రక్షణ మంత్రిత్వ శాఖ
ఎత్తైన ప్రదేశంలో ఆకాశ్ ప్రైమ్ పరీక్ష విజయవంతం
Posted On:
17 JUL 2025 4:45PM by PIB Hyderabad
జూలై 16న భారత్ కీలక మైలురాయిని చేరుకుంది. లద్దాఖ్‌లోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో రెండు వైమానిక హై స్పీడ్ మానవరహిత లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేసింది. ఆకాశ్ ఆయుధ వ్యవస్థను నవీకరించి రూపొందించిన ఆకాశ్ ప్రైమ్ ద్వారా ఈ ఘనత సాధించింది. 4,500 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో పనిచేయడానికి అనువుగా ఈ ఆయుధ వ్యవస్థను రూపొందించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ సహా పలు తాజా అప్‌గ్రేడ్‌లు ఇందులో భాగంగా ఉన్నాయి. వినియోగదారులు వెల్లడించిన అభిప్రాయాలను బట్టి, మరింత ప్రభావవంతంగా పనిచేసేలా వివిధ నవీకరణలు చేపడతారు. దేశీయ ఆయుధ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా రూపుదిద్దిన వ్యవస్థాగత ఏర్పాట్లు ఎంత కీలకమైనవో దీనిద్వారా స్పష్టమైంది.
దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసిన ఆకాశ్ ప్రైమ్ ఆయుధ వ్యవస్థను.. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర పారిశ్రామిక భాగస్వాములతో కలిసి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, డీఆర్డీవో విజయవంతంగా ధ్రువీకరించాయి. ఈ ఆయుధం తొలి ఉత్పత్తి యూనిట్ ఫైరింగ్ ట్రయల్‌లో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించారు. దేశ సరిహద్దుల్లో ఎత్తైన ప్రాంతాల్లో సకాలంలో వైమానిక దళాలను ప్రవేశపెట్టడానికి, వాయు రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి ఇది దోహదపడుతుంది.
భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన వైమానిక రక్షణ వ్యవస్థలు ఆపరేషన్ సిందూర్ సమయంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో సాధించిన ఈ ఘనత మరింత ప్రత్యేకమైనదని చెప్పక తప్పదు. భారత క్షిపణి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇదొక ప్రధానమైన ముందడుగు. ఇవిప్పుడు అంతర్జాతీయ రక్షణ మార్కెట్‌లో అందరి దృష్టినీ అమితంగా ఆకర్షిస్తున్నాయి.
ఈ అద్భుత విజయంపట్ల భారత సైన్యం, డీఆర్డీవో, సంబంధిత భాగస్వాములను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ విజయం భారతదేశ వైమానిక రక్షణ సామర్థ్యాలకు.. ముఖ్యంగా అధిక ఎత్తులో నిర్వహణ అవసరాలను తీర్చడంలో గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన అభివర్ణించారు.
విజయవంతమైన ఈ పరీక్షలో పాల్గొన్న బృందాలను రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ అభినందించారు. అధిక ఎత్తులో దేశానికి కీలకమైన వైమానిక రక్షణ అవసరాలను ఈ క్షిపణి తీర్చిందని ఆయన పేర్కొన్నారు.
***
(Release ID: 2145861)