ప్రధాన మంత్రి కార్యాలయం
వ్యవసాయ రంగంలో రెండు ముఖ్య పథకాలను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ: మొత్తం వ్యయం రూ. 35,440 కోట్లు
· దేశ స్వావలంబన, రైతుల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలు
· ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన, దాల్‌హన్ ఆత్మనిర్భరతా మిషన్
· రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా విత్తన దశ నుంచి మార్కెటుకు చేరే వరకు సంస్కరణలు
· మూడు ప్రాతిపదికల ఆధారంగా ప్రధానమంత్రి ధన ధాన్య పథకం కోసం 100 జిల్లాల ఎంపిక
· ‘దాల్‌హన్ ఆత్మనిర్భరత’ పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచే మిషన్ మాత్రమే కాదు.. మన భవిష్యత్ తరాలకు సాధికారికంగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా...
· రైతులను సాధికారులను చేయడం, వ్యవసాయంలో పెట్టుబడులను పెంచడం కోసం గత 11 ఏళ్లుగా ప్రభుత్వ నిరంతర కృషి
· పశుపోషణ, చేపల పెంపకం, తేనెటీగల పెంపకంతో చిన్న రైతులు, భూమిలేని కుటుంబాలకు సాధికారత
· నేడు గ్రామాల్లో నమో డ్రోన్ దీదీల నేతృత్వంలో ఆధునిక పద్ధతుల్లో ఎరువులు, క్రిమి సంహారకాల పిచికారీ
· మనం స్వావలంబన సాధిస్తూనే అంతర్జాతీయ మార్కెట్ కోసమూ ఉత్పత్తి చేయాలి
· ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వ్యాఖ్యలు
Posted On:
11 OCT 2025 3:22PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో ఈ రోజు నిర్వహించిన ప్రత్యేక వ్యవసాయ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు రైతులతో కూడా ప్రధానమంత్రి సంభాషించారు.
రూ.35,440 కోట్ల వ్యయంతో వ్యవసాయ రంగంలో రెండు ప్రధాన పథకాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. రూ.24,000 కోట్లతో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజనను, రూ.11,440 కోట్లతో పప్పుధాన్యాల్లో ఆత్మనిర్భరత మిషన్‌ను కూడా ఆయన ప్రారంభించారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య, ఆహార శుద్ధి రంగాల్లో రూ.5,450 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి.. దాదాపు మరో రూ.815 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. “భారత ప్రజాస్వామ్య నిర్మాణాన్ని, గ్రామీణాభివృద్ధిని పునరుద్ధరించిన తేజోమూర్తులైన ఇద్దరు భారత పుత్రుల జయంతి నేడు. ఇది చరిత్రాత్మక దినం. జయప్రకాశ్ నారాయణ్, నానాజీ దేశ్‌ముఖ్ గ్రామీణ భారతం తరఫున గొంతెత్తి నిలిచారు. రైతులు, అణగారిన వర్గాల సాధికారత కోసం జీవితాలను అంకితం చేశారు’’ అని ప్రధానమంత్రి అన్నారు.
స్వావలంబన, గ్రామీణ సాధికారత, వ్యవసాయ ఆవిష్కరణల కొత్త శకానికి నాంది పలికేలా.. ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన, దాల్‌హన్ ఆత్మనిర్భరతా మిషన్ (పప్పు ధాన్యాల్లో స్వావలంబన) పథకాలకు రూపకల్పపన చేశామని, దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు ఇవి నేరుగా ప్రయోజనం కల్పిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు. “భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాల్లో రూ. 35,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతుంది. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడం, దేశానికి ఆహార – పోషకాల భద్రతను అందించడంలో ప్రభుత్వ అచంచలమైన అంకితభావానికి ఇది నిదర్శనం” అని శ్రీ మోదీ అన్నారు.
దేశ అభివృద్ధి ప్రయాణంలో వ్యవసాయానిది ఎప్పుడూ కీలక పాత్రే అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయ రంగం దీర్ఘకాలిక నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్న విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. భారతీయ రైతులను సాధికారులను చేయడానికి తాను కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. వేగంగా పురోగమిస్తున్న 21వ శతాబ్దపు భారతదేశానికి బలమైన, సంస్కరణలతో కూడిన వ్యవసాయ వ్యవస్థ అవసరమని, 2014 తర్వాత తన ప్రభుత్వ హయాంలో ఈ దిశగా మార్పు మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. “గతంలోని ఉదాసీనతను మేం తొలగించాం. విత్తన దశ నుంచి మార్కెటు వరకు.. మన రైతుల ప్రయోజనాల కోసం సమగ్ర సంస్కరణలను మేం ప్రవేశపెట్టాం. ఈ సంస్కరణలు కేవలం విధానపరమైన మార్పులు మాత్రమే కాదు.. అవి భారతీయ వ్యవసాయాన్ని ఆధునికంగా, సుస్థిరంగా, క్రియాశీలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూడిన నిర్మాణాత్మక చర్యలు” అని శ్రీ మోదీ అన్నారు.
గత పదకొండేళ్లలో దేశ వ్యవసాయ ఎగుమతులు దాదాపు రెట్టింపయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి సుమారు 90 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందనీ, పండ్లు - కూరగాయల ఉత్పత్తి 64 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా పెరిగిందనీ తెలిపారు. భారత్ నేడు పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందనీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా ఉందన్నారు. 2014 తో పోలిస్తే తేనె, గుడ్ల ఉత్పత్తి కూడా రెట్టింపైందని తెలిపారు.
తమ హయాంలో దేశంలో ఆరు ప్రధాన ఎరువుల కర్మాగారాలను నెలకొల్పినట్లు ప్రధానమంత్రి తెలిపారు. రైతులకు 25 కోట్లకు పైగా భూసార కార్డులను పంపిణీ చేశామన్నారు. 100 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి సూక్ష్మ నీటిపారుదల సౌకర్యాలు అందాయన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రూ. 2 లక్షల కోట్ల విలువైన బీమా క్లెయిమ్‌లను రైతులకు పంపిణీ చేశారు.
రైతుల మధ్య సహకారం, మార్కెట్ అవకాశాలను పెంపొందించడం కోసం గత పదకొండేళ్లలో 10,000కు పైగా రైతు ఉత్పత్తిదారు సంస్థలను (ఎఫ్‌పీవో) ప్రభుత్వం నెలకొల్పిందన్నారు.
రైతులు, మత్స్యకారులు, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలతో తాను కొంతసేపు మాట్లాడానని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. వారి అనుభవాలను, అభిప్రాయాలనూ విన్న ప్రధానమంత్రి.. ఇలాంటి సంభాషణలు భారతీయ వ్యవసాయంలో పరివర్తనను ప్రతిబింబిస్తాయన్నారు.
ప్రస్తుతం మన దేశం పరిమిత విజయాలతో సరిపెట్టుకోవడం లేదని, స్ఫూర్తిమంతంగా ముందుకెళ్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే.. ప్రతి రంగంలో నిరంతర అభివృద్ధి, పురోగతి ఆవశ్యకమని స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతోనే ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన ప్రారంభించినట్టు తెలిపారు.
ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమ విజయమే ఈ కొత్త వ్యవసాయ కార్యక్రమానికి స్ఫూర్తి అని ప్రధానమంత్రి తెలిపారు. గత ప్రభుత్వాలు దేశంలోని వందకు పైగా జిల్లాలను ‘వెనుకబడినవి’గా ప్రకటించి, వాటిని బాగా నిర్లక్ష్యం చేశాయని ఆయన గుర్తు చేశారు. అందుకు భిన్నంగా తమ ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాలు, క్రియాశీల విధానాలతో ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, వాటిని ‘ఆకాంక్షాత్మక జిల్లాలు’గా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు.
ఏకీకరణ, సహకారం, పోటీ వ్యూహంతో ఈ జిల్లాల్లో పరివర్తన సాధించామని ఆయన వివరించారు. “సబ్ కా ప్రయాస్ స్ఫూర్తితో అందరూ ఐక్యంగా కృషి చేశారు. జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నమూనాను ప్రోత్సహించి అభివృద్ధిని వేగవంతం చేశారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ వందకు పైగా జిల్లాల్లోని దాదాపు 20 శాతం గ్రామాలకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదని ప్రధానమంత్రి చెప్పారు. “నేడు ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా దృష్టి సారించి అమలు చేయడం వల్ల.. ఇందులో చాలా గ్రామాలు అన్ని వాతావరణ పరిస్థితులకూ అనువైన రోడ్లతో అనుసంధానమయ్యాయి” అని శ్రీ మోదీ తెలిపారు. ఆరోగ్య సంరక్షణ సేవలందించడంలోనూ మెరుగుదలను ఆయన ప్రస్తావించారు. కార్యక్రమాన్ని ప్రారంభించే సమయానికి ఈ జిల్లాల్లో 17 శాతం మంది పిల్లల్లో ప్రాథమిక రోగనిరోధకత లోపించిందని తెలిపారు. ఇప్పుడు వీరిలో చాలా మంది పిల్లలు పూర్తి రోగనిరోధకత సాధించారన్నారు. “ఈ జిల్లాల్లో 15 శాతం కన్నా ఎక్కువ పాఠశాలలకు గతంలో విద్యుత్ సదుపాయం కూడా లేదు. నేడు దాదాపు ప్రతి పాఠశాలకు విద్యుత్ కనెక్షన్ ఉంది. ఇది పిల్లల కోసం మరింత అనుకూలమైన చదువుకునే వాతావరణాన్ని అందిస్తుంది” అని శ్రీ మోదీ చెప్పారు.
ఏకీకరణ, సహకారం, పోటీ ప్రాతిపదికలుగా నిర్మించిన అభివృద్ధి నమూనా ఫలితమే ఈ విజయాలన్నారు. వివిధ శాఖల మధ్య సహకారంతో కూడిన కృషి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యం స్పష్టమైన ఫలితాలనిచ్చాయన్నారు.
ఆకాంక్షాత్మక జిల్లాల నమూనా విజయమే ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజనకు ప్రేరణగా నిలిచిందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. “మూడు కీలక ప్రాతిపదికల ఆధారంగా జాగ్రత్తగా పరిశీలించి ఈ 100 జిల్లాలను ఎంపిక చేశారు. మొదటిది- యూనిట్ భూమికి వ్యవసాయ ఉత్పత్తి స్థాయి. రెండోది- ఒక ఏడాదిలో ఒకే భూమిలో పంటలు పండించిన సంఖ్య. మూడోది- రైతులకు సంస్థాగత రుణాలు లేదా పెట్టుబడి సౌకర్యాల లభ్యత, పరిధి” అని శ్రీ మోదీ తెలిపారు.
“రెండు పక్షాలు పూర్తిగా విభేదిస్తున్నాయని చెప్పడానికి ‘36 కా అంకడా’ అనే పదబంధాన్ని మనం తరచూ వింటుంటాం. కానీ ఓ ప్రభుత్వంగా మేం అలాంటి దృక్పథాన్ని సవాలు చేసి, తిప్పికొట్టాం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సేంద్రియ వ్యవసాయంపై జాతీయ మిషన్, సమర్థమైన నీటిపారుదల కోసం ‘తక్కువ నీళ్లు- ఎక్కువ పంట’’ కార్యక్రమం లేదా నూనెగింజల ఉత్పత్తిని పెంచడం కోసం నూనె గింజల మిషన్... ఇలా ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన కింద విభిన్నమైన 36 ప్రభుత్వ పథకాలను ఏకీకృతం చేసి సమన్వయంతో తీసుకొస్తున్నామని తెలిపారు. పశుసంవర్ధక అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతోపాటు ఇలాంటి అనేక కార్యక్రమాలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నారు. “ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన కింద.. క్షేత్రస్థాయిలో నిరంతర సంరక్షణ, వ్యాధి నివారణ కోసం స్థానిక అవసరాలకు అనుగుణంగా పశు ఆరోగ్య కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు” అని శ్రీ మోదీ అన్నారు.
ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం లాగానే.. ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన రైతులపైనే కాకుండా స్థానిక ప్రభుత్వ అధికారులపై, ముఖ్యంగా ప్రతి జిల్లా కలెక్టర్‌పైనా గణనీయమైన బాధ్యతను ఉంచుతుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ పథకం రూపకల్పన విధానం వల్ల ప్రతి జిల్లా నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపకల్పనకు అవకాశం కలుగుతుంది. “కాబట్టి స్థానిక నేల, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని రైతులను, జిల్లాల్లోని నాయకులను మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
దాల్‌హన్ ఆత్మనిర్భారత మిషన్ పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా దేశ భవిష్యత్తు తరాలను బలోపేతం చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకుందని శ్రీ మోదీ అన్నారు. దేశ రైతులు ఇటీవల గోధుమ, బియ్యం వంటి ఆహార ధాన్యాల్లో రికార్డు స్థాయి ఉత్పత్తిని సాధించి, భారత్‌ను ప్రపంచంలో అగ్రశ్రేణి ఉత్పత్తిదారులలో ఒకటిగా నిలిపారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “అయితే, పోషకాల కోసం పిండి, బియ్యానికే పరిమితం కావద్దు. ఈ ముఖ్యమైన ఆహారం ఆకలిని తగ్గించగలదుగానీ, సరైన పోషకాహారం కోసం మరింత వైవిధ్యమైన ఆహారం అవసరం. దేశ ప్రజల్లో, ముఖ్యంగా శాకాహార జనాభాలో శారీరక, మానసిక వికాసంలో ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. మొక్కల ద్వారా వచ్చే ప్రోటీన్లకు పప్పుధాన్యాలు అత్యంత ముఖ్య వనరుగా ఉన్నాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
“దేశీయ పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం ద్వారా ఈ సవాలును పరిష్కరించడానికి, తద్వారా పోషక భద్రతకూ స్వావలంబనకూ దాల్‌హన్ ఆత్మనిర్భరత మిషన్ దోహదం చేస్తుంది. 11,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన ఈ మిషన్ రైతులకు గణనీయమైన చేయూతను అందిస్తుంది” అని పేర్కొన్నారు. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 35 లక్షల హెక్టార్లకు పెంచడమే లక్ష్యమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ మిషన్ ద్వారా కంది, మినుములు, ఎర్ర పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరగడంతోపాటు పప్పుల కొనుగోలు కోసం సరైన వ్యవస్థ ఏర్పడుతుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మంది పప్పు ధాన్యాల రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది.
ఎర్రకోట నుంచి చేసిన తన ప్రసంగాన్ని గుర్తు చేస్తూ... రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అభివృద్ధి చెందిన భారత్‌కు నాలుగు ప్రధానాధారాల్లో ఒకటిగా వారిని అభివర్ణించారు. రైతులను సాధికారులను చేయడానికి, వ్యవసాయంలో పెట్టుబడులను పెంచడానికి గత పదకొండేళ్లుగా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నించిందని ఆయన పేర్కొన్నారు. తమ హయాంలో వ్యవసాయ బడ్జెట్ దాదాపు ఆరు రెట్లు పెరగడాన్ని బట్టి తాము వ్యవసాయానికిచ్చిన ప్రాధాన్యం స్పష్టమవుతోందన్నారు.
ఈ బడ్జెట్ విస్తరణ వల్ల ముఖ్యంగా భారత వ్యవసాయానికి వెన్నెముకగా నిలిచిన చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఓ ఉదాహరణను ఉటంకిస్తూ.. రైతులకు చేయూతనిచ్చి, వారి పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎరువులపై గణనీయంగా సబ్సిడీలను అందిస్తోందని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయ సుస్థిరత, ఉత్పాదకతతోపాటు అందరికీ లాభదాయకంగా ఉండేలా చూసుకునేందుకు చేపట్టిన విస్తృత చర్యల్లో ఈ విధానం భాగం.
సంప్రదాయ వ్యవసాయానికి అతీతంగా అవకాశాలను విస్తరించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ముఖ్యంగా చిన్న, భూమిలేని రైతులకు అదనపు ఆదాయ వనరులను అందించడం కోసం పశుసంవర్ధకం, మత్స్య సంపద, తేనెటీగల పెంపకం వంటి రంగాలను చురుగ్గా ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు.
తేనె ఉత్పత్తి రంగంలో విజయగాథను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. గత పదకొండేళ్లలో దేశంలో తేనె ఉత్పత్తి దాదాపు రెండింతలైందన్నారు. ఆరేడు సంవత్సరాల కిందట తేనె ఎగుమతులు దాదాపు రూ. 450 కోట్లుగా ఉండగా, ఇప్పుడవి రూ. 1,500 కోట్లకు పైగా పెరిగాయని తెలిపారు. ఎగుమతుల్లో నాటకీయంగా నమోదైన ఈ పెరుగుదల వల్ల.. రైతులకు నేరుగా మూడు రెట్ల ఎక్కువ ఆదాయం సమకూరిందన్నారు. వ్యవసాయ వైవిధ్యీకరణ, విలువ జోడింపు చర్యల ప్రయోజనాలు దీని ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.
ఆవిష్కరణ, పెట్టుబడి, మార్కెటును చేరువ చేయడం ద్వారా రైతులను సాధికారులను చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. స్వావలంబన కలిగిన, అభివృద్ధి చెందిన భారత కీలక చోదకులుగా రైతులను నిలిపిందన్నారు.
భారత వ్యవసాయం, గ్రామీణ శ్రేయస్సును రూపుదిద్దడంలో మహిళల పాత్ర పెరుగుతోందని శ్రీ మోదీ ప్రశంసించారు. పంటల సాగు, పశుపోషణ, సేంద్రియ వ్యవసాయం... అన్నింటా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలకంగా ఎదుగుతూ ముందంజలో నిలుస్తున్నారన్నారు. మూడు కోట్ల మందిని ‘లాఖ్‌పతి దీదీలు’గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం శక్తిమంతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, వ్యవసాయ రంగానికి ఇది ప్రత్యక్షంగా చేయూతనిస్తోందని ఆయన ఉదాహరించారు. “దేశంలోని గ్రామాల్లో నమో డ్రోన్ దీదీల పెరుగుదల ఓ ముఖ్య ఉదాహరణ. ఎరువులు, పురుగుమందుల పిచికారీ కోసం వారిప్పుడు ఆధునిక డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఈ ఆవిష్కరణ వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా గ్రామీణ మహిళలకు గణనీయమైన నూతన ఆదాయ మార్గాలను కూడా అందించింది” అని శ్రీ మోదీ వివరించారు.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో మహిళల కీలక పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “ఈ సుస్థిర విధానానికి చేయూతనిచ్చేందుకు 17,000కు పైగా ప్రత్యేక క్లస్టర్లను నెలకొల్పాం. అంతేకాకుండా, దాదాపు 70,000 మంది శిక్షణ పొందిన ‘కృషి సఖీలు’ సేంద్రియ, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అవలంబించడంపై రైతులకు క్రియాశీలంగా మార్గనిర్దేశం చేస్తున్నారు” అని శ్రీ మోదీ తెలిపారు.
