యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చారిత్రక యూరోపియన్ ట్రెబుల్ తర్వాత యువ ఫుట్ బాలర్లను


సత్కరించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ: భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఇది కొత్త ఆరంభమని వర్ణన

Posted On: 28 AUG 2025 6:54PM by PIB Hyderabad

మొహాలీలోని మినర్వా ఫుట్‌‌బాల్ క్లబ్‌కు చెందిన యువ ఫుట్‌బాలర్లను యువజన వ్యవహరాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు న్యూఢిల్లీలో సత్కరించారు. యూరోప్‌లో వారు సాధించిన విజయాలు భారత ఫుట్‌బాల్ భవిష్యత్తుకు నూతన ప్రారంభంగా వర్ణించారు.

22 మంది ఆటగాళ్లతో కూడిన అండర్ - 14/15 జట్టు ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో గోథియా కప్ (స్వీడన్), ది డానా కప్ (డెన్మార్క్), నార్వే కప్ (నార్వే) గెలిచి మొదటిసారిగా యూరోపియన్ ట్రెబుల్‌ను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది.

‘‘అంతర్జాతీయంగా ఫుట్‌బాల్‌ క్రీడలో భారత్ మరింత కీర్తి సాధించాలనే తపనకు ఇది నూతన ఆరంభం’’ అని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు.

యువ క్రీడాకారులు ఎక్కడ పోటీపడుతున్నా ‘దేశమే ముందు’ అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. ‘‘స్పోర్ట్స్ సైన్స్, పోషకాహారం, సైకాలజిస్టుల ద్వారా మానసిక దృఢత్వానికి యువ క్రీడాకారులు మరింత ప్రాధాన్యమివ్వాలి. ఇది భారత్‌ను విజయపథంలో నడిపిస్తుంది. ఈ యువకులు అధిక విశ్వాసాన్ని, క్రీడ పట్ల మక్కువను కొనసాగించాలని’’ అని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు.

ఈ మూడు ఫుట్ బాల్ పోటీలను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా పరిగణిస్తారు. ఈ బృందం 26 అంతర్జాతీయ మ్యాచుల్లో 295 గోల్స్ చేసి అజేయంగా నిలించింది. అదే సమయంలో సౌత్ అమెరికా, యూరోప్, ఇతర దేశాలకు చెందిన యూత్ క్లబ్బులకు అతి తక్కువ గోల్స్ ఇచ్చింది.

మినర్వా అకాడమీ ఎప్‌సీ ఖేలో ఇండియా గుర్తింపు పొందింది. గోథియా కప్ 2025లో భారత్ నుంచి యూ-14 జట్లతో పాల్గొన్న ఆరు క్లబ్బుల్లో ఇది కూడా ఒకటి. స్వీడన్‌లో యూత్ కప్‌గా పిలిచే గోథియా కప్ 2025 ఫైనల్లో అర్జెంటీనాకు చెందిన ఎస్కులా డె ఫుట్ బాల్ 18 టుకుమాన్ జట్టుపై 4-0 తేడాతో గెలుపొందింది.

కొంతోజమ్ యోహెన్బా సింగ్ (ఉత్తమ క్రీడాకారుడు, గోథియా కప్), హుయ్‌డ్రోమ్ టోనీ (ఉత్తమ ప్లేయర్, డానా కప్) లాంటి క్రీడాకారులు వ్యక్తిగత అవార్డులను పొందారు.

 

***


(Release ID: 2161696) Visitor Counter : 22