ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లో నవసారీలో లఖ్‌పతీ దీదీలతో ప్రధానమంత్రి సంభాషణకు తెలుగు అనువాదం
Posted On:
08 MAR 2025 10:55PM by PIB Hyderabad
లఖ్‌పతీ దీదీ – ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మాకు అందిన ఈ గౌరవం, మర్యాద చాలా సంతోషాన్నిస్తున్నాయి.
ప్రధానమంత్రి – ఈ ప్రపంచం ఈ రోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటూ ఉండొచ్చు. కానీ మన దేశ విలువలు, సంస్కృతిలో.. మాతృ దేవో భవతో మనం ప్రారంభిస్తాం. మనకు 365 రోజులూ తల్లే దేవత. ఒక్క రోజుకి మాత్రమే కాదు.
లఖ్‌పతీ దీదీ – శివానీ మహిళా మండలిలో మన సౌరాష్ట్ర సంస్కృతిలో భాగమైన బీడ్ వర్క్ చేస్తాం. ఇప్పటి వరకు ఈ కళలో 400 మందికి పైగా సోదరీమణులకు మేం శిక్షణ ఇచ్చాం. మా 11 మందిలో ముగ్గురు నుంచి నలుగురు మార్కెటింగ్ బాధ్యతలు చూస్తారు. మరో ఇద్దరు అకౌంట్లను నిర్వహిస్తారు.
ప్రధానమంత్రి – అంటే, మార్కెటింగ్ చేసేవారు ఇతర ప్రాంతాలకు వెళతారా?
లఖ్‌పతీ దీదీ – అవును సర్, ఇతర రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలకు వెళతారు.
ప్రధానమంత్రి – అంటే, మీరు దేశమంతా ప్రయాణించారా?
లక్పతీ దీదీ – అవును సర్, దాదాపుగా అన్ని ప్రాంతాలకు వెళ్లాం. మేం వెళ్లని నగరమంటూ లేదు.
ప్రధానమంత్రి – అయితే సోదరి పారుల్ ఎంత సంపాదిస్తున్నారు?
లఖ్‌పతీ దీదీ – పారుల్ సోదరి రూ.40,000 కంటే ఎక్కువే సంపాదిస్తోంది.
ప్రధానమంత్రి – అంటే ఇప్పుడు మీరు లఖ్‌పతీ దీదీ అయ్యారా?
లఖ్‌పతీ దీదీ – అవును సర్, నేను లఖ్‌పతీ దీదీగా మారాను. నా సంపాదనను తిరిగి పెట్టుబడిగా పెడుతున్నాను. నాతో పాటు మా బృందంలోని 11 మంది అక్కచెల్లెళ్లను కూడా లఖ్‌పతీ దీదీలుగా మార్చాలని నేను భావిస్తున్నాను. అలాగే మా గ్రామంలోని ప్రతి సోదరి దీన్ని సాధించాలని కోరుకుంటున్నాను.
ప్రధానమంత్రి – అద్భుతం!
లఖ్‌పతీ దీదీ – ప్రతి ఒక్కరినీ లఖ్‌పతీ దీదీగా మార్చడమే నా లక్ష్యం.
ప్రధానమంత్రి – మంచిది, నా లక్ష్యం 3 కోట్ల మంది లఖ్‌పతీ దీదీలను తయారు చేయడం. మీరంతా దాన్ని 5 కోట్లకు చేరుస్తారని అనుకుంటున్నాను.
లఖ్‌పతీ దీదీ – కచ్చితంగా! మాట ఇస్తున్నాం.
లఖ్‌పతీ దీదీ – నా బృందంలో 65 మంది సోదరీమణులు ఉన్నారు. వారంతా నాతో కలసి పనిచేస్తున్నారు. మేము ‘మిశ్రీ’ (పటిక బెల్లం) నుంచి ప్రత్యేక సిరప్ తయారు చేస్తాం. మా వార్షిక టర్నోవరు 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఉంటుంది. నా వ్యక్తిగత ఆదాయం 2.5 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. నా సహ దీదీల ఆదాయం 2 నుంచి 2.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. మా ఉత్పత్తుల అమ్మకానికి స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ)లతో కలసి పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మాకో అండ దొరికింది. ఈ స్థాయికి చేరుకుంటామని ఎప్పుడూ అనుకోలేదు. నాతో కలసి పనిచేస్తున్న మహిళలు తమ పిల్లలను బాగా చదివిస్తున్నారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వారికి మేం సాయం చేశాం. నా బృందంలోని చాలా మంది మహిళలు సొంత యాక్టీవా స్కూటర్లపై మార్కెటింగ్‌కు వెళతారు. మరికొందరు బ్యాంకు పనులు చూసుకుంటే, ఇంకొందరు అమ్మకాలు చూసుకుంటారు.
ప్రధానమంత్రి – అంటే, మీ సోదరీమణులందరికీ సొంత వాహనాలున్నాయా?
లఖ్‌పతీ దీదీ – అవును సర్! నా కోసం ఎకో కార్ కూడా కొనుక్కున్నాను.
ప్రధానమంత్రి – చాలా మంచి విషయం!
లఖ్‌పతీ దీదీ – ఈ కారును నేను నడపలేను. ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు నేను డ్రైవర్‌ని వెంట తీసుకెళ్తాను. సర్, ఈ రోజు నా ఆనందం రెట్టింపయ్యింది! ఇది మా అందరి కల – మిమ్మల్ని టీవీలో చూస్తూ ఉంటాం. పెద్ద జనసందోహం మధ్యలో కూడా మిమ్మల్ని చూడాలని ప్రయత్నించాం. కానీ, ఇప్పుడు మిమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తున్నాం.
ప్రధానమంత్రి – చూడండి, నేను మీ అందరి స్టాళ్లను సందర్శించాను. నాకు అవకాశం వచ్చిన ప్రతి సారీ - నేను ముఖ్యమంత్రిగా ఉన్నా లేదా ప్రధానమంత్రిగా ఉన్నా - నాకు ఎలాంటి తేడా లేదు. నేను ఎప్పుడూ ఒకే విధంగా ఉన్నాను.
లఖ్‌పతీ దీదీ – సర్, మీ వల్లే, మీ ఆశీర్వాదాల వల్లే.. మేం, మహిళలం, ఎన్నో అవరోధాలను అధిగమించి ఇంత ఉన్నత స్థాయికి చేరుకున్నాం. మేం లఖ్‌పతీ దీదీలుగా మారాం. ఇప్పుడు నాతో ఉన్న మహిళలు కూడా...
ప్రధానమంత్రి – మీరు లఖ్‌పతీ దీదీ అని మీ ఊరిలో ఉన్నవారికి తెలుసా?
లఖ్‌పతీ దీదీ – అవును సర్. అందరికీ తెలుసు. నేను ఇక్కడకి వస్తున్నానని తెలిసినప్పుడు మా ఊరి గురించి మీకు ఫిర్యాదు చేస్తానేమోనని కొందరు భయపడ్డారు కూడా. ‘‘దీదీ, మీరు వెళ్లినప్పుడు మన గ్రామం గురించి ఎలాంటి ఫిర్యాదులు చేయకండి’’ అని కూడా చెప్పారు.
లఖ్‌పతీ దీదీ – 2023లో మీరు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినప్పుడు.. సజ్జలు, జొన్నలు కేజీ రూ. 35కే అమ్ముతున్నామని, దానికి విలువను జోడించడంపై దృష్టి సారించాలని మా గ్రామంలోని మహిళలు గుర్తించారు. ఆ విధంగా, ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. మా వ్యాపారాన్ని మేం నిర్మించుకున్నాం. మేం మూడు ఉత్పత్తులతో ప్రారంభించాం. అందులో ఒకటి కుకీస్, ఇంకొటి ఖాఖ్రా. మీకు గుజరాతీ ఖాఖ్రా గురించి తెలుసు కదా?
ప్రధానమంత్రి – ఖాఖ్రా ఇప్పుడు మొత్తం భారత్ ఉత్పత్తిగా మారింది!