వ్యవసాయంలో మహిళలను సాధికారులను చేయడమన్నది కేవలం సామాజిక న్యాయం మాత్రమే కాదనీ.. ఆధునిక, స్వావలంబన కలిగిన, సంపన్న గ్రామీణ భారతదేశాన్ని సాధించే దిశగా వ్యూహాత్మక ముందడుగు అని పునరుద్ఘాటించారు.
ఇటీవలి జీఎస్టీ సంస్కరణలు వ్యవసాయ పరికరాలు, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి.. దేశ రైతులకు, గ్రామీణ కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక ఉపశమనాన్ని కలిగించిన తీరును వివరించారు. కొత్త జీఎస్టీ ద్వారా.. ట్రాక్టర్ ధరలో రూ. 40,000 తగ్గిందన్నారు. అలాగే బిందు సేద్యం, స్ప్రింక్లర్ పరికరాలు, పంటకోత సాధనాలపై అదనపు ధర తగ్గింపులతో ఈ పండుగ సీజన్‌లో రైతులకు గణనీయమైన పొదుపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే సేంద్రియ ఎరువులు, జైవిక క్రిమి సంహారకాల ధర తగ్గిందనీ.. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో సుస్థిర వ్యవసాయానికి కూడా మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆయన వివరించారు.
ఈ సంస్కరణల ఫలితంగా గ్రామీణ కుటుంబాలకు రెట్టింపు పొదుపు లభించిందనీ, అలాగే రోజువారీ వినియోగ వస్తువులు, వ్యవసాయ పనిముట్లపై ఖర్చులు తగ్గాయని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు.
ఆహారోత్పత్తిలో దేశ స్వావలంబనకు రైతులు చరిత్రాత్మక కృషి చేశారని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో వారిప్పుడు ముందువరుసలో నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు స్వావలంబన సాధించడమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెటును లక్ష్యంగా దిగుమతులను తగ్గించి, దేశ వ్యవసాయ ఎగుమతులను పెంచగల ఎగుమతి ఆధారిత పంటలను పండించాలని కోరుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన, దాల్‌హన్ ఆత్మనిర్భరత మిషన్ ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
నేపథ్యం
2025 అక్టోబరు 11న ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో జరిగే ప్రత్యేక కృషి కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆయన రైతులతో సంభాషించి, అనంతరం జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు.
రైతు సంక్షేమం, వ్యవసాయ స్వావలంబన, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రధానమంత్రి నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనం. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రైతులకు చేయూత, రైతు కేంద్రీకృత కార్యక్రమాల్లో కీలక విజయాలను ప్రజల ముందు ఉంచడంపై దృష్టి సారించారు.
వ్యవసాయ రంగంలో రూ. 35,440 కోట్లతో రెండు ప్రధాన పథకాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. రూ.24,000 కోట్లతో చేపట్టే ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజనను ఆయన ప్రారంభించారు. ఎంపిక చేసిన 100 జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యీకరణను పెంచడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులు, పంచాయతీ - బ్లాక్ స్థాయిలో పంటకోత అనంతర నిల్వను పెంచడం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, దీర్ఘకాలిక - స్వల్పకాలిక రుణ లభ్యతను సులభతరం చేయడం దీని లక్ష్యం.
రూ. 11,440 కోట్లతో ‘పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత మిషన్’ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. పప్పుధాన్యాల ఉత్పాదకత స్థాయిలను మెరుగుపరచడం, సాగు విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు.. సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ – ఇలా అన్ని దశలనూ బలోపేతం చేయడం దీని లక్ష్యం. తద్వారా నష్టాలను తగ్గించవచ్చు.
వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య, ఆహార శుద్ధి రంగాల్లో రూ.5,450 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. అలాగే దాదాపు మరో రూ.815 కోట్ల విలువైన ప్రాజెక్టులకూ శంకుస్థాపన చేశారు.
ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రాజెక్టులు:- బెంగళూరు, జమ్మూ కాశ్మీర్‌లో కృత్రిమ గర్భధారణ శిక్షణ కేంద్రం, అమ్రేలి, బనాస్‌లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద అస్సాంలో ఐవీఎఫ్ ల్యాబ్ ఏర్పాటు, మెహసానా, ఇండోర్, భిల్వారాలో పాల పౌడర్ ప్లాంట్లు, అస్సాంలోని తేజ్‌పూర్‌లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఫిష్ ఫీడ్ ప్లాంటు, వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్ల కోసం మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్, అదనపు విలువను అందించగల మౌలిక సదుపాయాలు, మొదలైనవి.
ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు:- ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాలో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్, ఉత్పత్తుల విలువను పెంచే మౌలిక సదుపాయాలు (వికిరణ), ఉత్తరాఖండ్‌లో ట్రౌట్ ఫిషరీస్, నాగాలాండ్‌లో సమీకృత ఆక్వా పార్క్, పుదుచ్చేరిలోని కారైకల్‌లో అధునాతన, సమీకృత ఫిషింగ్ హార్బర్, ఒడిశాలోని హీరాకుడ్‌లో అత్యాధునిక సమీకృత ఆక్వా పార్క్, తదితరాలు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సేంద్రియ వ్యవసాయ మిషన్ కింద ధ్రువీకరణ పొందిన రైతులకు, మైత్రి సాంకేతిక నిపుణులకు, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు (పీఎంకేఎస్‌కే)గా మార్చిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్), ఉమ్మడి సేవా కేంద్రాల (సీఎస్‌సీ)కు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు.
10,000 ఎఫ్‌పీవోలలో 50 లక్షల రైతు సభ్యత్వాలు, వీటిలో 1,100 ఎఫ్‌పీవోలు 2024-25లో రూ. 1 కోటికి పైగా వార్షిక టర్నోవర్ నమోదు చేయడం సహా.. పలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా సాధించిన ముఖ్య మైలురాళ్లను కూడా ఈ కార్యక్రమం ప్రజలకు చాటుతుంది. జాతీయ సేంద్రియ సాగు మిషన్ కింద 50,000 మంది రైతుల ధ్రువీకరణ, 38,000 మైత్రి (గ్రామీణ భారత్‌లో బహుళ ప్రయోజన ఏఐ సాంకేతిక నిపుణులు)ల ధ్రువీకరణ, కంప్యూటరీకరణ కోసం 10,000కు పైగా బహుళ ప్రయోజన, ఇ-పీఏసీఎస్‌లకు అనుమతి, నిర్వహణ, అలాగే పీఏసీఎస్, పాడి పరిశ్రమ, మత్స్య సహకార సంఘాల ఏర్పాటు, బలోపేతం... మొదలైనవి ఇతర విజయాలు. 10,000కు పైగా పీఏసీఎస్‌లు కార్యకలాపాలను వైవిధ్యపరచుకుని.. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు, ఉమ్మడి సేవా కేంద్రాలు (సీఎస్సీలు)గా పనిచేస్తున్నాయి.
పప్పు ధాన్యాలు సాగు చేస్తున్న రైతులతో ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి సంభాషించారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య సంపదలో అన్ని కార్యకలాపాలూ ప్రాతిపదికలుగా విధానాన్ని రూపొందించే లక్ష్యంతో చేపట్టిన వివిధ ప్రభుత్వ పథకాల నుంచి వారు ప్రయోజనం పొందారు. రైతు ఉత్పత్తిదారు సంస్థల్లో (ఎఫ్‌పీవో) సభ్యత్వం, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా చేయూతతో కూడా ఈ రైతులు ప్రయోజనం పొందారు.
***
(Release ID: 2178067)
Visitor Counter : 15
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam