజిక భద్రత వర్తింపును విస్తరిస్తూ.. దేశంలోని శ్రామిక శక్తినంతటినీ అధికారిక రంగంలోకి మార్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం .
***
(Release ID: 2141312)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam