జౌళి మంత్రిత్వ శాఖ
పత్తిపై దిగుమతి సుంకం మినహాయింపు 2025 డిసెంబరు 31 వరకు పొడిగింపు
• దేశీయ పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే... అంతర్జాతీయ మార్కెట్టులో పోటీకి చేయూత
• ముడిసరకు ఖర్చులను స్థిరీకరించడం, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వాన్ని బలపరచడం,
వస్త్రాలతో పాటు దుస్తుల విలువాధారిత వ్యవస్థలో ఉపాధి స్థిరతకు తోడ్పడనున్న సుంక రహిత దిగుమతులు
• భారత్ మొత్తం జౌళి ఎగుమతుల్లో 33 శాతం పత్తి వస్త్రాల ఎగుమతులు… పత్తి డిమాండును పెంచడం... తద్వారా రైతులకూ ప్రత్యక్ష ప్రయోజనం
Posted On:
28 AUG 2025 7:56PM by PIB Hyderabad
భారత జౌళి పరిశ్రమ మన దేశంలోనే అతి ఎక్కువ మందికి ఉపాధిని అందిస్తున్న రెండో రంగం. పరిశ్రమకు… అధిక నాణ్యత కలిగిన పత్తి అందుబాటులో ఉండాలి. అవసరానికీ, సరఫరాకూ మధ్య అంతరం ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొన్న ప్రభుత్వం... పత్తిపై దిగుమతి సుంకం మినహాయింపును ఈ ఏడాది డిసెంబరు 31 వరకు పొడిగించింది. ఈ నిర్ణయాన్ని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్రీయ మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. దీంతో నూలు, వస్త్రం, దుస్తులు, మేడ్-అప్స్ సహా పూర్తి వస్త్ర సంబంధిత వ్యవస్థలో... ఉత్పాదక వ్యయాల్లో స్థిరత్వం నెలకొంటుందని భావిస్తున్నారు. ఇది తయారీదారు సంస్థలతో పాటు వినియోగదారులకు కూడా ఊరటనిస్తుంది. వ్యూహాత్మకంగా తీసుకొన్న ఈ నిర్ణయం మన జౌళి రంగాన్ని ప్రపంచ స్థాయిలో పోటీపడేదిగా నిలపడంతో పాటు దేశీయ పత్తి రైతుల ప్రయోజనాలను కూడా కాపాడనుంది. దిగుమతుల్లో చాలా వరకు విశిష్ట పారిశ్రామిక అవసరాలను లేదా బ్రాండుతో ముడిపడ్డ ఎగుమతి కాంట్రాక్టుల అవసరాలను నెరవేరుస్తాయి. అవి దేశీయ పత్తికి ప్రత్యామ్నాయం కాబోవు.
తక్కువ స్థాయి ధరలు, ఎక్కువ నాణ్యత కలిగిన పత్తి.. ఇవి ఎగుమతి మార్కెట్లలో భారత్ స్థితిని పటిష్ఠపరుస్తాయి. దీంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు ఎగుమతి ప్రధాన యూనిట్లకు ఆర్డర్లు రావడం పెరుగుతోంది. వస్త్రాలు, దుస్తుల విలువాధారిత వ్యవస్థ 4.5 కోట్ల కన్నా ఎక్కువ మందికి బతుకుతెరువును చూపుతోంది. ఉపాధి అవకాశాలు తగ్గిపోకుండా ఉండాలంటే పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించాలి. ఇది జరగాలంటే పత్తి నిలకడగా అందుబాటులో ఉంటేటట్లు చూడడం కీలకం. ముడిసరకు నిరంతర సరఫరాతో అధిక విలువ కలిగిన వస్త్రాలు, దుస్తుల ఉత్పాదన జోరందుకొంటుందన్న భావన ఉంది. ఇది ప్రభుత్వ ‘భారత్‌లో తయారీ’ (మేక్ ఇన్ ఇండియా)తో పాటు దేశీయ ఉత్పత్తి లక్ష్యాలకూ ఊతాన్ని అందించగలుగుతుంది.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అమలవుతుండడంతో, సాగుకు పెట్టిన ఖర్చులో రైతులు కనీసం 50 శాతం తిరిగి అందుకోవడానికి వీలు కలుగుతోంది. దీంతో రైతు ప్రయోజనాలకు రక్షణ లభిస్తోంది. దిగుమతి చేసుకొనే పత్తి తరచుగా ప్రత్యేక పారిశ్రామిక అవసరాలను తీరుస్తుంటుంది. దేశీయ పత్తికి ప్రత్యామ్నాయం కాబోదు. దేశీయంగా ఉత్పత్తి తక్కువ ఉన్న సమయంలో లేదా దేశీయంగా నిల్వలు తగినంతగా లేనప్పుడూ మాత్రమే పత్తి దిగుమతులకు అనుమతిస్తారు. ఇది దేశీయ కొనుగోలు ధర గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు కూడా పోటీని తగ్గిస్తుంది. ప్రభుత్వం పత్తి ధరలను నిశితంగా గమనించడంతోపాటు అవసరాన్ని బట్టి తగిన రక్షణ చర్యలను తీసుకుంటుంది.
మన దేశం 2024-25లో ఏప్రిల్-అక్టోబరు మధ్య ఎగుమతి చేసిన వస్త్రాలు, దుస్తుల్లో పత్తి వస్త్రాల ఎగుమతులే దాదాపుగా 33 శాతం వరకు ఉన్నాయి. వీటి విలువ 7.08 బిలియన్ అమెరికా డాలర్లు ఉంటుంది. రెడీమేడ్ దుస్తుల తరువాత రెండో అతి పెద్ద విదేశీమారక ద్రవ్య రూపంలో ఆదాయం పత్తి వస్త్రాల ఎగుమతి నుంచే లభిస్తోంది. మన దేశంలో పండిస్తున్న పత్తిలో 95 శాతం స్థానికంగానే వినియోగం అవుతోంది. సుంకం మినహాయింపు నిర్ణయం రైతులకు పరోక్షంగా మేలు చేయనుంది. ఎలాగంటే ఇది ప్రపంచ దేశాలతో పోటీపడేందుకు దోహదం చేస్తుంది. దీంతో మిల్లులు పత్తి రైతులకు మెరుగైన ధరను చెల్లించగలుగుతాయి.
అన్ని రకాల పత్తిపైన 11 శాతం దిగుమతి సుంకాన్ని ఈ సంవత్సరం 31 వరకు మినహాయింపు ఇవ్వడాన్ని జౌళి సంఘాలు స్వాగతించాయి. చాలా కాలంగా ఉన్న పరిశ్రమ డిమాండును నెరవేర్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ కు జౌళి సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
***
(Release ID: 2162038)
Visitor Counter : 8