ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో బంగారం స్మగ్లింగ్‌పై డీఆర్ఐ చర్యలు 8.3 కేజీలకుపైగా విదేశీ బంగారం స్వాధీనం, నలుగురు అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
06 OCT 2026 8:47PM by PIB Hyderabad
బంగారం అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చర్యలు చేపట్టింది. నిఘా వర్గాల సమాచారంతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట డీఆర్ఐ అధికారులు చేపట్టిన దాడిలో సుమారు 12.37 కోట్ల విలువైన 8.3 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు పాల్పడిన నలుగురిని అరెస్టు చేశారు.
ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కూచ్ బెహర్ జిల్లాలో డీఆర్ఐ అధికారులు నిఘా పెట్టారు. 05.10.2026న భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో చౌధురిహాట్ వద్ద కూచ్ బెహర్ వైపు రెండు బైక్‌లపై వస్తున్న నలుగురు వ్యక్తులను అడ్డగించారు. వారిని తనిఖీ చేయగా బంగారం బిస్కెట్లు లభించాయి. వస్త్రంతో ప్రత్యేకంగా కుట్టిన నడుము బెల్ట్ ధరించిన ఇద్దరు వ్యక్తుల వద్ద ఈ బంగారాన్ని గుర్తించారు.
నలుగురు నిందితుల నుంచి మొత్తం 72 బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకోగా, అవి ఒక్కొక్కటి 116 గ్రాములు ఉన్నాయి. మొత్తంగా 8.3 కేజీల బరువున్న ఆ విదేశీ బంగారం విలువ దాదాపు 12.37 కోట్లు. కస్టమ్స్ చట్టం-1962లోని నిబంధనల ప్రకారం బంగారాన్ని సీజ్ చేసి, నలుగురు నిందితులను అధికారులు అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తును చేపట్టారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కూచ్ బెహర్ జిల్లాలో సుదీర్ఘకాలంగా నిఘా ఏర్పాటు చేసి, డీఆర్ఐ అధికారులు ఈ దాడులను చేపట్టారు. సరిహద్దు ప్రాంతాల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాను నియంత్రించేందుకు డీఆర్ఐ చర్యలు తీసుకుంటోంది. అక్రమంగా బంగారం తరలింపు, రవాణా వెనకున్న సిండికేట్లను గుర్తించటంపై దృష్టి సారిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2320087)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
బ్యాగ్రౌండ్ రిలీజ్ రిఫరెన్స్