సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ముంబయిలోని ఎన్ఎఫ్డీసీ కాంప్లెక్స్‌లో ఐఐసీటీ మొదటి క్యాంపస్ ప్రారంభం
ఐఐసీటీ గుర్తు, వేవ్స్ ఫలితాలు-ప్రభావాల నివేదికలను ఆవిష్కరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఎన్ఎఫ్‌డీసీ-నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాలోని గుల్షన్ మహల్లో వేవ్స్ భారత్ పెవిలియన్ ప్రారంభ వేడుకలు
వేవ్స్ ఇప్పుడు ఒక ఉద్యమంగా మారింది.. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతిధ్వనిస్తోంది: మహారాష్ట్ర ముఖ్యమంత్రి
ఏవీజీసీ-ఎక్స్ఆర్ నిపుణులు, శిక్షకులకు అధునాతన శిక్షణ ఇవ్వడానికి పూర్తిగా పరిశ్రమకు అనుగుణంగా ఉండే సరికొత్త కార్యక్రమాలను ఐఐసీటీ అందిస్తుంది: అశ్వినీ వైష్ణవ్
Posted On:
18 JUL 2025 4:28PM by PIB Hyderabad
ముంబయిలోని ఎన్ఎఫ్డీసీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన 'ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ' (ఐఐసీటీ) మొదటి క్యాంపస్, కార్యనిర్వహణ సముదాయం, తరగతి గదులను మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర సమాచార, ప్రసార, రైల్వేలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్లు ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఎన్ఎఫ్డీసీ-నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా (ఎన్ఎమ్ఐసీ)లోని గుల్షన్ మహల్లో వేవ్స్ 2025 భారత్ పెవిలియన్నూ వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025) మొదటి ఎడిషన్ ఫలితాలు-ప్రభావాల నివేదికలను వారు విడుదల చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాలు, ఐటీ శాఖల మంత్రి శ్రీ ఆశిష్ షెలార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజేష్ సింగ్ మీనా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐఐసీటీ గుర్తుతో పాటు, పదిహేడు కోర్సులనూ ఆవిష్కరించారు.



ఈ సందర్భంగా మహారాష్ట్ర ఫిల్మ్, స్టేజ్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎమ్ఎఫ్ఎస్సీడీసీఎల్) ద్వారా ప్రసార భారతి-మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూ)పై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. దేశంలో చలనచిత్ర, టెలివిజన్ రంగాల్లో సృజనాత్మకత ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ.. మీడియా రంగంలో ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ పోటీతత్వాన్ని ప్రోత్సహించే ఫిల్మ్, టెలివిజన్ మీడియా సమీకృత కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇరుపక్షాలు కలిసి పనిచేయనున్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఫడ్నవీస్ మాట్లాడుతూ.. భారత వినోద రాజధాని ముంబయిలో వేవ్స్ తొలి ఎడిషన్ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మే 1-4 తేదీల్లో ముంబయిలో నిర్వహించిన వేవ్స్ తొలి ఎడిషన్ గొప్ప విజయం సాధించిందన్నారు. క్రియేటివ్ ఎకానమీని ప్రోత్సహించడానికి దేశంలో ప్రపంచస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా.. కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషితోనే వేవ్స్ విజయం సాధ్యమైందని శ్రీ ఫడ్నవీస్ పేర్కొన్నారు. "వేవ్స్ ఇప్పుడు ఒక ఉద్యమంగా మారింది.. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు. వేవ్స్ సదస్సు క్రియేటివ్ ఎకానమీకి కొత్త ఊపునిచ్చిందన్నారు. వేవ్స్ కార్యక్రమాన్ని, క్రియేటర్స్ ఎకానమీని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 150 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఫిల్మ్ సిటీలో ఏర్పాటు కానున్న ఐఐసీటీ క్యాంపస్ ప్రపంచ స్థాయి విద్యాసంస్థగా మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించే నిర్మాణాత్మక, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వేవ్స్ 2025లో అందరి ప్రశంసలు పొందిన భారత్ పెవిలియన్ ప్రస్తుతం ఎన్ఎమ్ఐసీలోని గుల్షన్ మహల్కు మారింది.. ఇది ముంబయి పర్యాటకంలో సరికొత్త సాంస్కృతిక గమ్యస్థానాన్ని జోడిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వేవ్స్ సదస్సు సందర్భంగా మొదట 42 కంపెనీలతో, సుమారు రూ. 93,000 కోట్ల సమష్టి విలువతో ప్రకటించిన వేవ్స్ సూచీ స్వల్ప వ్యవధిలోనే రూ.1 లక్ష కోట్లు దాటిందని శ్రీ ఫడ్నవీస్ తెలిపారు. ఇది క్రియేటర్స్ ఎకానమీ వేగవంతమైన వృద్ధినీ, అపారమైన సామర్థ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. సృజనాత్మక సాంకేతిక రంగంలో ఐఐటీలు, ఐఐఎంల స్థాయి సంస్థను ఏర్పాటు చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కల సాకారం దిశగా ఐఐసీటీ ఏర్పాటు ఒక చారిత్రక నిర్ణయమన్నారు. క్రియేటివ్ ఎకానమీ రంగంలో పనిచేసే వ్యక్తులకు కొత్త నైపుణ్యాలు, శిక్షణ, సాధనాలను అందించడంతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ పద్ధతులను భారత్ అనుసరించేలా చేయడం చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడే సరికొత్త ఇంక్యుబేషన్లు, కొత్త ఆలోచనలు, కొత్త సాంకేతికతలు దేశీయంగా రూపొందుతాయని శ్రీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. తక్కువ వ్యవధిలోనే తొలి ఐఐసీటీ క్యాంపస్ ప్రారంభించుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఫిల్మ్ సిటీలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో తదుపరి క్యాంపస్ను అత్యంత సుందరంగా, పరిసరాలకు అనుగుణంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఐఐసీటీ కోసం 400 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి తెలిపారు. ఐఐసీటీలో వీఎఫ్ఎక్స్, పోస్ట్-ప్రొడక్షన్, ఎక్స్ఆర్, గేమింగ్, యానిమేషన్లకు సంబంధించి పూర్తిగా పరిశ్రమకు అనుగుణంగా ఉండే అధునాతన కార్యక్రమాలు ఉంటాయని శ్రీ వైష్ణవ్ తెలిపారు. పరిశ్రమ-విద్యారంగాల అనుసంధాన స్ఫూర్తితో గూగుల్, మెటా, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అడోబ్, డబ్ల్యుపీపీ వంటి సంస్థలతో ఐఐసీటీ అధికారిక ఒప్పందాలు చేసుకుందన్నారు. మొదటి బ్యాచ్లో 300 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగాల నిపుణులు, శిక్షకులకూ అధునాతన శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

ప్రముఖ సినీ నిర్మాత, ఐఎఫ్ఎఫ్ఐ ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ శేఖర్ కపూర్, ప్రఖ్యాత గేయ రచయిత, సీబీఎఫ్సీ చైర్పర్సన్ శ్రీ ప్రసూన్ జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ’ (ఐఐసీటీ) గురించి
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) ఈ ఆగస్టు నుంచి మొదటి బ్యాచ్ విద్యార్థుల కోసం ప్రవేశాలు ప్రారంభించనున్న క్రమంలో.. అభివృద్ధి చెందుతున్న భారత డిజిటల్, క్రియేటివ్ ఎకానమీ పరివర్తనాత్మక ముందడుగుకు రంగం సిద్ధమైంది. ఈ సంస్థ ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్-ఎక్స్టెండెడ్ రియాలిటీ) రంగంలో పరిశ్రమ ఆధారిత కోర్సుల బలమైన పోర్ట్ఫోలియోను అందిస్తుంది. వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చేయండి.

ఐఐసీటీ-ఎన్ఎఫ్డీసీ క్యాంపస్ వద్ద తరగతి గది
భారత్ పెవిలియన్ గురించి
అద్భుతంగా కథలు చెప్పే భారత వారసత్వం.. ప్రపంచస్థాయి కంటెంట్ రూపకల్పన భవిష్యత్తులో భారత్ ముందడుగుకు సంబంధించిన వేడుకల్లో భాగంగా.. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025 కేంద్రంగా భారత్ పెవిలియన్ ఆవిర్భవించింది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పెవిలియన్.. భారత సాంస్కృతిక ఆత్మను.. కాలా నుంచి కోడ్ వరకు దాని డిజిటల్ పరివర్తనను అధికారికంగా ప్రదర్శిస్తుంది. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆలోచనలు, నాయకత్వం ద్వారా ఏర్పాటైన ఈ భారత్ పెవిలియన్.. సృజనాత్మక రంగంలో తిరుగులేని శక్తిగా ఎదగాలనే భారత ఆకాంక్షను సూచిస్తుంది. నిర్ధిష్ట రంగానికి సంబంధించిన విస్తృత అంశాలతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలు లీనమయ్యే అనుభవాన్ని అందించడమే కాకుండా.. కంటెంట్, సృజనాత్మకత, సంస్కృతి ఆధారితమైన ఆరెంజ్ ఎకానమీని పెంపొందించడం పట్ల సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చేయండి.

ఎన్ఎఫ్డీసీ-ఎన్ఎమ్ఐసీలోని గుల్షన్ మహల్ వద్ద భారత్ పెవిలియన్
వేవ్స్ 2025 ఫలితాలు-ప్రభావాల నివేదికలు
ఆవిష్కరణలు, అమలు, ప్రపంచ భాగస్వామ్యంపై దృష్టి సారిస్తూ, వేవ్స్ వ్యవస్థలో ముఖ్య భాగంగా ఉన్న బహుళ నివేదికలు, కార్యక్రమాలను అధికారికంగా ఆవిష్కరించారు. వాటిలో భాగంగా ఉన్నవి:
WAVES Outcome Report
- Report on Conference Track
- Global Media Dialogue: Coffee Table Book
- Creatosphere Report
- WAVEX Report
- Waves Bazaar Report
ఈ ప్రచురణలు భారత మీడియా-వినోద రంగ అసాధారణ చైతన్యాన్ని, వైవిధ్యాన్ని, చలనచిత్రం, టెలివిజన్, యానిమేషన్, గేమింగ్, లీనమయ్యే మీడియా, ప్రత్యక్ష కార్యక్రమాలు, సంగీతం, డిజిటల్ కంటెంట్ను ప్రధానంగా వివరిస్తాయి. మరిన్ని వివరాల కోసం click here.
***
(Release ID: 2145950)