మంత్రిమండలి
azadi ka amrit mahotsav

మరో రెండు సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు కేబినెట్ ఆమోదం: మొత్తంగా రూ. 3,900 కోట్లకు పైగా పెట్టుబడి


ఇండియా సెమీకండక్టర్ మిషన్: మిశ్రమ సెమీకండక్టర్ ఆధారిత మినీ/మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే తయారీలోకి భారత్ అడుగిడుతున్న నేపథ్యంలో మరింత పెరగనున్న వేగం

నాడు పోస్టు చేయడమైనది: 05 MAY 2026 6:54PM by PIB Hyderabad

ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద మరో రెండు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గాలియం నైట్రైడ్ (GaN) సాంకేతికత ఆధారంగా నడిచే దేశంలో మొదటి వాణిజ్య స్థాయి మినీ/మైక్రో-ఎల్ఈడీ డిస్‌ప్లే తయారీ కేంద్రంతోపాటు ఒక సెమీకండక్టర్ ప్యాకేజింగ్ కేంద్రం ఇందులో ఉన్నాయి.

ఆమోదం పొందిన రెండు ప్రాజెక్టుల ద్వారా గుజరాత్‌లో దాదాపు రూ.3,936 కోట్ల మొత్తం పెట్టుబడితో సెమీకండక్టర్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 2,230 మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

ఆమోదం పొందిన రెండు ప్రతిపాదనల వివరాలిలా ఉన్నాయి:

             I.    క్రిస్టల్ మ్యాట్రిక్స్ లిమిటెడ్ (సీఎంఎల్) సంస్థ గుజరాత్‌లోని ధోలేరాలో మినీ/మైక్రో-ఎల్ఈడీ డిస్‌ప్లే మాడ్యూల్స్ తయారీ కోసం ఇంటిగ్రేటెడ్ కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, ఏటీఎంపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. 6 అంగుళాల వేఫర్‌లపై ఎపిటాక్సీతో కూడిన GaN ఫౌండ్రీ సేవలను కూడా ఈ కేంద్రం అందిస్తుంది. ఇక్కడ ఏడాదికి 72,000 చదరపు మీటర్ల మినీ/మైక్రో-ఎల్ఈడీ డిస్‌ప్లే ప్యానెళ్లను, మినీ-మైక్రో-ఎల్ఈడీ GaN ఎపిటాక్సీ వేఫర్లు.. అంటే 24,000 సెట్ల ఆర్జీబీ వేఫర్లను తయారు చేయాలని ప్రతిపాదించారు. ఈ ఉత్పత్తులను టీవీలు, కమర్షియల్ డిస్‌ప్లేల వంటి పెద్ద తెరల తయారీలోనూ, టాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లు, కార్లలోని డిస్‌ప్లేల వంటి మధ్యస్థ తెరల కోసం, స్మార్ట్ వాచీలు, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ గ్లాసెస్ వంటి సూక్ష్మస్థాయి డిస్‌ప్లేల తయారీలోనూ వినియోగిస్తారు.

           II.    సూచీ సెమికాన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎస్పీఎల్సంస్థ గుజరాత్‌లోని సూరత్‌లో డిస్క్రీట్ సెమీకండక్టర్ల తయారీ కోసం ఒక అవుట్‌సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ ఏడాదికి దాదాపు 1033.20 మిలియన్ల చిప్‌లను తయారు చేయాలని ప్రతిపాదించింది. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను ప్రధానంగా పవర్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఐసీలు, పారిశ్రామిక వ్యవస్థల్లో వినియోగిస్తారు. ఇవి వాహన రంగం, పారిశ్రామిక ఆటోమేషన్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో అవసరాలను తీరుస్తాయి.

ఈ రెండు ప్రాజెక్టుల ఆమోదం దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థకు భారీ ఊతాన్నిస్తుంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద ఆమోదం పొందిన మొత్తం ప్రాజెక్టుల సంఖ్య వీటితో 12కు చేరుకోగా, వీటి మొత్తం పెట్టుబడులు దాదాపు రూ. 1.64 లక్షల కోట్లకు చేరుతాయి.

ఈ రెండు ప్రాజెక్టులు దేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రపంచ స్థాయి చిప్ డిజైన్ సామర్థ్యాలకు మరింత బలాన్ని చేకూరుస్తాయి. ప్రభుత్వం 315 విద్యా సంస్థలకు, 104 అంకుర సంస్థలకు అందిస్తున్న డిజైన్ మౌలిక సదుపాయాల చేయూత వల్ల ఈ సామర్థ్యాలు వేగంగా విస్తరిస్తున్నాయి.

దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థ మరింత వేగం పుంజుకుంటోంది. ఇప్పటికే ఆమోదం పొందిన పది ప్రాజెక్టులు వివిధ అమలు దశల్లో ఉన్నాయి. భారత్ నుంచి రెండు ప్రాజెక్టులు ఇప్పటికే వాణిజ్యపరమైన ఎగుమతులను ప్రారంభించగా.. మరో రెండు ప్రాజెక్టులు త్వరలోనే వాణిజ్యపరమైన ఎగుమతులను ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.

***


(రిలీజ్ ఐడి: 2258194) సందర్శకుల సూచీ సంఖ్య : : 28
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , Kannada , Assamese , Odia , English , Urdu , हिन्दी , Punjabi , Gujarati