ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి... నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 JUL 2026 12:21PM by PIB Hyderabad

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశ నిర్మాణానికి కారకులైన ప్రముఖులలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఒకరని ప్రధాని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రఖ్యాత విద్యావేత్త, దార్శనికత కలిగిన నేత అని, భారత్ ఏకత, గౌరవం, ప్రగతి కోసం జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి ప్రశంసించారు.
విద్యారంగానికి, పారిశ్రామిక అభివృద్ధికి, జాతీయ సమైక్యతకు డాక్టర్ ముఖర్జీ అందించిన దీర్ఘకాలిక తోడ్పాటు తరాల తరబడి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘వికసిత్ భారత్ గమ్యం దిశగా భారత్ ముందుకు సాగుతున్న క్రమంలో డాక్టర్ ముఖర్జీ దార్శనికత, ఆదర్శాలు దేశ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ఈ రోజు, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి. ఈ సందర్భంగా భారత దేశ అసాధారణ శిల్పుల్లో ఒకరైన ఆ మహనీయునికి ప్రణామం చేస్తున్నాను. ఆయన జీవితం పాండిత్యంతో, ధైర్య సాహసాలతో, ప్రజా సేవ పట్ల పూర్తి నిబద్ధతతో పరిపూర్ణమైంది. భారత్ ఏకత, గౌరవం, ప్రగతి కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు.
డాక్టర్ ముఖర్జీ సేవలు వివిధ రంగాలకు విస్తరించాయి. ఆయన ఒక అసాధారణ మేధావి, విద్యావేత్త. నూతన ఆవిష్కరణలకు, భవిష్యత్తు కాలం అవసరాలను తీర్చగల విద్యకు ఆయన మద్దతిచ్చారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కాలంలో సాంప్రదాయిక రంగాలతో పాటు జీవనోపాధి మార్గాలు కూడా అభివృద్ధి చెందేటట్లు చర్యలు తీసుకుంటూ, పారిశ్రామిక స్వయంసమృద్ధికి పునాదులు వేశారాయన. బెంగాల్‌లో కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు, మానవీయ దృక్పథంతో ఆయన తీసుకున్న చర్యలు సంక్షోభంలో చిక్కుకున్న ప్రజానీకం పట్ల ఆయన కరుణను చాటిచెప్పాయి. వీటన్నింటికీ మించి... భారత్ సమైక్యత పట్ల, సమగ్రత పట్ల ఆయన కనబరిచిన తిరుగులేని నిబద్ధత కలకాలం స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది.
‘వికసిత్ భారత్’ గమ్యం వైపునకు మనం అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో, డాక్టర్ ముఖర్జీ దూరదృష్టి మనకు మార్గదర్శకత్వాన్ని అందిస్తూ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2281576) సందర్శకుల సూచీ సంఖ్య : : 53