రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాణ్యమైన రహదారి మౌలిక సదుపాయాల కోసం సహకార పద్ధతిలో జ్ఞానాన్ని పంచుకోవడంపై దృష్టి సారిస్తూ... ముగిసిన 'చింతన్ శిబిరం-2026'

కేంద్రం, రాష్ట్రాలు, సంబంధిత వర్గాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునే వేదికగా నిలిచిన ఈ రెండు రోజుల సదస్సు

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2026 6:20PM by PIB Hyderabad

నాణ్యమైన రహదారి మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర-రాష్ట్ర సహకారాన్ని బలోపేతం చేయడం, క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకోవడం, సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించిన రెండు రోజుల “చింతన్ శిబిరం 2026 - రహదారి మౌలిక సదుపాయాలపై జాతీయ సదస్సు” ఈ రోజు ముగిసింది. గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో గల స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఈ సదస్సును నిర్వహించారు.

 

ముగింపు సమావేశంలో రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ వి. ఉమాశంకర్ మాట్లాడుతూ... జాతీయ రహదారులు, రహదారుల రంగానికి సంబంధించిన ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఈ 'చింతన్ శిబిరం' కల్పించిందని పేర్కొన్నారు. విధానపరమైన, అమలు స్థాయిల్లో తమ కార్యక్రమాలు, అనుభవాలు, పరిష్కారాలను పంచుకునే వెసులుబాటు రాష్ట్రాలకు, ఇతర భాగస్వామ్య పక్షాలకు ఈ సదస్సు ద్వారా లభించిందని ఆయన తెలిపారు.

 

వికసిత్ భారత్ దార్శనికతకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు, రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు అవసరమనీ... మౌలిక సదుపాయాల అభివృద్ధిలో దృష్టి క్రమంగా నాణ్యత వైపు మళ్లుతోందనీ శ్రీ ఉమాశంకర్ స్పష్టం చేశారు.

 

జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన సాంకేతిక వేదికలు, సంస్థాగత సామర్థ్యాలను వినియోగించుకునే అవకాశం రాష్ట్రాలకు లభించడం ఈ చర్చల కీలక ఫలితం. సాంకేతిక సహకారం, సామర్థ్యాల పెంపుదల మద్దతుతో... పీఎం గతిశక్తి, డేటా లేక్, ఈడీఏఆర్, కాంట్రాక్టర్ రేటింగ్ వ్యవస్థలు, భూమి రాశి వంటి వేదికలను రాష్ట్ర స్థాయి అనువర్తనాల కోసం అందుబాటులో ఉంచవచ్చు.

 

ప్రస్తుతం జాతీయ రహదారి వ్యవస్థ కోసం ఉపయోగిస్తున్న ఏఐ-ఆధారిత ఈడీఏఆర్ ప్లాట్‌ఫారమ్... సంబంధిత రహదారి సమాచారం అందుబాటులో ఉన్నప్పుడు రాష్ట్ర, స్థానిక రహదారులపై ప్రమాదాల సరళిని విశ్లేషించడంలోనూ, రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు సాక్ష్యాధారిత చర్యలను రూపొందించడంలోనూ రాష్ట్రాలకు తోడ్పడగలదు.

వృత్తి నైపుణ్యం, నైపుణ్యాభివృద్ధి, మెరుగైన పర్యవేక్షణ ద్వారా నిర్మాణ రంగ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ చర్చలు స్పష్టం చేశాయి. నిర్మాణ పద్ధతులను మెరుగుపరచడానికి, మెరుగైన నాణ్యతా ఫలితాలను నిర్ధారించడానికి, నిర్మాణ కార్మికుల్లో కేంద్రీకృత నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య నిర్మాణం ప్రాముఖ్యతనూ శ్రీ ఉమాశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు.

 

సాంకేతిక సామర్థ్యానికి, గత పనితీరుకు అధిక ప్రాధాన్యమిస్తూ... డీపీఆర్ కన్సల్టెంట్లు, అథారిటీ ఇంజనీర్లు, స్వతంత్ర ఇంజనీర్ల నాణ్యత-ఆధారిత ఎంపిక, పనితీరు మదింపు బలోపేతంపైనా దృష్టి సారించారు. పర్యవేక్షణలోని లోపాలను సరిదిద్దడం, మెరుగైన ప్రాజెక్టు ఫలితాలను నిర్ధారించడం ఈ చర్యల లక్ష్యం.

 

ముఖ్యంగా రాష్ట్ర రహదారులు, రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేల అభివృద్ధి కోసం... మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్లు, బీవోటీ, యాన్యుటీ ఆధారిత నమూనాలు సహా వినూత్న కాంట్రాక్టింగ్, ఫైనాన్సింగ్ విధానాలను రాష్ట్రాలు అవలంబించే అవకాశాలపై ఈ సదస్సులో చర్చించారు. జాతీయ స్థాయి అభివృద్ధిలో పొందిన అనుభవాన్ని, నైపుణ్యాన్ని... రాష్ట్రాలు నిర్మాణాత్మక చేయూత, సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా ఉపయోగించుకోవచ్చు.

 

జ్ఞానాన్ని పంచుకునే ప్రక్రియను సులభతరం చేయడానికి, విజయవంతమైన పద్ధతులను విస్తృతంగా అవలంబించేలా చేయడానికి... ఆయా రంగాల నిపుణులు, అధికారుల భాగస్వామ్యంతో రాష్ట్రాలు తమ సొంత చింతన్ శిబిరాలు, కార్యశాలలను నిర్వహించాలని శ్రీ ఉమాశంకర్ ఆహ్వానించారు.

 

రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో పీఎం గతిశక్తి, సమీకృత మౌలిక సదుపాయాల ప్రణాళిక, భూసేకరణ, భూమి రాశి, మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్లు, రేటింగ్‌లు, సురక్షిత రహదారులు, హరిత రహదారుల రూపకల్పన, రహదారి భద్రత, టోల్ సంస్కరణ, నాణ్యతకు హామీ, ప్రాజెక్టుల పర్యవేక్షణ వంటి అంశాలపై సమావేశాలు జరిగాయి.

 

ఈ సమావేశాలు కేంద్రం-రాష్ట్రాల మధ్య చర్చలకు, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, అమలులో ఎదురయ్యే సవాళ్లకు ఆచరణాత్మక, పునరావృతమయ్యే పరిష్కారాలను గుర్తించడానికి దోహదపడ్డాయి. దేశంలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే, సురక్షితమైన, అధిక నాణ్యత గల రహదారి మౌలిక సదుపాయాలను నిర్మించే దిశగా సహకార విధానాన్ని బలోపేతం చేశాయి.

***

 


(రిలీజ్ ఐడి: 2319886) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी