యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025 జాతీయ క్రీడా విధానానికి కేబినెట్ ఆమోదం


దేశ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా క్రీడల శక్తిని వినియోగించుకోవాలన్న యోచన

Posted On: 01 JUL 2025 3:16PM by PIB Hyderabad

దేశ క్రీడా రంగానికి నూతన ఆకృతిని ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2025-జాతీయ క్రీడా విధానానికి (ఎన్ఎస్పీ) ఆమోదం తెలిపింది.  క్రీడల ద్వారా పౌరులను సాధికారులుగా చేయాలని కొత్త విధానం ఆశిస్తోంది.  

ప్రస్తుతం అమల్లో ఉన్న 2001 జాతీయ క్రీడా విధానాన్ని  భర్తీ చేసే కొత్త విధానం, క్రీడారంగంలో భారత్ ను ప్రపంచ అగ్రగామి దేశంగా నిలిపేందుకు అవసరమైన దీర్ఘకాలిక, వ్యూహాత్మక ప్రణాళికలను ప్రతిపాదిస్తోంది. 2036 ఒలింపిక్ క్రీడలు  సహా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో భారత్ ను ముందు వరసలో నిలపాలని కొత్త విధానం ఆశిస్తోంది.

వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు, నీతీ ఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్ఎస్ఎఫ్), అథ్లెట్లు, నిపుణులు, పౌర భాగస్వాముల మధ్య జరిగిన విస్తృతస్థాయి చర్చల అనంతరం 2025-ఎన్ఎస్పీ రూపొందింది. ఈ విధానం అయిదు మూల స్తంభాలపై ఆధారపడింది:

1. ప్రపంచ వేదికపై అత్యుత్తమ ప్రదర్శన

ఈ విధాన లక్ష్యం:


·      క్రీడా నైపుణ్యాన్ని చిన్న వయసులోనే గుర్తించడం, ప్రోత్సహించడం సహా క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ దృఢమైన క్రీడా కార్యక్రమాలను తయారుచేయడం.

·      లీగ్ స్థాయి, ఇతర ఆటల పోటీలను ఏర్పాటు చేసి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం.

·      క్రీడాకారులకు దన్నుగా నిలిచే ప్రపంచస్థాయి శిక్షణ, కోచింగ్ తదితర సౌకర్యాలను సిద్ధం చేయడం.

·      జాతీయ క్రీడా సమాఖ్యల బలోపేతం, మెరుగైన నిర్వహణ.

·      క్రీడాకారులు మరింత మెరుగైన ప్రదర్శన కనపరచేందుకు అనువుగా స్పోర్ట్స్ సైన్స్, వైద్యం, సాంకేతికతల వినియోగం.  

·      కోచ్ లు, సాంకేతిక అధికారులు, ఇతర సిబ్బంది సహా క్రీడల నిర్వహణతో సంబంధం ఉన్న వారికి శిక్షణ, అవగాహన పెంపు కార్యక్రమాలు.

2. ఆర్థిక ప్రగతి కోసం క్రీడలు

క్రీడల ఆర్థిక సామర్థ్యాన్ని గుర్తించిన ఎన్ఎస్పీ చేపట్టబోయే వ్యూహాలు:

·      క్రీడా పర్యాటకానికి ప్రోత్సాహం, భారీ అంతర్జాతీయ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు ప్రణాళికలు.

·      క్రీడా ఉత్పత్తుల రంగానికి ప్రోత్సాహం, ఈ రంగంలో అంకుర , ఇతర పరిశ్రమలకు దన్ను.

·      పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్), విలక్షణ పెట్టుబడి పథకాల ద్వారా ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం.

3. సాంఘికాభివృద్ధిలో క్రీడల పాత్ర

సాంఘికపరమైన సమ్మిళితత్వాన్ని సాధించడంలో క్రీడల పాత్రను నూతన విధానం గుర్తిస్తుంది:

·      ప్రత్యేకంగా రూపొందించిన పథకాల ద్వారా మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం – మరీ ముఖ్యంగా నిరుపేద, గిరిజన, దివ్యాంగ మహిళలకు ప్రోత్సాహం.

·      సంప్రదాయ, దేశవాళీ  క్రీడల పునరుద్ధరణ, వాటికి ప్రోత్సాహం.

·      క్రీడలను విద్యలో భాగం చేయడం ద్వారా ఉపాధి మార్గంగా చూపడం, వాలంటీర్లకు ప్రోత్సాహం, క్రీడలతో కూడిన రెండు-రంగాల ఉపాధి మార్గానికి ప్రోత్సాహం.  

 

·      విదేశాల్లో నివసించే భారతీయ సమాజంతో క్రీడల ద్వారా అనుసంధాన మార్గాలను నిర్మించడం.

 4. ప్రజా ఉద్యమంగా క్రీడలు

క్రీడలను జాతీయ స్థాయి ఉద్యమంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో:

·      జాతీయస్థాయి ప్రచార కార్యక్రమాలు, సామూహిక కార్యక్రమాల ద్వారా క్రీడల్లో పెద్దయెత్తున ప్రజా భాగస్వామ్యాన్ని, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం.  

·      పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో ఫిట్నెస్ సూచికలతో కూడిన సమాచారాన్ని అందుబాటులో ఉంచడం.

·      క్రీడా సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉంచడం.

5. విద్యతో క్రీడలు మమేకం (ఎన్ఎస్పీ)

2020 జాతీయ విద్యా విధానానికి అనుగుణమైన 2025-ఎన్ఎస్పీ ప్రతిపాదనలు:

·      పాఠ్య ప్రణాళికల్లో క్రీడలు అంతర్భాగం కావాలి.

·      విద్యార్థుల్లో క్రీడల పట్ల అవగాహన, వారికి తగిన శిక్షణను అందించేందుకు వీలుగా బోధన సిబ్బంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ప్రత్యేక శిక్షణ.

6. వ్యూహాత్మక ప్రణాళిక:

నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు ఎన్ఎస్పీ-2025 అమలు చేసే సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక:

·      నిర్వహణ: మెరుగైన క్రీడానిర్వహణ కోసం చట్టబద్ధమైన, బలమైన నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు.

·      నిధుల అందజేత, మద్దతులో ప్రైవేటు రంగ పాత్ర: వినూత్న ఫైనాన్సింగ్ విధానాలను అభివృద్ధి పరచడం, పీపీపీలు, సీఎస్ఆర్ ల  ద్వారా ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం.

·      సాంకేతికత, సృజనాత్మకత: పనితీరు, పరిశోధన, కార్యక్రమాల అమలు తీరు పర్యవేక్షణ కోసం కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్‌ సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం.

·      జాతీయ పర్యవేక్షణ పథకం/వ్యవస్థ: నాణ్యత సూచికలు, కీలక పనితీరు సూచికలు (కేపీఐలు), కాలపరిమితి గల లక్ష్యాలతో కూడిన జాతీయ వ్యవస్థల సృష్టి.

·      రాష్ట్రాలకు ఆదర్శ విధానం: జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తమ విధానాలను సవరించుకునేందుకు లేదా రూపొందించేందుకు ఎన్ఎస్పీ-2025 ఒక నమూనాగా పనిచేస్తుంది.

·        సంపూర్ణ-ప్రభుత్వ విధానం:  సమగ్ర ప్రభావం లక్ష్యంగా అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యకలాపాలు, పథకాలు, కార్యక్రమాల్లో క్రీడలను భాగం చేయాలన్నది  ఈ విధానం లక్ష్యం.  

ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ, దార్శనికతలతో కూడిన 2025 జాతీయ క్రీడా విధానం దేశాన్ని ప్రపంచ అగ్రగామి క్రీడా విజేతగా నిలపాలని, చక్కని ఆరోగ్యం కలిగి, దేశ పురోభివృద్ధిలో భాగమయ్యే  సాధికార పౌరులను తయారు చేయాలని ఆశిస్తోంది,

 


 

****


(Release ID: 2141319)