లఖ్‌పతీ దీదీ – అవును సర్! అది ఇండియా మొత్తం చేరువైంది.
ప్రధానమంత్రి – మోదీ లఖ్‌పతీ దీదీలను తయారు చేయాలనుకుంటున్నారు అని తెలిసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారు?
లఖ్‌పతీ దీదీ – సర్, నిజం చెప్పాలంటే, మహిళలకు ఇది అసాధ్యమని మొదట అనుకున్నారు. లక్షాధికారి అంటే.. సంపాదనలో ఎక్కువ సున్నాలు ఉండటం.. అది పురుషులకు మాత్రమే సొంతమని వారు అనుకున్నారు. కానీ నేను వారికి ఏం చెబుతున్నానంటే.. ‘‘ఈ రోజు మేం లక్షాధికారులం, మరికొన్నేళ్లలో, సరిగ్గా ఇదే రోజున.. కరోడ్‌పతి దీదీ కార్యక్రమంలో పాల్గొంటాం!’’
ప్రధానమంత్రి – అద్భుతం!
లఖ్‌పతీ దీదీ – ఈ కలను మేం నిజం చేస్తాం! మీరు మాకు మార్గం చూపించారు. మమ్మల్ని లక్షాధికారులను చేశారు. ఇప్పుడు మేం, మరో అడుగు ముందుకు వేసి.. కోటీశ్వరులుగా మారి మీకు చూపిస్తాం. సర్, అప్పుడు ఇక్కడ ‘‘మేం ఇప్పుడు కరోడ్‌పతి దీదీలం!’’ అనే బ్యానర్ ఉంటుంది.
లఖ్‌పతీ దీదీ – నేను డ్రోన్ పైలట్‌ను కూడా. డ్రోన్ దీదీని, ఇప్పుడు నా ఆదాయం 2 లక్షల రూపాయలకు చేరుకుంది.
ప్రధానమంత్రి – నేను ఒకసారి ఓ సోదరితో మాట్లాడాను. అప్పుడు ఆమె ‘‘నాకు సైకిల్ ఎలా తొక్కాలో తెలియదు, కానీ ఇఫ్పుడు డ్రోన్ ఎగరవేస్తున్నాను!’’ అని చెప్పింది.
లఖ్‌పతీ దీదీ – మేం విమానాలు నడపలేకపోవచ్చు. కానీ డ్రోన్లను ఎగరవేస్తున్నాం, అయినా మేం పైలట్లమే.
ప్రధానమంత్రి – ఇప్పడు, మీరు పైలటయ్యారు!
లఖ్‌పతీ దీదీ – అవును సర్, మా మరుదులు నన్ను వదిన అని పిలవట్లేదు. పైలట్ అని పిలుస్తున్నారు.
ప్రధానమంత్రి – ఓహ్! అంటే ఇప్పుడు మీ కుటుంబం మొత్తానికి మీరు పైలట్ దీదీ అన్నమాట?
లఖ్‌పతీ దీదీ – అవును, సర్! వాళ్లు ఇంటికి వచ్చినప్పుడుల్లా నన్ను పైలట్ అనే పిలుస్తారు.
ప్రధానమంత్రి – మరి మీ ఊర్లో వారి సంగతేంటి? వాళ్లు కూడా అలాగే పిలుస్తారా?
లఖ్‌పతీ దీదీ – అవును, గ్రామస్థులు కూడా అలాగే పిలుస్తారు!
ప్రధానమంత్రి – మీరు ఎక్కడ శిక్షణ తీసుకున్నారు.
లఖ్‌పతీ దీదీ – మహారాష్ట్రలోని పుణేలో.
ప్రధానమంత్రి – శిక్షణ కోసం పుణే వరకు వెళ్లారా?
లఖ్‌పతీ దీదీ – అవును సర్, పుణేకి వెళ్లాను!
ప్రధానమంత్రి – మీ కుటుంబం దానికి అంగీకరించిందా?
లఖ్‌పతీ దీదీ – అవును.
