కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడానికి ఎస్‌పీఆర్ఈఈ 2025 ప్రారంభించిన ఈఎస్ఐసీ


ఈ పథకం 2025 జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుంది

Posted On: 17 JUL 2025 11:24AM by PIB Hyderabad

ఈఎస్ఐ కార్పొరేషన్ 196వ సమావేశంలో ఎస్‌పీఆర్ఈఈ 2025 (ఉద్యోగులు, యాజమాన్యాల నమోదును ప్రోత్సహించే పథకం)ను కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) ఆమోదించింది.

ఎస్‌పీఆర్ఈఈ 2025

ఈఎస్ఐ చట్టం ప్రకారం సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడమే ఈఎస్ఐసీ ఆమోదించిన స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయిస్ (ఎస్‌పీఆర్ఈఈ) 2025 లక్ష్యం. ఈ పథకం 2025 జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుంది. ఇప్పటి వరకు నమోదు చేసుకోని యాజమాన్యాలు, ఒప్పంద, తాత్కాలికంగా పనిచేస్తున్న వారితో సహా ఉద్యోగులందరూ ఎలాంటి తనిఖీలు లేదా పాత బకాయిలతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తుంది.

 

ఎస్‌పీఆర్ఈఈ 2025లో చేపట్టే కార్యక్రమాలు

తమ సంస్థలు, ఉద్యోగులను ఈఎస్ఐసీ పోర్టల్, శ్రామ్ సువిధ, ఎంసీఏ పోర్టల్ ద్వారా డిజిటల్ గా నమోదు చేసుకోవచ్చు.

యజమాని ప్రకటించిన తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చెల్లుబాటును పరిగణనలోకి తీసుకుంటారు.

రిజిస్ట్రేషన్ ముందు కాలానికి ఎలాంటి చందా లేదా ప్రయోజనం వర్తించదు.

రిజిస్ట్రేషన్ ముందు కాలానికి సంబంధించిన రికార్డుల తనిఖీలు నిర్వహించరు. పాత రికార్డుల గురించి అడగరు.

జరిమానాల భయాన్ని తొలగించి, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా స్వచ్ఛందంగా నమోదు చేసుకొనేలా ఈ పథకం ప్రోత్సహిస్తుంది. ఎస్‌పీఆర్ఈఈ పథకం ప్రారంభించడానికి ముందు నిర్ధిష్ట కాలవ్యవధిలో నమోదు చేసుకోకపోతే.. చట్ట పరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. లేదా పాత బకాయిలు చెల్లించాల్సి వచ్చేది. ఈ అడ్డంకులను తొలగించి... నమోదు కాని ఇతర సంస్థలు, కార్మికులను సైతం ఈఎస్ఐ పరిధిలోకి తీసుకువచ్చి, సమగ్ర సామాజిక భద్రతను అందించడమే ఎస్‌పీఆర్ఈఈ 2025 లక్ష్యం.

ఎస్‌పీఆర్ఈఈ 2025 ప్రారంభంతో సమ్మిళితమైన, సామాజిక భద్రతను అందించే పురోగమన సమాజం దిశగా కార్మిక రాజ్య బీమా సంస్థ ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేసి పాత బకాయిల నుంచి మినహాయింపు ఇవ్వడం ద్వారా తమ శ్రామిక శక్తిని క్రమబద్దీకరించుకొనేలా యాజమాన్యాలను ప్రోత్సహిస్తుంది. అలాగే మరింత మంది కార్మికులను ముఖ్యంగా కాంట్రాక్టు రంగాల్లో పని చేసేవారు ఈఎస్ఐ చట్టం ద్వారా అవసరమైన ఆరోగ్య, సామాజిక ప్రయోజనాలను పొందేలా చేస్తుంది. భారత్‌లో సంక్షేమ కేంద్రక కార్మిక వ్యవస్థ దార్శనికతకు అనుగుణంగా దాని పరిధిని బలోపేతం చేసుకోవడానికి, సార్వత్రిక సామాజిక భద్రత అనే లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈఎస్ఐసీ కట్టుబడి ఉంది.

 

***


(Release ID: 2145506)
Read this release in: English