ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
''నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రీ-క్లినికల్ రీసెర్చ్(ఎన్ఐపీసీఆర్)''గా ఐసీఎంఆర్-ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్ పేరు మార్పు
प्रविष्टि तिथि:
13 APR 2026 3:17PM by PIB Hyderabad
ఔషధ ఆవిష్కరణలు, వైద్య సాంకేతికతను దేశంలోనే అభివృద్ధి చేసే దిశగా భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్(ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్) పేరును ''నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రీ-క్లినికల్ రీసెర్చ్(ఎన్ఐపీసీఆర్)''గా మార్చింది. ఈ మార్పు 2026 మార్చి 20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
ఐసీఎంఆర్‌కు చెందిన ఈ పరిశోధన సంస్థ గతంలో ప్రధానంగా పరిశోధనల కోసం జంతువులను అందించే సంస్థగానే ఉండేది. ఇప్పుడు ఔషధాలు, టీకాలు, వైద్య పరికరాలను మానవాళికి అందుబాటులోకి వచ్చే ముందు నిర్వహించే ప్రీ-క్లినికల్ అధ్యయనాల్లో కీలకపాత్ర పోషించనుంది. ఈ క్రమంలో సంస్థ ముఖ్య కార్యకలాపాలను ప్రతిబింబించేలా ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్ పేరును ఎన్ఐపీసీఆర్‌గా మారుస్తూ ఐసీఎంఆర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి ప్రభుత్వ ప్రీ-క్లినికల్ పరిశోధన సంస్థ దేశంలోనే మొదటిది కావడం విశేషం.
ప్రీ-క్లినికల్ పరిశోధనల కోసం ఎన్ఐపీసీఆర్ రెండు ముఖ్యమైన పరిశోధనా విధానాలను ఉపయోగించనుంది. మొదటిది.. వివిధ జంతు నమూనాలపై పరిశోధన, రెండోది.. కణాలు, సూక్ష్మ అవయవ నమూనాలు(ఆర్గనోయిడ్స్)పై అత్యాధునిక పరిశోధనలు.
ప్రీ-క్లినికల్ పరిశోధనలకు కేంద్రబిందువుగా రూపాంతరం చెందిన ఎన్ఐపీసీఆర్.. ప్రయోగశాలలో కనిపెట్టిన కొత్త ఆవిష్కరణలను మానవ పరీక్షల దశకు తీసుకెళ్లడంలో కీలక వంతెనగా పనిచేయనుంది. వివిధ రకాల ఔషధాలు, టీకాలు, వైద్య పరికరాలు, సెల్ అండ్ జీన్ థెరపీ వంటి అధునాతన వైద్య చికిత్సా విధానాల అభివృద్ధికి అవసరమైన వేదికను ఈ సంస్థ అందించనుంది.
భారతదేశంలో వివిధ విద్యా, పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, అంకుర సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందించడంతో పాటు కొత్త ఆవిష్కరణలను పరీక్షించి, నిర్ధారించడంలో ఎన్ఐపీసీఆర్ సహకరిస్తుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆరోగ్య పరిశోధన విభాగం(డీహెచ్ఆర్) పరిధిలో పనిచేస్తున్న ఈ సంస్థ.. భారతదేశ జీవఔషధ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించనుంది.
***
(रिलीज़ आईडी: 2251507)
आगंतुक पटल : 130
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English