ప్రధానమంత్రి – చాలా మంచి విషయం.
లఖ్‌పతీ దీదీ – అప్పటికి నా కొడుకు చాలా చిన్నవాడు. తనని ఇంట్లోనే వదలివెళ్లాను. నేను లేకుండా ఎలా ఉండగలడా? అని ఆలోచిస్తూ ఉండేదాన్ని.
ప్రధానమంత్రి – అంటే ఓ రకంగా, మీ అబ్బాయే మిమ్మల్ని డ్రోన్ దీదీ చేశాడు!
లఖ్‌పతీ దీదీ – అవును! ఇప్పుడు తనకీ ఓ లక్ష్యం ఉంది. – ‘‘అమ్మా, నువ్వు డ్రోన్ పైలట్ అయ్యావు కదా, నేను ఎయిర్‌ప్లేన్ పైలట్ అవుతా!’’ అంటున్నాడు.
ప్రధానమంత్రి – మంచి విషయం! ఇప్పుడు, దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో డ్రోన్ దీదీలు తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.
లఖ్‌పతీ దీదీ – సర్, ఈ విషయంలో మీకు ధన్యవాదాలు, మీ డ్రోన్ దీదీ పథకం ద్వారా నేను లఖ్‌పతీ దీదీ అయ్యాను.
ప్రధానమంత్రి – మీ ఇంట్లో మీ స్థాయి కూడా పెరిగే ఉంటుంది కదా!
లఖ్‌పతీ దీదీ – అవును, సర్!
లఖ్‌పతీ దీదీ – నేను మొదలుపెట్టినప్పుడు నాతో 12 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 75కి పెరిగింది.
ప్రధానమంత్రి – వారెంత సంపాదిస్తున్నారు?
లఖ్‌పతీ దీదీ –మా రాధాకృష్ణ మండలి గురించి చెప్పాలంటే, మా సభ్యులు ఎంబ్రాయిడరీ, పశుపోషణ చేస్తున్నారు. అందరూ కలసి ఏడాదికి 9.5 లక్షల నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు.
ప్రధానమంత్రి – పది లక్షల రూపాయలు!
లఖ్‌పతీ దీదీ – అవును, సర్, మేం అంతే సంపాదిస్తున్నాం.
లఖ్‌పతీ దీదీ – 2019లో స్వయం సహాయక బృందాల్లో చేరిన తర్వాత బరోడా స్వయం ఉపాధి సంస్థ ద్వారా బ్యాంకు సఖి శిక్షణ తీసుకున్నాను.
ప్రధానమంత్రి – రోజుకి ఎంత మొత్తాన్ని మీరు నిర్వహించగలుగుతున్నారు?
లఖ్‌పతీ దీదీ – రోజుకి సగటున 1 నుంచి 1.5 లక్షల రూపాయలను నిర్వహిస్తాను. వాటిలో ఎక్కువ భాగం బ్యాంకు వద్దే చేస్తాను. కొన్ని లావాదేవీలను ఇంటి దగ్గర కూడా చేస్తాను.
ప్రధానమంత్రి – అది మీకు ఒత్తిడి కలిగించదా?
లఖ్‌పతీ దీదీ – అస్సలు లేదు, సర్! నేను ఎక్కడికి వెళ్లినా నాతో పాటు ఓ చిన్న బ్యాంకును తీసుకెళతాను.
ప్రధానమంత్రి – గొప్ప విషయమే!
లఖ్‌పతీ దీదీ – అవును, సర్.
ప్రధానమంత్రి – మీరు నెలకు ఎంత మేర బ్యాంకు లావాదేవీలు చేస్తున్నారు?
లఖ్‌పతీ దీదీ – సర్, నా నెలవారీ బ్యాంకు లావాదేవీలు 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉంటాయి.
ప్రధానమంత్రి – అంటే.. బ్యాంకులపై ప్రజలకు విశ్వసనీయత పెరిగిందని అర్థం. అంటే మీరు వస్తే.. బ్యాంకు వచ్చినట్టే అని వారు నమ్ముతున్నారు.
లఖ్‌పతీ దీదీ – అవును, సర్. నిజమే!
లఖ్‌పతీ దీదీ – సర్, నా హృదయపూర్వకంగా మిమ్మల్ని నేను గురువుగా భావిస్తున్నాను. ఈ రోజు, మీ వల్లే, మీరు ఇచ్చిన స్ఫూర్తి వల్లే నేను లఖ్‌పతీ దీదీ అయ్యాను. నేను ముందుకు సాగడానికి, ఈ స్థాయికి చేరడానికి మీ మార్గదర్శకత్వమే తోడ్పడింది. నేను ఏదో కలలో ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. నిజంగానే మేం లఖ్‌పతీ దీదీలు అయ్యాం! ఇతర మహిళలు కూడా ఇదే సాధించేలా చేయడమే మా లక్ష్యం. సఖీ మండలి నా జీవితంలో పెద్ద మార్పునే తీసుకువచ్చింది. ఓ రోజు ముస్సోరీ నుంచి రాధా బెన్ రస్తోగీ అనే మేడం వచ్చారు. ఆవిడ నా నైపుణ్యాలు చూసి నన్ను ముస్సోరీకి ఆహ్వానించారు. నేను వెంటనే అంగీకరించి అక్కడికి వెళ్లాను. అక్కడ నేను 50 మంది వంట సిబ్బందికి సజ్జలు, జొన్నలతో గుజరాతీ రోట్లా తయారు చేయడం నేర్పించాను. నా మనసుకి బాగా నచ్చిన విషయం ఏమిటంటే.. నేను ఎక్కడికి వెళ్లినా.. ‘ఈమె రీటా బెన్, నరేంద్ర మోదీ సాహెబ్ రాష్ట్రం, గుజరాత్ నుంచి వచ్చారు’’ అని చెబుతారు. ఇది గుజరాత్ మహిళగా నన్ను గర్వపడేలా చేస్తోంది. అది నాకు గొప్ప గౌరవాన్ని ఇస్తోంది సర్!
ప్రధానమంత్రి – ఇప్పుడు, మీరంతా ఆన్లైన్ వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టాలి. మీకు సహాయమందించేలా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయమని ప్రభుత్వాన్ని నేను అడుగుతాను. మనం చాలా మంది సోదరీమణులను అనుసంధానించాం. వారంతా క్షేత్రస్థాయిలోనే ఆదాయం సంపాదిస్తున్నారు. భారతీయ మహిళలు కేవలం ఇంటి పనికే పరిమితం కారని - అది అపోహేనని ఈ ప్రపంచం తెలుసుకోవాలి. వాస్తవానికి వారు భారతీయ ఆర్థిక సామర్థ్యాన్ని వెనక ఉండి నడిపిస్తున్న శక్తి. భారతీయ ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో గ్రామీణ మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. రెండోది.. టెక్నాలజీని మహిళలు త్వరగా నేర్చుకుంటారని నేను గమనించాను. డ్రోన్ దీదీలు ఈ విషయాన్ని నిరూపించారు. డ్రోన్ పైలట్లుగా మేం శిక్షణ ఇచ్చిన మహిళలు కేవలం రెండు, మూడు రోజుల్లోనే ఆ నైపుణ్యాలను పెంచుకోగలిగారు. చాలా త్వరగా వారు నేర్చుకున్నారు. నిబద్దతతో సాధన చేశారు. మన దేశ మహిళల్లో పోరాడే తత్వం, తయారు చేసే, పోషించే, సంపదను సృష్టించే శక్తి సహజంగా ఉంటుంది. ఈ సామర్థ్యం లెక్కలకు అందనిది. ఈ శక్తి మన దేశానికి ఎన్నో ప్రయోజనాలను తీసుకు వస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
సూచన: లఖ్‌పతీ దీదీలతో ప్రధానమంత్రి చర్చలో కొన్ని భాగాలు గుజరాతీలో ఉన్నాయి. వాటిని హిందీలోకి తర్జుమా చేశారు.
***
(Release ID: 2159146)
Visitor Counter : 8
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam